Economic growth | ఆర్థిక వృద్ధి-అభివృద్ధి భావనలు
వృద్ధి భావన
-ఒక దేశంలో జాతీయోత్పత్తి వల్ల సంభవించిన పెరుగుదలను ఆర్థిక వృద్ధి సూచిస్తుంది.
-ఆర్థిక వృద్ధి అనేది ఒక దేశంలోని స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) పెరుగుదలను అంచనా వేస్తుంది.
-మైఖేల్ పీ తోడారో ప్రకారం ఆర్థిక వృద్ధి అనేది ఒక స్థిరమైన ప్రక్రియ. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదన సామర్థ్యం నియత కాలంలో పెరుగుతుంది. ఫలితంగా జాతీయ ఉత్పత్తిలో, ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది.
-ఆర్థిక వృద్ధి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ అని సైమన్ కుజ్నెట్స్ పేర్కొన్నారు.
-జనాభా పెరుగుదల రేటుకంటే వాస్తవిక జాతీయాదాయం పెరుగుదల ఎక్కువ ఉంటేనే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది.
-ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సామర్థ్యంలో ఎక్కువ స్థాయి పెరుగుదల నమోదయినప్పుడు ఆర్థిక వృద్ధి ఉంటుంది.
-ఒక దేశ ప్రగతి ఆర్థిక వృద్ధికి సంబంధించిన నాలుగు రకాల కారకాల మీద ఆధారపడి ఉంటుంది. అవి..
1. ఆర్థిక వ్యవస్థ పొదుపు రేటు
2. మూలధన ఉత్పత్తి, నిష్పత్తి
3. శ్రామిక శక్తి వృద్ధి రేటు
4. సాంకేతిక విజ్ఞానంలో మార్పులు, నవకల్పనలు
-ఆర్థిక వృద్ధి దేశ వస్తుసేవల ఉత్పత్తిలో పెరుగుదలను, తలసరి ఉత్పత్తిలో పెరుగుదలను తెలుపుతుంది.
-వస్తుసేవల ఉత్పత్తిలో వృద్ధిరేటుతో సమానంగా జనాభా వృద్ధిరేటు పెరిగితే వాస్తవ తలసరి ఆదాయంలో మార్పు ఉండదు.
ఆర్థికాభివృద్ధిలో నిర్మాణాత్మక మార్పులు
-ఆర్థికాభివృద్ధి దేశంలోని వివిధ రంగాల్లో వచ్చే నిర్మాణాత్మక మార్పులను సూచిస్తుంది.
-వృత్తిపరమైన నిర్మాణంలో మార్పులు వస్తాయి.
-ఆర్థికాభివృద్ధి వల్ల ప్రాథమిక రంగంలో (వ్యవసాయం) శ్రామికశక్తి వాటా తగ్గి ద్వితీయరంగం (పారిశ్రామిక రం గం), సేవారంగాల్లో కార్మిక శక్తివాటా పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధి వల్ల విదేశీ వాణిజ్యంలో మార్పులు వస్తాయి. ప్రాథమిక రంగ వస్తువుల ఎగుమతులు తగ్గి, మూలధన వస్తువుల దిగుమతుల వాటాలో పెరుగుదల ఏర్పడుతుంది.
ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య బేధాలు
-కిండల్బర్గర్ ప్రకారం ఆర్థిక వృద్ధి అధిక ఉత్పత్తిని సూచించగా ఆర్థికాభివృద్ధి అనేది ఉత్పత్తితోపాటు అందుకు దోహదపడే సంస్థాపూర్వక మార్పులను సూచిస్తుంది.
-ఆర్థిక వృద్ధి వస్తుసేవల పెరుగుదలను అంటే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలను సూచిస్తుంది. ఆర్థికాభివృద్ధి దేశంలో ఆర్థిక వృద్ధితోపాటుగా వ్యవస్థాపూర్వక, సంస్థాగత, సాంఘిక, ఆర్థిక మార్పులను సూచిస్తుంది.
-ఆర్థిక వృద్ధి ఏకోన్ముఖమైనది. ఆర్థికాభివృద్ధి బహుపార్శ ప్రక్రియ.
-ఆర్థిక వృద్ధి ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మకమైన మార్పులను సూచిస్తుంది. ఆర్థికాభివృద్ధి పరిమాణాత్మక మార్పులతోపాటు గుణాత్మక మార్పులను సూచిస్తుంది.
-ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వ జోక్యం ఉన్నా లేకున్నా సాధించవచ్చు. ప్రభుత్వ జోక్యం లేకుంటే ఆర్థికాభివృద్ధి సాధించలేరు. ఆర్థికాభివృద్ధి ప్రారంభంలో ఉత్పత్తి తక్కువ ఉం టుంది. దానిని పెంచటానికి ప్రభుత్వ జోక్యం అవసరం.
-ఆర్థిక వృద్ధి వేగంగా ఉన్నప్పుడు అధిక సాంకేతిక మార్పు లు ఉంటాయి. అధికస్థాయిలో ఆర్థికాభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణంలో మార్పులు తీసుకురావడం.
-ఆర్థిక వృద్ధిపై, పురోగతిపై దృష్టి సారిస్తే దానంతట అదే పేదరికాన్ని నిర్మూలిస్తుంది. పేదరికంపై దృష్టిసారిస్తే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది.
-ఆర్థిక వృద్ధి పరిధి సంకుచితమైనది. తలసరి ఆదాయ స్థాయిలోని మార్పులతో మాత్రమే ఆర్థిక వృద్ధికి సంబం ధం ఉంది. కానీ ఆర్థికాభివృద్ధి పరిధి విస్తృతమైనది. తలసరి ఆదాయ పెరుగుదలనే కాకుండా ఆర్థిక వ్యవస్థలో ధనాత్మక మార్పులను, ప్రజల జీవన ప్రమాణాలలో పెరుగుదలను సూచిస్తుంది.
-ఆర్థిక వృద్ధిని స్వల్పకాలానికి అంటే సాధారణ సంవత్సరం ఆధారంగా తెలుపుతారు. ఆర్థికాభివృద్ధి దీర్ఘకాలానికి సంబంధించినది. ఇది 20 నుంచి 25 ఏండ్లలో సంస్థాగత మార్పులను తెలుపుతుంది.
-ఆర్థిక వృద్ధి ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది. ఆర్థికాభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినది.
-సామాజిక మార్పు అనేది ఆర్థిక వృద్ధిలో సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. ఆర్థికాభివృద్ధిలో మాత్రం తప్పనిసరిగా సా ధ్యం అవుతుంది. తగిన ఉద్యోగ అవకాశాలు, ఆహార ధా న్యాల లభ్యత, మంచి ఆరోగ్యం, విద్య, ప్రజల జీవన నైపుణ్యాలలో మార్పులు ఆర్థికాభివృద్ధితో సాధ్యమవుతాయి.
-ఒక దేశ జాతీయాదాయంలో, తలసరి ఆదాయంలో వాస్తవిక తలసరి ఆదాయంలో, ఉత్పాదకత సామర్థ్యంలో పరిమాణాత్మక మార్పులను తెలిపేది ఆర్థిక వృద్ధి అని నిర్వచించవచ్చు.
-దీర్ఘకాలంలో ఒకదేశంలో ఆదాయ వ్యత్యాసాలు లేకుండా తలసరి ఆదాయాలు క్రమంగా, ఒడిదుడుకులు లేకుండా పెరుగుతూ, ప్రజల జీవన ప్రమాణస్థాయి, అక్షరాస్యత, ఉద్యోగిత పెరుగుతూ వస్తువుల సముదాయంలో ఉత్పత్తి పద్దతులలో సాంకేతిక, వ్యవస్థాపూర్వక మార్పులు జరిగే ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని నిర్వచించవచ్చు.
ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు
-ఆర్థికాభివృద్ధి సాధించడానికి భారతదేశం నిర్దేశించుకున్న లక్ష్యాలు
1. ఆర్థిక వృద్ధిరేటుతో ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడం
2. ఆర్థిక స్వయంపోషకత్వం సాధించడం
3. సామాజిక న్యాయం 4. ఆధునికీకరణ
5. ఆర్థిక స్థిరత్వం 6. సమ్మిళిత వృద్ధి
ఆర్థిక వృద్ధిరేటు
-ఆర్థిక వృద్ధిరేటు సాధించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించాలని భారతదేశం, చైనా సహా అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
-దేశంలో మొదటి మూడు దశాబ్దాల ప్రణాళికా కాలంలో అభివృద్ధి రేటు మన ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడలేదు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు సగటున 1980 వరకు కేవలం 3.73శాతం మాత్రమే ఉంది. అదే కాలంలో జనాభా వృద్ధిరేటు 2.5 శాతం ఉంది. ఫలితంగా తలసరి ఆదాయంలో వృద్ధిరేటు 1శాతం మాత్రమే ఉండేది.
-ఆరో పంచవర్ష ప్రణాళికా కాలం నుంచి ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మార్పులు సాధ్యమయ్యాయి. 6, 7, 8 ప్రణాళికల్లో వృద్ధిరేటు వరుసగా 5.4, 5.8, 6.8 శాతంగా నమోదయ్యింది.
ఆర్థిక స్వావలంబన
-భారతదేశం విషయానికి వస్తే విదేశీ సహాయంపై సాధ్యమైనంత వరకు తక్కువ ఆధారపడాలి.
-ప్రణాళికల ఆరంభంలో స్వదేశీ అవసరాలు ముఖ్యంగా ఆహార ధాన్యాల కోసం అమెరికాపై ఆధారపడ్డారు. అలాగే సత్వర పారిశ్రామిక అభివృద్ధి కోసం విదేశాల నుంచి మూలధన వస్తువులైన బోర్ యంత్రాలు, యంత్రపరికరాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకున్నాం.
-మౌళిక వస్తువులైన రోడ్లు, రైల్వేలు, ఇంధనం అభివృద్ధికోసం పెట్టుబడులు పెంచటానికి విదేశీ సహాయంపై ఆధారపడ్డాం.
-మూడో ప్రణాళిక వరకు మన పోషకత్వం సాధించటానికి విదేశీ సహాయంపై అధికంగా ఆధారపడ్డాం.
-4వ ప్రణాళిక నుంచి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం పోషకత్వం సాధ్యమైంది. 5వ ప్రణాళిక ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని పొందడానికి ఎగుమతుల ప్రోత్సాహం, దిగుమతుల ప్రత్నామ్నాయ విధానాన్ని అవలంభించాం.
సామాజిక న్యాయం
-దేశంలోని ఆదాయ సంపదలు వివిధ వర్గాల మధ్య సమానంగా పంపిణీ జరగాలన్నదే సామాజిక న్యాయం.
-సమాజంలో పేద, అణగారిన వర్గాలవారికి ఆర్థిక, సామాజిక న్యాయం అందించడం అనేది ఆర్థికాభివృద్ధి లక్ష్యం.
-పంచవర్ష ప్రణాళికల కాలంలో నాలుగు సామాజిక న్యాయ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఏ) దేశ రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామిక సూత్రాలు అమలుచేయడం
బి) సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించటం ద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించడం.
సి) ప్రారంభంలో ఆర్థిక శక్తి కేంద్రీకరించి ఆ తర్వాత వికేంద్రీకరణ దిశలో మార్పు చేయడం.
డి) దేశంలో వెనుకబడిన, అణగారిన వర్గాల వారి పరిస్థితులను మెరుగుపర్చడం.
-ఇందులో భాగంగానే భూసంస్కరణలు ప్రవేశపెట్టి అమలుచేశారు. ప్రణాళికలను అమలుచేసి ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల ఆర్థిక పరిస్థితులలో మార్పులు తెచ్చారు.
-ఆదాయ అసమానతల తగ్గింపుకోసం వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేస్తున్నారు.
ఆధునికీకరణ
-స్వాతంత్రానంతరం ప్రణాళికల రూపకర్తలు, విధానకర్తలు దేశ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించడం కోసం వ్యవస్థాపరమైన, సంస్థాపరమైన విధానాన్ని అమలుచేశారు.
-ఆధునీకరణ లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలలో మార్పు, ఉత్పత్తి పద్దతులలో మార్పు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్పత్తిని పెంచడం.
-ఆధునీకరణ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అవసరమయ్యే బ్యాంకింగ్, బ్యాంకింగేతర సేవల విస్తరణకు తోడ్పతుంది.
ఆర్థిక స్థిరత్వం
-దేశంలో ద్రవ్యోల్బణ రహిత సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది.
-రెండో ప్రణాళిక తర్వాత దేశంలో ధరల పెరుగుదల చాలాకాలం కొనసాగింది.
-సామాజిక న్యాయంతో కూడిన ద్రవ్యోల్బణ రహిత స్వయం పోషకత్వ వృద్ధిని సాధించడం ఆర్థికాభివృద్ధి లక్ష్యం అని చెప్పవచ్చు.
సమ్మిళిత వృద్ధి
-ఆర్థికాభివృద్ధి తీరును, గమనాన్ని సమ్మిళిత వృద్ధి తెలుపుతుంది.
-ఈ సమ్మిళిత వృద్ధి భావనను ప్రపంచ బ్యాంకు వెలుగులోకి తెచ్చింది. దీని ప్రకారం వృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాలి.
ఆర్థికాభివృద్ధి భావన
-ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థిక వృద్ధికంటే విస్తృతమైనది.
-ఒకదేశంలో వచ్చే సాంఘిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన, ప్రగతిశీల మార్పులను ఆర్థికాభివృద్ధి సూచిస్తుంది.
-సాధారణంగా తలసరి ఆదాయం ఎక్కువ ఉండటాన్ని ఆర్థికాభివృద్ధికి సూచికగా భావిస్తారు.
-ఈ భావన వల్ల దేశంలో దీర్ఘకాలంలో ఆదాయ వ్యత్యాసాలు లేకుండా తలసరి ఆదాయాలు క్రమంగా పెరుగు తూ ప్రజల జీవన ప్రమాణస్థాయి, అక్షరాస్యత, ఉద్యోగిత పెరుగుతూ వస్తు సముదాయంలో, ఉత్పత్తి పద్ధతుల్లో సాంకేతిక, వ్యవస్థాపూర్వక మార్పులు జరిగే ప్రక్రియ ఆర్థికాభివృద్ధి.
-దీనివల్ల ఉపాధి అవకాశాలు ఎక్కువగా విద్య, ఆరోగ్యరంగం, పర్యావరణ రంగాల్లో కల్పించబడుతాయి. ఫలితంగా ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుంది. అందువల్ల ఆర్థిక వృద్ధికంటే ఆర్థికాభివృద్ధి భావన విస్తృతమైనది.
-యునైటెడ్ నేషన్స్ నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం అభివృద్థి అనేది కేవలం మానవుని భౌతిక అవసరాలను కాకుండా సామాజిక జీవనంలో పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటుంది.
-అభివృద్థి కేవలం ఆర్థిక వృద్ధిని మాత్రమే కాకుండా సాంఘిక, సాంస్కృతిక, వ్యస్థాపరమైన మార్పులను సూచిస్తుంది.
-పీ తోడారో ప్రకారం ఆర్థికాభివృద్ధి బహుముఖ అభివృద్ధి ప్రక్రియ. త్వరతకాలిక ఆదాయం పెరుగుదల, అసమానతల తగ్గుదల, సాపేక్ష పేదరిక నిర్మూలన ప్రక్రియలు ఇందులో ఉంటాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. ఆర్థికాభివృద్ధి కిందివాటిలో దేనిని తెలుపుతుంది?
1.వ్యక్తిలో వచ్చే శారీరక మార్పు
2. వ్యక్తిలో వచ్చే శారీరక పెరుగుదలతోపాటు మానసిక పెరుగుదల
3. ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల
4. జాతీయాదాయంలో పెరుగుదల
2. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ లేని దేశం ఏది?
1. భారత్ 2. అమెరికా
3. పాకిస్థాన్ 4. బంగ్లాదేశ్
3. ప్రభుత్వ జోక్యంతోనే సాధ్యం అయ్యేది ఏది?
1. ఆర్థిక వృద్ధి 2. ఆర్థికాభివృద్ధి
3. తలసరి ఆదాయం 4. జాతీయాదాయం
4. ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖ అభివృద్ధి ప్రక్రియ అన్నది ఎవరు?
1. పీ తోడారో 2. మార్షల్ 3. కీన్స్ 4. ఆడం స్మిత్
5. ఆర్థిక వృద్ధి, అభివృద్ధిని దేనితో పోల్చవచ్చు?
1. సమాజంలో పెరుగుదల 2. ఒక వ్యక్తి పెరుగుదల
3. దేశంలో వ్యక్తుల పెరుగుదల 4. ఏదీకాదు
జవాబులు: 1-2, 2-2, 3-2, 4-1, 5-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు