Telangana movement | తెలంగాణకు నాంది ఫ్రీ జోన్
– రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలన్నింటినీ ఆరు జోన్లుగా విభజించి హైదరాబాద్ నగరాన్ని 6వ జోన్లో భాగంగా చూపించారు. ఈ ఉత్తర్వుల్లో ఎక్కడా హైదరాబాద్ ఫ్రీజోన్ అనే పదం కానీ, 7వ జోన్ అనే పదం కానీ లేదు. అయినప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం పరిపాలన విధానాల్లో, ఉత్తర ప్రత్యుత్తరాల్లో హైదరాబాద్ నగరాన్ని ఫ్రీజోన్‌గా, 7వ జోన్‌గా పరిగణించి యథేచ్చగా నియామకాలు చేశారు.
– హైదరాబాద్ ఫ్రీ జోన్ అంటూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ 2009, అక్టోబర్ 9న తీర్పునిచ్చింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించడానికి రాష్ర్టానికి సంబంధంలేని గుజరాత్‌కు చెందిన న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వులపై అవగాహన లేని ఆయన హైదరాబాద్ ఫ్రీజోన్‌పై సరైన వాదనలు వినిపించకపోవడంతో సుప్రీంకోర్టు ఆ తీర్పును వెలువరించింది.
– రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయించిన 14ఎఫ్‌తో హైదరాబాద్ సిటీ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ ఉండదు. ఈ ఉద్యోగాలకు స్థానిక, స్థానికేతర అభ్యర్థులందరూ అర్హులే. అయితే ప్రభుత్వరంగంలో ఉపాధి అవకాశాలు ఉపాధ్యాయ రంగం, పోలీసు డిపార్టుమెంట్లలో అధికంగా ఉంటాయి.
– తెలంగాణలోని మొత్తం పోలీసు డిపార్ట్మెంట్ ఉద్యోగాల్లో సగానికిపైగా హైదరాబాద్ సిటీ పరిధిలోనే ఉంటాయి. ఈ తీర్పుతో హైదరాబాద్ సిటీ పోలీస్‌లో స్థానికులకు రిజర్వేషన్ లేకుండా పోవడం ఉద్యోగులు, నిరుద్యోగులను ఆందోళనకు గురిచేసింది.
– దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14ఎఫ్‌ను తొలగించాలని, హైదరాబాద్‌ను 6వ జోన్లో భాగంగా చేయాలని, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాడ్ చేశాయి. దీనికోసం తెలంగాణ ఉద్యోగ సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తామని ప్రకటించాయి. ఉద్యమ తీవ్రతను గమనించిన ప్రభుత్వం అక్టోబర్ 19న ఫ్రీజోన్ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఫ్రీజోన్ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూపిటిషన్ వేస్తామని ప్రతిపాదించింది. టీఆర్ఎస్, లోక్‌సత్తా పార్టీలు మినహా అన్ని పార్టీలు ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించాయి.
– రివ్యూ పిటిషన్‌ను ప్రతివాది అంటే ప్రభుత్వం వేయాలి. ఎలాంటి వాదనలు ఉండవు. రాతపూర్వక అఫిడవిట్లు మాత్రమే సమర్పించాలి. సుప్రీంకోర్టుకు సరైన వాదనలను, సమాచారాన్ని అందించని ప్రభుత్వం రివ్యూ పిటిషన్ ద్వారా చెప్పే కొత్త విషయం ఏమీ ఉండదు. ఒకవేళ సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ కొట్టివేస్తే క్యూరేటివ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. కానీ అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే సుప్రీం దాన్ని అనుమతిస్తుంది. కాబట్టి హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి తొలగిస్తూ 6వ జోన్‌గా మార్చాలంటే రాజ్యాంగ సవరణ తప్ప మరో గత్యంతరం లేదు. కాబట్టి గతంలో 1972లో ముల్కీ రూల్ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ సవరణ ద్వారా ఏవిధంగా రద్దు చేశారో అలాగే హైదరాబాద్ ఫ్రీజోన్ తీర్పుని కూడా రద్దు చేయాలని ఉద్యోగ, ప్రజాసంఘాలు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరాయి.
ఉస్మానియా విద్యార్థుల ఆందోళన- 2009, నవంబర్ 21న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థి సంఘాలన్నీ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్, పిడమర్తి రవి, కైలాష్ నేత, బాలరాజు తదితర విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో 14ఎఫ్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు మొదలయ్యాయి.
కాకతీయ విద్యార్థి గర్జన
– కాకతీయ విశ్వవిద్యాలయంలో 2009, నవంబర్ 22న వేలాది మంది విద్యార్థులతో భారీ బహిరంగసభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేసీఆర్ హాజరై తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం, వారు పోషించాల్సిన కీలక భూమిక, చారిత్రక అవసరాన్ని వివరించారు. ఇక కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో జరగాలి అని పేర్కొన్నారు.
దీక్షకు సన్నాహాలు
– తెలంగాణ ప్రజలను చైతన్యపరచడానికి టీఆర్ఎస్ వివిధ రకాల ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించింది. నవంబర్ 23న సర్వమత ప్రార్థ్ధనలు చేసింది. నవంబర్ 24న గ్రామ గ్రామాన దండోరా వేయించింది. అదేరోజు రాత్రి అమరవీరుల స్థూపాల వద్ద కొవ్వొత్తులు, కాగడాలను ప్రదర్శించింది. నవంబర్ 26న తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థలను బహిష్కరించి ర్యాలీలు, మానవహారాలను నిర్వహించింది. నవంబర్ 27న తెలంగాణ దీక్ష కంకణధారణలో భాగంగా ప్రతిఒక్కరికి నుదుట తిలకం దిద్ది కంకణం కట్టింది. 28న ఎడ్లబండ్లు, సైకిళ్లు, మోటారు వాహనాలపై ర్యాలీలు నిర్వహించింది. కేసీఆర్ నాయకత్వంలోని బృందం జాతీయ, ప్రాంతీయ అధికార, ప్రతిపక్షాలను కలిసి ఆమరణ నిరాహార దీక్షకు సహకరించాలని కోరింది. సిద్దిపేటలోని రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న రంగథాంపల్లిలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద దీక్షావేదిక ఏర్పాటు చేసింది.
కేసీఆర్ అరెస్ట్- ఎగసిన ఉద్యమం
– దీక్ష ప్రారంభించడానికి మూడు రోజుల ముందే కేసీఆర్ కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పోలీసులు కేసీఆర్ దీక్షకు దిగకుండానే ముందస్తుగా కరీంనగర్లో ఒకరోజు ముందే అరెస్టు చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. అందుకు అనుగుణంగా పోలీసులు కరీంనగర్లో 144 సెక్షన్ విధించారు.
– 2009, నవంబర్ 28 అర్థరాత్రి కేసీఆర్‌ను అరెస్టు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు తెలంగాణ భవన్ చేరుకున్నారు. అయితే విషయం తెలిసిన టీఆర్ఎస్, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌కు రక్షణగా నిలిచారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేయలేకపోయారు.
– కేసీఆర్ నవంబర్ 29న దీక్షా వేదిక అయిన సిద్దిపేటకు ఉ. 7.50కి కరీంనగర్ నుంచి బయలుదేరారు. అల్గునూరు వద్ద ఆయనను అరెస్టు చేసిన పోలీసులు ఖమ్మం తరలించారు. కేసీఆర్ వాహనం వెంట డజన్ల కొద్ది పోలీసు వాహనాలు కాన్వాయ్‌గా వెళ్లాయి. అది ఆదివారం కావడంతో సెకండ్‌క్లాస్ స్పెషల్ మేజిస్ట్రేట్ చదలవాడ శ్రీరామ మూర్తి ఇంటి వద్ద కేసీఆర్‌ను, ఇతర నాయకులను హాజరుపరిచారు. దీంతో కేసీఆర్‌తో సహా మరో 10 మంది నాయకులకు 14 రోజుల రిమాండ్ విధించారు. వారందరిని దానవాయిగూడెం జిల్లా జైలుకు తరలించారు. కేసీఆర్ ఆమరణ దీక్షలో ఉండటంతో 24 గం.లు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.
– కేసీఆర్ అరెస్టుతో పార్టీలకతీతంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటయ్యారు. ఓయూ విద్యార్థులు సీఎం దిష్టి బొమ్మను కాల్చారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు వేలాదిగా విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. వీరిపై పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జీ చేశారు. కేయూతోపాటు తెలంగాణలో యూనివర్సిటీలు అన్నీ రణక్షేత్రాలుగా మారాయి.
– ఉద్యమకారులపై ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండకు నిరసనగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ చౌరస్తాలో నల్లగొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంత చారీ పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు.
సిద్దిపేట ఉద్యోగ గర్జన కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రకటన
– ఉద్యోగ, ప్రజాసంఘాలు, టీఆర్ఎస్ పార్టీ విజ్ఞాపనలను ప్రభుత్వం తేలికగా తీసుకుంది. దీంతో హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంపై ఉద్యోగ, ప్రజాసంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యంగా నిర్మించడానికి ఉద్యోగ సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఉద్యోగ సంఘాలకు టీఆర్ఎస్ బాసటగా నిలిచింది. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు 2009, అక్టోబర్ 21న సిద్దిపేట ఉద్యోగ గర్జనకు పిలిపునిచ్చాయి. దీనికి లక్షల సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. హైదరాబాద్‌ను ఫ్రీజోన్ కాకుండా 6వ జోన్లో అంతర్భాగంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని ఉద్యోగసంఘాలు డిమాండ్ చేశాయి. లేకపోతే ఉద్యోగులు పెన్ డౌన్, పోలీసులు గన్‌డౌన్ చేసి పరిపాలనను స్తంభింపచేస్తామని ప్రకటించారు. ఇదే బహిరంగ సభనుంచి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగిస్తూ తెలంగాణ వాలే జాగో, ఆంధ్ర వాలే బాగో అనే నినాదం ఇచ్చారు. ఈ మాసాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల ప్రయత్నాలు చేస్తా. అయినా సిద్దించకపోతే సిద్దిపేట అమరవీరుల స్థూపం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆత్మార్పణ చేసైనా రాష్ర్టాన్ని సాధిస్తా. ఆమరణ నిరాహార దీక్ష గాంధేయ, అహింసా యుత మార్గంలో జరుగుతుంది, ఇక తెలంగాణ జైత్రయాత్రలో పాల్గొంటారో, కేసీఆర్ శవయాత్రలో పాల్గొంటారో తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే అని అన్నారు.
– ప్రజా సంఘాల హెచ్చరికలు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకున్నాయి. తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉందని రుజువు చేయడానికి ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక డిమాండ్‌తో ఉద్యమ కార్యాచరణను రూపొందించిన టీఆర్ఎస్కు మొదట్లో ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో ప్రజాసంఘాలు కేసీఆర్ ఆమరణ దీక్ష, టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణకు అండగా నిలిచాయి. ఆమరణ దీక్ష చారిత్రక అవసరాన్ని గురించి ప్రజాసంఘాలు తెలంగాణ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీల, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచాయి. ఇలా పక్కా ప్రణాళికా బద్దంగా తెలంగాణ ఉద్యమాన్ని సంఘటితంగా కొనసాగించడంతో కేసీఆర్ దీక్ష నాటికి బలమైన పునాదులు పడ్డాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు