పెట్టుబడుల ఉపసంహరణ అంటే ఏమిటి..?
ద్రవ్యలోటు చెల్లింపుల శేషం (Balance of Payments) అనుహ్య రీతిలో భారీస్థాయికి చేరి, దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడంతో 1990-91 లో ఆర్థిక సహాయం కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF), ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. అయితే కొన్ని షరతులకు లోబడి ఆర్థిక సహాయం అందించనుననట్లు ఆ సంస్థలు స్పష్టం చేశాయి.
-ప్రపంచ బ్యాంకు, IMF షరతులు నెరవేర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1991 జూలై 24న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది.
-దేశ పారిశ్రామిక రంగంలో ప్రైవేటు రంగం పాత్రను, ప్రాధాన్యాన్ని పెంచడమే ఈ పారిశ్రామిక విధానంలోని ప్రధాన మౌలికాంశం.
-దేశ కోశాగారానికి భారంగా మారి, పూర్తిగా బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడిన ప్రభుత్వ రంగ సంస్థల అధికారులకు సహకరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించింది.
-ప్రభుత్వరంగ సంస్థల పనితీరులో మరింతగా మార్కెట్ క్రమశిక్షణను తీసుకరావాలంటే వాటి నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవాలని 1991 నాటి పారిశ్రామిక విధాన ప్రకటన స్పష్టం చేసింది.
-చివరకు ప్రభుత్వం 1991 డిసెంబర్లో పెట్టుబడుల ఉపసంహరణకు(disinvestment) శ్రీకారం చుట్టింది.నిజానికి 1990-91లో చంద్రశేఖర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పెట్టుబడుల ఉపసంహరణకు నాంది పలికింది. ఎంపిక చేసిన సంస్థలో 20శాతం వాటాను ప్రభుత్వరంగ సంస్థలకు విక్రయించాలని అప్పట్లో ప్రభుత్వం తలపెట్టింది.
-1991-92 బడ్జెట్లో ప్రభుత్వ ఆర్థిక సంస్థలకు,మ్యూచ్‌వల్ ఫండ్లకు, కార్మికులకు మాత్రమే వాటాలు విక్రయించాలని స్పష్టం చేసింది.
లక్ష్యాలు : ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణలో మార్కెట్ పరమైన క్రమశిక్షణ ప్రవేశపెట్టి, వాటి సామర్థ్యం పెంచాలనే లక్ష్యంతో ఉపసంహరణ ప్రకటించిన ప్రభుత్వం తర్వాత ఒక ప్రత్యేక పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఏర్పాటు చేసింది.
శాఖ లక్ష్యాలు
1. వ్యూహత్మకం కాని సంస్థల వద్ద పేరుకుపోయిన ప్రభుత్వ వనరులను సాంఘిక ప్రాధాన్యత గల ప్రాథమిక ఆరోగ్యం, విద్య, కుటుంబ సంక్షేమం, సాంఘిక ఆర్థిక అవస్థాపన అవసరాల కోసం మళ్లించడం.
2. ఆర్థికంగా నిలదొక్కుకోలేని ప్రభుత్వ సంస్థలకు ప్రభుత్వ వనరులు కేటాయించకపోవడం.
3. నానాటికి మితిమీరిపోతున్న ప్రభుత్వ రుణభారాన్ని తగ్గించడం.
పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్
-సామూహిక యాజమాన్యం, కార్మికుల షేర్ హోల్డింగ్ ను ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం 1990 ఆగస్టులో ఐదుగురు సభ్యులతో ఇన్వెస్ట్మెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
-ప్రణాళిక సంఘం మాజీ అధ్యక్షుడు అయిన జీవీ రామకృష్ణను కమిషన్‌కు చైర్మన్‌గా నియమించారు.
-దేశ భద్రతతో ముడిపడిన కీలక రంగాలకు చెందిన వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను విక్రయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.
-ఇతర పీఎస్‌యూలలో వాటాల విక్రయాలను కమిషన్ మార్గదర్శకత్వంలో చేపట్టాలని నిర్ణయించింది.
-వ్యూహత్మక పీఎస్‌యూలలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రసక్తిలేదు.ప్రాధాన్య సంస్థలలో 49 శాతం వరకు వాటాలు విక్రయించాలని, అంతగా ప్రాధాన్యం లేని సంస్థలలో 74 శాతం వరకు వాటాలు ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
-ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, రక్షణ ఉత్పత్తులు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, అణుశక్తి, రైల్వేరవాణాకు సంబంధించిన సంస్థలు వ్యూహాత్మకమైనవి.
-జూలై 2001లో డిజిన్వెస్ట్ మెంట్ కమిషన్‌ను పునర్ వ్యవస్థీకరించారు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా పనిచేసిన ఆర్‌హెచ్ పాటిల్‌ను కమిషన్ చైర్మన్ గా నియమించారు.
-ప్రభుత్వం నివేదించిన పీఎస్‌యూలలో డిజిన్వెస్ట్మెంట్కు అనుసరించాల్సిన పద్ధతులను మాత్రమే కమిషన్ సిఫార్సు చేయాలి. ఈ సిఫార్సులు సలహాలు మాత్రమే, తుది నిర్ణయం ప్రభుత్వానిదే.
-కమిషన్‌కు చట్టబద్ధమైన అధికారాలు కల్పించాలని జీవీ రామకృష్ణ అభ్యర్థనను పట్టించుకోలేదు.
-ఉపసంహరణ విధానం: 1991-92లో ప్రభుత్వరంగ సంస్థల మైనారిటీ వాటాల విక్రయంలో డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్ది మార్పులతో ఈ విధానమే 1999-2000 వరకు కొనసాగింది.
-2000 మార్చి నుంచి ఈ విధానంలో మార్పు వచ్చింది. ఉపసంహరణకై కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు.
-ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో డిజిన్వెస్ట్మెంట్కు లక్ష్యాన్ని ప్రకటిస్తుంది.1990-92లో లక్ష్యం రూ.2,500 కోట్లుగా
2015-16లో లక్ష్యం రూ. 41,000 కోట్లుగా (21, 400 కోట్లు వాస్తవం)
2016-17 లో లక్ష్యం రూ.56,000 కోట్లుగా (21,000 కోట్లు వాస్తవం)
2017-18 లో లక్ష్యం రూ. 72,500 కోట్లుగా నిర్ణయించారు. కాని వాస్తవంలో విక్రయాలు లక్ష్యాలను చేరుకోలేదు.
-జాతీయ పెట్టుబడుల నిధి: 2005 జనవరిలో జాతీయ పెట్టుబడుల నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లాభం సంపాదిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మైనారిటీ వాటాల విక్రయ రాబడిని దీనిలో జమచేస్తారు.
-దీని మూలనిధి రూ.1814.45 కోట్లు. విద్య, వైద్యం, అభివృద్ధి చేయడానికి, ఉద్యోగిత పెంచటానికి, ఎంపిక చేసిన ప్రభుత్వరంగ సంస్థల మూలధనం పెంచడానికి ఈ నిధి ఉపయోగిస్తారు.
ఈ నిధిని కింది పథకాల కోసం కేటాయిస్తారు.
1. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
2. రాజీవ్‌గాంధీ గ్రామీణ విధ్యుదీకరణ యోజన
3. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్
4. వేగవంతమైన నీటిపారుదల ప్రయోజనాల కార్యక్రమం
5. వేగవంతమైన విద్యుత్ అభివృద్ధి సంస్కరణ కార్యక్రమం
ప్రైవేటు రంగం: ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే దేశీయ, విదేశీ వ్యాపార పారిశ్రామిక సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థల యాజమాన్యంలో పనిచేస్తుంటే వాటన్నింటిని కలిపి ప్రైవేటురంగం అని అంటారు. ప్రైవేటు యాజమాన్యమే ఆ సంస్థలను నిర్వహిస్తుంది.
-ఒకప్పుడు సొంత వ్యాపారం లేదా భాగస్వామ్య వ్యాపారంగా నడిచిన ప్రైవేటు సంస్థలు, ఈ రోజు జాయింట్ స్టాక్ కంపెనీలుగా, కార్పొరేట్ సంస్థలుగా నిర్వహించడం జరుగుతుంది.
-స్వాతంత్య్రానికి ముందు రైల్వేలు, నీటిపారుదల, విద్యుచ్చక్తి, తంతి తపాల, ఓడరేవులు, ఆయుధాలు, ఆయుధ సామాగ్రి తప్ప మిగిలిన అన్ని పరిశ్రమలు ప్రైవేటురంగంలో ఉండేవి.
-1951 పరిశ్రమల (అభివృద్ధి, నియంత్రణ) చట్టం తదితర నిబంధనల ప్రకారం ప్రైవేటురంగ సంస్థల ఏర్పాటును, నిర్వహణను ప్రభుత్వం క్రమబద్దీకరించి నియంత్రణ చేస్తూ లైసెన్సింగ్ విధానాన్ని అమలుచేసింది.
-1991 వరకు ప్రభుత్వరంగమే అధిక ప్రాధాన్యం కలిగిన రంగం కింద ఉండేది. అటు తర్వాత నూతన ఆర్థిక విధానం ఫలితంగా ప్రభుత్వరంగ ప్రాధాన్యం తగ్గించి ప్రవేటురంగాన్ని ప్రోత్సహిస్తున్నారు.
ప్రైవేటురంగ పాత్ర
1. ఆర్థికాభివృద్ధి: పారిశ్రామికీకరణ ప్రక్రియకు ప్రేరణ, చైతన్యశక్తి ప్రైవేటు రంగమే అని షుంపీటర్ పేర్కొన్నాడు.
-ప్రైవేటువారి లక్ష్యం లాభార్జన, లాభాలు పెంచుకోవడం కోసం నవకల్పనలు ప్రవేశపెట్టి పారిశ్రామికీకరణ అభివృద్ధికి తోడ్పడతారు.
-స్వాతంత్య్రానికి పూర్వం నూలు బట్టలు, జనపనార, పంచదార, కాగితం, వంట నూనెలు, టీ మొదలైన పరిశ్రమల అభివృద్ధికి ప్రైవేట్ రంగం కృషిచేసింది. స్వాతంత్య్రం తర్వాత యంత్రపరికరాలు, రసాయనాలు, రంగులు, ప్లాస్టిక్, ఇను ము, ఇనుముకాని లోహాలు, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులు, సిమెంట్ మొదలైన మధ్యరకం వస్తువుల తయారీలో అనేక ప్రైవేటు సంస్థలను నెలకొల్పారు.
-వినియోగ వస్తురంగంలో అనేక వస్తువుల విషయంలో స్వయం సమృద్ధి సాధించిన ప్రైవేట్‌రంగం జాతీయోత్పత్తి పెరుగుదలకు తోడ్పడి ఆర్థికాభివృద్ధిలో సముచిత పాత్ర నిర్వహిస్తుంది.
2. ఉద్యోగిత: ప్రైవేటు రంగంలోని పరిశ్రమలు ఎక్కువగా శ్రమసాంద్రత పరిశ్రమలు, వీటివల్ల దేశంలో ఉపాధి కల్పన పెరిగింది.
3. ఆధునిక పరిశ్రమలు: వినియోగ వస్తురంగంలో ఎలాక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ రంగంలో ప్రైవేటురంగంలో ఆధునీకరణ విస్తృతంగా జరిగింది.
4. వ్యవసాయాధారిత పరిశ్రమలు: వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలలో ప్రైవేటురంగం ప్రధానపాత్ర నిర్వహిస్తున్నది. పశుపోషణ, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, పండ్ల తోటలు, వ్యవసాయాధారిత పరిశ్రమలు ముఖ్యంగా, ఫుడ్ ప్రాసెసింగ్ అభివృద్ధి చెందడంలో ప్రైవేటురంగం పాత్ర ప్రధానమైంది.
5. వ్యాపార రంగం: రైల్వేలు ప్రభుత్వరంగంలోనే ఉన్నా, సరుకుల రోడ్డురవాణాలో ప్రైవేటురంగానిదే పైచేయి. టోకు, చిల్లర, వ్యాపారం ద్వారా మార్కెటింగ్‌ను ప్రైవేటురంగమే నిర్వహిస్తుంది.
6. అవస్థాపన: ముఖ్యంగా రోడ్లనిర్మాణం,బ్రిడ్జ్‌ల నిర్మాణంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (BOT) పద్ధతిలో ప్రైవేటురంగం ప్రధానపాత్ర నిర్వహిస్తున్నది.
7. సేవారంగం: బ్యాంకింగ్, బీమా, విద్య, వైద్యం మొదలైన సేవారంగాల్లో కూడా ప్రైవేటురంగం పాత్ర విస్తరిస్తున్నది. కుటుంబసేవలు, వినోదసేవలు, వృత్తిపరమైన సేవలు ప్రైవేటురంగం అందిస్తున్నది.
8. చిన్నతరహా & కుటీర పరిశ్రమలు: ఈ పరిశ్రమలు అధికంగా ప్రైవేటురంగంలోనే పనిచేస్తున్నాయి. ఇవి శ్రమసాంద్రతవి కావడంతో ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు దొరికాయి.
రంగరాజన్ కమిటీ సిఫార్సులు
1992-93లో పెట్టుబడుల ఉపసంహరణకు PSUలను ఎంపిక చేయడానికి ఒక ప్రక్రియను రూపొందించాలని, అలా ఎంపిక చేసిన PSUల నుంచి ఎంత శాతం వరకు ఈక్విటీలను అమ్మకానికి పెట్టవచ్చో సిఫారసు చేయాలని కోరుతూ 1992 నవంబర్‌లో కేంద్రప్రభుత్వం సి. రంగరాజన్ నేతృత్వంలో పెట్టుబడుల ఉపసంహరణ కమిటీని నియమించింది.
ఇందులో సిఫారుసులు:-
1. ప్రభుత్వ సంస్థల్లో గణనీయంగా వాటాను ఉపసంహరించాల్సిన అవసరం ఉంది.
2. ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే ప్రత్యేకించిన రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న PSUలలో 49శాతం వాటాను విక్రయించాలి.
3. వ్యూహత్మక ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ పాత్ర అవసరమైన కొన్ని రకాల సంస్థలలో వాటాను పూర్తిగా విక్రయించవచ్చు.
4. ఆయుధాలు, రక్షణ పరికరాలు, చమురు, అణువిద్యుత్, అణుధార్మిక ఖనిజాలు, రైల్వే, బొగ్గు-లిగ్నైట్లను కీలక రంగాలుగా గుర్తించింది. వీటిల్లో మాత్రం ప్రభుత్వం 51శాతానికి తగ్గకుండా వాటా కొనసాగించాలని సిఫారసు చేసింది.
5. PSU ల కార్మికులకు, ఉద్యోగులకు ప్రాధాన్యతా వాటాల జారీకి ఒక పథకాన్ని రూపొందించాలి.
6. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా లభించే ఆదాయంతో 10శాతం మొత్తాన్ని PSU అభివృద్ధికి కేటాయించాలి.
7. సంస్కరణల కార్యాచరణను పర్యవేక్షించడానికి వీలుగా ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణపై ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
-ఈ నివేదికను ప్రభుత్వం 1993 జూన్ 26న ప్రజలకు విడుదల చేసింది. 1993-94లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.3,500 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. కొన్ని కారణాల వల్ల పెట్టుబడుల ఉపసంహరణ సాగలేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు