బెంగాల్ ఉద్యమం ప్రాముఖ్యత ఏంటి?
అరవింద ఘోష్
-అతివాద జాతీయోద్యమ నాయకుల్లో అరవింద ఘోష్ ప్రముఖుడు. ఇతడు స్వామి వివేకానందుని ఆధునిక వేదాంత ఉద్యమంవల్ల ప్రభావితుడయ్యాడు.
-రాజకీయ స్వాతంత్య్రం దేశానికి ఆయువుపట్టు అని ప్రకటించాడు.
-ఇతను న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్ అనే శీర్షికన బొంబాయికి చెందిన ఇందుప్రకాశ్ అనే పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ వ్యాసాలు రాశాడు.
-అరవిందుని దృష్టిలో జాతీయత రాజకీయ కార్యక్రమం మాత్రమే కాదు. జాతీయత అనేది మతం. దాన్ని దైవం ప్రజ లకు ఇచ్చింది ఈ భావం హృదయానికి ఆత్మకు సంబంధిం చింది అని జాతీయతను నిర్వచించాడు.
-వందేమాతరం పత్రిక నిర్వహణలో బిపిన్ చంద్రపాల్‌కు సహకరించాడు. బెంగాల్లో జుగంతర్ అనే పత్రికను ప్రారంభించాడు.
-భారత జాతీయోద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించిన అరవిందుడు 1910లో రాజకీయ సన్యాసం చేసి పాండిచ్చేరి అడవులకు వెళ్లాడు. వందేమాతర ఉద్యమంలో ఇతర ముఖ్య సంఘటనలు
-బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో స్వరాజ్, స్వదేశీ, ఆర్థిక బహిష్కరణ, జాతీయ విద్యా విధానం మొదలైన నినాదాలు ఆవిర్భవించాయి.
-బెంగాల్ విభజన మధ్యతరగతి జాతీయవాద ఆవిర్భావానికి నాంది పలికింది. 1905, అక్టోబర్ 16న బెంగాల్ అంతటా సంతాప దినంగా పాటించారు. రెండు రాష్ర్టాల మధ్య సమైక్యతకు చిహ్నంగా ప్రజలు రక్షాబంధన్ మహోత్సవాన్ని నిర్వహించారు. నేత పరిశ్రమను ఆర్థికంగా ప్రోత్సహించడానికి బహిరంగ సమావేశంలో సురేంద్రనాథ్ బెనర్జీ జాతీయ నిధిని ప్రారంభించాడు.
-ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంగ్లంలో మాట్లాడటం, రాయడం మానేసి స్వదేశీ భాషల్లో ఆ పని చేయాలని ప్రజలను కోరాడు.
-రవీంద్రనాథ్ ఠాగూర్ స్వదేశీ స్టోర్‌ను ప్రారంభించాడు. బ్యాంకులు, బీమా కంపెనీలను స్థాపించడానికి జమీందారులు, వ్యాపారులు, రాజకీయ నాయకులతో చర్చలు జరిపాడు.
-ఈ సమయంలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా పాట రాయగా, దక్షిణాన రంజన్ మజుందార్ తాకూమార్ జూలీ (అమ్మమ్మ కథలు) అనే పుస్తకాన్ని ప్రచురించాడు.
-స్వదేశీ ఉద్యమంలో స్త్రీలు ప్రముఖంగా పాల్గొన్నారు. పట్టణాల్లో మధ్యతరగతి స్త్రీలు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు.
-బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం ప్రజాదరణ పొందినా రైతాంగాన్ని మాత్రం కదిలించలేక పోయింది. ఈ ఉద్యమం పట్టణాలు, మధ్యతరగతి ప్రజలకు పరిమితమైంది.
-ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం పత్రికలపై నిర్బంధాలను విధించింది. వందేమాతరం సంపాదకుడు అరవిందఘోష్, సంధ్య సంపాదకుడు ఉపాధ్యాయ, యుగంధర్ సంపాదకుడు భూపేంద్రనాథ్దత్తలను విచారించి శిక్షించారు.
-బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన వందేమాతర ఉద్యమం 1908 వరకు కొనసాగింది. చివరికి ప్రభుత్వ అణచివేత విధానాల ఫలితంగా ఉద్యమం క్షీణించింది.
-ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ మింటో హిందువులు, ముస్లింల మధ్య, మితవాదులు, అతివాదుల మధ్య కుట్ర పన్నాడు.
-ఇందుకనుగుణంగా మితవాదులను లోబరుచుకోవడానికి భారతీయులకు అనుగుణంగా నూతన రాజ్యాంగ సంస్కరణలు చేపడతామని వాగ్దానాలు చేశాడు.
-ముస్లింలను లొంగదీసుకోవడానికి జరుగబోయే ఎన్నికల్లో ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటుచేసి వారి హక్కులను కాపాడుతామని ప్రకటించాడు.
-1906లో అఖిల భారత ముస్లిం లీగ్‌ను స్థాపించడంతో ముస్లిం నాయకులు వందేమాతర ఉద్యమానికి దూరమయ్యారు.
-అయితే నాయకుల్లో ఐకమత్యం లేకపోవడం, మితవాదులు అతివాదుల ధోరణులను వ్యతిరేకించడం, 1908 నాటికి తిలక్, బిపిన్ చంద్రపాల్‌లు జైలుకు వెళ్లడం, లాలా లజపతిరాయ్‌ని దేశ బహిష్కరణ చేయడం, అరవింద ఘోష్ సన్యసించడంతో బెంగాల్ ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం నీరుగారిపోయింది.
-1911లో బ్రిటిష్ చక్రవర్తి జార్జి-5 భారత్‌కు విచ్చేసినప్పుడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన దర్బార్‌లో బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్టింజ్-2 ప్రకటించాడు.
-ఇదే ఏడాది రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. 1912, మార్చి 22న అప్పటి భారత రాజ్య కార్యదర్శి లార్డ్ క్రెవీ బెంగాల్ విభజన రద్దును అమలుపరచి సమైక్య బెంగాల్ రాష్ర్టాన్ని తిరిగి పునరుద్ధరించాడు.
సూరత్ కాంగ్రెస్ సమావేశం (1907)
-బెంగాల్ విభజన జరిగిన కొద్దిరోజుల్లోనే 1905 డిసెంబర్లో బెనారస్‌లో కాంగ్రెస్ సమావేశమైంది. దీనికి గోఖలే అధ్యక్షత వహించాడు. అయితే ఆర్థిక బహిష్కరణ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించాలని తీవ్రవాద భావాలు గల బెంగాలీ ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో గోఖలే బెంగాల్ విభజనను ఖండించి స్వదేశీ ఉద్యమాన్ని సమర్థించాడు. అయితే 1906లో బ్రిటిష్ యువరాజు భారత్‌ను సందర్శించాల్సి ఉంది. యువరాజుకు స్వాగతం చెబుతూ ఆయనపట్ల ఎలాంటి అమర్యాద చూపకూడదని తీర్మానాన్ని ఆమోదిద్దామన్నారు మితవాదులు. కానీ అతివాదులు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు.
-1906లో కాంగ్రెస్ కలకత్తాలో సమావేశాన్ని నిర్వహించింది. అతివాదులు తిలక్‌ను అధ్యక్షునిగా ఎన్నుకోవాలని భావించారు. కానీ, మితవాదులు దాదాభాయ్ నౌరోజీ అధ్యక్ష పదవి స్వీకరించాల్సిందిగా కోరి, ఒప్పించి అతివాదుల ప్రయత్నం భగ్నం చేశారు. సమావేశంలో దాదాభాయ్ నౌరోజీ మాట్లాడుతూ గ్రేట్ బ్రిటన్ ఇతర వలసప్రాంతాల్లో వలే స్వపరిపాలన, స్వరాజ్ భారత జాతీయ ఉద్యమ లక్ష్యమని బహిరంగంగా అధ్యక్ష ఉపన్యాసంలో ప్రకటించి, నౌరోజీ జాతీయవాదులని ఆశ్చర్యపరిచాడు. ఈ సమావేశంలో స్వరాజ్, స్వదేశీ, ఆర్థిక బహిష్కరణ, జాతీయ విద్యావిధానాలను ఆమోదిస్తూ తీర్మానాలు చేశారు. ఈ సమావేశం అతివాద వర్గానికి విజయంగా చెప్పవచ్చు.
-బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ కొనసాగిన తీవ్ర ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాలకు దారితీసింది. కాంగ్రెస్‌లోని అన్నివర్గాలవారు బెంగాల్ విభజనను వ్యతిరేకించిన ఉద్యమం తీరుపట్ల, ఉద్యమ లక్ష్యాలపై మితవాదులు, అతివాదుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ మొదలైన మితవాదులు ఉద్యమం బెంగాల్‌కు మాత్రమే పరిమితమై ఉండాలని, అందులో కూడా ఇది స్వదేశీ ప్రోత్సాహం, విదేశీ వస్తు బహిష్కరణకు ప్రాధాన్యం ఇస్తే చాలని భావించారు. అయితే అతివాదులైన బాలగంగాధర్ తిలక్, లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్ వంటి నాయకులు వందేమాతర ఉద్యమాన్ని అభిలభారత ఉద్యమంగా రూపొందించి, దేశమంతటా చేపట్టాలని దాని ద్వారా బ్రిటిష్‌వారి పాలనను అంతమొందించడానికి జాతీయోద్యమం కొనసాగించాలని భావించారు. ఇరువర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగా 1907లో జరిగిన సూరత్ సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది.
-అయితే ఈ 23వ కాంగ్రెస్ సమావేశం నాగ్‌పూర్‌లో జరగాల్సి ఉండగా, అక్కడ అతివాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో మితవాద నాయకుడైన ఫిరోజ్‌షా మెహతాకు పట్టున్న సూరత్ పట్టణానికి మార్చారు.
-ఈ సమావేశ అధ్యక్ష పదవికి అతివాదులు లాలా లజపతిరాయ్‌ని ప్రకటించగా, మితవాదులు రాస్బిహారీ బోస్సు ప్రతిపాదించారు. దీంతో లాలా లజపతిరాయ్ పోటీ నుంచి విరమించుకున్నాడు.
-సమావేశం ప్రారంభంకాగానే ప్రసంగించడానికి తిలక్ అనుమతి కోరగా, దానికి మితవాదులు నిరాకరించారు. రాస్బిహారీ బోస్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించాడు. ఈ సందర్భంలో జరిగిన అలజడిలో సురేంద్రనాథ్ బెనర్జీకి గాయాలయ్యాయి. దీంతో సమావేశం రద్దయ్యింది. తిలక్ చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదు.
-మితవాదులు విడిగా సమావేశమై కాంగ్రెస్ నుంచి అతివాదులను బహిష్కరించారు. సూరత్ సమావేశం అనంతరం కాంగ్రెస్ రెండు ముక్కలై అతివాద వర్గానికి తిలక్, మితవాద వర్గానికి గోఖలే నాయకత్వం వహించారు.
-అతివాదులు తిలక్ నాయకత్వంలో కొత్తగా నేషనలిస్ట్ పార్టీని స్థాపించారు.
బిపిన్ చంద్రపాల్
-ఈయన బెంగాల్లో స్వదేశీ ఉద్యమాన్ని నిర్వహించాడు.
-1907లో ఆంధ్రలో పర్యటించి స్వదేశీ ఉద్యమ ప్రచారం ద్వారా ప్రజల్లో ఉత్తేజం నింపాడు.
-ఇతని పర్యటనను ఆంధ్రలో ముట్నూరి కృష్ణారావు పర్యవేక్షించాడు. ఈ సందర్భంగా సంస్కరణ కాదు దేశానికి కావలసింది, కొత్తరూపం సుమా అని బిపిన్ చంద్రపాల్ పిలుపునిచ్చాడు.
-ఈయన ప్రసంగాలను చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగులోకి అనువదించాడు. ఆయన రాజమండ్రి నుంచి మనోరమ అనే పత్రికను నడిపాడు. భరత ఖండంబు చక్కని పాడి ఆవు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి అని బ్రిటిష్ ప్రభుత్వ పాలనను విమర్శించాడు.
-దేశభక్తుడు అయిన శ్రీపాద కృష్ణమూర్తి 1907లో వందేమాతరం అనే వారపత్రికను ప్రారంభించాడు. ఈ పత్రిక తెలుగు ప్రజలకు వందేమాతరం మనదే రాజ్యం అనే నినాదాన్ని అందించింది.
-చిదంబరం పిైళ్లె అనే దేశభక్తుడు మద్రాస్‌కు చెందిన గొప్ప వ్యాపారి. ఈయన స్వదేశీ ఉద్యమకాలంలో జాతీయ వాణిజ్య నౌకను నడపడానికి ప్రయత్నించగా బ్రిటిష్‌వారు అతన్ని అరెస్టు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు