Disaster management | విపత్తు నిర్వహణ
జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, ఘాగ్రా నదులతో కూడిన వాయవ్య నదీ పరివాహక ప్రాంతం, తపతి, నర్మద, మహానది, వైతరణి, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులతో కూడిన ద్వీపకల్ప నదీ పరివాహక ప్రాంతాలు వరదకు ప్రభావితమవుతున్నాయి.ఏపీ, తమిళనాడు, ఒడిశా, కేరళ తీర ప్రాంతాలు, అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్ తరుచూ తీవ్ర వరద ముంపునకు గురవుతుంటాయి. జీవాయుధాలు కలిగించే జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించలేం. ప్లేగు, స్మాల్ఫాక్స్ వంటివి వేగంగా సోకే కారకాలను గుర్తించడంలో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి. పూర్వకాలంలో శత్రుసైన్యాన్ని చంపే విధానంలో భాగంగా బుబోనిక్ ప్లేగు (గ్రంథులు ఉబ్బడం) వ్యాధితో మరణించిన వారి శవాలను రాజు కోటలో విసిరేవారు.
ఉదా: 1346 కఫా సంఘటన. 1422 కరోల్‌స్టీన్ సంఘటన.
– విపత్తు అనేది ఒక అపాయకరమైన స్థితి. దేనివల్ల ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు వాటిల్లుతుందో ఆ స్థితిని విపత్తు (DISASTER) అంటారు. విపత్తు అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి తీసుకున్నారు.
– DISASTER- DUS అంటే చెడు, ASTER అంటే నక్షత్రం. ప్రాచీన కాలంలో పూర్వీకులు ఏదైనా విధ్వంసం లేదా విపత్తును ఏదో ఒక నక్షత్రంతో ముడిపెట్టి, ఆ నక్షత్రాన్ని దుష్ట నక్షత్రంగా భావించేవారు. ప్రపంచానికి విపత్తు అనే భావనని పరిచయం చేసిన వ్యక్తులు గ్రీకులు.
నిర్వచనం
– ఒక సమాజం తన సొంత వనరులతో కోలుకోలేనివిధంగా, సాధారణ సామర్థ్యానికి మించి ప్రాణనష్టం, ఆస్తినష్టం, పర్యావరణ వనరులను విలుప్తం చేసి, మౌలిక సౌకర్యాలకు, నిత్యావసర సేవలకు, జీవనోపాధికి, మానవ దైనందిన జీవితానికి అంతరాయం కలిగించే ఒక సంఘటన లేదా వరుస ఘటనలను విపత్తు అంటారు.
ఐక్యరాజ్యసమితి
– విపత్తును ఐక్యరాజ్యసమితి సమాజపు లేదా కమ్యూనిటీ సాధారణ నిర్మాణానికి, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపద అని నిర్వచించింది.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
– సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని కాపాడి సంరక్షించడానికి అసాధారణ అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉపద్రవ పరిస్థితి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
– ప్రభావిత కమ్యూనిటీ లేదా ప్రాంతం కోలుకోడానికి వెలుపలి నుంచి అసాధారణమైన ప్రతిస్పందన అవరమయ్యే విధంగా నష్టానికి, ఆర్థిక విధ్వంసానికి, మానవ ప్రాణ నష్టానికి ఆరోగ్యం, ఆరోగ్య సేవలను పతనం చేసే ఏదైనా సంఘటన అని నిర్వచించింది.
– ఒక దుర్ఘటనను విపత్తుగా పిలవాలంటే ఎన్నుకోవాల్సిన ప్రమాణాలు లేదా ఆ దుర్ఘటన జరిగిన ప్రాంతంలో కనిపించే లక్షణాలు
– సమాజ సాధారణ మనుగడ దెబ్బతినడం
– ధన, ప్రాణ, ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగడం
– ప్రజల జీవనోపాధి దెబ్బతినడం
– విపత్తు ప్రభావానికి లోనైన సమాజానికి ఆస్తులు, అక్కడి ప్రజల పునర్నిర్మాణానికి వెలుపలి నుంచి సహాయం అవసరం అన్నంతగా దాని తీవ్రత ఉండటం
– దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితమై, అక్కడి పర్యావరణం దెబ్బతిని, సుస్థిరాభివృద్ధికి ఆటంకం కలిగేలా ఉండటం
విపత్తు అనే భావనలో ముఖ్యంగా 1. వైపరీత్యం, 2. దుర్బలత్వం, 3. సామర్థ్యం, 4. ఆపద అనే అంశాలు ఇమిడి ఉన్నాయి.
– వైపరీత్యం/అపాయకరమైన స్థితి (Hazard): ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి, ఆస్తులకు, పర్యావరణానికి ప్రకృతి చేతగాని లేదా మానవ కారకంగా గాని నష్టాలు సంభవిస్తే దానిని వైపరీత్యం అంటారు.
– Hazard becomes Disaster అంటే ప్రమాదం పెద్దది అయితే విపత్తుగా పేర్కొనవచ్చు.
వైపరీత్యాలను
1. సహజ వైపరీత్యాలు (Natural Hazards)
2. సామాజిక – సహజ వైపరీత్యాలు (Socio Natural Hazards)
3. మానవ ప్రేరేపిత వైపరీత్యాలు (Human Induced Hazards)
4. పర్యావరణ వైపరీత్యాలుగా విభజించవచ్చు.
– భూకంపం, సునామీ, అగ్నిపర్వత విస్ఫోటనం, భూతాపం, ఆనకట్టలు తెగిపోవడం, గనుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం మొదలైనవాటిని ప్రకృతిసిద్ధ లేదా సహజ వైపరీత్యాలు అంటారు.
– వరదలు, భూకంపాలు, కరువులు, ఆనకట్టలు కూలిపోవడం వంటి వాటికి మానవ ప్రేరేపిత, ప్రకృతి కారణాలు రెండూ ఉన్నాయి. అందువల్ల సామాజిక-సహజ వైపరీత్యాలు అంటారు.
ఉదాహరణ: వరదలు అనేవి సహజసిద్ధంగా కురిసే అధిక వర్షాల వల్ల రావచ్చు లేదా మావన నిర్లక్ష్యం కారణంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటంవల్ల కూడా రావచ్చు.
– పారిశ్రామిక ప్రమాదాలు, రైలు, రోడ్డు, విమాన ప్రమాదాలు, ఉగ్రవాద దాడులు, ఆనకట్టలు కూలిపోవడం, విషపూరిత వ్యర్థాల లీకేజీ, యుద్ధం, అంతర్గత తిరుగుబాట్లు మొదలైనవి మానవ ప్రేరేపిత వైపరీత్యాలకు ఉదాహరణలు. కాలుష్యం, అడవుల నరికివేత, ఎడారీకరణ, తెగుళ్లదాడులు మొదలైనవి పర్యావరణ వైపరీత్యాలు.
ఉదా: మానవజాతి నివసించని ఎడారిలో భూకంపం సంభవిస్తే అది సమాజానికి ఎలాంటి ప్రత్యక్ష, తక్షణ నష్టం కలిగించదు. అందువల్ల దాన్ని విపత్తుగా పేర్కొనలేం.
ఉదా: 2001లో గుజరాత్‌లోని భుజ్‌లో సంభవించిన భూకంపం 10వేల మందికిపైగా ప్రాణాలను హరించింది.
దుర్బలత్వం
– ఎప్పుడైతే విపత్తు సంభవిస్తుందో ఆ సమయంలో కొన్ని స్థలాల్లో కొంతవరకు అపాయాన్ని నిరోధించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ, కొన్ని స్థలాల్లో అపాయం నుంచి రక్షించలేం. ఆ స్థితిని సరైన రక్షణ లేని పరిస్థితులు లేదా దుర్బలత్వం అంటారు.
ఉదా: 2001లో గుజరాత్ భూకంపం సందర్భంగా భుజ్ శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నవారికంటే ఇరుకైన రోడ్లు, కొత్తగా నిర్మించి ఎత్తయిన, సురక్షితం కాని భవనాలు, అధిక జనసాంద్రత కలిగిన భుజ్ పాత నగరానికి చెందిన వారే ఎక్కువగా ప్రాణాలను కోల్పోయారు.
సామర్థ్యం
– వైపరీత్య ప్రభావానికి లోనైన వ్యక్తులు/ప్రజా సమూహాలు తమ ఉపాధిని పునరుద్ధరించుకునే స్థితిని సామర్థ్యం అని పిలుస్తారు.
– దీనికోసం దుర్బలస్థితిలో ఉన్న ప్రజల భౌతిక, ఆర్థిక స్థితిగతులను పెంపొందించాలి.
సామర్థ్యాలు రెండు రకాలు 1. భౌతిక సామర్థ్యం
2. సామాజిక – ఆర్థిక సామర్థ్యం
ఆపద
– వైపరీత్యాలు, దుర్బలత్వ పరిస్థితుల మధ్య పరస్పర చర్యల కారణంగా ఆర్థిక కార్యకలాపంలో అంతరాయం, పర్యావరణ క్షీణతతోపాటు మరణాలు, గాయాలు, ఆస్తి, జీవనోపాధి నష్టం వంటి హానికరమైన పర్యవసానాలు లేదా ఊహించని నష్టాలు జరిగే సంభావ్యతను ఆపద లేదా అపాయం అంటారు.
విపత్తు రకాలు
విపత్తును 1. వేగాన్ని బట్టి, 2. కారణాలను బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు.
వేగాన్ని బట్టి విపత్తులు
– వేగం ఆధారంగా రెండు రకాల విపత్తులున్నాయి.
1. నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు
– చాలా రోజులుగా, నెలలుగా లేదా ఏండ్లుగా కొనసాగే విపత్తును నిదానంగా ప్రారంభమయ్యే విపత్తు అంటారు.
ఉదా: కరువు, పర్యావరణ క్షీణత, తెగుళ్లదాడి, దుర్భిక్షం
2. వేగంగా ప్రారంభమయ్యే విపత్తు
– తక్షణ విఘాతంవల్ల సంభవించే విపత్తును వేగంగా ప్రారంభమయ్యే విపత్తు అంటారు. దీని ప్రభావం స్వల్పకాలం లేదా దీర్ఘకాలం ఉండవచ్చు.
కారణాలను బట్టి విపత్తులు
– కారణాలను బట్టి విపత్తులు రెండు రకాలు
1. సహజ విపత్తులు
– ప్రకృతి వైపరీత్యంవల్ల సంభవించి, ప్రభావిత ప్రజలు ఎదుర్కోలేనివిధంగా మానవ, ఆర్థిక, ప్రాణనష్టాలకు దారితీసే ఘటనను సహజ విపత్తు అంటారు. ఉదా: వరదలు, కరువులు, చక్రవాతాలు, సునామీలు, భూకంపాలు
వరదలు
– సాధారణంగా ముంపునకు గురికాని నేల ముంపునకు గురికావడానికి దారితీసేవిధంగా నదీ కాలువ వెంట లేదా తీరం వద్ద అధిక నీటిస్థాయి ఉండి చానెల్ కెపాసిటీ/సామర్థ్యం మించి ప్రవహిస్తే వరద అంటారు.
– వరదలు అతివృష్టి పరిస్థితులవల్ల సంభవిస్తాయి.
– 1962లో ఏర్పాటుచేసిన కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) నిర్వచనం ప్రకారం ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నిర్దిష్ట సమయంలో నిరంతరం 12.5 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం సంభవించినప్పుడు ఆ నీరు నదీ వ్యవస్థలతో పట్టక నది గట్లకు ఇరువైపులా పొంగి ప్రవహించడాన్ని వరద అని పిలుస్తారు.
– వరద గంటల సమయం తీసుకుని క్రమంగా ఏర్పడవచ్చు లేదా ఆనకట్టలు తెగిపోవడం, భారీ వర్షాలవల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండానే అకస్మాత్తుగా రావచ్చు.
– దీనివల్ల ప్రజలకు, భవనాలకు కలిగే ప్రమాదాన్ని వరద వైపరీత్యం (Flood Hazard) అంటారు.
– భారత భూభాగంలో 22.5 శాతం భూభాగం అంటే 40 మిలియన్ హెక్టార్ల భూమి వరద ప్రభావిత ప్రాంతంలో ఉంది. ఇందులో ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ హెక్టార్ల భూభాగం క్రమంతప్పకుండా వరదలకు లోనవుతున్నది.
కరువులు
– ఒక ప్రాంతంలో అల్ప వర్షపాతం కారణంగా నీటికి, ఆహారానికి, పశుగ్రాసానికి, ఉపాధికి తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితిని కరువుగా నిర్వచించవచ్చు.
– అతినిదానంగా, అనావృష్టి పరిస్థితులవల్ల కరువు వస్తుంది.
లక్షణాలు
– కరువు నిదానంగా సంభవించే విపత్తు. కరువు ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు ముగిసిందో నిర్ణయించడం కష్టం.
– కరువు కేవలం వర్షపాతపు పరిమాణాన్ని బట్టి కాకుండా ఒక నిర్దిష్టకాలం, స్థలంలో అపసవ్య వర్షపు పంపిణీవల్ల ఏర్పడుతుంది.
– కరువు ప్రభావాలు ఒకదానిపై ఒకటి నిదానంగా ఒక నిర్దిష్ట కాలవ్యవధిలో కనిపిస్తాయి.
కారణాలు
– కరువు సహజ విపత్తు అయినప్పటికీ అధిక జనాభా, పశువులను అధికంగా మేపడం, అడవుల నరికివేత, మృత్తికాక్షయం, భూగర్భ జలాలను అధికంగా వినియోగించడం, జీవ వైవిధ్యం కోల్పోవడంవల్ల కరువు సంభవిస్తుంది.
– సాగునీటి వసతులు లేకపోవడం
– నేల తేమను పట్టి ఉంచే సామర్థ్యం తక్కువగా ఉండటం
– పశుగ్రాస నిలువ ఏర్పాట్లు లేకుండా పశువులను పెంచడం
– నీరు ఎక్కువగా అవసరమయ్యే పంటలను సాగుచేయడం
– పారిశ్రామికీకరణ
– భూతాపం
తుఫానులు (చక్రవాతాలు)
– చక్రవాతం అనేది సమశీతోష్ణ, ఉష్ణ అక్షాంశాల వేడి ప్రవాహాల్లో సంభవించే అల్ప వాతావరణ పీడనం. ఇది వర్షాన్ని కుమ్మరిస్తూ ఉత్తరార్ధగోళంలో అపసవ్య దిశలో, దక్షిణార్ధగోళంలో సవ్యదిశలో వీచే శక్తిమంతమైన గాలులతో కూడిన సుడులు తిరిగే వాతావరణ అలజడి.
– సైక్లోన్ అంటే పాము గుండ్రని చుట్ట.
– సముద్రజల ఉపరితలం నుంచి 60 మీ. లోతు వరకు ఉష్ణోగ్రత 260ల కంటే ఎక్కువగా ఉంటుంది. నీటి ఆవిరి కారణంగా సముద్రమట్టంలో 7000 మీ. ఎత్తుకు సాపేక్ష ఆర్థ్రత పెరిగి ద్రవీభవనం జరిగి క్యుములోనింబస్ మేఘం ఏర్పడుతుంది. ఈ సమయంలో నీటి ఆవిరిలోని గుప్తోష్ణం బయటకు విడుదలైనప్పుడు అల్పపీడనం ఏర్పడుతుంది.
– చక్రవాత కేంద్ర వ్యాసం 20-50 కిలోమీటర్ల వరకు ఉండి, చక్రవాత మేఘాలపైకి ఎగసి ట్రోపో ఆవరణం మొత్తాన్ని ఆక్రమిస్తాయి.
– తుఫాను జీవిత చక్రం దాదాపు ఆరు రోజులు ఉంటుంది.
– 2004 నుంచి తుఫానులు సంభవించినప్పుడు అందులో గాలుల వేగం 34 నాట్స్ పరిధిని మించినట్లయితే ఆ తుఫానులకు ప్రత్యేక పేర్లు పెడుతారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపిన బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానులకు కింది విధంగా పేరు పెట్టారు.
1. 2010, మే 21 నుంచి 22 వరకు – లైలా
2. 2010, అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు – జల్
3. 2014, అక్టోబర్ 12- హుద్‌హుద్
వరదలు ఎక్కడ సంభవిస్తాయి?
– ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ విపత్తు కుదింపు వ్యూహం (United Nations International Stratagy for Disaster Reduection) రూపొందించిన గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్టు (Global Assesment Report) 2011 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వరద ఎదుర్కొంటున్న జనాభాలో 90 శాతం మంది దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల్లోనే నివసిస్తున్నారు. దక్షిణాసియాలో విపత్తు ముప్పును ఎదుర్కొంటున్న దేశాల్లో భారత్, బంగ్లాదేశ్‌ల ప్రజలు అత్యధికంగా వరద ముప్పును ఎదుర్కొంటున్నారు. వరదలు దాదాపు నదీ పరివాహాల్లో సంభవిస్తాయి.
– ప్రపంచంలో అత్యధింకగా వరద ముప్పు ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. దేశంలో వరదలకు రుతుపవనాలు, అధిక పూడిక కలిగిన నదులు, వాలైన, ఎక్కువగా కోసుకుపోయిన హిమాలయాల పర్వత శ్రేణులు వంటివి ముఖ్య కారణాలవుతున్నాయి.
– రాష్ట్రీయ బార్హ్ ఆయోగ్ (Rashtriya Barh Ayog) 1980లో వేసిన అంచనాల ప్రకారం భారతదేశ భూభాగంలో సుమారు 12 శాతం (40 మిలియన్ హెక్టార్లు) వరద ముంపునకు గురవుతుంది. ఉత్తర, తూర్పు భూభాగాలు వరదలకు అత్యధికంగా గురవుతున్నాయి.
– దేశంలో సగటున 1200 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అందులో దాదాపు 85 శాతం వర్షపాతం నాలుగు నెలలు (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) స్వల్ప వ్యవధిలోనే కురుస్తుంది. అందువల్ల ఈ నాలుగు నెలల్లోనే నదుల్లోకి పెద్ద ఎత్తున నీరువచ్చి, విస్తారమైన వరదలకు దారి తీస్తుంది.
– జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, ఘాగ్రా నదులతో కూడిన వాయవ్య నదీ పరివాహక ప్రాంతం, తపతి, నర్మద, మహానది, వైతరణి, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులతో కూడిన ద్వీపకల్ప నదీ పరివాహక ప్రాంతాలు వరదకు ప్రభావితమవుతున్నాయి.
– ఏపీ, తమిళనాడు, ఒడిశా, కేరళ తీర ప్రాంతాలు, అసోం, ఉత్తరప్రదేశ్, బీహార్ తరుచూ తీవ్ర వరద ముంపునకు గురవుతుంటాయి.
– దేశంలోని అనేక నదీ వ్యవస్థలు హిమాలయాల నుంచి ప్రవహిస్తుండటం, అవి పెద్ద ఎత్తున అవక్షేపాలను తీసుకురావడం, నదీ జలమార్గంలో పూడిక ఏర్పడటం మొదలైన కారణాలవల్ల వరదలు తరచుగా వస్తుంటాయి.
వరదలకు కారణాలు
– ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎనిమిది కంటే ఎక్కువ సంఖ్యలో ఏర్పడే ఉష్ణమండల చక్రవాతాలు.
– ఎగువప్రాంతాల్లో నైరుతి రుతుపవన కాలంలో కుండపోత వర్షాలు. డెల్టా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేకపోవడం.
– నదీ పరఅవాహక ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి విడుదలయ్యే ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను నదుల్లోకి వదిలేయడం.
– నది గట్ల వెంట మానవ కార్యకలాపాలవల్ల నేల క్రమక్షయం ఎక్కువగా ఉండి, నదీ వ్యవస్థల్లోకి పూడికలు ఎక్కువగా చేరడం.
దుష్ప్రభావాలు
– రవాణా సౌకర్యాలు దెబ్బతినడం
– మత్స్యకారుల సామాగ్రి దెబ్బతినడం
– పంటపొలాల్లో ఇసుక మేటలు వేయడం
– ప్రాణ, ధన నష్టాలు
– సంక్రమణ అంటువ్యాధుల వ్యాప్తి
– గిడ్డంగులు మునిగిపోయి ఆహారకొరత ఏర్పడటం
– పంటలు మునిగిపోవడంవల్ల పంట ఉత్పత్తి తగ్గిపోవడం
భూకంపాలు
– భూమి ఒకటి లేదా రెండు నిమిషాల వ్యవధిలోపు ఆకస్మికంగా కదలికలు జరుపడాన్ని భూకంపం అని పిలుస్తారు.
– దీని అధ్యయనాన్ని సిస్మాలజీ అంటారు.
– ఈ భూభ్రంశాలు అతిస్వల్ప స్థాయిలో ఉంటాయి.
– అభిసరణ పలక సరిహద్దులవద్ద ఇవి ఏర్పడుతాయి. భూకంప నిర్మాణంలో రెండు భాగాలు ఉన్నాయి.
1. భూకంపనాభి: భూ అంతర్భాగంలో భూకంపాలు జనించే ప్రాంతం.
2. భూకంప అభికేంద్రం: భూకంపనాభికి క్షితిజలంబంగా భూ ఉపరితలంపైగల ప్రాంతం.
కారణాలు
– గనుల పైకప్పులు కూలిపోవడం.
– పెద్ద నీటి విడుదల, జలవిద్యుత్తు కేంద్రాల నిర్మాణాలను చేపట్టడం.
– భూ అంతర్భాగంలో రేడియోధార్మిక మూలకాలు విస్ఫోటనం చెందడం.
– భూపాతాలు, హిమపాతాలు సంభవించడం.
స్వరూపాకార బలాలు (టీటోనిక్ ఫోర్స్)
– పై కారణాల్లో విరూపాకార బలాలవల్ల అతితీవ్ర భూకంపాలు ఏర్పడుతాయి. వీటివల్ల ఏర్పడే భూకంపాలు లోతుల ఆధారంగా మూడు రకాలు.
1. గాథ భూకంపాలు
– భూ ఉపరితలం నుంచి 60 కి.మీ. లోతులో ఏర్పడేవి.
2. మాధ్యమిక భూకంపాలు
– భూ అంతర్భాగంలో 60 కి.మీ. – 300 కి.మీ. లోతువరకు ఏర్పడే భూకంపాలు.
3. అగాథ భూకంపాలు
– భూ అంతర్భాగంలో 300 కి.మీ. అంతకంటే ఎక్కువ లోతులో ఏర్పడే భూకంపాలు.
– పైన తెలిపిన వాటిలో గాథ భూకంపాలు అత్యంత ప్రమాదం. కారణం ఇందులో భూకంపనాభి లోతు తక్కువగా ఉండటం.
– భూకంపనాభి నుంచి విడుదలయ్యే శక్తి కంపన తరంగాల రూపంలో భూ ఉపరితలంవైపు కదులుతుంది. వీటినే భూకంప తరంగాలు అంటారు.
– భూకంప తరంగాల తీవ్రత, వేగం, అవి పయనించే దిశ ఆధారంగా మూడు రకాలు.
1. P-ప్రాథమిక తరంగాలు
– భూకంప తరంగాలన్నింటిలో అత్యంతవేగంగా కదిలే తరంగాలు.భూ ఉపరితలాన్ని ముందుగా చేరే తరంగాలు.
– ఇవి ఘన, ద్రవ, వాయు స్థితిలోని పదార్థాల గుండా పయనించగలుగుతాయి.
– ధ్వని తరంగాలను పోలి ఉన్నందున వీటిని అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.
2. S-ప్రాథమిక తరంగాలు
– ఘన పదార్థాల గుండా మాత్రమే పయనిస్తాయి.
– తరంగం పయనించే దిశకు లంబకోణంలో స్పందిస్తూ కాంతి తరంగాలను పోలి ఉన్నందున వీటిని తిర్యక్ తరంగాలు అని పిలుస్తారు.
3. L-ఉపరితల/ర్యాలి/లౌ తరంగాలు
– P & S తరంగాలు భూ ఉపరితలాన్ని చేరిన తర్వాత దీర్ఘ తరంగాలు (F)గా రూపాంతరం చెంది భూకంప అభికేంద్ర ప్రాంతాన్ని తీవ్రంగా కంపింపజేస్తాయి. అందుకే L-తరంగాలు భూకంప తరంగాలన్నింటిలోకెల్లా ప్రమాదకరమైనవి.
– భూ అంతర్భాగంలో P, S తరంగాలు జనించే ప్రాంతాన్ని భూకంపనాభి అంటారు.
– భూకంప తీవ్రతను కొలిచే పరికరాలు 1. మెర్కాలి స్కేలు, 2. రోసి ఫారెల్ స్కేలు, 3. రిక్టర్ స్కేలు
– ఒకే భూకంప తీవ్రతగల ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహారేఖలను ఐసోసిస్మల్ లైన్స్ అంటారు.
– భూకంపానికి సంబంధించి హైదరబాద్‌లో నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్- 1967లో ఏర్పాటు చేశారు.
– రూర్కీ యూనివర్సిటీని బీహార్‌లో హిమాలయాల్లో ఏర్పడే భూకంపాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేశారు. దీంతోపాటు భూకంపాలకు సంబంధించిన శిక్షణను ఇచ్చే ట్రెయినింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
2. మానవసంబంధ విపత్తులు
– మానవసంబంధ విపత్తుకు కారణం సామూహిక విధ్వంసక ఆయుధాలు. (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్- WMD)
– ప్రాణాలు, ఆస్తులు, పర్యావరణానికి భారీనష్టాన్ని తెచ్చే ఆయుధాలను సామూహిక విధ్వంసక ఆయుధాలు అంటారు.
సామూహిక విధ్వంసక ఆయుధాల్లో ముఖ్యమైనవి
1. అణ్వాయుధాలు,
2. రసాయన ఆయుధాలు,
3. జీవ ఆయుధాలు.
అణ్వాయుధాలు
– 1895లో విలియం రాంట్జెన్ x-కిరణాల ఉనికి గురించి ప్రపంచానికి తెలిపాడు.
– 1896లో హెన్రీ క్వెరల్ అనే శాస్త్రవేత్త సహజ రేడియో ధార్మికత గురించి ప్రపంచానికి తెలియజెప్పాడు.
– 1942లో ఎన్రికో ఫెర్మి గ్రాఫైట్, యురేనియంలలో గొలుసుకట్టు చర్యను కనిపెట్టాడు.
– పై ప్రయోగాల ఫలితమే అణుబాంబుల ఆవిర్భావం.
– అణ్వాయుధాల్లో రెండు ప్రాథమిక తరహా ఆయుధాలున్నాయి. మొదటి తరహా ఆయుధాలు తమ విస్ఫోటక శక్తిని కేంద్రక విచ్ఛిత్తిచర్యల ద్వారా మాత్రమే పొందుతాయి. వీటినే అణు, ఫిజన్ బాంబులు అంటారు.
– రెండో తరహా అణ్వాయుధాలు కేంద్రక సంలీన చర్యల ద్వారా పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేస్తాయి. ఒక యూనిట్ ద్రవ్యరాశి విచ్ఛిత్తి చర్యల కంటే సంలీన చర్యలు ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. అందువల్ల ఫిజన్బాంబుల కంటే ఫ్యూజన్ బాంబులు వెయ్యిరెట్లు శక్తిమంతమైనవి.
ఉదా: హైడ్రోజన్ బాంబులు, థర్మో న్యూక్లియర్ బాంబులు, ఫ్యూజన్ బాంబులు
రసాయన విపత్తులు
– రసాయన విపత్తులు పారిశ్రామిక ప్రమాదాలు, ప్రమాదకరమైన రసాయనాలను బాధ్యతారాహిత్యంగా వినియోగించడంవల్ల సంభవిస్తాయి.
– విషపూరిత వాయువులు వాటి స్వభావం రీత్యా విస్తారమైన వినాశనానికి కారణమవుతాయి.
– అవి తేలికగా వ్యాపించి, పెద్ద పెద్ద ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి.
– రసాయన సామూహిక విధ్వంసకర ఆయుధాల (డబ్ల్యూఎండీ)ను తయారుచేయడం మిగతా వాటితో పోల్చితే చాలా తేలిక. ఇవి రుచి, రంగు లేనివిగా ఉండటంవల్ల వాటిని పసిగట్టడం చాలా కష్టం.
– దేశంలో రసాయన దుర్ఘటన 1984లో జరిగిన భోపాల్ దుర్ఘటన. ఇక్కడ Methyl Isocyanate అనే విషవాయువు విడుదల కావడంతో 2500 మంది చనిపోయారు. 2010లో సుప్రీంకోర్టు దీనిపై తీర్పు ఇచ్చింది.
జీవ ఆయుధాలు
– జీవ ఆయుధాల (బయాలజికల్ వెపన్స్)ను తయారుచేయడం చాలా సులభం. ఎటువంటి నైపుణ్యంతో కూడిన ప్రయోగ వ్యవస్థలు లేకుండానే ఉపయోగించవచ్చు.
– వందలు, వేల మందిని చంపే లేదా గాయపరిచే సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటిని పేదవాని అణుబాంబు (పూర్ మెన్స్ న్యూక్లియర్ బాంబ్) అంటారు.
– పొలాలపై పురుగు మందులను పిచికారీ చేసే చిన్న చిన్న విమానాల నుంచి శరీరంపై చల్లుకునే పర్ఫ్యూమ్ ఆటమైజర్ల వరకు దేనినైనా జీవాయుధాలను ప్రయోగించడానికి ఉపయోగించుకోవచ్చు.
– జీవ ఆయుధాలు కలిగించే జబ్బులను ప్రాథమిక దశలో గుర్తించలేం. ప్లేగు, స్మాల్ఫాక్స్ వంటివి వేగంగా సోకే కారకాలను గుర్తించడంలో జాప్యం జరిగితే తీవ్ర ప్రభావం చూపుతాయి.
– పూర్వకాలంలో శత్రుసైన్యాన్ని చంపే విధానంలో భాగంగా బుబోనిక్ ప్లేగు (గ్రంథులు ఉబ్బడం) వ్యాధితో మరణించిన వారి శవాలను రాజు కోటలో విసిరేవారు.
ఉదా: 1346 కఫా సంఘటన. 1422 కరోల్‌స్టీన్ సంఘటన.
– ఈ సంక్రమణలో ముఖ్యకారకాలు వైరస్, బ్యాక్టీరియా.
విపత్తు నిర్వహణ-దశలు-చట్టం
– భారత విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రకృతి లేదా మానవ తప్పిదాలవల్ల సంభవించిన ఘటనల కారణంగా సంబంధిత ప్రాంతం తనంతట తాను కోలుకోలేని విధంగా పెద్ద ఎత్తున ధన, ప్రాణ, పర్యావరణ నష్టాలకు కారణమయ్యే ఉపద్రవం, ప్రమాదం లేదా దుర్ఘటనలనే విపత్తు అని పిలుస్తారు.
విపత్తు నిర్వహణ చట్టం-2005
– ఈ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధ్యక్షుడు ముఖ్యమంత్రి.
– జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ-ఎన్డీఎంఏ)
ఐదు దశలు
1. నివారణ (ప్రివెంటివ్)
2. సంసిద్ధత (ప్రివెంటివ్ ప్రిపరేషన్)
3. ఉపశమనం (మిటిగేషన్)
4. పునరావాసం (రిహాబిలిటేషన్)
5. పునర్నిర్మాణం (రీ కన్స్ట్రక్షన్)
– 329 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణం ఉన్న దేశ భూభాగంలో కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ర్టాలు తరచూ ఏదో ఒక రూపంలో విపత్తును ఎదుర్కొంటున్నాయి.
కారణాలు
1. దేశం ఒక విశిష్టమైన నైసర్గిక స్థితిని కలిగి ఉండటం
2. దేశ శీతోష్ణస్థితి రుతుపవనాలపై ఆధారపడి ఉండటం
3. అధిక జనాభా,
4. సుదీర్ఘమైన తీరరేఖను కలిగి ఉండటం
5. పారిశ్రామికీకరణ,
6. పట్టణీకరణ
7. ఖనిజాల తవ్వకం,
8. బహుళార్ధ సాధక ప్రాజెక్టుల నిర్మాణం
9. గ్లోబల్ వార్మింగ్
10. జనాభా పెరుగుదల
– పై కారణాలవల్ల దేశంలో దాదాపు 60 శాతం భూభాగం భూకంపాలకు, 70 శాతం దుర్భిక్ష పరిస్థితులకు, 15 శాతం భూతాపాలకు, 8 శాతం తుఫానులకు, 22 శాతం వరదలకు లోనవుతూ ఉంది.
ఎన్డీఎంఏ ముఖ్యాంశాలు
– విపత్తు నిర్వహణ యాజమాన్యం వివిధ స్థానాల్లోని సంస్థల మధ్య, వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ద్వారా చేపట్టాలి.
– ప్రభావిత ప్రాంత ప్రజల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని విపత్తు యాజమాన్యం ఉండాలి.
– విపత్తు నిర్వహణకు అమలుచేసే కార్యక్రమాలు సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా ఉండాలి.
– విపత్తు నిర్వహణకు సంబంధించి చేపట్టే టెక్నాలజీ మారుమూల ప్రాంతాల్లోని చివరి నిరాశ్రయునికి కూడా అందుబాటులో ఉండాలి.
– సమగ్ర విపత్తు నిర్వహణకు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు, శాస్త్రవేత్తలు, ఎన్జీవోల మధ్య సమన్వయం సాధించే దిశగా ఉండాలి.
– ప్రభావిత ప్రాంత ప్రజలు ఆయా విపత్తులకు సంబంధించి తమను తాము రక్షించుకునేలా సరైన శిక్షణనిచ్చి వారిని చైతన్యవంతుల్ని చేయాలి.
– సంస్థాగతమైన న్యాయ, చట్టపరమైన సాంకేతికపరమైన అంశాలన్నింటి మధ్య సమన్వయం సాధిస్తూ అభివృద్ధి ప్రక్రియలన్నింట్లో విపత్తు యాజమాన్యాన్ని జోడించాలని ఎన్డీఎంఏ సూచిస్తున్నది.
– 1990లో యూఎన్ఓ సాధారణ సభ అంతర్జాతీయ విపత్తు తగ్గింపు దశాబ్దంగా 1990ను ప్రకటించింది. దీంతో భారతప్రభుత్వం విపత్తు నిర్వహణకు తీసుకోవాల్సిన సంస్థాగత చర్యలకోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖకు బాధ్యతలు అప్పగించింది.
– అయితే లాథూర్ భూకంపం, ఒడిశాలోని సూపర్ సైక్లోన్ వంటి విపత్తుల దృష్ట్యా 1999లో వ్యవసాయ మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి పంత్ చైర్మన్‌గా ఒక ఉన్నత స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీని ఆధ్వర్యంలో రూపొందించిన సమగ్రమైన విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డీఎంఏను 2005లో స్థాపించారు.
– ఎన్డీఎంఏ నిర్వహణను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేపట్టింది. ఇందులో రెండు ప్రధాన భాగాలుంటాయి.
1. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజర్ (ఎన్ఐడీఎం)
– దీని కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఎన్ఐడీఎం ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల సామర్థ్య నిర్మాణాలను చేపట్టింది.
2. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలు (నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్- ఎన్డీఆర్ఎఫ్)
సునామీలు
– సునామీ అంటే మహాసముద్రంలో భారీ పరిమాణంలో నీరు స్థానభ్రంశం చెందడంవల్ల సంభవించే నీటి తరంగాలను సునామీలు అంటారు. సునామీ అనే పదాన్ని సార్వత్రికంగా వినియోగించడానికి 1963లో అమెరికాలోని హవాయిలో జరిగిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల సదస్సులో అంగీకారం జరిగింది.
– సునామీ అనేది జపాన్ భాషా పదం. జపాన్ భాషలో సు అంటే ఓడరేవు, నామి అంటే అలలు (తరంగాలు)
సునామీ లక్షణాలు
– సునామీ నీటిపై గాలివీచడంవల్ల వచ్చే సాధారణ మహాసముద్ర తరంగాలకు భిన్నంగా ఉంటుంది. సునామీలు సాధారణ తరంగాలకంటే ఎన్నోరెట్లు అధికవేగంతో ప్రయాణిస్తాయి. గంటకు 100 కి.మీ. వేగంతో, సాధారణ తరంగ వేగంతో పోల్చుకుంటే మహాసముద్ర అగాథ జలంలో సునామీ జెట్ విమానంతో సమానంగా గంటకు 300 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
– అగాథ జలంలో అవి ఎంతవేగంతో ప్రయాణించినప్పటికీ, సునామీలు నీటి ఎత్తును 30-45 సెం.మీ. ఎత్తుకు మాత్రమే పెంచగలుగుతాయి. అందువల్ల సముద్రంలో నౌకలపై ఎటువంటి ప్రభావం ఉండదు.
– సునామీలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా సంభవిస్తాయి.
– కంప్యూటర్ నమూనాలు సునామీ సంభవించే సమయాన్ని కొద్ది నిమిషాల ముందు తెలియజేస్తాయి.
– సునామీలు విధ్వంసక స్వభావం కలిగి ఉంటాయి. ఇసుక తీరాలను ఖండఖండాలుగా చేస్తాయి. తీర ప్రాంతంలోని వృక్ష జాతులను విచ్ఛిన్నం చేస్తాయి.
– కొన్నిసార్లు సునామీల కారణంగా తీరంవద్ద నీరు వెనక్కు తగ్గి మహాసముద్రపు భూతలం బయటకు కనిపిస్తుంది. దీన్ని సహజసిద్ధమైన సునామీ హెచ్చరికగా భావించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సునామీలు అనేవి ఒకే తరంగం కాదు, బహుళ తరంగాల పరంపర.
కారణాలు
– సముద్ర ఉపరితలాన్ని ఉల్కలు ఢీకొనడం
– సముద్ర అంతర్భాగంలో భూకంపాలు సంభవించడం
– సముద్ర అంతర్భాగంలో అగ్నిపర్వతాలు ఉద్భేదనం
– సముద్ర అంర్భాగంలో భూ కంపాలు సంభవించడం
దుష్ప్రభావాలు
– 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధి కలిగిన సునామీలు భారీ నష్టాన్ని కలుగజేస్తాయి.
– నీటిబలంతో తన మార్గంలో అడ్డువచ్చే ప్రతిదాన్ని కూల్చివేస్తుంది. సునామీలవల్ల వచ్చే వరద ప్రభావం మానవ ఆవాసాలు, రోడ్లు, మౌలిక వసతులకు అపార నష్టాన్ని కలిగిస్తుంది.
– ఓడరేవులకు, విమానాశ్రయాలకు నష్టం వాటిల్లుతుంది.
– భౌతిక నష్టంతోపాటు ప్రజారోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
– నీరు ఇళ్లలోకి రావడంవల్ల ప్రజలు నీళ్లలో మునిగిపోయి మరణాలు సంభవిస్తాయి.
– విపత్తు సంభవించిన ప్రాంతాల్లో తాగునీటి లభ్యత అన్నది ఎప్పుడూ ప్రధాన సమస్యగానే ఉంటుంది.
– మురుగునీటి పైపులు దెబ్బతినడంవల్ల మురుగునీరు పారుదల వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.
– పంటనష్టం వాటిల్లుతుంది. పర్యావరణం క్షీణిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు