How is Biology Preparation | బయాలజీ ప్రిపరేషన్ ఎలా?
టీచర్ ఉద్యోగానికి పోటీపడే అభ్యర్థులు కింది అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. సిలబస్‌ను నిశితంగా పరిశీలించాలి. దాని పరిధిని గుర్తించాలి.
-ఏయే రిఫరెన్స్ పుస్తకాలు అవసరమో గుర్తించాలి.
-కాల వ్యవధిని దృష్టిలో ఉంచుకోవాలి.
-సరైన ప్రణాళిక రూపొందించుకోవాలి.
-అంశాలవారీగా విడిగా అధ్యయనం చేయాలి. ప్రతి అంశంపై సంక్షిప్తమైన, అవసరమైన ముఖ్యాంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి.
-స్కూల్ స్థాయి (6, 7, 8, 9, 10) పుస్తకాల్లోని వివిధ అంశాల సమాచారాన్ని ఇంటర్మీడియట్ స్థాయిలోని సంబంధిత అంశాలతో క్రోడీకరిస్తూ అధ్యయనం చేయడం చాలా అవసరం. రెండింటిని కలుపుతూ ముఖ్యాంశాల నోట్స్‌ను తయారు చేసుకోవడం, పట్టికలను తయారు చేసుకోవడం అలవర్చుకోవాలి.
ప్రతి అంశంపై పట్టుసాధించడం అవసరం. కాబట్టి అభ్యర్థి ఒక టాపిక్ చదవడం ముగిసిన తర్వాత సంబంధిత ప్రశ్నావళిని తయారు చేసుకుని సాధన చేయాలి.
-ప్రతి అధ్యాయం/యూనిట్‌పైన ప్రశ్నావళిని సాధనచేసిన తర్వాత జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి. అతిసాధారణ, సాధారణ, కఠినస్థాయి ఉన్న ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
-పునర్అభ్యసనం చేసేటప్పుడు, మొదటిసారి సాధనలోని లోపాల అంశాలపై దృష్టి కేంద్రీకరించాలి.
-అభ్యర్థులు ప్రతి యూనిట్ అభ్యాసం, సాధన చేసిన తర్వాత మొత్తం సిలబస్‌పై మోడల్ పేపర్లను సాధన చేయాలి. కనీసం 20-30 మోడల్ పేపర్ల సాధన అవసరం.
-మోడల్ పేపర్ సాధనలో సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.
-తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే.. ఎక్కువగా అతి సులభ, సులభస్థాయికి చెందినవి. మరికొన్ని కఠినస్థాయి ప్రశ్నలతో రూపొందించినవి. కాబట్టి అభ్యర్థులు అతిసాధారణ స్థాయి, కఠినస్థాయి ప్రశ్నల సాధన తప్పనిసరిగా చేయాలి.
-టీఆర్టీ పరీక్షలో ప్రశ్నపత్రాల రూపకల్పనకు ఎస్సీఈఆర్టీ, తెలుగు అకాడమీ పుస్తకాలకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వాటిని పూర్తిగా, విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసినట్లయితే విజయం సులభమవుతుంది.
టీఆర్టీ – ముఖ్యమైన అంశాలు
1. జీకే, కరెంట్ ఎఫైర్స్
2. విద్యాదృక్పథాలు
3. సబ్జెక్టు విషయాంశాలు
4. బోధనాభ్యసన శాస్త్రం
-జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్ ప్రిపరేషన్‌కు ప్రతిరోజు కొంత సమయం కేటాయించడం అవసరం. దీనికోసం ఎక్కువ సమయం వృథా చేయరాదు.
-విద్యాదృక్పథాలు, కంటెంట్, బోధనాభ్యసనశాస్త్రంలో పట్టుసాధిస్తే అత్యధిక మార్కులు సాధించడం, విజయం సులభమవుతుంది.
-కంటెంట్‌లో స్కూల్, ఇంటర్మీడియట్స్థాయి రెండింటిని కలిపిన ప్రశ్నావళి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తగు జాగ్రత్తలతో, లోతైన విషయజ్ఞానమే కాకుండా అవగాహన స్థాయిని పెంపొందించుకోవడం చాలా అవసరం. నైపుణ్యాలను పరీక్షించే పరీక్షగా పరిగణించాలి.
-బయాలజీ కంటెంట్ సిలబస్‌లో తొమ్మిది చాప్టర్లను చేర్చారు.
-జీవశాస్త్రం సిలబస్ మొదటి చాప్టర్లో జీవశాస్త్రం ప్రాముఖ్యత, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర, జీవశాస్త్రం-శాఖలు, ప్రఖ్యాత జీవశాస్త్రవేత్తలు, దేశంలో జీవశాస్త్ర సంబంధిత సంస్థల గురించి చేర్చారు. ఈ చాప్టర్ స్కూల్, ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి రూపొందింది.
-రెండోచాప్టర్- జీవప్రపంచం: దీనిలో ప్రధానంగా జీవుల లక్షణాలు, జీవుల వర్గీకరణ (వివిధ రకాల వర్గీకరణల గురించి చదవడం అవసరం) చేర్చారు. విట్టేకర్ వర్గీకరణ పూర్తిగా చదవాలి. 9వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పుస్తకాల్లో ఈ సిలబస్ ఉంది.
మూడో చాప్టర్- సూక్ష్మజీవ ప్రపంచం: వైరస్, బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లలో ఉపయోగకరమైన, హానికరమైన సూక్ష్మజీవుల గురించిన అధ్యయనం అవసరం. ఇందులో స్కూల్ స్థాయి అంశాలతోపాటు, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పుస్తకాల్లోని అంశాలను చదవాలి.
-నాలుగో చాప్టర్- కణం-కణజాలాలు: దీనికోసం స్కూల్ స్థాయిలో 9, 10వ తరగతి పుస్తకాలు, ఇంటర్లో ప్రథమ సంవత్సరం వృక్ష, జంతుశాస్త్ర అంశాలను అధ్యయనం చేయాలి.
-నోట్: కణచక్రం-కణవిభజన-మైటాసిస్, మియాసిస్ల గురించి క్షుణ్ణంగా చదవడం అవసరం. ఇక్కడ కఠినస్థాయి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
-ఐదో చాప్టర్- వృక్ష ప్రపంచం-అంశాలు: దీనిలో ప్రధానంగా బాహ్యస్వరూపశాస్త్రం, వృక్ష శరీరధర్మశాస్త్రం, ఆర్థిక ప్రాముఖ్యత, వ్యవసాయ విధానాలు, పంటలు-వ్యాధులు, నివారణ చర్యలు, వృక్ష ప్రజననం, ఆహారధాన్యాల నిలువ, సంరక్షణ విధానాల గురించి చదవాలి.
-వృక్షశాస్ర్తానికి సంబంధించిన అంశాల్లో ప్రధానంగా నాలుగో, ఐదో అధ్యాయాల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. వాటితోపాటు 2, 3, 9 అధ్యాయాల్లోని వృక్షశాస్త్ర అంశాలపై (ఇంటర్మీడియట్) కూడా అవగాహన స్థాయి పెరగాలి. విస్తృతంగా అధ్యయనం చేయాలి.
ఆరో చాప్టర్- జంతుప్రపంచం-అంశాలు: జంతు శరీరధర్మశాస్త్రం (అవయవాలు-అవయవ వ్యవస్థలు), జ్ఞానేంద్రియాలు (కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం-నిర్మాణం-విధులు), మానవ పోషణ, పోషకాలు, వాటి ధర్మాలు-విధులు, సంతులిత ఆహారం, న్యూనతా వ్యాధులు, ఉష్ణమండల వ్యాధులు, చర్మ వ్యాధులు, మానవుల్లో అంధత్వం, కారణాలు, నివారణ నియంత్రణ, ఆరోగ్య సంస్థలు, ప్రథమ చికిత్స-కీటకాల కాటు, పాముకాటు, తేలుకాటు, ఎముకల విరుపు, ప్రమాదాలు, జీవిత నైపుణ్యాలు, వన్య, పెంపుడు జంతువులు, జంతువుల ఆర్థిక ప్రాముఖ్యత, జంతుప్రవర్తన, పిసికల్చర్, సెరికల్చర్, పౌల్ట్రీ, గేదెలు, ఆవుల ప్రజననం, అనువంశికత అంశాలు ఉన్నాయి.
-జంతుశాస్ర్తానికి సంబంధిన అంశాల్లో ముఖ్యమైనవి: 3వ అధ్యాయంలోని ప్రోటోజోవన్లు, నాలుగో అధ్యాయంలోని జంతు కణజాలాలు, జంతుకణం, 6, 7 అధ్యాయాలను చదవాలి. వీటికి సంబంధించిన అంశాలు ఇంటర్మీడియట్ స్థాయిలో వివరణాత్మకంగా ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆ స్థాయిలో అధ్యయనం చేయాలి. ఆరో చాప్టర్ నుంచి కూడా కఠినస్థాయి ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
7వ చాప్టర్: మన పర్యావరణం-అంశాలు: స్కూల్‌స్థాయి ప్రధానంగా 8, 9, 10 తరగతుల్లోనివి, ఇంటర్ ప్రథమ సంవత్సరం జంతుశాస్త్రంలోని అంశాలను అధ్యయనం చేస్తే సరిపోతుంది.
-8వ చాప్టర్- శక్తిమయ ప్రపంచం-అంశాలు: ఇందులో ప్రధానంగా పని-శక్తి, శక్తి రూపాంతరీకరణ, సజీవుల్లో శక్తి అవశ్యకత, ఆధార జీవక్రియా రేటు (బీఎంఆర్), ఆవరణ వ్యవస్థలోని శక్తి సంబంధాలు, జీవ ద్రవ్యరాశి, జీవ ఇంధనాలు, సాంప్రదాయేతర శక్తి వనరుల గురించి అధ్యయనం చేయాలి.
-8వ చాప్టర్లోని అంశాల కోసం పాత సిలబస్ 9వ తరగతి నాలుగో అధ్యాయం, 7వ అధ్యాయం చదవాలి. సహజవనరుల గురించిన సమాచారం 3వ అధ్యాయంలో ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
9వ చాప్టర్- జీవశాస్త్రంలో ఆధునిక ధోరణులు: ఈ చాప్టర్లో ప్రధానమైనవి సంకరణం, జన్యుపరివర్తనం, జెనెటిక్ ఇంజినీరింగ్, జీన్ బ్యాంక్, జన్యు చికిత్స, కణజాల వర్ధనం, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ అంశాలను అధ్యయనం చేయాలి.
-ఇంటర్మీడియట్ వృక్ష, జంతుశాస్ర్తాల్లోని అంశాలను చదివితే సరిపోతుంది.
-జీవశాస్త్ర కంటెంట్ చాలా కీలకమైనదనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఎందుకంటే అత్యధిక మార్కులు (44) కంటెంట్‌కే కేటాయించారు. ఈ విభాగం నుంచి మొత్తం 88 ప్రశ్నలు వస్తాయి. కంటెంట్‌పై పట్టు ఉంటే ఈ విభాగం నుంచి పూర్తి మార్కులు సాధించవచ్చు.
-అభ్యర్థులు ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలి.
-జీవశాస్త్ర బోధనాపద్ధతులు అనే విభాగం కోసం పాతసిలబస్ ఇచ్చారు. తెలుగు అకాడమీ పుస్తకాలను 2010 నుంచి 2015 వరకు పరిశీలిస్తే పూర్తి సిలబస్ లభ్యమవుతుంది.
-జీవశాస్త్ర బోధనాపద్ధతుల్లో 10 అధ్యాయాలను క్షుణ్ణంగా చదవాల్సిందే. పట్టుదలతో అధ్యయనం, సాధన చేస్తే ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించడం సులభం.
జీవశాస్త్ర-మెథడాలజీ ప్రిపరేషన్ ప్లాన్
-ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదవాలి.
-వ్యూహాత్మక పునశ్చరణతోనే మెథడాలజీలో స్కోరింగ్.
-టీఆర్టీకి ఉన్న కొద్ది కాల వ్యవధిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో భాగంగా ఆయా బోధన అభ్యసన శాస్త్రంపై తదేక దృష్టి, సమన్వయం, చొరవ, ఉత్సుకతతో ప్రతి అంశాన్ని చదవాలి. జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో 32 ప్రశ్నలకుగాను 16 మార్కులు ఉంటాయి. విజయానికి ఇది కూడా ఒక మెట్టు లాంటిది. అంటే దాదాపు విజయం ఈ బోధన అభ్యసన శాస్త్రంపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలోని పాఠ్య ప్రణాళిక ఎన్సీఎఫ్-2014 విద్యలో గుణాత్మకతను పెంపొందించడానికి నూతన పాఠ్య ప్రణాళికను రెండేండ్ల కోర్సుకు సరిపడినట్లు మార్చారు. ఈ కొత్త సిలబస్ అంశాలు కూడా చదవడం వల్ల మెథడ్‌పై పూర్తి విశ్లేషణాత్మక అవగాహన వస్తుంది. అభ్యర్థులు చదివిన అంశాలను ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకొని మరిన్ని ఉదహరణలతో సొంతంగా నోట్స్ తయారుచేసుకొని క్రమపద్ధతిలో కృత్య వివరణగా చదువుతూ ఒక అంశానికి మరో అంశానికి మధ్య భేదాలు, పోలికలు అన్వయించుకుంటూ అప్లికేషన్ ప్రశ్నావళి తీరును గుర్తిస్తూ సమగ్ర సమాచారం చదివాననే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నప్పుడు పూర్తిస్థాయి విజయం మీదే అవుతుంది.
(మెథాడాలజీ)
జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో మొత్తంగా పది యూనిట్లు ఉన్నాయి.
1. విజ్ఞానశాస్త్రం – స్వభావం, పరిధి
2. జీవశాస్త్ర అభ్యసన విలువలు, ఉద్దేశాలు
3. జీవశాస్త్ర అభ్యసన లక్ష్యాలు
4. జీవశాస్త్ర అభ్యసన ఉపయోగాలు, పద్ధతులు
5. జీవశాస్త్ర అభ్యసన ప్రణాళికలు
6. జీవశాస్త్ర ప్రయోగశాల
7. జీవశాస్త్ర విద్యా ప్రణాళిక
8. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు
9. అనియత విద్య
10. మూల్యాంకనం
-ఒకటో చాప్టర్లో విజ్ఞానశాస్త్రం స్వభావం, పరిధి అంశాలే కాకుండా జీవశాస్త్ర పరిధి, స్వభావాలను పూర్తిస్థాయిలో సంశ్లేషణాత్మకంగా చదవాలి. ఈ చాప్టర్ నుంచి సూటిగా ప్రశ్నలు అడుగుతారు.
-రెండో చాప్టర్లో విలువలు, ఉద్దేశాలపై నిత్యజీవితానికి అన్వయించుకొని అప్లికేషన్ మెథడ్‌లో రెండు లేదా మూడు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-మూడో చాప్టర్లో విద్యా లక్ష్యాలు వాటిలో జరిగిన మార్పులు, కొత్త పోకడలు, విధానాలను విద్యార్థికి అన్వయించుకుంటూ లక్ష్యాల మధ్య భేదాలు అవగాహన చేసుకొని పూర్తిస్థాయిలో చదవాలి. దీనిలో మూడు లేదా నాలుగు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-నాలుగో చాప్టర్ ఉపగమాలు, పద్ధతులులో కృత్యాల స్థాయిలో ఉపయోగించే పద్ధతులపై దృష్టి పెట్టాలి. వీటిని అప్లికేషన్ మెథడ్‌లో రెండు లేదా మూడు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-ఐదో చాప్టర్లో బోధనాభ్యసనం కోసం ఉపయోగించే ప్రణాళికలు ప్రాథమికాంశాలు, సమాచార ప్రసార సాంకేతిక అన్వయాల ప్రణాళికలు, సమాచార ప్రసార సాంకేతికాలు విద్యలో తీసుకువచ్చిన మార్పులను చదవాలి. ఇందులో సూటిగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-ఆరో చాప్టర్లో ప్రయోగశాల జీవశాస్త్ర ప్రయోగశాల ప్రాముఖ్యత, విద్యార్థి ఎలా ఉపయోగించుకుంటాడనే అంశాల మీద ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-ఏడో చాప్టర్లోని విద్యా ప్రణాళికలు, పాఠ్య ప్రణాళిక, నూతన విద్యా ప్రణాళిక, మార్పులు, జాతీయ విద్యా చట్టం, సిలబస్, సామగ్రి, ముద్రణ వనరులపై విషయావగాహనతో అర్థం చేసుకుంటూ చదవాలి. రెండు లేదా మూడు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-ఎనిమిదో చాప్టర్లో ఉపాధ్యాయుడు అనే అంశం అందరికీ తెలిసిందే అనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తారు. కానీ ఒక ఉపాధ్యాయుడు జీవశాస్త్ర అంశాలను బోధించేందుకు ఏ విధంగా సన్నద్ధంగా ఉండాలనే విషయాలను స్వయం అవగాహనతో చదవాలి. ప్రశ్నలు ఇన్‌డైరెక్ట్ మెథడ్‌లో సూటిగా ప్రశ్నలు అడుగుతారు. రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
-తొమ్మిదో చాప్టర్లో అనియత విద్య, బడి బయట పిల్లల కోసం విద్య కోసం ప్రభుత్వ కార్యక్రమాలు, కృత్యవగాహనతో చదవాలి. రెండు ప్రశ్నలు విద్య కార్యక్రమాలపై అడిగే అవకాశం ఉంది.
-పదో చాప్టర్ (జీవశాస్త్ర మూల్యాంకనం)లో ప్రస్తుత మూల్యంకన పద్ధతులు ప్రత్యేక అవసరాలు గల పిల్లల మూల్యాంకనం, మూల్యాంకన/మదింపు చట్రాలపై దృష్టి సారించి సమాచార సేకరణతో చదవాలి. డైరెక్టుగా మూడు లేదా నాలుగు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-పై చాప్టర్లలో అభ్యర్థులు మరింత దృష్టి, విశ్లేషణాత్మక అవగాహన పెట్టాల్సిన యూనిట్లు. జీవశాస్త్ర, లక్ష్యాలు, విలువలు, ఉద్దేశాలు, ప్రణాళికలు, మూల్యంకనంపై వ్యూహాత్మకంగా అప్లికేషన్‌తో విద్యార్థి స్థాయికి దిగి ఆలోచిస్తూ పాఠ్యాంశ సమన్వయంతో పరిశీలన, స్వీయ విశ్వాసాన్ని పెంచుకొనే విధంగా సొంత నోట్స్ ప్రిపరేషన్‌తో చదివితే జీవశాస్త్ర అభ్యసన శాస్త్రంలోని 16 మార్కులు సాధించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు