Scientific Institutions | శాస్త్రీయ సంస్థలు – పరిశోధనలు
పూర్వకాలంలో శాస్త్రవేత్తలు తమ సొంత ఖర్చులతో పరిశోధనలు చేసేవారు. ప్రభుత్వాల నుంచి అరకొర సాయం మాత్రమే అందేది. కానీ క్రమంగా శాస్త్ర పురోగతి పెరగడంతో ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి. ఒక అంశంపై పరిశోధన కోసం వివిధ శాస్త్ర విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు ఒకేచోట కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో భారత ప్రభుత్వం దేశంలో అనేక పరిశోధన సంస్థలను స్థాపించింది. వాటిలో జీవశాస్ర్తానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంస్థల వివరాలు నిపుణ పాఠకుల కోసం…
ఇక్రిశాట్
-దీని విస్తృత రూపం ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రోపిక్స్ (ICRISAT).
-ఇది భారత్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. 1972లో ఏర్పాటు చేశారు.
-ఐక్యరాజ్యసమితి పరిధిలోని ఈ సంస్థకు మన దేశం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది.
-ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. మాలీ, కెన్యా, నైగర్, నైజీరియా, మలావి, ఇథియోపియా, జింబాబ్వే దేశాల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి.
-ఈ సంస్థ అర్ధశుష్క ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగే పంట మొక్కలపై పరిశోధనలు చేస్తుంది. అర్ధశుష్క ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా, భూములు నిస్సారంగా ఉంటాయి. దీంతో ఈ ప్రాంతాల్లో తరచూ కరువు ఏర్పడుతుంది. అందుకే ఇలాంటి ప్రాంతాల్లో మనగలిగే వంగడాలను అభివృద్ధి చేసి, కరువును నివారించడం కోసం ఈ సంస్థ పరిశోధనలు చేస్తుంది. గత పదేండ్లలో ఇక్రిశాట్ సైంటిస్టులు అనేక కొత్త వంగడాలను సృష్టించారు. భారత్, చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాల్లోని అర్ధశుష్క ఉష్ణమండల ప్రాంతాల్లో అనేక రకాల కొత్త వంగడాలు సాగులోకి వచ్చాయి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్
-ఇది భారత ప్రభుత్వరంగ సంస్థ. దీన్ని 1911లో ఇండియన్ రిసెర్చ్ ఫండ్ అసోసియేషన్ (IRFA) పేరుతో ఏర్పాటు చేశారు. 1949లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌గా మార్చారు.
-ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీని పరిధిలో 26 నేషనల్ ఇన్స్టిట్యూట్లు, 6 ప్రాంతీయ మెడికల్ రిసెర్చ్ సెంటర్లు ఉన్నాయి.
-ఇది మెడికల్ సైన్సెస్‌లో పరిశోధనలు చేస్తుంది. దీని పరిధిలోని 26 నేషనల్ ఇన్స్టిట్యూట్లు ఎయిడ్స్, టీబీ, కుష్ఠు, కలరా, మలేరియా, డయేరియా, ఇమ్యునో హెమటాలజీ, ఆంకాలజీ, మెడికల్ స్టాటిస్టిక్స్ తదితర అంశాలపై పరిశోధనలు చేస్తాయి. ఆరు రీజినల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్లు ప్రాంతీయ ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు జరుపుతాయి.
నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NBRI)
-ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ పరిధిలోని వృక్షశాస్త్ర పరిశోధన సంస్థ.
-ఈ సంస్థ లక్నోలో ఉంది.
-దీన్ని 1948లో నేషనల్ బొటానికల్ గార్డెన్ (NBG) పేరుతో ఏర్పాటుచేశారు. 1953లో CSIR టేకోవర్ చేసింది. 1978లో దీని పేరును నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NBRI)గా మార్చారు.
-ఈ సంస్థ వృక్షశాస్ర్తానికి సంబంధించి పరిశోధనలు జరుపుతుంది. వర్గీకరణశాస్త్రం, ఆధునిక జీవశాస్ర్తాలపై అధ్యయనం చేస్తుంది.
ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్
-ఇది భారత్‌లో జాతీయస్థాయి వ్యవసాయ పరిశోధన సంస్థ.
-ఈ సంస్థ న్యూఢిల్లీలో ఉంది. ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ (ICAR) పరిధిలో పనిచేస్తుంది.
-దీన్ని 1905లో అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ARI) పేరుతో బీహార్‌లో స్థాపించారు. 1911లో ఇంపీరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్‌గా, 1919లో ఇంపీరియల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్గా పేరు మార్చారు.
-అయితే 1934 జనవరి 15న బీహార్‌లో భూకంపం సంభవించి ఈ సంస్థ పూర్తిగా ధ్వంసమవడంతో ఢిల్లీకి మార్చాలని నిర్ణయించారు. 1936లో ఢిల్లీలో సంస్థను నూతనంగా ప్రారంభించారు. 1947లో స్వాతంత్య్రానంతరం దీని పేరును ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చారు.
-వ్యవసాయ పరిశోధనలు చేసి ఉత్పత్తులను పెంపొందించడం, నూతన వ్యవసాయ విధానాలను వృద్ధిచేయడం, విద్యార్థులకు వ్యవసాయానికి సంబంధించిన వివిధ కోర్సులను అందించడం IARI ప్రధాన లక్ష్యాలు.
సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ
-ఇది భారత్‌కు సంబంధించిన జీవసాంకేతిక పరిశోధన సంస్థ. దీన్ని 1977లో ఏర్పాటు చేశారు.
-ఈ సంస్థ హైదరాబాద్‌లో ఉంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (CSIR) పరిధిలో పనిచేస్తుంది.
-బయోటెక్నాలజీ ద్వారా మానవాళి అభివృద్ధికి సంబంధించి ఈ సంస్థ అనేక పరిశోధనలు చేస్తుంది. బయోమెడిసిన్ & డయాగ్నస్టిక్స్, కేంద్రకపూర్వ నిజకేంద్రక జీవుల్లో జీన్ రెగ్యులేషన్, హోస్ట్-పారాసైట్ ఇంటరాక్షన్స్, మెంబ్రేన్ బయాలజీ, ప్రొటీన్ స్ట్రక్చర్, బయోఇన్ఫర్మాటిక్స్, ఫంక్షనల్ జీనోమిక్స్, థియరిటికల్ బయాలజీ మొదలైన అంశాలపై సీసీఎంబీ శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగుతున్నాయి.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రిసెర్చ్
-ఇది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 1976లో ఏర్పాటు చేశారు.
-దీని ప్రధాన కార్యాలయం నాగ్‌పూర్‌లో ఉంది. కోయంబత్తూర్ (తమిళనాడు), సిర్సా (హర్యానా)ల్లో మరో రెండు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
-ఈ సంస్థ ఎప్పటికప్పుడు రైతులకు లాభదాయకంగా ఉండే నూతన పత్తి వంగడాలను సృష్టిస్తూ.. దీర్ఘకాలిక పరిశోధనలు కొనసాగిస్తుంది.
సెంట్రల్ రైస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ -ఇది ఆసియాలోనే అతిపెద్ద వరి పరిశోధన సంస్థ. ఇది కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ పరిధిలో పనిచేస్తుంది.
-దీన్ని 1946, కటక్ (ఒడిశా)లో ఏర్పాటు చేశారు.
-ఇది ఎప్పటికప్పుడు అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలను అభివృద్ధి చేస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు మూడు హైబ్రిడ్ రకాలు సహా దాదాపు 120 రకాల వరివంగడాలను సృష్టించారు.
-ఇక్కడ అభివృద్ధిచేసిన వరివంగడాలు భారత్‌తోపాటు ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, మలేషియా, వియత్నాం, సియెర్రా లియోన్, బుర్కినాఫాసో, బురుండి, మలావి, మాలి, టాంజానియా, పరాగ్వే తదితర దేశాల్లో వినియోగంలో ఉన్నాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్‌కేన్ రిసెర్చ్
-ఇది కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ గొడుగు కింద పనిచేస్తున్న చెరుకు పరిశోధన సంస్థ.
-దీన్ని 1952లో ఏర్పాటు చేశారు. ముందుగా ఇండియన్ సెంట్రల్ షుగర్‌కేన్ కమిటీ పరిధిలో ఉండేది. 1954లో నేరుగా భారత ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. 1969లో ఇతర పరిశోధన సంస్థలతో కలిసి ఐకార్ గొడుగు కింద చేరింది.
-ఈ సంస్థ ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. బీహార్‌లో ప్రాంతీయ కేంద్రం, మహారాష్ట్రలో బయాలజికల్ కంట్రోల్ సెంటర్ ఉన్నాయి.
-చెరుకు వంగడాలను, ఉత్పత్తులను పెంచడం ఈ సంస్థ ప్రధాన కర్తవ్యం. ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో చెరుకు పంటసాగుకు సంబంధించి ఈ సంస్థ వివిధ వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
-ఇది దేశంలోని పురాతన పరిశోధనా సంస్థల్లో ఒకటి. అంతేగాక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ పరిధిలో ఇదే అతిపెద్ద సంస్థ.
-ఈ సంస్థ హైదరాబాద్‌లో ఉంది. దీన్ని 1918లో బెరిబెరి వ్యాధిపై అధ్యయనం కోసం తమిళనాడులోని పాశ్చర్ ఇన్స్టిట్యూట్లోని ఒక గదిలో ఏర్పాటు చేశారు. 1928లో విస్తరించి న్యూట్రిషన్ రిసెర్చ్ ల్యాబొరేటరీస్ గా పేరు మార్చారు.
-1958లో దీన్ని హైదరాబాద్‌కు తరలించారు. 1969లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌గా పేరు మార్చారు.
-దేశంలో పోషకాహార లోపాన్ని తగ్గించడం కోసం ఈ సంస్థ కృషిచేస్తుంది. క్లినికల్ న్యూట్రిషన్, ఫార్మకాలజీ, పాథాలజీ, టాక్సికాలజీ, ఫుడ్ కెమిస్ట్రీ, ఎండోక్రినాలజీ, మాలిక్యులార్ బయాలజీ, రీజనరేటివ్ మెడిసిన్, కమ్యూనిటీ న్యూట్రిషన్, ఆప్తాల్మాలజీ, స్పోర్ట్స్ న్యూట్రిషన్ తదితర అంశాల్లో పరిశోధనలు జరుపుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు