Library movement | తెలంగాణలో గ్రంథాలయోద్యమం
-తెలుగు ప్రజలు ప్రాచీన, మధ్యయుగంలో తమ గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి జరిగిన ప్రయత్నమే గ్రంథాలయోద్యమం. తెలంగాణ ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం తీసుకువచ్చే క్రమంలో గ్రంథాలయోద్యమం కీలకపాత్ర పోషించింది. నిజాం సంస్థానంలో సాహితీ రంగానికి ఒక విశిష్టత ఉంది. ఇది ప్రజలను చైతన్యవంతులను చేసి నిజాం నిరంకుశ పాలనను కూకటివేళ్లతో పెకిలించేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. ఇదే నిజాం ప్రభుత్వ పరిభాషలో చెప్పాలంటే గ్రంథాలయం అంటే విప్లవ సంస్థలు. అప్పటి ప్రభుత్వ ఆలోచనలో ఒక్క గ్రంథం ఎన్నో ఉద్యమాలతో సమానం. గ్రంథాలు బయటికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేసింది. ఒక గ్రంథాలయం ప్రారంభించాలంటే కచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉండేది. ఎక్కడైనా గ్రంథాలయాలు స్థాపిస్తున్నారని తెలిస్తే భయకంపితులై, దానిపై అనేక ఆంక్షలను విధించి మూసేయించనిదే పాలకులకు నిద్రపట్టేది కాదు. ఎంత నిర్బంధం, నిఘా ఉన్నప్పటికీ గ్రంథాలయోద్యమ పవనాలు వీయక మానలేదు. రహస్యంగా గ్రంథాలను పంపిణీ చేసుకునే అలవాటు మొదలైంది. గ్రంథాలయాలను స్థాపించినవారు ఉన్నతవర్గాల నుంచి వచ్చిన ఉదారవాదులు, ప్రజాతంత్ర భావాలు కలవారు. గ్రంథాలయ స్థాపన ద్వారా మాతృభాషపై అభిమానం, విజ్ఞానవ్యాప్తి ఉద్యమ ఆరంభంలో ప్రధానాశయంగా ఉన్నట్లు ప్రచారం చేస్తూ అంతర్లీనంగా రాజకీయ లక్షణాలు కలిగి ప్రభుత్వ అధికారులకు అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డారు.
స్థాపించిన గ్రంథాలయాలు
-తెలంగాణలో 1872లో సికింద్రాబాద్‌లో సోమసుందర్ మొదలియార్ గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఇది హైదరాబాద్‌లోనే కాకుండా తెలుగు ప్రాంతాల్లోనే మొదటి గ్రంథాలయంగా చెప్పుకోవచ్చు. దీన్ని 1884లో మహబూబియా కళాశాలలో విలీనం చేశారు.
-1872లో ముదిగొండ శంకరాద్యులు సికింద్రాబాద్‌లోని శంకర్‌మఠ్‌లో శంకరానంద గ్రంథాలయాన్ని స్థాపించారు. ఇదే సంవత్సరంలో ముదిగొండ శంకరాద్యులు సికింద్రాబాద్‌లోనే సార్వజనీక గ్రంథాలయాన్ని స్థాపించారు.
-1892లో అసఫియా స్టేట్ సెంట్రల్ స్థాపించబడింది. మొదట్లో ఈ గ్రంథాలయంలో అరబ్బీ, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్, సంస్కృత గ్రంథాలు మాత్రమే లభ్యమయ్యేవి. అయితే ఆంధ్ర మహాసభ కృషి ఫలితంగా 1940 నుంచి ప్రాంతీయ భాషలైన తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, భాషా గ్రంథాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు.
-1895లో భారత్ గుణవర్దక్ సంస్థ గ్రంథాలయం శాలిబండలో ఏర్పాటైంది. మరాఠీ భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం కొంతమంది మరాఠీ సంపన్నులు ఈ గ్రంథాలయాన్ని స్థాపించారు. 1896లో బొల్లారంలో ఆల్బర్ట్ రీడింగ్ రూం ఏర్పాటయ్యింది.
-గ్రంథాలయోద్యమానికి ఆద్యుడు, పితామహుడు అని పిలవబడే కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల రాజు రాజా నాయని వెంకటరంగారావు సంస్థానంలో దివాన్‌గా పనిచేసేవారు. వెంకటరంగారావు కొమర్రాజు లక్ష్మణరావుకు అవసరమైన ఆర్థికసహాయం, విశ్రాంతి ఇచ్చి ఆయన కృషికి అండగా నిలిచాడు.
-నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావులతో కలిసి కొమర్రాజు లక్ష్మణరావు హైదరాబాద్‌లో 1901లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించారు. ఈ గ్రంథాలయాన్ని రావిచెట్టు రంగారావు గృహంలో స్థాపించారు. ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, రఘుపతి వెంకటరత్నంనాయుడు అప్పటి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో తెలుగు భాషా స్థితిని మెరుగుపర్చడమే ఈ గ్రంథాలయ స్థాపన ప్రధాన ఉద్దేశం. ఆదిరాజు వీరభద్రరాజు వంటి ప్రముఖులు ఈ గ్రంథాలయ కార్యకర్తలుగా పనిచేశారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి, తెలంగాణ గ్రంథాలయోద్యమానికి ఊపునిచ్చింది. దీని తర్వాత తెలంగాణవ్యాప్తంగా అనేక గ్రంథాలయాలు, సంస్థలు ఏర్పాటయ్యాయి.
-1904లో హన్మకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్రభాషా నిలయం ఏర్పాటుచేశారు.
-1905లో సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం, శంషాబాద్‌లో బాలభారతి నిలయం, ఆంధ్ర భాషా వర్తక సంఘం మొదలైనవి ఈ గ్రంథాలయోద్యమంలో భాగంగా తెలంగాణలో ఏర్పాటయ్యాయి.
-ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధి సాధించనిదే భారతదేశం ప్రగతిపథంలో అడుగుపెట్టలేదని గుర్తించిన కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు హైదరాబాద్‌లో 1906లో విజ్ఞాన చంద్రికా మండలి స్థాపించారు. ఈ మండలి కార్యదర్శిగా రావిచెట్టు రంగారావు వ్యవహరించారు.
-ఈ మండలి తెలంగాణలో నవల పోటీలు నిర్వహించింది. తెలుగు ప్రాంతంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన మొదటి సంస్థ ఇది. ఏ సంక్లిష్ట విజ్ఞాన శాఖ అయినా మాతృభాషలో బోధించవచ్చని, అలా చేసినప్పుడే అది సులువుగా పరివ్యాప్తం కాగలదని ఈ మండలి భావించింది. తెలుగు భాషలో ఈ విజ్ఞాన చంద్రికామండలి చరిత్ర, సాహిత్యం, విజ్ఞాన శాస్ర్తాల్లో పుస్తకాలు ప్రచురించి భావవ్యాప్తికి దోహదం చేసింది. ఆంధ్ర-తెలంగాణ సాంస్కృతిక సంబంధాలు అభివృద్ధిపర్చడంలో కీలకపాత్ర పోషించింది. దేశ చరిత్రలు, పదార్థ విజ్ఞాన, రసాయన, జీవ, వృక్ష శాస్ర్తాలకు సంబంధించిన అనేక గ్రంథాలు విజ్ఞాన చంద్రికా మండలి కృషి ఫలితంగా వెలువడ్డాయి. పాశ్చాత్య విజ్ఞానం ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అబ్రహం లింకన్ జీవిత చరిత్ర, ఆచంట లక్ష్మీపతి జీవశాస్త్రం, కలరా, మలేరియా గ్రంథాలు, విశ్వనాథ శర్మ రసాయన శాస్త్రం, కట్టమంచి రామలింగారెడ్డి అర్థశాస్త్రం, పేలాల సుబ్బారావు రాణి సంయుక్త, 1910లో చిలుకూరి వీరభద్రరావు రచించిన ఆంధ్రుల చరిత్ర మొదలైన గ్రంథాలు ఈ విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించిన గ్రంథాల్లో వైవిధ్యాన్ని తెలియజేస్తున్నాయి. కొమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథాన్ని రచించి విజ్ఞాన శాస్ర్తాలకు సంబంధించిన అనేక అంశాలను పేర్కొన్నాడు. ఈ గ్రంథం రెండు వేల పేజీలతో మూడు భాగాలుగా వెలువడింది. తెలంగాణ గ్రంథాలయోద్యమంలో కొమర్రాజు లక్ష్మణరావు, సోమనాథరావులతోపాటు కోదాటి నారాయణరావు కీలకపాత్ర పోషించారు. ఇతని స్వీయ చరిత్ర అయిన నారాయణ త్రయం అనే పుస్తకం తెలంగాణలో గ్రంథాలయోద్యమం గురించి పేర్కొంది. గ్రంథాలయాలు, పఠనాలయాలపైన నిరంతర నిఘా కొనసాగేది. నిజాం రాష్ట్ర ప్రజలు చైతన్యులు కాకపోవడానికి ఇక్కడ సభలు, సమావేశాలు నిర్వహించుకునే స్వాతంత్య్రం వారికి లేకపోవడమే. గ్రంథాలయోద్యమం విజ్ఞానోద్యమంగా కనిపించినప్పటికీ ప్రజల కళ్లు తెరిపించి, తెలుగు భాషాభిమానాన్ని కలిగించి నిజాం రాజ్యాన్ని, అధికారాన్ని ప్రశ్నించే స్థాయికి ప్రజలను చైతన్యం చేసి కదిలించింది.
గ్రంథాలయోద్యమంలోని గ్రంథాలయాలు
-1910లో ఖమ్మంలో ఆంధ్రభాషా నిలయం, 1913లో వరంగల్ జిల్లా మడికొండలో ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం, 1913లో సికింద్రాబాద్‌లో సంస్కృత కళావర్ధిని గ్రంథాలయాలను స్థాపించారు.
-1918లో హైదరాబాద్‌లో రాజబహదూర్ వెంకటరామారెడ్డి చొరవతో రెడ్డిహాస్టల్ గ్రంథాలయం ఏర్పడింది. ఈ గ్రంథాలయంలో తెలంగాణలో లభించిన తాళపత్ర గ్రంథాలను భద్రపర్చారు. సురవరం ప్రతాపపెడ్డి ఈ గ్రంథాలయానికి 1924 నుంచి 1932 వరకు కార్యదర్శిగా పనిచేశారు. ఈ గ్రంథాలయంలో నిజాం ప్రభుత్వం నిషేధించిన వీరసావర్కర్ రచించిన గ్రంథం వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెంట్స్ ఉంచడంవల్ల సురవరం ప్రతాపరెడ్డి తన కార్యదర్శి పదవిని కోల్పోయాడు.
-గ్రంథాలయ నిర్వహణ, గ్రంథాలయ ఉద్యమకారుల కోసం సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణాంధ్రుల కర్తవ్యం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించాడు.
-1918లో నల్లగొండలో ఆంధ్రసరస్వతి గ్రంథాలయాన్ని స్థాపించారు. షబ్నవీసు వెంకట రామనరసింహారావు గ్రంథాలయ నిర్వాహకులుగా పనిచేశారు.
-1918లో నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పువ్వాడ వెంకటప్పయ్య అనే ఉపాధ్యాయుడు ప్రజల సహకారంతో ఆంధ్రవిజ్ఞాన ప్రకాశిని అనే గ్రంథాలయాన్ని స్థాపించాడు. ఇతను కృషి ప్రచారిణి గ్రంథమాల అనే సంస్థను స్థాపించి తెలుగు పుస్తకాలను ముద్రించేవారు. దీంతో ఇతడిని నిజాం ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది.
-1920లో సికింద్రాబాద్‌లో మడూరి రాఘవులు భాషాకల్పవల్లి అనే గ్రంథాలయం, 1923లో హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో బాలసరస్వతి గ్రంథాలయం, ఖమ్మంలో ఆంధ్ర విద్యార్థి సంఘం గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి.
-1925లో హైదరాబాద్‌లో ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం, 1926లో బీఎస్ వెంకట్రావు ఆదిహిందూ లైబ్రరీ, 1926లో దక్కన్ వైశ్య సంఘ గ్రంథాలయం, 1930 మెదక్ జిల్లాలో జోగిపేట గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి.
-1941లో చిలుకూరులో రావి నారాయణరెడ్డి రైతు గ్రంథాలయాన్ని స్థాపించారు.
-దాదాపు ఇదే సమయంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకాధికారి టీకే బాలయ్య తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశాడు. ఇతడు ఆర్మూర్ తాలూకాలోని మారుమూల గ్రామాలకు ఎడ్లబండ్లపై పుస్తకాలను పంపిణీ చేశారు.
గ్రంథాలయోద్యమ ఇతర ముఖ్య కార్యక్రమాలు
-1923లో మాడపాటి హన్మంతరావు కార్యదర్శిగా, బారిస్టర్ రాజగోపాలరెడ్డి అధ్యక్షుడిగా ఆంధ్రజన కేంద్ర సంఘం స్థాపించారు. గ్రంథాలయాలు, పాఠశాలలను స్థాపించడం, తాళపత్ర గ్రంథాలను సేకరించి చరిత్ర పరిశోధనలు జరిపి తెలంగాణ వైభవాన్ని వెలుగులోకి తేవడం, తెలుగుకు ప్రాచుర్యం కల్పించడం, కరపత్రాలు, పుస్తకాలను ప్రచురించి ప్రజలను చైతన్యవంతులుగా చేయడం మొదలైన కార్యక్రమాలు ఈ సంఘం తన లక్ష్యాలుగా నిర్ణయించింది. ఆంధ్రజన కేంద్ర సంఘానికి అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు సారథ్యంలో ఆంధ్రపరిశోధక మండలిని స్థాపించారు. కొమర్రాజు లక్ష్మణరావు మరణించిన తర్వాత ఇది లక్ష్మణరాయ పరిశోధక మండలిగా మారింది. ఇది తెలంగాణ చరిత్ర, సంస్కృతులను వెలుగులోకి తేవడానికి అనేక శాసనాలు, తాళపత్ర గ్రంథాలను వెలికితీసింది. నాయని వెంకటరంగారావు ఆధ్వర్యంలో 1935లో ఆదిరాజు వీరభద్రరావు ప్రచురించిన తెలంగాణ శాసనాలు, సురవరం ప్రతాపరెడ్డి ప్రచురించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర తెలంగాణ ప్రజలను చైతన్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాయి. ఇదేవిధంగా 1935లో వెలువడిన కాకతీయ సంచిక తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు