Indian society | భారతీయ సమాజం-విభజన
జజ్మాని వ్యవస్థ
-భారతదేశ సమాజంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కనిపించే వృత్తిపరమైన సేవలను జజ్మాని వ్యవస్థ అంటారు. ఈ విధానంలో వివిధ కులాల మధ్య ఆర్థికపరమైన సేవలు పరస్పరం వినియోగించుకోబడతాయి.
ఉదా: గ్రామీణ సమాజంలో వడ్రంగి, క్షురకుడు (మంగళి), కమ్మరి, కంసాలి మొదలైనవారు వ్యవసాయదారులకు తమ వృత్తిపరమైన సేవలనందిస్తారు. ఫలితంగా వారు ధాన్యం లేదా ఇతర రూపాల్లో తమ సేవలకు ప్రతిఫలం పొంది జీవనం కొనసాగిస్తారు. వస్తుమార్పిడి లేదా సేవల మార్పిడి ఇక్కడ ప్రాథమికంగా కన్పిస్తుంది. ఇలా కులాలు ఒకరిపై మరొకరు ఆధారపడిన వ్యవస్థనే జజ్మాని వ్యవస్థ అంటారు.
-ఒక్కో కుల సమూహం ఒక్కో రకమైన వృత్తిలో నైపుణ్యం కలిగి ఉండటం వల్ల తమ సేవలను కులాల మధ్య వినియోగించుకుంటారు.
-ప్రొఫెసర్ యోగేంద్ర సింగ్ అభిప్రాయంలో గ్రామీణ భారతంలోని వివిధ కులాల మధ్య ఉన్న పరస్పర సంబంధాలే జజ్మానీ వ్యవస్థ.
-జజ్మాన్ అనేది యజమాన్ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. యజమాన్ అంటే యజంను నిర్వహించేవాడని అర్థం. జజ్మాని అనే పదం సాధారణంగా గ్రామానికి సంబంధించిన ప్రముఖుడు లేదా ప్రముఖులను సూచిస్తుంది. సహజంగానే వీరు భూస్వాములు కావడంవల్ల భూమిలేని మిగతా కులసమూహాలు వీరి వ్యవసాయానికి, ఇతర మతపరమైన సంస్కారాలకు తమ సేవలను అందిస్తూ ఆ యజమాని నుంచి తమ అవసరాలను తీర్చుకునేందుకు ధాన్యం, ఆహార పదార్థాలు, రక్షణ లాంటి ప్రతిఫలాన్ని పొందుతారు.
-ఇలా యజమాని వివిధ రకాల సేవలు అందించేవారిని Projo లేదా Kamins అంటారు. సాధారణంగా ధనవంతులైన ఉన్నత వర్గాల వారు యజమానులు. సంపద, వ్యవసాయ భూమి లేనివారు Kaminsగా సేవలందించేవారు.
-ఇలా జజ్మాని వ్యవస్థ సంప్రదాయపరమైన కులవృత్తి బాధ్యతలను తెలిపే వ్యవస్థ. ఇందులో సేవలను అందించే కులాలను Kamins అని, సేవలను పొందేవారిని జజ్మాని అని అంటారు.
-జజ్మాని వ్యవస్థ వివిధ కులాలకు చెందిన రెండు కుటుంబాల మధ్య సంబంధాలను ఏర్పరుస్తుంది.
ఉదా: వ్యవసాయాధార కుటుంబానికి, వడ్రంగి కుటుంబానికి మధ్య ఉండే పరస్పర సంబంధం.
-ఒక Kamins కుటుంబం వారసత్వంగా జజ్మానికి సంబంధించి ఒక కుటుంబానికి సేవలందించే వారసత్వ హక్కును కలిగి ఉంటుంది. అంటే అందరు సేవకులు (Kamins). జజ్మాన్లకు సేవలు అందివ్వరు. ఒకవేళ ఆయా కుటుంబాలు స్వచ్ఛందంగా తమ హక్కును వదులుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.
-ఇలా కులాల మధ్య సేవాపరమైన పరస్పర ఆధారితం ఉన్నందువల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామంలో సంఘటితం దృఢంగా ఉంటుంది.
Harold Gould అభిప్రాయంలో..
-ఇది ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ ఫ్యామిలీ సంబంధం. యజమాని-సేవకుల సంబంధం. అంటే పోషకులు (Jajman), సేవకుల (Kamins) మధ్యగల సంబంధం.
-సాధారణంగా పోషకులుగా లేదా యజమానులుగా ఉన్నత కులాలకు చెందిన భూస్వాములు, సేవకులుగా భూమిలేని ఇతర కులాలు తమ వృత్తి నైపుణ్యం ద్వారా పోషించేందుకు అనుసరించే మార్గం.
-సేవకులు యజమాని గృహంలో జరిగే వివిధ మతపరమైన సంస్కారాలకు తమ సేవలను అందిస్తారు. అంటే పనిముట్లను అందించడమే కాకుండా మతపరమైన కార్యక్రమాల నిర్వహణలో తమ సేవలను అందిస్తారు.
ఉదా: Services of the Hairstylees (క్షురకులు)
Services of the Dhobi
Services of the Priest (పూజారి) మొదలైనవి.
-లీచ్ అభిప్రాయంలో జజ్మాని వ్యవస్థ అనేది శ్రమవిభజనను, కులాల మధ్యగల ఆర్థికపరమైన ఆధారాన్ని క్రమబద్ధం చేస్తుంది.
-జజ్మాని వ్యవస్థ వల్ల నిమ్న కులాలవారు వారి సేవలకు చెల్లించే విలువను వారు నిర్ణయించే స్థాయిలో ఉండేవారు కాదు. వారి జీవనానికి సంబంధించి ప్రతి విషయానికి యజమాని దయాదాక్షిణ్యాలపై ఆధారపడటంవల్ల వారి సామాజిక స్థాయి నిమ్నంగా ఉండేది.
-కులపరమైన వృత్తిసేవలు అందించాలనే భావనవల్ల నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఉన్నతమైన ఉపాధి మార్గాలను పొందే అవకాశం లేకుండా పోయింది.
-ఈ వ్యవస్థలో యజమానులు సేవకుల వృత్తిపరమైన సేవలకు తమకు తోచిన రీతిలో పైకం చెల్లిస్తూ మోసగించేవారు. ఫలితంగా సేవకుల ఆర్థికస్థితి దయనీయంగా ఉండేది. ఈ దురవస్థలకు కారణం సేవకులకు ఇతర జీవనోపాధులు లేక వృత్తినే నమ్ముకోవడం, భూములన్ని యజమానుల చేతిలో ఉండటం.
-జజ్మాని వ్యవస్థ బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి పతనమవడం ప్రారంభించింది. అందుకు దోహదం చేసిన కారణాలు..
1. బ్రిటిష్ వారి రాకతో సమాజంలో పారిశ్రామికీకరణ, సహజ వనరుల వెలికితీత వంటివాటివల్ల నూతన జీవనోపాధులు వచ్చి కులపరమైన సేవలను అందించే అవసరం లేకుండా పోవడం
2. విద్య, రవాణా సౌకర్యాల అభివృద్ధివల్ల వలసలు, నూతన వృత్తులు లేదా తమ సేవలకు సరైన డిమాండ్ ఉన్న ప్రాంతంలోనే అందించడం
3. వస్తు మార్పిడి నుంచి కరెన్సీ మాధ్యమంగా మార్కెట్ పరిణామం చెందడం
4. భూముల పంపిణీ, జమీందారీ వ్యవస్థ రద్దు, భూ సంస్కరణ, భూ గరిష్ఠ పరిమితి వంటివాటివల్ల భూ సంపద నిమ్న వర్గాలకు అందడంతో వారు వ్యవసాయం వైపు మొగ్గుచూపడం
5. సంఘ సంస్కరణ ఉద్యమాలు, నిమ్నజాతుల పునరుద్ధరణ
6. నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల ప్రజలు గ్రామవృత్తులను వదిలి పట్టణాల్లో జీవించడం వంటి మొదలైన అంశాలు
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
-భారత సమాజ మరొక ప్రధాన లక్షణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. దీనికి సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ వ్యవస్థలో ఉమ్మడి నివాసం, ఉమ్మడి ఆస్తి, ఆదాయాలు, రెండు తరాలకు పైగా కుటుంబ సభ్యులు, సంస్కారాలు, బలమైన సంప్రదాయాల వంటివి ముఖ్యలక్షణాలు. వీటివల్ల కుటుంబాలు దృఢంగా ఉండి తద్వారా సమాజం దృఢంగా తయారైంది. నూతన ఆర్థిక విధానాలు, వలసలు, పారిశ్రామికీకరణ, నగరీకరణ, ఉన్నతవిద్య వంటి ఆర్థికపరమైన మార్పుల వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రస్తుతం మరుగున పడిందనే చెప్పవచ్చు.
హిందూ సామాజిక వ్యవస్థ
-హిందూ సామాజిక వ్యవస్థను భారతదేశ సమాజ ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఇతర సమాజాల్లో ఇలాంటి ప్రత్యేకమైన జీవన విధానం కనిపించదు. మిగతా మతాలకు సంబంధించిన వ్యవస్థలను ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా గమనించవచ్చు.
-హిందూ సామాజిక వ్యవస్థ ముఖ్యలక్షణాలు.. 1. వర్ణవ్యవస్థ, 2. కులవ్యవస్థ, 3. పురుషార్థాలు, 4. కర్మ, 5. వర్ణాశ్రమ ధర్మాలు ఇతర లక్షణాలతో ఏర్పడి ఉంది.
-ప్రతి సభ్యుడు ఆచరించాల్సిన విధి విధానాలను పైన తెలిపిన వివిధ రూపాల్లో పొందుపర్చారు. ఈ హిందూ వ్యవస్థకు వేదాలు, స్మృతులు, ఇతిహాసాలు మొదలైనవి ప్రమాణాలు.
-హిందూ సామాజిక వ్యవస్థల మూలం చాలా వైవిధ్యతతో ఇతిహాస సాహిత్యం, వేద సాహిత్యంలో మూలాలను కలిగి ఉంది. సమాజ నైతికత, భౌతికత, ధర్మశీలత లాంటి విషయాలను పాటించాలని తెలపడం వల్ల సమాజం దృఢంగా కొనసాగడానికి బాటలు వేసింది.
పురుషార్థాలు
-జీవితం ధర్మపరంగా వివిధ దశలను దాటాలంటే ప్రతివ్యక్తి నాలుగు పురుషార్థాలను పాంటిచాలి. అవి..
1. ధర్మం, 2. అర్థం, 3. కామం, 4. మోక్షం
-మానవుని ప్రవర్తనను క్రమబద్ధం చేసేది ధర్మం. ఇదే ప్రపంచానికి మూలం. దు అనే పదం నుంచి ఇది ఉద్భవించింది. ఇది రుగ్వేదంలోని రుత అనే పదానికి సమానం. ఈ ధర్మం వ్యక్తి క్రమశిక్షణ తద్వార సమాజ క్రమాన్ని నిర్దేశిస్తుంది.
-మానవుని అంతిమ లక్షాలు, జీవన గమ్యాలు అయిన నాలుగు పురుషార్థాల్లో ధర్మం మొదటిది. ధర్మం లేని అర్థం, కామం వ్యక్తిని అధమ స్థానానికి తీసుకెళ్తాయి.
-మొదటి మూడు పురుషార్థాలకు 1. ధర్మశాస్త్రం, 2. అర్థశాస్త్రం, 3. కామశాస్త్రం అనే శాస్ర్తాలు ఉన్నాయి. సృష్టిలో దేనికీ హాని కలిగించకుండా కాపాడటానికి ధర్మం ఆవిర్భవించింది.
-ధర్మం, అర్థం, కామాలను కలిపి త్రివర్గాలు అంటారు. ఇందులో అర్థం, కామం ప్రాపంచికాలు. ధర్మం మాత్రం అన్ని పురుషార్థాల్లో ఉన్నతమైనది.
-రెండో పురుషార్థం అయిన అర్థం అంటే సంపద. దీనివల్లే వ్యక్తి ధర్మాలను అనుసరించడానికి, జీవనం సాగించడానికి వీలవుతుంది. అయితే ఇది ధర్మాన్ని మీరకూడదు.
-మూడో పురుషార్థం కామం. అర్థ, కామాలు అనేవి గృహస్థాశ్రమంలో వ్యక్తి అవసరాలు. కామం అంటే కోరిక, ఇంద్రియ వాంఛలను తృప్తి పరచడం.
-కామం అనేది శారీరక వాంఛలకు సంబంధించింది. కాబట్టి అన్ని పురుషార్థాల్లో ఇది అధమంగా భావించబడుతుంది. అయినా కామం వల్లే ప్రజ అంటే సంతానం, వివాహ కుటుంబాలు ఏర్పడుతాయి. అయితే ఈ కామం ధర్మ బద్ధంగా మాత్రమే అనుసరించాలి. అంటే కామాన్ని క్రమబద్ధం చేసుకోవాలి.
-నాలుగో పురుషార్థం మోక్షం. ధర్మం, అర్థం, కామాల పరిపూర్ణత వల్ల వ్యక్తి ఉన్నత స్థానానికి చేరుకుంటాడు. ఫలితంగా అజ్ఞానం నశించును. మనస్సు, ఇంద్రియాలు, సామర్థ్యాలు ఆధీనంలో ఉండటమే మోక్షం. ఇది వ్యక్తి సాధించే అత్యున్నత విలువ.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు