తపన ఉంటే.. విజయం తథ్యం!

– రజనీకాంత్‌రెడ్డి (5వ ర్యాంకర్, 2017 గ్రూప్-1)
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కసి, పట్టుదల ఉండాలి. టైంటేబుల్ ప్రకారం, సబ్జెక్టులవారీగా నిరంతరం శ్రద్ధగా చదవాలి. ఉద్యోగం నాకు రాదులే అని కాకుండా నాకే వస్తది అని మనపై మనపై మనకు నమ్మకం ఉండి కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేరుతుందని నిరూపించారు రజనీకాంత్ రెడ్డి. 2017లో తెలుగులో గ్రూప్-1 పరీక్ష రాసి 5వ ర్యాంక్ సాధించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు ఆన్లైన్లో ఉచిత శిక్షణ ఇస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయన సక్సెస్ ఆయన మాటల్లో తెలుసుకుందాం..
# మాది మెదక్ జిల్లా రేగోడ్ మండలం దోసపల్లి. నాన్న రామకృష్ణారెడ్డి సన్నకారు రైతు. అమ్మ సరళమ్మ గృహిణి. మేం మొత్తం ముగ్గురు అన్నదమ్ములం. అందరిలో నేనే చిన్నవాడిని. మా ఊరిలోని ప్రాథమిక పాఠశాలలోనే 5వ తరగతి వరకు, 6 నుంచి 10వ తరగతి వరకు రేగోడ్ మండలం గజవాడ ఉన్నత పాఠశాలలో చదివాను. ఇంటర్మీడియట్ జహీరాబాద్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తిచేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలో జర్నలిజం చేశాను.
# తొలి ప్రయత్నంలోనే..
2011లో గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించాను. సమయం తక్కువ.. అయినా గ్రూప్స్ కొట్టాలనే కసితో చదివాను. 2011లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాశాను. 2012లో మొయిన్స్ రాసి, ఇంటర్వ్యూ పూర్తిచేశాను. కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనివార్య కారణాలతో 2016లో మళ్లీ మెయిన్స్ నిర్వహించారు. అప్పటికే గ్రూప్-2 ఉద్యోగం చేస్తున్నాను. అందుకే.. ఒక్కసారి రివిజన్ చేసుకొని వెళ్లి పరీక్ష రాశా. 5వ ర్యాంకు వచ్చింది.
# తెలుగులోనే..
ఇంగ్లిష్‌లో పరీక్ష రాస్తే ఎక్కువ మార్కులొస్తాయని, తెలుగులో రాస్తే తక్కువ వస్తాయనే అపోహ అందరిలాగే నాలోనూ ఈ ఉండేది. కానీ త్వరగానే అందులో నుంచి బయటికి వచ్చి తెలుగులోనే రాయాలని నిర్ణయించుకొన్నాను. తెలుగులో పరీక్ష వద్దని కొంతమంది వారించారు. అయినా నాపై నాకున్న నమ్మకంతో తెలుగులోనే రాశాను. ఇంగ్లిష్ బాగా వచ్చిన నా స్నేహితుల్లో ఎవరికీ ఉద్యోగం రాలేదు. తెలుగులో రాసిన నాకు వచ్చింది.
# పుస్తకాలు బాగా చదివాను
తపన, పట్టుదల, ప్రణాళిక, కసి, క్రమశిక్షణ.. ఇవన్నీ ఉంటే గ్రూప్స్‌లో విజయం తథ్యం. అదే తపన గ్రూప్స్ ర్యాంకర్‌ని చేసింది. సివిల్స్ లేదా గ్రూప్-1 స్థాయి పోస్టు కొట్టాలని ముందే నిర్ణయించుకొన్నాను. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుకొనేవాడిని. తెలంగాణ చరిత్ర, ప్రభుత్వ పాలసీలు, అమలు.. వంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ ఉండేది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాల గురించి మిత్రులతో సరదాగా చర్చిస్తూ ఉండేవాడిని. కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదవడం నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. ఇంటర్వ్యూలో ఇది నాకెంతగానో ఉపయోగపడింది.
# నిరుత్సాహపరిచినా.. వెనుకడుగు వేయలేదు
గ్రూప్-1 నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అందులో నాకొక జాబ్ ఉన్నదని మనసులో ముందే రాసి పెట్టేసుకొన్నాను. ఆ ఉద్యోగం వచ్చిందనే ఊహలోనే బతికేవాడిని. నన్ను నేను పూర్తిగా నమ్ముకొనే వాడిని. ఎవరెన్ని చెప్పినా లైట్‌గా తీసుకొనేవాడిని. అపోహల జోలికి అసలే వెళ్లేవాడిని కాదు. పుట్టిన ఊరి పేరు, కన్న తల్లిదండ్రుల ఆశలు నిజం చేయాలని ప్రతిక్షణం పరితపించేవాడిని. మా ఇంట్లో ఒక్కరంటే ఒక్కరూ.. కనీసం చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి కూడా లేరు. అందుకే ఆ లోటును నేను పూర్తిచేయాలని బలంగా అనుకొనేవాడిని. ‘చాలామంది ఏండ్ల తరబడి చదువుతున్నారు.. నువ్వు ఇప్పటికిప్పుడే అనుకొని చదివితే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? అందులోనూ గ్రూప్-1 వంటి పెద్ద ఉద్యోగం, అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావ్’ అంటూ ఎంతోమంది నిరుత్సాహపరిచారు. అయినా.. వెనకడుగు వేయలేదు. వారితో అనవసరపు వాదనలు పెట్టుకోలేదు. నేను సాధించే ఉద్యోగమే వాళ్లకు సమాధానం కావాలని బలంగా విశ్వసించాను.
# మెంటార్‌గా 60 మందికి ఉచిత కోచింగ్
సివిల్స్ తర్వాత అంత క్రేజ్ ఉన్నది గ్రూప్-1 ఉద్యోగానికే. జిల్లా స్థాయి అధికారిగా నియామకమయ్యే గొప్ప అవకాశం ఉన్న ఉద్యోగం. అందుకే.. గ్రూప్-1 కొట్టాలని లక్షలమంది ఆశిస్తూ ఉంటారు. కానీ పరిస్థితులు వాళ్లకు అనుకూలించవు. అన్నీ ఉన్నా సరైన మెంటార్ లేకపోవడంతో ఎంతో మంది గ్రూప్స్ కొట్టలేకపోతున్నారు. నేను ప్రిపేరయ్యేటప్పుడు నాకో మంచి మెంటార్ ఉంటే బాగుంటుందని అనుకొనేవాడిని. ఆ అవకాశం లేక అనునిత్యం అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ ముత్యాలరావు సార్‌ని ఫాలో అవుతూ ఉండేవాడిని. ఆయన జీవితం నిజంగా ఎందరికో ఆదర్శం. ప్రస్తుతం నేను గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా ఉన్నానంటే దానికి ఆయనా ఓ కారణమే. అందుకే.. నేను ఓ మెంటార్‌గా ఉండాలనుకొన్నా. అదే సమయంలో నా స్నేహితురాలు ప్రశాంతి ఇటువంటి ఓ ప్రతిపాదనతో ముందుకొచ్చారు. వెంటనే నా ఆలోచన చెప్పేశాను. ఇద్దరం కలిసి ఆన్లైన్లో 60 మందికి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నాం. నిత్యం వాళ్లకు టచ్‌లో ఉంటాను. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం, సెలవు దినాల్లో వాళ్ల అనుమానాలను నివృత్తి చేస్తూ ఉంటాను. వాళ్లతో ఎప్పటికప్పుడు స్ఫూర్తి నింపుతాను. వాళ్లకు ఆన్లైన్లోనే పరీక్షలు నిర్వహిస్తాం.
# మీకు మీరే ఓ స్ఫూర్తి
గ్రూప్-1కు ప్రిపేరయ్యేవాళ్లు మీకు మీరే స్ఫూర్తిగా తీసుకోవాలి. కలలు కనండి.. అవి నిజం చేసుకోండి. టార్గెట్ పెట్టుకోండి.. అదే జీవితాశయమని అనుకోండి. ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అవకాశం ఉన్నన్ని సార్లు రివిజన్ చేసుకోండి. పది, ఇంటర్, డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చాయన్నది ముఖ్యం కాదు. చదువులో ఆఖరి వరుసలో ఉన్నా ఎంతోమంది సివిల్స్, గ్రూప్స్‌లో సక్సెస్ అయ్యారు. అందుకే అటువంటి అపోహలను వీడండి. మీ బలమేంటి? బలహీనత ఏంటి? అనేది బేరీజు వేసుకోండి. అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకోండి. అవకాశం ఉంటే కంబైన్డ్ స్టడీస్‌కు ఎక్కువ సమయం ఇవ్వండి. సాధించాలన్న తపన.. అందుకు తగిన కష్టం.. సరైన ప్రణాళిక ఉంటే.. గ్రూప్-1 నోటిఫికేషన్లో మీకొక ఉద్యోగం ఖాయం.
– సూర్యకిరణ్
RELATED ARTICLES
Latest Updates
SBI Recruitment | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ పోస్టులు
ITBP Recruitment | ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
WCDSC Kamareddy Recruitment | కామారెడ్డి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
WCDSC Jayashankar Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఉద్యోగాలు
Current Affairs | ప్రపంచంలో ‘హంగర్ హాట్‌స్పాట్స్’ ఎన్ని ఉన్నాయి?
South Central Railway Recruitment | సౌత్ సెంట్రల్ రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు
NIT Faculty Recruitment | మేఘాలయా నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
TSPSC Group-1 Prelims Practice Test | ‘తెలంగాణ భాషా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకొంటారు?
TSPSC Group-1 Prelims Practice Test | ఏడుపు పుట్టించే వాయువు ఏది?
Respiratory System – Gurukula JL special | పదార్థాల విచ్ఛిన్నం.. శక్తి ఉత్పన్నం.. ఉష్ణమోచకం