Qutubshahi rule | కుతుబ్‌షాహీల పాలన-విశేషాలు
కుతుబ్‌షాహీలు
-సైనిక వ్యవస్థ: బహమనీ రాజ్య శిథిలాలపై దక్కన్లో గోల్కొండ కేంద్రంగా అవతరించిన కుతుబ్‌షాహీలు.. బహమనీల సైనిక వ్యవస్థనే కొద్దిపాటి మార్పులతో ఆచరించారు. వీరు భారీ సైన్యాలను పోషించారని సమకాలీన చరిత్రకారులు, విదేశీ యాత్రికులు పేర్కొన్నారు. బహమనీ సైనిక వ్యవస్థ మాదిరిగానే మొత్తం సైన్యం ఎప్పుడూ రాజధానిలో ఉండేది కాదు. రాష్ర్టాలు తమ తమ రాజ ప్రతినిధుల కింద కొంత సైన్యాన్ని వారి లెక్క ప్రకారం ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది మధ్యయుగంలో అన్ని రాజ్యాల్లో ఉండేది. సామంతులు, జమీందార్లు కూడా కొంత సైన్యాన్ని పోషిస్తూ ఉంటారు. అవసరమైనప్పుడు సుల్తాన్‌కు ఈ సైన్యాలను సహాయంగా పంపుతారు. ఆపైన రాష్ర్టాలకు కూడా బలగాల అవసరం ఉంటుంది. తమ ప్రాంతాల్లో శాంతిభద్రతలు కాపాడటానికి, పొరుగు రాజ్యం దండెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వం బలగాలను పంపేవరకు శత్రు సైన్యాన్ని నిలువరించటానికి రాష్ర్టాలు సైన్యాలను పోషిస్తూ ఉంటాయి.
-సుల్తాన్ కులీ రాజ్యస్థాపన తొలిరోజుల్లోనే రాజ్య పటిష్ఠతకు బలోపేతమైన, సువిశాల సైన్యాన్ని రూపొందించాడు. యుద్ధకాలంలో సైన్యాధ్యక్షుడు లేదా సిఫహ్సలార్ లేదా సర్లష్కర్ సేనలను నడిపించేవాడు. కుతుబ్‌షాహీల సేనలో హిందూ-ముస్లిం, ఇరానీలు ఉన్నారు. సైనికశాఖ అధిపతిని ఐయిన్- ఉల్ – ముల్క్ అనేవారు. కుతుబ్‌షాహీల ఆదాయంలో ఎక్కువ భాగం సైన్యాల పోషణకు, సైనికుల జీతభత్యాలకే సరిపోయేది. అబుల్హసన్ కాలంలో సైనికుల జీతభత్యాలకు ఏడాదికి 8,84,470 హొన్నులు ఖర్చయ్యేది. ఫ్రెంచ్కు చెందిన థేవ్‌నాట్ ప్రకారం రెండు గుర్రాలను, కొంత మంది శిబిరానుచరులను నిర్వహించాల్సిన మహ్మదీయ సైనికులకు పది హొన్నులు, హిందూ కాల్బంటులకు రెండు హొన్నులు ప్రతి నెల చెల్లించేవారు. అశ్విక బలగాలకు, కాల్బంటులకు ఏకరూప దుస్తులను, తగిన ఆయుధాలను ఇచ్చేవారు. అశ్వికులు ఎర్ర తలపాగాలు, దుస్తులు, కవచం, శిరస్ర్తాణం ధరించేవారు. తెలుగువారు ధోవతులు, అంగీలు, తలపాగాలు ధరించేవారు.
-సమాచార వ్యవస్థ: కుతుబ్‌షాహీల కాలంలో సమాచారం చేరవేత ఉత్తరాల ద్వారా జరిగేది. ఆ ఉత్తరాల బట్వాడా రౌతులకు, కాల్బంట్లకు అప్పజెప్పేవారు. రౌతులు గుర్రాల మీద స్వారీ చేస్తూ వెళ్లేవారు.
-గండికోట తన ముఖ్యపట్టణంగా ఏలిన మీర్‌జుమ్లా మహమ్మద్ సయ్యద్ సమాచార వ్యవస్థను గురించి ట్రావెర్నియర్ తన గ్రంథంలో.. నవాబు గుడారంలో తన ఇద్దరు కార్యదర్శులతో కూర్చుని ఉండటం చూశాం. సంప్రదాయం ప్రకారం అతని కాళ్లకేమీ పాదరక్షలు లేవు. చేతి వేళ్లలో, కాలి వేళ్లలోనూ అతను ఎన్నో కాగితాలు పెట్టుకొని ఉన్నాడు. ఎవరికి ఏ సమాధానం ఇవ్వాలో అతను ఆదేశాలిచ్చాడు. కార్యదర్శులు ఆ సమాధానం రాశాక దాన్ని బయటకు చదవమని అడిగేవాడు. ఆ పైన ఆ ఉత్తరం తీసుకొని, దానికి తానే సీలు వేసి, కాల్బంటుకో, రౌతుకో ఇచ్చేవాడు అని పేర్కొన్నాడు. నిజానికి రౌతు కంటే కాల్బంటే వేగంగా ఉత్తరాలు చేర్చేవాడు. ప్రతి మూడు మైళ్ల మజిలీకి చేరుకోగానే అతడు ఉత్తరాలను ఓ గుడిసెలోకి విసిరి వేసేవాడు. వెంటనే వాటిని మరొక కాల్బంటు పట్టుకొని పరిగెత్తుతూ తర్వాత మజిలీకి చేర్చేవాడు అని తెలిపాడు.
-భూమిశిస్తు-రెవెన్యూ విధానం: గోల్కొండ రాజ్యంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. సర్కార్ ఖజానాకు భూమి శిస్తే ముఖ్య ఆధారం. తెలంగాణ కేంద్రంగా తెలుగువారిని సుమారు రెండు శతాబ్దాలపాటు పరిపాలించిన కుతుబ్‌షాహీలు అనేక విధాలుగా వ్యవసాయాభివృద్ధికి కృషి చేశారు. దీంతో వ్యవసాయదారులు సుఖశాంతులతో జీవించారు. సమకాలీన రచనల్లో, విదేశీ అకౌంట్లలో గోల్కొండ రాజ్య సిరిసంపదలను గురించి వివరణలు ఉన్నాయి. ముస్లిం భూమి రికార్డుల్లో భూమి సాగుచేసే వ్యక్తిని రయ్యత్ అని పేర్కొన్నారు. రయ్యత్ నుంచే రైతు అనే పదం ఏర్పడిందని కొందరి అభిప్రాయం.. అయితే, ఏ ముస్లిం పాలకులు కూడా భూమిపై రైతు సంపూర్ణ హక్కును గుర్తించలేదు.
-క్రీ.శ. 1685- 86 నాటి కుతుబ్‌షాహీ రాజ్య ఆదాయాన్ని గురించి (భూమిశిస్తు, ఇతర పన్నులు, సుంకాలు కలిపి రాజ్యంలోని 21 సర్కార్ల నుంచి వచ్చే ఆదాయం) సమకాలీన రచయిత గిర్దారీలాల్ తన గ్రంథమైన అష్కర్స్-తారీఖ్-ఇ-జఫరహాలో పేర్కొన్నాడు. అతని వివరణ ప్రకా రం మొత్తం 21 సర్కార్ల నుంచి సుల్తాన్ ఖజానాకు వచ్చిన ఆదాయం 82, 95, 196 హొన్నులు. ఒక హోన్ను నేటి రూ. 3కు సమానం. అంటే గోల్కొండ చివరి సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా కాలం నాటి మొత్తం రెవెన్యూ రూ. 2,47,85,529లు. ఈ ఆదాయంలో అధిక భాగం నేటి తెలంగాణ ప్రాంతంలో వ్యాపించి ఉన్న 12 సర్కార్ల నుంచి వచ్చేది. అంతేగాక వీరి ఆధీనంలోని కర్ణాటకలోని 16 సర్కార్లు, 162 పరగణాల నుంచి 26,75,498 హొన్నుల ఆదాయం వచ్చేది. వజ్రాల గనులను లీజుకు ఇవ్వడంతో భారీ మొత్తంలో ఆదాయం వచ్చేది.
-ఆర్థిక పరిస్థితులు: మధ్యయుగ దక్కన్లో వెలిసిన ఐదు షియా రాజ్యాల్లో గోల్కొండ సంపన్న రాజ్యం. దీనికి రెండు అంశాలు దోహదం చేశాయి. ఒకటి గోల్కొండ రాజ్యంలోని సహజ సంపద. ముఖ్యంగా అత్యంత విలువైన వజ్రాల గనులు. రెండోది తీరాంధ్ర ప్రాంతంలోని సారవంతమైన భూములు- నీటి వసతులు. మచిలీపట్నం కేంద్రంగా మధ్య ఆసియా, ఐరోపా దేశాలతో భారీ ఎత్తున కొనసాగిన విదేశీ వ్యాపారం. ప్రజలు సొంత భూములు, వ్యాపారులు కోఠీలు కలిగి ఉన్నారు. సుల్తానులు వారి అధికారులు విలాసవంత జీవితం గడిపారు. వ్యవసాయమే అధిక సంఖ్యాక ప్రజల వృత్తి. ప్రభుత్వ కోశాగారానికి ముఖ్య ఆదాయమార్గం. జమిందారీ, హవేలీ భూములని రెండు రకాలు ఉండేవి. వ్యవసాయ పనులు జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాలపై ఆధారపడి జరిగేవని మెథోల్డ్ రాశాడు. కోస్తా ప్రాంతంలో నీటి వసతులు పుష్కలంగా ఉండటం వల్ల రైతాంగం మంచి లాభాలు గడించేదని పేర్కొన్నాడు. తెలంగాణ ప్రాంతంలో పండ్లు, పూలు పుష్కలంగా పండించేవారని థెవ్నాట్ రాశాడు. ద్రాక్షపండ్లు పుష్కలంగా పండేవని, వీటిలో కొంత భాగం ద్రాక్ష సారాయి తయారీకి వాడేవారని థెవ్నాట్ పేర్కొన్నాడు. చిరుధాన్యాలు, పప్పులు, తమలపాకులు, పొగాకు, మిర్చి విరివిగా పండేవి. నీలిమందు పంటను ఏలూరులో బాగా పండించేవారు.
-వ్యవసాయం- నీటిపారుదల సౌకర్యాలు: కుతుబ్‌షాహీ సుల్తానులు, వారి అధికారులు రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించేవారు. నీటిపారుదల వసతులు తక్కువగాగల తెలంగాణ ప్రాంతంలో అనేక పాత చెరువులకు మరమ్మతులు చేయించారు. ఇబ్రహీం-కులీ-కుతుబ్‌షా కాలంలో అనేక కొత్త జలాశయాలు, చెరువులు నిర్మించారు. వీటిలో హుస్సేన్‌సాగర్, బద్వేల్, ఇబ్రహీంపట్నం చెరువు ముఖ్యమైనవి. గోల్కొండకోట అవసరాల కోసం నీటి సరఫరా చేయడానికి, కోటకు 5 కి.మీ. దూరంలో దుర్గ్ వద్ద ఒక జలాశయాన్ని కట్టించారు. రాజప్రసాదం ఎత్తున ఉండటంతో దీనికి నీటిసరఫరా చేయడం కోసం హైడ్రోలాజికల్ ఇంజినీరింగ్ నైపుణ్యంతో పూర్తి చేశారు. సైఫాబాద్ పరిసరాల్లో రాజమాత మాసాహెబా (ఖానం ఆఘా) ఒక చెరువును తాగునీటి కోసం కట్టించింది. దీన్నే మాసాహెబ్ ట్యాంక్ అనేవారు.

-వీరికాలంలో చెరువుల పరిరక్షణ కోసం గ్రామ, సర్కార్, పరగణా, తరఫ్ స్థాయిల్లో ప్రత్యేకాధికారులను, ఉద్యోగులను నియమించారు. వారికి ప్రత్యేక వసతులు, జీతభత్యాలు చెల్లించారు. 1551 నాటి ఒక శాసనం ప్రకారం ఇబ్రహీం కులీ కుతుబ్‌షా పానగల్ చెరువుకు మరమ్మతులు చేపట్టాడు. అంతోజి అనే ఒక హిందూ హవల్దార్, అతని సహచరులు ఒక చెరువుకు నెల్లూరు జిల్లాలో మరమ్మతులు చేపట్టడం కోసం వడ్డెరలకు ఒక కొర్రు తరి భూమిని దానంగా ఇచ్చారని నెల్లూరు జిల్లా (కందుకూరు) శాసనం తెలుపుతున్నది. చెరువులు నిర్మించిన వారికి, నిర్మాణంలో పాల్గొన్న వారికి, వాటిని పరిరక్షించే వారికి కుతుబ్‌షాహీలు ప్రత్యేక వసతులు గౌరవం కల్పించారు.
-వర్తకం- వ్యాపారం: కుతుబ్‌షాహీల కాలంలో కూడా కాకతీయ యుగంలో మాదిరిగానే దేశీ, విదేశీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగింది. కోమట్లు దేశీ, విదేశీ వ్యాపారంలో కీలకపాత్ర పోషించారు. సమకాలీన రచనలైన హంసవింశతి, శుకసప్తతి, విదేశీ పర్యాటకుల రచనలైన ట్రావెల్ అకౌంట్లు వర్తక-వ్యాపారం గురించి విలువైన సమాచారాన్ని ఇస్తున్నాయి. అరబ్ వర్తకులు, పోర్చుగీసు వర్తకులు కుతుబ్‌షాహీలకు మేలు రకం గుర్రాలను సరఫరా చేసేవారు. ఐరోపా వర్తక సంఘాలు ప్రవేశించిన తర్వాత నర్సాపురం, మచిలీపట్నం, మద్రాస్, గోల్కొండ, కొండవల్లి గొప్ప వర్తక కేంద్రాలుగా రూపొందాయి. దేశీయ వ్యాపారంలో ఎడ్లబండ్లు, గాడిదలు, గుర్రాల బగ్గీలు కీలక పాత్ర నిర్వహించేవి. విదేశీ వ్యాపారం సముద్రంపై ఓడల్లో జరిగేది. దీనిని ఓడ బేరం అనేవారు. ఓడకాడు అనే పదం శుకసప్తతిలో వాడారు. మోటుపల్లి, నర్సాపురం, మచిలీపట్నం విదేశీ వ్యాపారానికి ముఖ్య కేంద్రాలు. మచిలీపట్నం నుంచి ఐరోపా దేశాలకు మేలురకం వస్ర్తాలను ఎగుమతి చేసేవారు. విదేశీ బాటసారుల వర్ణనల్లో ఆనాటి ఓడల సైజు, ఎగుమతి అయ్యే వస్తువులు, వస్ర్తాలు, పరికరాల వివరాలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీశైలం, వరంగల్, శ్రీకాళహస్తి, ఉదయగిరి వర్తక కేంద్రాలుగా ఎదిగాయి. గ్రామాల్లో వారంతపు అంగళ్లు జరిగేవి. పెరికలు వస్తుసామగ్రి రవాణాలో కీలకపాత్ర పోషించేవారు. తెలంగాణ, ఆంధ్రవర్తకులు కర్ణాటక, తమిళనాడు, గుల్బర్గా, ఔరంగాబాద్, అహ్మద్‌నగర్, బీజాపూర్, మద్రాస్ వంటి పట్టణాల వర్తకులతో సంబంధాలు కలిగి ఉండేవారు. చేతివృత్తుల వారు ముఖ్యంగా లీలు స్వయంగా స్థానిక మార్కెట్లకు వెళ్లి తమ తమ వస్ర్తాలను అమ్మి లాభాలు గడించేవారు. కార్మికులు, పనివారు, వృత్తినిపుణులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరుచూ వలస వెళ్లేవారు. దీనివల్ల సంస్కృతి మరింత సుసంపన్నమైంది. ఓడల నిర్మాణం నర్సాపూర్, మచిలీపట్నాల్లో వర్ధిల్లింది. తెలంగాణలోని నిర్మల్, ఇందల్వాయిలలో ఇనుము, పోత పరిశ్రమ విశేష ఖ్యాతి గడించాయి. హైదరాబాద్ నుంచి వర్తకులు నల్లగొండ, కొండపల్లి, విజయవాడ మీదుగా మచిలీపట్నం చేరేవారు.
-కుతుబ్‌షాహీ సుల్తానులు వర్తక వ్యాపారంపై పన్నులను, సుంకాలను నియమిత పద్ధతిలో వసూలు చేసి వ్యాపారాన్ని ప్రోత్సహించారు. వర్తకులకు అన్ని రకాల వసతులు, రక్షణ కల్పించారు. తూకాలు, కొలతలు సరిగ్గా ఉండేట్లు అధికారులు పర్యవేక్షించేవారు. గోల్కొండ రాజ్యంలో ముఖ్య కరెన్సీ హొన్ను అనే బంగారు నాణెం. దీన్నే విదేశీ వర్తకులు పగోడ అన్నారు. వణం, తార్, కాసు అనేవి ఇతర నాణేలు. ఆనాటి ఎగుమతుల్లో వస్ర్తాలు, వజ్రాలు, సురేకారం, తివాచీలు, నీలిమందు, మేలురకం కత్తులు ముఖ్యమైనవి. దిగుమతుల్లో గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు, బంగారం, సీసం, ఖర్జూర పండ్లు, కస్తూరి, పింగాణి పాత్ర లు, గవ్వలు మొదలైనవి పేర్కొనదగినవి.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






