Rashmi Vadlakonda | సక్సెస్ లోడింగ్!
తయారీ రంగంలో ఇప్పటికీ పురుషులదే పెత్తనం. అందులోనూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో
మగవారిదే ఆధిపత్యం. ఈ రెండు పరిమితులనూ అధిగమించి.. అమెరికా మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాన్ని అందుకున్నారు రష్మి వడ్లకొండ.
Rashmi Vadlakonda | మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహించే రోజు ఎంతో దూరం లేదంటారు రష్మి వడ్లకొండ. ఈ యువతి వృత్తిరీత్యా మెకానికల్ ఇంజినీర్. ఉత్పాదక రంగంలో తమదైన ప్రతిభ కనబరుస్తూ.. నూతన ఆవిష్కరణలకు ప్రాణంపోస్తున్న మహిళలకు అమెరికాలోని ద మాన్యుఫ్యాక్చరింగ్ ఇన్స్టిట్యూట్ ఏటా ‘ఉమెన్ మేక్’ అవార్డులను అందజేస్తుంది. తాజాగా ఐర్లాండ్ వేదికగా జరిగిన సదస్సులో ఈ ఏడాదికిగాను ఆ పురస్కారం సాధించి ఎమర్జింగ్ లీడర్‌గా నిలిచారు రష్మి. ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కేంద్రంగా పనిచేస్తున్న ట్రేన్ టెక్నాలజీస్‌లో రష్మి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్రీడీ ప్రింటింగ్‌లో ఆ సంస్థకు తను సాంకేతిక సలహాదారు. దాంతోపాటే, క్యాంపస్ నుంచి అప్పుడే బయటికొచ్చిన యువ ఇంజినీర్లకూ దిశానిర్దేశం చేస్తున్నారు.
ఉమెన్ ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ (డబ్ల్యూఐఎమ్) అసోసియేషన్ సౌత్ కరోలినా చాప్టర్‌కు వైస్ చైర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇంటర్నల్ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా.. ఈ రంగంలోకి వచ్చే మహిళలను ప్రోత్సహిస్తున్నారు. పట్టుదలతో పనిచేస్తే పురుషులతో పోటీపడటం అసాధ్యం కాదని భరోసా ఇస్తారామె. రష్మి నాయకత్వ ప్రతిభను ట్రేన్ టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మైరీడ్ మాగ్ననెర్ కొనియాడారు కూడా.
తనవైన అభిరుచులు
‘రష్మికి యోగా అంటే ప్రాణం. ‘ఆరోగ్యకరమైన శరీరం, ఆరోగ్యకరమైన మనసు యోగాతోనే సాధ్యం’ అంటారామె. తను ఫ్యాషన్ ప్రేమికురాలు. ట్రెండ్స్‌ను ఇష్టపడతారు. కొత్త ధోరణులను సాధి
కారికంగా విశ్లేషించగలరు కూడా. అప్పుడప్పుడూ ర్యాంప్ మీద మెరుపులు మెరిపిస్తారు. ‘రేపటి తరం కోసం.. అందులోనూ మహిళల కోసం తయారీ రంగానికి సువిశాలమైన మార్గాన్ని సిద్ధం చేద్దాం’ అంటూ పిలుపునిస్తారు రష్మి.
పక్కా హైదరాబాదీ
రష్మి నేపథ్యమంతా హైదరాబాద్ చుట్టూనే తిరుగుతుంది. ఇక్కడే పుట్టిపెరిగారామె. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. కొంతకాలం క్యాంపస్‌లోనే రీసెర్చ్ అసిస్టెంట్‌గా చేశారు. తర్వాత సైయెంట్ టెక్నాలజీస్‌లో ఏడాదిపాటు ఉద్యోగం చేశారు. అనంతరం అమెరికా వెళ్లి నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదివారు. ‘ఓ కొత్త వస్తువుకు రూపం ఇవ్వడం అనేది.. ఓ జీవికి ప్రాణం పోసినంత గొప్ప పని. బాల్యం నుంచీ నన్ను కొత్తకొత్త ఆవిష్కరణలు ఆకట్టుకునేవి. భిన్నంగా ఆలోచించేలా ప్రేరేపించేవి. వైద్యం, సాహిత్యం, రాజకీయం.. ఇలా అన్ని రంగాల్లో మహిళలు రోల్ మోడల్‌గా ఉన్నారే? ఇక్కడ మాత్రం ఎందుకులేరనే ప్రశ్న వెంటాడేది. అదే నాతో మెకానికల్ ఇంజినీరింగ్ వైపు అడుగులు వేయించింది’ అంటారు రష్మి. కూతురి తపనను కన్నవారూ అర్థం చేసుకున్నారు. తమవంతుగా ప్రోత్సహించారు. సివిల్, మెకానికల్, ట్రిపుల్-ఈ వంటి కోర్సులలో యువతులకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. తను చదువుకునే రోజుల్లోనూ అంతే. క్లాస్‌రూమ్‌లో అమ్మాయిల సంఖ్య పదిహేను లోపే. మాస్టర్స్ చదువుతున్న రోజుల్లోనూ అదే పరిస్థితి. పదిమంది విద్యార్థులు ఉంటే.. తానొక్కతే అమ్మాయి. అసలే క్లిష్టమైన సబ్జెక్ట్, దానికితోడు ఒంటరిననే భావన. అన్నీ వదిలేసి ఇంటికి రావాలనే ఆలోచన వచ్చేదట. అదీ తాత్కాలికమే. అంతలోనే గుండెనిండా ఆత్మవిశ్వాసం నింపుకొనేవారామె. మెటల్ ఎడెటివ్ మాన్యు ఫ్యాక్చరింగ్‌లో లోతైన అధ్యయనం చేశారు. మాస్టర్స్ తర్వాత ట్రేన్ టెక్నాలజీస్‌లో ఉద్యోగం రష్మి జీవితంలో ఓ మలుపు. ఓ మామూలు ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభించి.. కంపెనీకి అవసరమైన సాంకేతికతను అందించే స్థాయికి చేరుకున్నారు. వివక్షకు తావులేకుండా మహిళలకు అవకాశాలు కల్పిస్తే కంపెనీలైనా, కుటుంబాలైనా వృద్ధి చెందుతాయి. అప్పుడే, మహిళల సత్తా వెలుగులోకి వస్తుంది. అమెరికాలో, భారత్‌లో.. ఈ విషయంలో జరగాల్సింది చాలా ఉంది’ అంటారు రష్మి ఆశావాదం ప్రతిధ్వనించేలా. అవును. తను చెప్పినట్టు.. ముందుంది మంచికాలం.
.. కడార్ల కిరణ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?