స్పష్టతతో ముందుకెళ్తే విజయం తథ్యం.. సీఏపీఎఫ్లో ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించిన సయింపు కిరణ్ మాటల్లో
రాష్ట్రంలో భారీస్థాయిలో నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో పోటీపరీక్షార్థుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు. ఇటువంటి సమయంలో ఆయా పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారి మాటలు, సలహాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. అనుభవంతో వారిచ్చే సూచనలు ఎంతో విలువైనవి. పోటీపరీక్షలు రాయడం ఒక ఎత్తు అయితే, వాటిలో లక్ష్యాన్ని సాధించడం మరో ఎత్తు. ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అంతిమ లక్ష్యం వైపు పోవడం దీర్ఘకాలిక ప్రక్రియ. సరిగ్గా అటువంటి మార్గంలో పయనిస్తూ సివిల్స్ సాధించడమే లక్ష్యంగా చదువుతూ మధ్యలో జాతీయస్థాయిలో నిర్వహించే సీఏపీఎఫ్లో ఆల్ ఇండియా 15వ ర్యాంక్ సాధించిన సయింపు కిరణ్ తన విజయం గురించి నిపుణతో చెప్పిన విషయాలు ఆయన మాటల్లో..
కుటుంబ నేపథ్యం
మాది వ్యవసాయ కుటుంబం. వరంగల్ జిల్లా గీసుకొండ దగ్గరలోని అనంతారం గ్రామం. నాన్న ప్రభాకర్ రావు, అమ్మ జయలక్ష్మి వ్యవసాయం చేస్తారు. వరంగల్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తిచేశాను. తర్వాత ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదివాను. అనంతరం జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1598 ర్యాంక్ సాధించి ఐఐటీ ఢిల్లీలో చేరాను. అక్కడ బీటెక్ పూర్తిచేసిన తర్వాత ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్ ప్రారంభించాను. మా కుటుంబంలో నేనే మొదటి గ్రాడ్యుయేట్‌ను. అమ్మానాన్నలు కష్టపడి నన్ను చదివించారు. వారి ప్రోత్సాహంతో ఐఐటీ ఢిల్లీ వరకు వెళ్లగలిగాను.
సహాయం చేయడంలో సంతృప్తి
ఎదుటి వారికి సహాయం చేయడంలో ఉండే సంతృప్తి మరెక్కడా దొరకదు అనేది నా భావన. ప్రజలకు మంచి చేయాలనే తపనతో అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మా ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. ఇటువంటి గ్రామాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. వాటి అభివృద్ధికి, రైతులు పడే బాధలు చూశాను. ఉద్యోగాల్లో థ్యాంక్‌ఫుల్ జాబ్స్ కొన్నే ఉంటాయి. అటువంటి వాటిలో టీచర్, డాక్టర్, సివిల్ సర్వెంట్. దీనిలో సివిల్ సర్వెంట్ కావాలని శ్రమిస్తున్నాను.
ఐఐటీ ఢిల్లీ ఎందుకంటే..
ఐఏఎస్ లక్ష్యంగా ఐఐటీ బాంబే, మద్రాస్‌లో సీటు వచ్చినా ఐఐటీ ఢిల్లీనే ఎంపిక చేసుకున్నా. దీనికి కారణం సివిల్స్‌కు ఢిల్లీలో మంచి ప్లాట్‌ఫాం ఉండటం. సివిల్ ఇంజినీరింగ్ పూర్తయ్యే వరకు దానిలోనే లీనమయ్యా. క్రీడలు, క్లబ్స్‌లో పార్టిస్పేట్ కావడం వల్ల మంచి అనుభవం వచ్చింది. క్లబ్ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. మంచి కాలేజీలో చేరడం వల్ల మంచి స్నేహితులు, మంచి ఎక్స్పోజర్ లభిస్తాయి. ఫైనల్ ఇయర్లో ప్లేస్‌మెంట్స్‌కు వెళ్లకుండా సివిల్స్ ఆప్షనల్స్‌కు కోచింగ్ తీసుకున్నాను.
సివిల్స్ ప్రస్థానం..
2017లో బీటెక్ పూర్తయ్యాక 2018లో సివిల్స్ మొదటిసారి రాశాను. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై కాలేదు. జీవితంలో మొదటిసారి ఫెయిల్యూర్‌ను చూశాను. ఈ అపజయంతో ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. దీంతో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను. తప్పులను సరిదిద్దుకొని ముందుకు ప్రయాణించాను. 2019, 2020, ప్రిలిమ్స్ పూర్తిచేసి మెయిన్స్ రాశాను. రెండు మార్కులతో సెకండ్ అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ మిస్ అయింది. ఈసారి (2021) ఇంటర్వ్యూకు అవకాశం వచ్చింది. వచ్చే నెలలో ఇంటర్వ్యూ ఉంది.
సీఏపీఎఫ్ వైపు..
సివిల్స్ ప్రస్థానం సుదీర్ఘమైనది. దీనిలో ఉండగా సీనియర్ మిత్రుడు వాట్సప్ డీపీ చూస్తుండగా పోలీస్ ఆఫీసర్ డ్రెస్‌లో కనిపించాడు. వెంటనే ఏం చేస్తున్నావని ఫోన్ చేసి వివరాలు అడిగాను. అతను సీఏపీఎఫ్ రాసి అసిస్టెంట్ కమాండెంట్ జాబ్ సాధించాను అని చెప్పాడు. ఈ ఎగ్జామ్ సివిల్స్‌కు ఉపయోగపడుతుందని చెప్పాడు. దీంతో దానికి దరఖాస్తు చేశాను. దరఖాస్తుకు చివరిరోజు కావడం, వయోపరిమితికి సరిగ్గా 20 రోజుల తక్కువ వయస్సు ఉండటం కలిసి వచ్చింది. సివిల్స్‌కు ప్రిపేర్ అయి ఉండటంతో ఈ ఎగ్జామ్ సులభంగా పూర్తిచేశాను.
ఈ ఎగ్జామ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఉంటాయి. ఈ రెండింటిని ఒకే రోజు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్ పేపర్ కరెక్షన్ చేస్తారు. తుది ఎంపికలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా చేస్తారు.
సీఏపీఎఫ్లో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలు ఉంటాయి. వీటిలో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల కోసం సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది.
రాష్ట్రం నుంచి తక్కువ..
- సీఏపీఎఫ్ పోస్టులు మంచి హోదా, జీతం కలిగినవి. మన రాష్ట్రం నుంచి తక్కువ మంది దీనివైపు వెళ్తున్నారు. మహారాష్ట్ర నుంచి 50 శాతం మంది అభ్యర్థులు ఈ పోస్టుల్లో విజయం సాధిస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఎస్ఐ, ఆర్మీ, సివిల్స్‌కు ప్రిపేరయ్యే వారు ఈ పోస్టులను సులభంగా సాధించవచ్చు.
- సివిల్స్ ప్రిలిమ్స్ కంటే చాలా సులభంగా ఉంటుంది ఈ పరీక్ష. ఈ పరీక్షలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలోని కొన్ని పార్ట్స్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. వీటికోసం పదోతరగతి స్థాయి బుక్స్ చదివితే సరిపోతుంది.
- మెయిన్స్‌లో ఇంగ్లిష్ బేసిక్స్, గ్రామర్‌ను పరీక్షిస్తారు. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.
- మెయిన్స్ డిస్క్రిప్టివ్ విధానంలో లెంగ్తీగా ఉంటుంది. దీనిలో ప్రశ్నకు మనం ఎలాంటి సమాధానం రాశామో పరిశీలిస్తారు.
- మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు సాధించిన రెండో అభ్యర్థిగా నిలిచాను.
- ఇంటర్వ్యూ సివిల్స్ ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది. దీనివల్ల భవిష్యత్‌లో సివిల్స్ రాయాలనుకునే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అనుభవాన్ని ఇస్తుంది.
- అసిస్టెంట్ కమాండెంట్ పోస్టు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దేశసేవతో పాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయి.
- చక్కటి పదోన్నతులు లభిస్తాయి.
సీఏపీఎఫ్ ఇంటర్వ్యూలో…
సుజాతా మెహతా మేడం బోర్డు ఇంటర్వ్యూ చేసింది. సుమారు 30 నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగింది.
ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు
1. నీకు వరంగల్‌లో పోస్టింగ్ ఇస్తే ఏం చేస్తావు?
2. ప్రభుత్వ ఉద్యోగంలో ఏం లేదు? ఎందుకు దీనికోసం ప్రయత్నిస్తున్నావు అని అడిగారు?
3. నిన్ను ఇండియాకు హెడ్ చేస్తే ఏం చేస్తావు అని స్పష్టత లేని ప్రశ్న అడిగారు. అప్పుడు వారిని స్పష్టత కోసం హెడ్ అంటే ఏమిటి అని ప్రశ్నించి పీఎం అయితే ఇలా, ప్రెసిడెంట్ అయితే ఇలా అని సమాధానం చెప్పాను.
4. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మూడు లాభాలు, మూడు నష్టాలను చెప్పమన్నారు
ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు సాధించిన మూడో అభ్యర్థిగా నిలిచాను.
విజయానికి కారణం..
- తల్లిదండ్రులు, మిత్రుడు మనీష్, చెల్లెలు గిరిజ ప్రోత్సాహంతో ఈ విజయం సాధించాను.
- సివిల్స్‌లో రెండుసార్లు అపజయం పొందాక హైదరాబాద్ వచ్చాను. బాలలత మేడం దగ్గర పర్సనల్ గైడెన్స్ తీసుకున్నాను. ముఖ్యంగా సీఏపీఎఫ్ ఇంటర్వ్యూకు మేడం ఇచ్చిన సలహాలు వందశాతం ఉపయోగపడ్డాయి.
పోటీ పరీక్షార్థులకు..
- ఫెయిల్యూర్‌ను శాపంగా భావించవద్దు. చుక్కలను గురిచూసి కొట్టినప్పుడు అది మిస్ అయినా మీరు కనీసం చంద్రుడినైనా కొడుతారు అనే నానుడి ప్రకారం గొప్పదైన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దాన్ని సాధించడానికి నిరంతరం శ్రమించాలి.
- మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఫలితం కోసం ఆశించవద్దు. చదివిన చదువు జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది.
పగటి కలలు కనవద్దు. వాటి వల్ల సమయం వృథా తప్ప ఏ ఫలితం రాదు. ఎంత బాగా వర్క్ చేస్తే అంత మంచి హోదా వస్తుంది.
ఒత్తిడికి గురికావద్దు
- ప్రతిరోజు కనీసం 6-8 గంటల పాటు నిరంతరం చదవడం అలవాటు చేసుకోవాలి. వారానికి ఆరురోజులు చదివి ఒకరోజు విశ్రాంతి తీసుకోవడం లేదా రిఫ్రెష్ కావడం చేస్తే మంచిది.
- చదివే సమయంలో మధ్య మధ్యలో చిన్న విరామం తీసుకోవాలి. ఎక్కువ ఒత్తిడికి గురికావద్దు.
- రోజుకు 14-16 గంటలు చదవడం కరెక్ట్ కాదు.
- యూపీఎస్సీ అనేది ఫ్రెండ్లీ ఎగ్జామ్. ఇక్కడ ఒకసారి మిస్ అయినా మరో అవకాశం ఉంటుంది.
- కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయ్యేవారు మంచి స్నేహితులు అంటే లక్ష్యం వైపు ప్రయాణించే వారిని ఎంచుకోవాలి. వారితో కలిసి గ్రూప్ స్టడీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పరీక్షల్లో మనం చేసే తప్పులను తెలుసుకోవడానికి, మన స్థాయిని పరీక్షించుకోవడానికి గ్రూప్ అనేది చాలా ఉపయోగపడుతుంది.
- తప్పుల నుంచి పాఠాలను నేర్చుకోవాలి. ఆ తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
లక్ష్య సాధనకు హాబీలు
- ప్రతి ఒక్క అభ్యర్థి ఏదో ఒక హాబీని డెవలప్ చేసుకోవడం మంచిది. దీనివల్ల లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం
అలవడుతుంది. - చదువు అనేది భారంగా చూడవద్దు.
- హాబీ అనేది జీవితంలో ముందుకు పోవడానికి ఉపయోగపడుతుందని గుర్తుంచుకోండి. అంతేకాకుండా దీనివల్ల మానసిక విశ్రాంతి లభిస్తుంది.
- గోల్‌ను చేరుకోవడానికి ఇవి ఉపయోగపడుతాయి. ఒక్కో అడుగు ముందుకువేయడం అనేది చాలా ముఖ్యం. ఏ ప్రయాణానికయినా ఒక్కో అడుగు అనే సూత్రం వర్తిస్తుంది.
- చివరిగా పోటీపరీక్షలు రాసే వారికి నేను చెప్పేది ఒక్కటే ‘స్థిరత్వం, పట్టుదల’ ఉంటే ఏదైనా సాధించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?