Reservation | అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు
-మానవుడు ప్రకృతి సృష్టించిన సహజసిద్ధమైన అవరోధాలను అధిగమించి అంతరిక్షాన్ని అందుకోగలిగే స్థాయికి ఎదిగాడు. కానీ అతని సాంఘిక జీవనంలో కృత్రిమంగా సృష్టించుకున్న సామాజిక అవరోధాలైన కులం, మతం, అసమానతలు, లింగ వివక్ష మాత్రం అధిగమించలేకపోతున్నాడు. కులాలతో ఖండితమైన భారతీయ సమాజంలో కులాంతర వివాహాల దగ్గర నుంచి కుల ప్రాతిపదికన చెలరేగే ఘర్షణల వరకు, కుల పెద్దలు నిర్వహించే కాప్ పంచాయితీల దగ్గర నుంచి దేశ సర్వోన్నత న్యాయస్థానం కుల రిజర్వేషన్లపై వెల్లడించిన మండల్ కమిషన్ తీర్పు పంచాయితీ వరకు పరిణామాలను పరిశీలిస్తే దేశంలో కులం అనే సాంఘిక వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019, జనవరి 7న కేంద్రప్రభుత్వం అగ్రవర్ణ పేదలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణిస్తూ వారికి 10 శాతం విద్య, ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగ సవరణ చేయడానికి నిర్ణయించడంతో కులాలు, ఆర్థిక పరిస్థితుల ప్రాతిపదికన రిజర్వేషన్లకు సంబంధించి నేడు దేశ మేధావి వర్గం చర్చను ప్రారంభించింది.
-ప్రాచీన యుగంలో వర్ణ ధర్మం అనేది వృత్తులను నిర్ణయిం చి తద్వారా ప్రతి వర్ణం ఆర్థిక స్థితిగతులను నిర్ణయించే నిర్ణాయకాంశంగా ఉండేది. కానీ నేటి ప్రపంచీకరణ యుగంలో సమాజ వృత్తి ధర్మం, దాని నిర్మాణం అనేవి ఆర్థిక స్థితిగతులను నిర్ణయించి తత్ఫలితంగా సాంఘిక స్థితిగతులను నిర్ణయించే నిర్ణాయకాంశం అయ్యింది. అంటే నేడు సమాజంలో నెలకొని ఉన్న పేదరికం, ఆర్థిక అసమానతలు, పురుషాధిక్యత, పితృస్వామ్యం అనే సమస్యలు ఆర్థిక సాధికారితలేమి వల్ల సంభవించడం దీనికి నిదర్శనం.
-దేశవ్యాప్తంగా గత అర్ధ దశాబ్ద కాలంగా మహారాష్ట్రలో మరాఠీలు, తెలంగాణలో రెడ్డి జాగృతి, ఆంధప్రదేశ్‌లోని కాపులు, హర్యానా, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో జాట్లు, ఉత్తరప్రదేశ్, బీహార్లలో కథియ, కాయస్థ, బ్రాహ్మణులు, కర్ణాటకలో లింగాయత్‌లు, ఒక్క లింగాయత్‌లు, తమిళనాడు, కేరళలల్లో పేద బ్రాహ్మణులు, గుజరాత్లో పాటీదార్లు రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమించారు.
-ఈ యుగంలో చాతుర్వర్ణంలో చివరి వర్ణం అయిన శూద్రులను, ఇతర మూడు వర్గాల్లో మహిళలను సైతం నిమ్నవర్గాలుగానే పరిగణించారు. కానీ వేద అనంతర కాలం ప్రారంభమయ్యే నాటికి వర్ణవ్యవస్థలో సంకీర్ణం జరిగి జాతి, ఉపజాతి, పంచములు అనే మరో వర్ణంవారిని చాతుర్వర్ణ వ్యవస్థలో అదనంగా సృష్టించారు. అనంతరం మధ్యయుగం ఆరంభం నాటికి గుప్తయుగంలో వర్ణవ్యవస్థ ఇంకా బలపడింది. ఈ దశలోనే కులం అని పిలిచే వృత్తి ఆధారిత సాంఘిక వ్యవస్థ వాస్తవరూపం దాల్చింది.
-బ్రిటిష్‌వారి రాకతో ఆధునిక యుగంలో అడుగిడిన భారతీయ సమాజం.. బ్రిటిస్వారు అనుసరించిన విభజించి పాలించు అనే సూత్రంలో భాగంగా ప్రవేశపెట్టిన పాలనా పద్ధతులవల్ల పన్ను వసూలులో మధ్యవర్తి ప్రధానమైన జమీందారీ భూస్వామి విధానాలు అనుసరించడంవల్ల కొన్ని కులాలు ఆర్థికంగా స్థితిమంతులయ్యారు. దీనికితోడు బ్రిటిష్‌వారు పరిపాలన సంస్కరణల్లో భాగంగా సంపద, ఆర్థిక అంశాల ప్రాతిపదికన ఓటుహక్కు ఇవ్వడంవల్ల వారు రాజకీయంగా సైతం క్రియాశీలమయ్యారు.
-బెంగాల్ ల్యాండ్‌హోల్డర్స్ అసోసియేషన్ వంటి భూస్వా మ్య సంఘాలు దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ సంఘటనలు పూర్వం రాజ్య సలహాదారులు, పాలకుల వర్గంగా ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ వర్గంవారితో సమానమైన హోదాను పొంది, అప్పటికే గౌరవనీయ స్థానాన్ని అనుభవిస్తున్న వారు సరసన చేరి అగ్రవర్ణాలుగా పిలువబడ్డారు. దీనికి భిన్నంగా బ్రిటిష్‌వారి రాజ్య సంక్రమణ, సైన్యసహకార పద్ధతులు, రాజ్య విస్తరణ కాంక్షవల్ల స్వదేశ సంస్థానాల్లో ఉపాధిని కోల్పోయిన చేతివృత్తులవారు, పంచమ వర్గంవారు వెనుకబడిన వర్గాలుగా మిగిలిపోయారు.
-స్వాతంత్య్రం వచ్చేనాటికి అగ్రవర్ణాలవారు ఆర్థికంగా, రాజకీయంగా బలంగా ఉండి దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నారు. రాజ్యాంగ పరిషత్తులో, మొదటి ఎన్నికల్లో పార్లమెంటు సభ్యత్వం విషయంలో వీరి ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగ పరిషత్తు భూస్వాముల ఆధిపత్యంలో ఉందని మార్క్సిస్టు విమర్శకులు వ్యాఖ్యానించడాన్నిబట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే స్వాతం త్య్రం వచ్చిన తర్వాత ఆర్థిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థల్లో మార్పులు అగ్రవర్ణాల స్థితిగతుల్లో మార్పులకు కారణమయ్యాయి.
-అగ్రకుల గ్రామీణ పేదవారు 1980 దశకం మధ్య నుంచి ప్రారంభమైన ఉన్నత విద్య, సాంకేతిక విద్య రంగాల ద్వారా నైపుణ్యాన్ని సాధించడంలో వైఫల్యం చెందారు. మరోవైపు ఇదే సమయంలో వ్యవసాయంలో ఉత్పాదకత, ప్రతిఫలం తగ్గి సేవారంగాలకు ప్రాధాన్యం ఏర్పడటం ప్రారంభమైన ఈ తరుణంలో అగ్రవర్ణ పేదలు ఎదుర్కొనే సాపేక్ష వివక్ష పట్ల అగ్రవర్ణాల్లో అవగాహన పెరిగి చైతన్యవంతులయ్యారు. గుజరాత్లో పాటీదార్లు, మహారాష్ట్రలో మరాఠాలు, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు భారీ ఎత్తున లక్షల మందితో నిర్వహించిన నిరసన ప్రదర్శనలే వారిలోని సంఘటిత చైతన్యానికి నిదర్శనం.
-దీనికి పరిష్కారంగా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం సముచితంగానే ప్రస్తుత సమస్యకు పరిష్కారంగా చెప్పవచ్చు. దీనిలో భాగంగానే రాజ్యాంగ అధికరణలు 14, 15లను సవరించి ఎటువంటి న్యాయపరమైన అవరోధాలు ఏర్పడకుండా చూడాలని ప్రభుత్వం భావించడం కూడా ఆహ్వానించదగిన పరిణామం. దీనివల్ల ప్రభుత్వం అగ్రవర్ణ పేదల సమస్యను రాజ్యాంగ దృక్కోణం నుంచి అర్థం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది.
-అయితే దీన్ని చట్టరూపంగా తీసుకురావడంలోని అవరోధాలను పరిశీలిస్తే ఈ చట్టం చేయడానికి కష్టతరమైన 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాల్సి రావడం, రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉండటం, కేశవానంద భారతి కేసులో 1973లో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ద్వారా న్యాయస్థానానికి అపరిమిత అధికారం ఉండటం, న్యాయ సమీక్ష అధికారం ద్వారా దేశ సర్వోన్నత న్యాయస్థానానికి సంక్రమించిన అధికారాన్ని న్యాయవ్యవస్థ క్రియాశీలత ద్వారా పూర్వం N JAC వంటి రాజ్యాంగ సవరణలు కూడా చెల్లవని కొట్టివేయడం వంటి అవరోధాలను, అడ్డంకులను ఈ బిల్లు అధిగమించాల్సి ఉంటుంది. దీనికి తోడు ప్రస్తుతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత సరేసరి.
-కానీ సమాజంలో అధిక సంఖ్యాకుల అభిప్రాయాలకు, ప్రయోజనానికి ఎంత ప్రాధాన్యం ఉందో అల్ప సంఖ్యాకుల అభిప్రాయానికి, ప్రయోజనానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్న జాన్ స్టువర్ట్ మిల్ (జేఎస్ మిల్) తాత్వికత ఆధారంగా గతేడాది కాలంలో దేశ సర్వోన్నతమైన న్యాయస్థానం వెలువరించిన LGBT హక్కులపై తీర్పు, వివాహేతర సంబంధం కేసుపై తీర్పు, ఆధార్ గోప్యతపై వెలువరించిన తీర్పులను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు సామాజిక న్యాయం, సమానత్వంలకు కట్టుబడి ఉందని అగ్రవర్ణ పేదలు ఆశాభావంతో ఉన్నారు. సమాజం అనేది స్థిరమైనది కాదని అతి గతిశీలమైన జైవిక విభాగం అని, ఇప్పటివరకు LGBTల హక్కులను విస్మరించినందుకు క్షమించాలని LGBT వర్గాల కేసుపై తీర్పు సందర్భంగా సుప్రీం ధర్మాసనం క్షమాపణలు కోరింది. సర్వోన్నత న్యాయస్థానం సాంఘిక న్యాయానికి కట్టుబడి ఉందనడానికి ఇది నిదర్శనం.
-రిజర్వేషన్లు అనేవి సామాజిక న్యాయం కల్పించడానికి రాజ్యం అమలుచేసే నిశ్చయాత్మక చర్యల్లో భాగం కాబట్టి దాన్ని లక్షిత వర్గాలకు సామాజిక సాధికారికతను అందించే మాధ్యమంగా వినియోగించాలి. కానీ రిజర్వేషన్లను విస్తరిస్తూ ప్రజలందరికీ సార్వత్రికంగా అమలు చేయరాదని, అలా చేస్తే ఆచరణలో రిజర్వేషన్ల స్ఫూర్తి దెబ్బతిని స్వార్థ రాజకీయాలు ప్రబలే ప్రమాదం ఉందని భారత రాజ్యాంగ పిత బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తు చర్యల్లో ప్రసంగిస్తూ పేర్కొనడం గమనార్హం. దీనికితోడు రాజ్యాంగంలో రిజర్వేషన్లు పదేండ్ల కాలానికే అమలు చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. కానీ దీనికి అతీతంగా స్వతంత్ర భారతావనిలో రిజర్వేషన్లను పొడిగించుకుంటూ నేటికీ కొనసాగిస్తున్నారు.
-యాదృచ్ఛికంగా ఒక నిర్ణీత కులంలో పుట్టినందుకు ఆ వ్యక్తిని పురాతన, ప్రాచీన యుగంలో వారి పూర్వీకుల కారణంగా ఏర్పడిన సాంఘిక వివక్షకు ప్రతీకారంగా వందలు, వేల ఏండ్ల తర్వాత రిజర్వేషన్ల పేరుతో ప్రతి వివక్షకు గురిచేయడమనే సంకెళ్లలో బందీ అయి నేటి అగ్రవర్ణ పేదలు సామాజిక న్యాయానికి దూరమయ్యారు. ప్రతిభ ఆధారంగా కాకుండా, పుట్టుక ఆధారంగా వివక్షకు గురిచేసే కులవ్యవస్థను నశింపజేయాలనే అంబేద్కర్ ఆలోచనకు సైతం ఈ ప్రతివివక్ష అనేది వ్యతిరేకం. ఒకానొక సందర్భంలో నాకు నా జాతి, నా దేశం రెండింటిలో ఏది ముఖ్యమనే సందర్భం వస్తే నాకు నా జాతి ముఖ్యం అని అంబేద్కర్ వ్యాఖ్యానించారు. దీనికి వివరణ ఇస్తున్న అంబేద్కర్ వాదన ప్రకారం సమానత్వమే సమాజ మనుగడకు ప్రాథమిక మూలసూత్రం ఏ జాతి మరో జాతిపై ఆధిపత్యం వహించజాలదని, ఎవరికి సాంఘిక న్యాయం దూరం కారాదని దీని కోసం నా పోరాటం నా జాతి నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
-పాలకులు రిజర్వేషన్ల అంశాన్ని తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఒక సాధనంగా వినియోగించకుండా అంబేద్కర్ చెప్పినట్లు కులం పునాదులపైన ఒక జాతిని కాని, ఒక నీతిని కాని నిర్మించలేం అనే కఠోర సత్యాన్ని అంతర్లీనం చేసుకుని, రిజర్వేషన్లను ప్రస్తుత సాంఘిక అసమానతలకు తాత్కాలిక పరిష్కారంగా వినియోగించి భవిష్యత్తులో రిజర్వేషన్లు అవసరంలేని సంపూర్ణ సామాజిక న్యాయం కలిగిన సుస్థిరమైన సమాజ స్థాపనకు రాజ్యం కృషిచేయాలి. అప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
-స్వాతంత్య్రానంతరం 30 కోట్లుగా ఉన్న భారత జనాభాలో 15 శాతం కూడా మించని స్థాయిలో అగ్రకులంవారు ఉండేవారు. అయినప్పటికీ వ్యవసాయ ప్రధాన భారత్‌లో సంపద సృష్టికి కారణమైన భూ యాజమాన్యం వీరి చేతిలోనే ఉండేది. పైగా శైశవ దశలో ఉన్న భారత ప్రజాస్వామ్యంలో సాధారణ ఎన్నికల్లో వీరు అధిక సంఖ్యలో శాసనసభలకు ఎన్నికయ్యేవారు. ఫలితంగా వీరికి ఆర్థికంగా, రాజకీయంగా ఎటువంటి వివక్ష ఎదురయ్యేది కాదు. కానీ 1960 దశకం మధ్యలో హరిత విప్లవం తర్వాత దాని ప్రయోజనాల్లో అధికభాగం ఈ భూస్వామ్య అగ్రకులాలకే దక్కాయి.
-ఈ ప్రభావాలు 1970-80 దశకంలో ఎంఎన్ శ్రీనివాస్ అనే సమాజ శాస్త్రవేత్త సిద్ధాంతీకరించిన ఆధిపత్య కులాల ఆవిర్భావానికి దారితీశాయి. ఈ ఆధిపత్యం కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలపడి అధికారం, సంపదను చేజిక్కించుకుని అగ్రవర్ణాల్లోనే బలమైన వర్గంగా తయారయ్యాయి. వీరిలో ఆంధ్ర, తెలంగాణల్లో రెడ్డి, కమ్మ, వెలమ, తమిళనాడులో కొంగువల్లలార్, కర్ణాటకలో లింగాయత్, ఒక్క లింగాయత్, మహారాష్ట్రంలో మరాఠాలు, గుజరాత్లో పాటీదార్లు, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానాలో జాట్లు ముఖ్యమైన కులాలు. కానీ సమస్య మొత్తం ఈ అగ్రకులాల్లో, ఆధిపత్య కులాల్లో ఉపకులాలు, ఆ ఉపకులాల్లో కూడా అంతర్గతంగా ఆర్థిక, సాంఘిక అసమానతలు నెలకొని ఉండటంతో సమస్య ప్రారంభమైంది. ఉదాహరణకు తెలుగు రాష్ర్టాలు, తమిళనాడు, కర్ణాటకల్లో విస్తరించి ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో 20కు పైగా ఉపకులాలు ఉన్నాయి.
-అగ్రవర్ణ పేదలంటే ఎవరు? వారిలో అశాంతికి కారణం ఏమిటి? అనే విషయాలు తీసుకోవాలంటే ఈ విషయాన్ని సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాల దృష్ట్యా చారిత్రాత్మక పరిశీలన చేస్తే అవగతమవుతుంది. ప్రాచీన భారతదేశంలో సమాజాలు వేదాలు పేర్కొన్న వర్ణ ధర్మం ఆధారంగా నడుచుకునేవి. అయా సమాజాల్లో పవిత్రమైన యజ్ఞోపవీత ధారణకు అర్హులైన ద్విజులు అనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల్లో పురుషులను మాత్రమే అగ్రవర్ణాలుగా పరిగణించేవారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?