CA Practical Training | మెదడుకు పదును సీఏ ప్రాక్టికల్ ట్రెయినింగ్
ప్రస్తుతం సీఏ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరిగా మారింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జాబ్ రెడీ స్కిల్స్, రియల్‌టైమ్ ఎక్స్పీరియన్స్ అందించేదే ప్రాక్టికల్ ట్రెయినింగ్. తరగతి గదుల్లో బోధించిన అంశాలను వాస్తవ పరిస్థితులకు అన్వయించగలిగే అవకాశం ఆర్టికల్‌షిప్ ద్వారా లభిస్తుంది. సంబంధిత రంగాల్లోని ఆధునిక ధోరణులపై అవగాహన ఏర్పడుతుంది. కోర్సు పూర్తయ్యేనాటికి ఇండస్ట్రీ రెడీగా తీర్చిదిద్దడానికి ప్రాక్టికల్ ట్రెయినింగ్ మంచి వేదిక. అందుకే ప్రాక్టికల్ ట్రెయినింగ్‌ను ఉద్యోగానికి మొదటి మెట్టుగా భావిస్తున్నారు. కెరియర్‌పరంగా నిర్ణయాత్మక ప్రాక్టికల్ ట్రెయినింగ్ గురించి తెలుసుకుందాం…
సీఏ కోర్సు – దశలు
-సీఏ కోర్సు మూడు దశల్లో పూర్తిచేయాలి. ముందుగా సీఏ ఫౌండేషన్ పూర్తిచేసినవారు తొమ్మిది నెలలకు రెండో దశ అయిన సీఏ ఇంటర్ పూర్తిచేయాలి. సీఏ ఇంటర్‌లోని మొదటి గ్రూప్‌కానీ, రెండో గ్రూప్‌కానీ, లేదా రెండు గ్రూప్‌లూ పూర్తిచేసినవారు సీఏ ఇన్స్టిట్యూట్ నిర్వహించే నాలుగువారాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ (ఐసీఐటీఎస్ఎస్) అనే కంప్యూటర్ కోర్సును పూర్తిచేయాలి. తర్వాత మూడేండ్లపాటు ప్రాక్టికల్ ట్రెయినింగ్ తీసుకోవాలి. మూడేండ్ల ప్రాక్టికల్ ట్రెయినింగ్‌లో రెండున్నరేండ్ల శిక్షణ పూర్తిచేశాక, సీఏ ఇన్‌స్టిట్యూట్‌వారు నిర్వహించే నాలుగు వారాల అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ (ఐసీఐటీఎస్ఎస్) అనే కంప్యూటర్ కోర్సు పూర్తిచేసి, తర్వాత సీఏ ఫైనల్ పరీక్ష రాయవచ్చు.
ప్రాక్టికల్ ట్రెయినింగ్ అంటే?
-సీఏ చదువుతున్న విద్యార్థులు చదువుతోపాటు భవిష్యత్తులో చేయబోయే ప్రాక్టీసు లేదా ఉద్యోగాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం, ప్రాక్టికల్ నాలెడ్జ్ వృత్తి నైపుణ్యం, ఆచరణాత్మకత, ఎక్స్పోజర్ వంటి అంశాలపై ముందుగానే అవగాహన ఏర్పర్చుకోవడమే ప్రాక్టికల్ ట్రెయినింగ్ ఉద్దేశం.
ట్రెయినింగ్ ఎక్కడ?
-ఐపీసీసీ కోర్సులో రెండు గ్రూపులు లేదా ఏదైనా ఒక గ్రూపు పూర్తిచేసిన విద్యార్థి మూడేండ్లపాటు ఒక ప్రాక్టీసింగ్ సీఏ దగ్గరకానీ, ఒక ఆడిట్ సంస్థలోగానీ ప్రాక్టికల్ ట్రెయినింగ్ తీసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేయించాలా?
-ఐపీసీసీ రెండు గ్రూపులు పూర్తిచేసినవారు లేదా ఏదైనా ఒక గ్రూపు పూర్తిచేసినవారు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. మనం ఎవరివద్ద ప్రాక్టికల్ ట్రెయినింగ్ తీసుకోబోతున్నాం? ఎప్పటి నుంచి ట్రెయినింగ్ ప్రారంభించాం? వంటి విషయాలు ఐసీఏఐకి ముందుగానే తెలియజేయాలి.
ట్రెయినింగ్‌కు ఎలాంటి సంస్థను ఎంచుకోవాలి?
-నైపుణ్యాలను, ప్రతిభను మెరుగుపర్చుకోవడానికి ఎక్కువ అవకాశాలను కల్పించే ఆడిట్ సంస్థలను ఎంపిక చేసుకోవాలి. ఇంటర్‌పర్సనల్ బిహేవియర్, కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రాక్టికల్ ట్రెయినింగ్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సీనియర్, తెలిసిన సీఏ సహకారం తీసుకోవాలి. స్టయిఫండ్ గురించి ఆలోచించకుండా మంచి సంస్థలో ప్రాక్టికల్ ట్రెయినింగ్‌కు అవకాశం ఉంటే చేరడానికి సిద్ధంగా ఉండాలి.
-విద్యార్థులు ప్రాక్టికల్ ట్రెయినింగ్ ఎలాంటి ఆడిట్ సంస్థలో అయినా చేయవచ్చు. మనం ఎంచుకునే ఆడిట్ సంస్థను బట్టే (అది చిన్నదయినా, పెద్దదయినా) మనం నేర్చుకునే నైపుణ్యం ఆధారపడి ఉంటుంది.
-చాలామంది విద్యార్థులు తామున్న ఊరు, సిటీ చిన్నవని పెద్దపెద్ద ఆడిట్ సంస్థలు లేవని పెద్ద సంస్థలో ప్రాక్టికల్ ట్రెయినింగ్ తీసుకుంటేనే మంచి పరిజ్ఞానం, ఎక్స్పోజర్ వస్తుందని భావిస్తుంటారు. కానీ అది అపోహమాత్రమే. మీరు ఏ ఆడిట్ సంస్థలో ప్రాక్టికల్ ట్రెయినింగ్ కోసం చేరినా వ్యవహరించే విధానం, మీలోని తపనను బట్టి మీకు పరిజ్ఞానం వస్తుందని మరచిపోకూడదు.
-కొంతమంది ప్రాక్టికల్ ట్రెయినింగ్ కోసం ఉన్న నగరాలను వదిలేసి మెట్రోనగరాలకు వెళ్తున్నారు. దీంతో కొంతమంది మెట్రో కల్చర్‌కి ఆకర్షితులై తమ దిశమారి తప్పటడుగులు వేస్తున్నారు. అందువల్ల మెట్రోనగరాలకు వెళ్లి ప్రాక్టికల్ ట్రెయినింగ్ తీసుకోవాలనుకునే విద్యార్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి.
-విద్యార్థులు ఏ ఆడిట్ సంస్థలో చేరాలనుకుంటున్నారో ఆ సంస్థలో ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసిన సీనియర్లతో, అక్కడ ప్రాక్టికల్ ట్రెయినింగ్ కొనసాగిస్తున్న వారితో ముఖాముఖి మాట్లాడి నిర్ణయంతీసుకోవడం మంచిది.
-విద్యార్థులు ఆడిట్ సంస్థను పెద్దపెద్ద భవనాలు, కార్పొరేట్ హంగులు, ఆర్బాటాలు చూసి ఎంచుకోకూడదు. ఆ సంస్థకి ఉన్న క్లయింట్ ఎవరు? వృత్తి నైపుణ్యాలు ఎలా ఉంటాయి? ఎన్ని రకాల ఆడిట్లు నేర్పిస్తారనే అంశాలను బేరీజువేసుకుని నిర్ణయం తీసుకోవాలి.
-కొంతమంది విద్యార్థులు తమకి సరైన ఎక్స్పోజర్ రావడంలేదని, ఆడిట్ సంస్థ చదువుకోవడానికి సమయం ఇవ్వదని, ఇలా రకరకాల కారణాలతో పదేపదే సంస్థలు మారుతుంటారు. ఇది గమనించి సీఏ ఇన్స్టిట్యూట్ కూడా ఆడిట్ సంస్థ బదిలీ ప్రక్రియను కఠినతరం చేసింది.
-ఇప్పుడు విద్యార్థులు ఒక ఆడిట్ సంస్థ నుంచి మరో ఆడిట్ సంస్థకు మారడం అంతసులభం కాదు. అందుకే ఆడిట్ సంస్థలో ప్రాక్టికల్ ట్రెయినింగ్‌లో చేరేముందు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
ట్రెయినింగ్‌లో గమనించాల్సిన అంశాలు
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ సమయంలో శిక్షణ ఇచ్చే సంస్థ లేదా ఆడిట్ ఆఫీస్.. విద్యార్థులతో రకరకాల సంస్థల ఆడిట్ వర్క్ చేయిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు కింది అంశాలను నిశితంగా గమనించాలి…
1. సంస్థకు సంబంధించిన పుస్తకాలు ఎలా తయారుచేస్తారు?
2. సంస్థ వ్యాపార లావాదేవీలను ఎలా జరుపుతున్నారు?
3. వ్యాపార సంస్థకి సంబంధించిన మంచి, చెడులు, వారి వ్యాపార సూత్రాలు, మెళకువలు గమనించాలి.
4. వ్యాపార పద్ధతులను నిశితంగా పరిశీలించాలి.
5. తయారీ సంస్థలైతే వస్తు తయారీలో వివిధ దశల గురించి తెలుసుకుంటే మంచిది.
6. ప్రాక్టికల్ ట్రెయినింగ్ తీసుకోవడం వల్ల విద్యార్థి ఒక సీఏ ఏ పని చేస్తాడో ఆ పని మొత్తం నేర్చుకునే వీలుంటుంది.
అసెస్మెంట్ టెస్ట్
-సీఏ కోర్సులోని నూతన విధానం ప్రకారం ప్రాక్టికల్ ట్రెయినింగ్‌లో ఉన్న విద్యార్థులు సీఏ ఇన్స్టిట్యూట్ నిర్వహించే అసెస్మెంట్ టెస్ట్ రాయాలి. విద్యార్థులు అప్పటివరకు పొందిన ప్రాక్టికల్ ట్రెయినింగ్‌లో ఎలాంటి అంశాలు నేర్చుకున్నారు, ఎంతవరకు అనుభవం సాధించారో తెలుసుకునేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
ఎప్పుడు రాయాలి?
-ట్రెయినింగ్‌లో మొదటి లేదా రెండో ఏడాది ముగిసిన తర్వాత వచ్చే త్రైమాసికంలో ఈ టెస్ట్ రాయల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రాక్టికల్ ట్రెయినింగ్ ముగిస్తే ఆగస్టు-సెప్టెంబర్‌లో అసెస్మెంట్ టెస్ట్ రాయాలి.
సిలబస్
-ఈ పరీక్షకు ప్రత్యేకంగా సిలబస్ అంటూ ఉండదు. ప్రాక్టికల్ ట్రెయినింగ్ సమయంలో విద్యార్థి ఏ సబ్జెక్టుకు సంబంధించిన ప్రాక్టికల్ పరిజ్ఞానం సంపాదిస్తాడో ఆయా సబ్జెక్టుల్లోనే సిలబస్ ఉంటుంది.
-మొదటి ఏడాది: 50 మార్కులకు అకౌంటింగ్, ఆడిటింగ్ (కార్పొరేట్ లా కలిపి), 25 మార్కులకు డైరెక్ట్ ట్యాక్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్, ఇండస్ట్రియల్ ఆడిట్ల నుంచి ఏదో ఒక మాడ్యూల్‌ను ఎంచుకోవాలి. (ప్రాక్టికల్ ట్రెయినింగ్ స్పెషలైజేషన్‌ని బట్టి). మొత్తం 75 మార్కులకు ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్ష రెండు గంటల్లో పూర్తిచేయాలి.
-రెండో ఏడాది: 50 మార్కులకు అకౌంటింగ్, ఆడిటింగ్ (కార్పొరేట్ లాస్ కలిపి), మిగతా మార్కులకు డైరెక్ట్ ట్యాక్స్ (ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్‌తో కలిపి), ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్, ఇండస్ట్రియల్ ఆడిట్ నుంచి ఏవో రెండు మాడ్యూల్స్ ఎంచుకోవాలి. మొత్తం 100 మార్కులకు ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. పరీక్ష మూడు గంటల్లో రాయాలి.
రిజిస్ట్రేషన్
-ఆన్లైన్ ద్వారా ఈ టెస్టుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వెబ్సైట్ www.icai.org, ICAI Cloud Campus.
-నెగెటివ్ మార్కులు లేవు.
-మరిన్ని వివరాలకు: 0120-3876870/3045925 (లేదా) ptassessment@icai.in ద్వారా Board of Studies వారిని సంప్రదించవచ్చు.
ప్రాక్టికల్ ట్రెయినింగ్ ప్రయోజనాలు
-ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియావారు సీఏ కోర్సు మొదలు పెట్టినప్పటి నుంచే ఈ ప్రాక్టికల్ ట్రెయినింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. సీఏ విద్యార్థులు సీఏ చదువుతోపాటు ఈ ప్రాక్టికల్ ట్రెయినింగ్‌కు కూడా సమప్రాధాన్యమిచ్చి సీఏ సర్టిఫికెట్‌తోపాటు సీఏగా రాణించడానికి అవసరమయ్యే అన్ని మెళకువలు నేర్పించడానికి ఈ విధానం ప్రవేశపెట్టారు.
-సీఏ పూర్తిచేసినవారు ఉద్యోగానికైనా వెళ్లవచ్చు లేదా సొంతంగా ప్రాక్టీస్ కూడా ప్రారంభించవచ్చు. ప్రాక్టీస్కుగానీ, ఉద్యోగం చేయడానికిగానీ ఈ ఆర్టికల్‌షిప్ ద్వారా నేర్చుకునే మెళకువలు ఎంతో ఉపయోగపడుతాయి.
-ఆర్టికల్‌షిప్ ద్వారా విద్యార్థి తరగతిగదిలో నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఎలా అమలు చేయాలో నేర్చుకుంటాడు.
-సీఏ ఫైనల్ పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడు ఫైనల్లోని అన్ని అంశాలపై లోతైన అవగాహన అవసరం. ప్రాక్టికల్ ట్రెయినింగ్‌ను నిబద్ధతతో పూర్తిచేసినవారు సీఏ ఫైనల్లోని అన్ని అంశాలపై అవగాహన ఏర్పడి పరీక్షలు చక్కగారాసే వీలుంటుంది.
-సీఏ ఫైనల్లో అడిగే ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు మన ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని కూడా ప్రశ్నించేలా ఉంటాయి. కాబట్టి ప్రాక్టికల్ ట్రెయినింగ్‌లో ఉన్నప్పుడు ఏ విషయాన్ని వదలకుండా అన్ని విషయాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందే సమయంలో సహచర విద్యార్థులతో సఖ్యతగా ఉంటూ వారికి తెలిసిన విషయాలను కూడా మీరు అడిగి తెలుసుకుంటూ ఉండాలి. దీనివల్ల మీకు తెలియని అంశాలను ఆకళింపుచేసుకొనే వీలుంటుంది.
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ సమయంలో మనం అధికారులు, సీనియర్లు, అనేక రకాల విభాగాల ప్రతినిధులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మనం వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటూ పనిచేస్తే మనకు కావాల్సిన పరిజ్ఞానంతోపాటు మన భావవ్యక్తీకరణ నైపుణ్యాలను సైతం పెంచుకోవచ్చు.
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ నిబద్ధతతో పూర్తిచేసిన వారికి వారిపైన నమ్మకం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కలిగి తమ కెరీర్‌పై స్పష్టతను ఏర్పర్చుకొని, తమ గమ్యాలను సరైన దిశలో నిర్దేశించుకొని అటువైపు పయనం సాగిస్తారు.
-రోజువారి బాధ్యతల కారణంగా డిపార్ట్మెంట్ హెడ్/మేనేజర్లు వారికి వచ్చిన వినూత్న ఆలోచనలను అమలు చేయడం ఒక్కోసారి సాధ్యం కాదు. అలాంటి ఆలోచనలపై పనిచేయడం, వాటి ద్వారా ఎదురయ్యే పరిస్థితులను పరిశీలించడానికి ఆడిట్ సంస్థలు ప్రాక్టికల్ ట్రెయినీ అసిస్టెంట్‌గా చేరినవారి సేవలను వినియోగించుకుంటాయి. అంతేకాకుండా ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందేవారు ఫ్రెష్మైండ్తో ఉంటారు కాబట్టి సంబంధిత రంగాల్లో సృజనాత్మక ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది. ఇవి నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తాయి. కాబట్టి ఆడిట్ సంస్థలు ప్రాక్టికల్ ట్రెయినింగ్‌ను ప్రోత్సహిస్తాయి.
-తమకు కావాల్సిన ప్రతిభావంతులను రిక్రూట్ చేసుకునే క్రమంలో ప్రాక్టికల్ ట్రెయినింగ్‌ను ఆడిట్ సంస్థలు ఒక మార్గంగా భావిస్తాయి. అవసరమైన నైపుణ్యాలు, ప్రాక్టికల్ ట్రెయినింగ్ సమయంలో పనితీరు, దృక్పథం, చురుగ్గా కంపెనీ సంస్కృతిలో కలిసిపోవడం వంటి అంశాలను ఆడిట్ సంస్థలు నిశితంగా గమనిస్తాయి. ఈ సమయంలో తమ స్కిల్స్‌తో ఆకట్టుకునేవారికి కంపెనీలు ఉద్యోగ అవకాశం కల్పిస్తాయి.
ఇంటర్వ్యూలో విజయం ఎలా?
-కొన్ని పెద్ద ఆడిట్ సంస్థలు తమవద్ద ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందాలనుకునే విద్యార్థులకు మౌకిక పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి. అటువంటి పెద్ద సంస్థలకు ఇంటర్వ్యూలకు వెళ్లే విద్యార్థులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు…
1. ఇంటర్వ్యూకు వెళ్లేముందు సీఏ ఐపీసీసీలోని అన్ని సబ్జెక్టులను మరోసారి రివైజ్ చేసుకోవాలి.
2. ఇంటర్వ్యూలో వారు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియకపోతే నిజాయితీగా తెలియదని చెప్పాలి. ఏదో ఒక సమాధానం చెప్పి మభ్యపెట్టవద్దు.
3. మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్న ఆడిట్ సంస్థ పూర్తి సమాచారాన్ని ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవారు వారి సంస్థపట్ల మీకున్న అభిప్రాయాన్ని తెలపాలని అడిగే అవకాశం ఉంది.
4. ఇంటర్వూలో అడిగే ప్రశ్నలకు కంగారుపడకుండా సమాధానం చెప్పాలి. మీరు ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. దుస్తులు ప్రొఫెషనల్‌గా ఉండాలి.
5. ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చేటప్పుడు మీరు చేరాలనుకుంటున్న ఆడిట్ సంస్థ నిబంధనలకు లోబడి పనిచేస్తారు అనేలా సమాధానాలు ఉండాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?