పరీక్షలను..జయించేదెలా?
పరీక్ష అనే పదమే భయాన్ని కలిగిస్తుంది. ఇది కేవలం విద్యార్థులకే కాదు, ఇంచుమించుగా అన్ని స్థాయిల వ్యక్తులకు. దేనికైనా పరీక్ష పెడుతున్నాం అంటే అది గెలవడానికి సాధ్యం కానిది అనే అభిప్రాయంతోనే తీసుకుంటాం. నిజానికి ఇది ఒక రాంగ్ మెటాఫర్ కానప్పటికీ, ఈ పదానికున్న అర్థాన్ని గ్రహించే విషయంలో మాత్రం అందరూ పొరపడుతూనే ఉంటారు. నిజం చెప్పాలంటే పరీక్ష అనేది టాలెంట్‌ను నిరూపించుకునే వేదిక. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. పరీక్షలో ఇప్పటివరకు బోధించిన పాఠాల నుంచే ప్రశ్నలు అడుగుతారు తప్ప వేరే విష యాలు అడగరు. ముందు భయం నుంచి దూరం జరగాలి.పరీక్షా ఫోబియాను ఎలా దూరం చేయాలి?.. పరీక్షాకాలంపై పది సూత్రాలు.. అవగాహన ప్రణాళిక…ఆరోగ్యం,ఆత్మవిశ్వాసం ఇదే సక్సెస్ మంత్ర.
నెగెటివ్ ఇంప్రెషన్
-పరీక్షలంటే ఇలా తల్లడిల్లిపోవడానికి ప్రధాన కారణం చిన్నప్పట్నుంచీ ఏర్పరచుకున్న నెగెటివ్ ఇంప్రెషన్. పరీక్షాఫలితాలు రెండు విధాలుగా బయటపడతాయి. పాస్ కావటం, లేదా ఫెయిల్ అవ్వడం. సరిగ్గా శిక్షణ పొందామా? లేదా?, సరిగ్గా ప్రిపేర్ అయ్యామా అనే విషయాన్ని పక్కన పెడితే అందరూ ఫెయిల్ అవ్వకూడదు అని భావించటం వల్ల పరీక్ష అనే పదాన్ని భయం తో ముడిపెట్టడం జరుగుతుంది. సరిగ్గా ప్రిపేర్ కానివారి సంగతి పక్కన పెడితే, బాగా చదువుకున్నవారికి కూడా భయం ఎందుకు కలుగుతుంది? ఎందుచేత పరీక్షలు బాగా రాయలేకపోతుంటారు? అనే ప్రశ్నలకు మనోవిజ్ఞానశాన్త్రవేత్తలు కొన్ని కారణాలను చెబుతారు.
న్యూరోటిక్ పెర్సనాలిటీ
-బాల్య దశలో ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులతోనూ, ఇతర వ్యక్తులతోనూ, సామాజిక పరిస్థితులతోనూ సరైన సర్దుబాటు ధోరణి అలవర్చుకోకపోవటం చేత పర్సనాలిటీ లోపాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇగో, సూపర్ ఇగోల మధ్య సంఘర్షణ ఏర్పడటం వల్ల ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఇలాంటి వారినే సైకాలజీలో న్యూరోటిక్ పెర్సనాలిటీస్ అని అంటారు. వీరిలో అకారణ భయాలు, ఆందోళనలు, హైపోఖాండ్రియా వంటి లక్షణాలు కలుగుతుంటాయి. వీరికి పరీక్షలు సమీపిస్తున్నాయి అనగానే భయాందోళనలు కమ్ముకుంటాయి. దీనినే యాంగ్జయిటీ న్యూరోసిస్ అని అంటారు. ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, ఛాతి నొప్పి, చెమటలు పట్టడం, నిస్సత్తువ, కడుపునొప్పి, తలనొప్పి, పల్స్‌రేటు పెరగటం, నోరు, పెదాలు ఎండిపోవటం, కండరాలు బిగపట్టేయ టం, అరచేతులు, అరికాళ్లు చెమ్మబారటం వంటి సొమాటిక్ లక్షణాలు కన్పిస్తాయి.
ప్యానిక్ ఎటాక్
– స్వభావ రీత్యా న్యూరోటిక్ లక్షణాలు ఉన్నా, లేకపోయినా, ప్యానిక్ ఎటాక్‌కు గురికావచ్చు. ఏమైనా సరే సక్సెస్ తప్పనిసరి అని అనిపించటం దీనికి ప్రధానకారణం. పరీక్షల తర్వాత జీవితాన్ని ఊహించలేని స్థితిలో పాస్ కావటమే ఆఖరి అవకాశంగా భావించటంతో పరీక్ష అనే భయోత్పాతాన్ని తప్పించుకునే నేపథ్యంలో అన్కాన్షస్ చేపట్టే రక్షణ చర్యే ప్యానిక్ ఎటాక్. పరీక్ష హాలులోకి అడుగు పెట్టగానే కళ్లు బైర్లు కమ్మి నెర్వస్ బ్రేక్‌డౌన్ ఏర్పడుతుంది.
వైఫల్యం
-పరీక్షలను ఎలాగైతే మనం తప్పుగా అర్థం చేసుకుంటామో, వాటి ఫలితాల విషయంలో కూడా అలాగే పప్పులో కాలేస్తాం. వైఫల్యం అనే మాట చాలా కఠినమైనది, ఎవ్వరూ అంగీకరించలేనిది. దేనికైనా సరే ఫీడ్ బ్యాక్ ఉంటుందే తప్ప, ఫెయిల్యూర్ ఉండదు. అయితే విద్యార్థుల్లో ఓటమిని అంగీకరించే తత్వం లేకపోవటం వల్ల పరీక్షల్లో ఫెయిల్ అవుతామనే భయానికి లోనుకావడం జరుగుతుంది. పరీక్షల్లో తాము నేర్చుకున్నది బయటపెట్టేందుకు తాము ఏ విధంగా ప్రిపేర య్యామో జరిగిందో విశ్లేషించుకున్నా, లేకపోయినా పరీక్షల్లో విజయాన్ని మాత్రమే వీరు ఎక్కువగా కోరుకుంటారు. విశ్లేషణారహితమయిన కోర్కె ఎంత ఎక్కువ ఉంటే అపజయం తప్పదేమోనన్న భయాందోళనలు అంత ఎక్కువవుతాయి.
సిచ్యుయేషనల్ యాంగ్జయిటీ
-బాగా చదివే పిల్లలకు సైతం ఇది ఏర్పడుతుంది. ట్రైన్‌కి టైం అవుతోందనగానే కొంతమందికి గుండెల్లో గుబులు, కడుపులో అదోలా అనిపించటం లాగానే, ఈ పిల్లలకు పరీక్ష హాలులోకి వెళ్లగానే అక్కడి వాతావరణం, సిచ్యుయేషన్ వారిలో యాంగ్జయిటీని కలిగిస్తుంది. సందర్భాన్ని బట్టి ఏర్పడేది కాబట్టి దీన్ని సిచ్యుయేషనల్ యాంగ్జయిటీ అంటారు. దీని ప్రభావం వల్ల వీరి ఆలోచనా స్రవంతిలో బ్లాకేజెస్ ఏర్పడుతాయి. చదివింది గుర్తురాదు. క్వశ్చన్ పేపర్ అర్థం కాదు. ఏదో నామమాత్రంగా రాసి పరీక్ష అయ్యిందనిపించి బయటపడతారు. ఇంటికి వచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని వివరించి చెప్పే సమయంలో ఇవన్నీ తనకి బాగా తెలిసినవే అని గుర్తిస్తారు. ఇక్కడ కాన్షస్, అన్కాన్షస్ మైండ్ల పనితనమే ప్రభావం చూపిస్తుంది. మనం నేర్చుకున్నదంతా మన అన్కాన్షస్లో నిల్వ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కాన్షస్ మైండ్ కన్నా అన్కాన్షస్ మైండ్ విస్తృతమైనది, సంక్లిష్టమైనది. మన మైండ్‌లో 90 శాతం అన్కాన్షస్ ఆక్రమిస్తుంది. ఇక్కడ నిల్వ ఉన్న సమాచారం మన కాన్షస్ మైండ్‌కు నిరాటంకంగా సరఫరా కావాలంటే కాన్షస్ మైండ్ ప్రశాంతంగా ఉండాలి. సిచ్యుయేషనల్ యాంగ్జయిటీకి లోనైనప్పుడు కాన్షస్ మైండ్ కల్లోల భరితంగా ఉంటుంది. ఫలితంగా అన్కాన్షస్ ద్వారాలు మూసుకుపోతాయి. పరీక్ష అయిపోయిన తర్వాత రిలీఫ్ ఏర్పడటం వల్ల కాన్షస్ మైండ్ ప్రశాంతమవుతుంది. అప్పుడు అన్కాన్షస్లో ఉన్న సమాచారం నిరభ్యంతరంగా కాన్షస్ మైండ్లోకి ప్రవేశిస్తుంది. చాలామంది పిల్లలకు అయ్యో! బాగా తెలిసున్నాసరే, ఆన్సర్ రాయలేకపోయానే! అని నాలుక కరుచుకోవటానికి కారణం ఇదే.
అకడమిక్ ప్రెషర్
-శారీరక, మానసిక పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ అపవ్యవస్థలు లేకపోయినా, నేటి విద్యారంగ పరిస్థితులు పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనను కల్గించేవిగా ఉన్నాయి. షెడ్యూలు ప్రకారం పోర్షన్ కంప్లీట్ కాకపోవటం, వివిధ కారణాల వల్ల క్లాసులు సరిగ్గా జరగకపోవటం, ప్రతి సబ్జెక్ట్‌లోనూ సిలబస్ విస్తరించటం వల్ల పిల్లలకు పరీక్షల ప్రిపరేషన్‌కు టైం పరిమితం కావటం, రిఫరెన్స్‌లు చూసే టైం లేకపోవటం, రివిజన్‌కు సరైన గెడైన్స్ కొరవడటం జరుగుతుంది. అలాగే, పరీక్షల్లో విద్యార్థులు సాధించబోయే ఒక్కొక్క మార్కుకీ గట్టిపోటీ ఏర్పడటం, పిల్లలు పాస్కావటానికి పెట్టే షరతులు వారిని విపరీతంగా భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పరీక్షల తర్వాత ఎదురుకాబోయే పైచదువులు, ఉద్యోగాలు వంటి రంగాలలో ఎక్కడపడితే అక్కడ పోటీ కారణాల వల్ల విద్యార్థులకు పరీక్షలంటే టెన్షన్ పెరుగుతుంది.
ఇతర కారణాలు
-ఒంట్లో బాగుండకపోవటం, పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ఇతర పనుల్లో మునిగి ఉండటం, అభిమాన హీరోలు, క్రికెట్, ఫ్రెండ్స్, లవ్ అఫైర్స్ వగైరాల వల్ల పరీక్షలు దగ్గరపడేంతవరకూ పుస్తకం తీసే టైం దొరక్క పరీక్షలంటే భయపడటం జరుగుతుంది.
మరేం చేయాలి ?
-దీర్ఘకాలికంగా ప్రణాళికలను రూపొందించుకోవటానికి ఇప్పుడు సమయం లేదు. చదువుకునే సమయం, నేర్చుకునే సమయం, రివిజన్ సమయం అంతా గడిచిపోయింది. ఇప్పుడు మిగిలివున్న ఈ కాస్త సమయాన్ని ఉపయోగించుకుని పరీక్షలను రాయగల్గాలి. ఆఖరి నిముషంలోనే అయినప్పటికీ మీరు ఇప్పుడు తీసుకునే చర్యల ఫలితం మాత్రం పరీక్షల్లో మీ పెర్ఫార్మెన్స్ని ఎంతో ప్రయోజనకరంగా ప్రభావితం చేస్తుంది.
రిలీఫ్ పొందండి
మీరు వేసుకునే షెడ్యూలులో అప్పుడప్పుడు రిలీఫ్ కావడానికి వీలుగా ఒక గంట, లేదా గంటన్నర సేపు రివిజన్ని వదిలిపెట్టి మానసికోల్లాసాన్ని కలి గించే పనులు చేయండి. ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, ప్రకృతిని ఆస్వాదించటం, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవటం మంచిది. రిలీఫ్ కోసం అంటూ టీవీ చూడకండి. టీవీలో చూపే కార్యక్రమాల వల్ల, వాటి కథాంశాల వల్ల మీ మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. చక్కని సంగీతం వినటం కూడా ఒక మంచి అలవాటు.
పరీక్షలనేవి మనం ఎదుర్కొనలేని సంఘటనలెంతమాత్రమూ కాదు. మనం నిత్యజీవితంలో రకరకాల వ్యక్తుల మధ్య, రకరకాల విషయాలతో జీవిస్తున్నాం. దీనికి తోడు మన సమాజంలో పలురకాలైన ఇబ్బందులు మంచినీటి సమస్య, కరెంటు కోత, వాతావరణ కాలుష్యం, అనేకం మనకు సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. ఇలా మన జీవన గమనంలో ఎన్ని రకాల సమస్యలకు ఒత్తిళ్లకు ప్రతిఘటనను చూపుతూ జీవించగల్గుతున్నామంటే దీంతో పోలిస్తే పరీక్షలనేవి చాలా తేలికైన విషయాలు. వీటిని మనం మనకున్న శక్తిసామర్థ్యాలతో ఇంతకన్నా ఎక్కువ సమర్థవంతంగా ఎదుర్కోగలం. అందుచేత వేటికీ భయపడని మనం కేవలం పరీక్షలంటేనే భయం అని అనుకోవటం పూర్తిగా అవివేకం. చదివినవి ఏవిచ్చినా చక్కగా పొందికగా, అత్యద్భుతంగా రాయగలనని విశ్వసించండి.
ప్రణాళిక వేసుకోండిలా..
దేనికైనా ప్లానింగ్ అవసరం. ఇప్పుడు మీకు చేతిలో ఉన్న టైం చాలా తక్కువ. చదవాల్సింది చాలా ఎక్కువ. అందుచేత సరైన స్టడీప్లాన్ వేసుకుని దానిని నిక్కచ్చిగా అమలు చేయండి.
-సరిగ్గా ఎన్నిరోజులు సమయం ఉన్నదో లెక్కించండి.
-ఒక్కో సబ్జెక్టులో ఎన్ని పాఠాలున్నాయో చూడండి.
-కనీసం ఒక్కో సబ్జెక్టులో రోజుకు మూడు పాఠాలైనా చదవాలని తీర్మానించుకోండి. రోజు మొత్తంలో మీరు మెలకువగా ఉండే గంటలెన్నో లెక్కించండి. అందులో ఒక గంట రిలీఫ్ కార్యక్రమానికి వదిలిపెట్టండి. వీలైనంత మేరకు సిలబస్ అంతా కవరవ్వాలని నియమం పెట్టుకోండి.
-ఏరోజు రివిజన్ ఆ రోజే చెక్ చేసుకోండి. నేర్చుకోలేకపోయిన ప్రశ్నలను, లేదా పాఠాలను విడిగా నోట్ చేసుకోండి. అందుకు కారణాలు రాసుకోండి.
రివిజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మీరు వేసుకున్న షెడ్యూలు ప్రకారం ఆయా సబ్జెక్టులను తీసుకుని ముం దుగా మానసిక ప్రశాంతతకు, రిలాక్సేషన్‌కి ఐదు నిమిషాలు కేటాయించండి. మీ మైండ్ పూర్తిగా చదువు మీదకు మళ్లించండి. ఇప్పుడు మీరు చదివే ప్రశ్న జవాబులు, కీలకాంశాలు అన్నీ యథాతథంగా మీ మనసులో ముద్రింపబడతాయని అనుభూతి చెందండి.
-ప్రతి పాఠంలోని కీలకాంశాలను ఆ పాఠం చివరన ఇస్తారు. వాటిని క్షుణ్ణంగా చదవండి.
-కీలకాంశాలను కవర్ చేసే ప్రశ్నలే ఇంపార్టెంట్ కశ్చన్స్. పరీక్షల్లో వాటికే ప్రాధాన్యత ఎక్కువ. అందుచేత ముందుగా ఈ ప్రశ్నలను బాగా చదివి నేర్చుకోండి.
ప్రశాంతంగా ఉండాలంటే ?
సిచ్యుయేషనల్ యాంగ్జయిటీ, ప్యానిక్ ఎటాక్, యాంగ్జయిటీ న్యూరోసిస్ వంటివి ఏర్పడకుండా ఉండటానికి మీరు మానసిక ప్రశాంతతను రెగ్యులేట్ చేసుకోవటం అలవర్చుకోవాలి. సెల్ఫ్ హిప్నోసిస్‌లో దీనికొక సింపుల్ ఎక్సర్సైజ్ ఉంది. మీకు నచ్చే, ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి. మీ ధ్యాసంతా ఒక బిందువుపై కేంద్రీకరించండి. ఆ బిందువు మీ ఎదురుగా వున్న ఒక చుక్క కావచ్చు, లేదా మీరు కనులు మూసుకుని ధ్యానం చేసినట్లయితే ఏదైనా ఒక చిన్న భావన కావచ్చు. మీ దృష్టంతా దానిమీద కేంద్రీకరించటం మాత్రమే ఇక్కడ అనివార్యం. అలా మీరు దృష్టి కేంద్రీకరించిన రెండు, మూడు నిమిషాల్లోనే మీలో ట్రాన్స్ స్థితి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ కింది మూడు సజెషన్లను ఒక్కొక్కటి ఏడు సార్ల చొప్పున మీ అన్కాన్షస్కు అందివ్వాలి.
1. ఇప్పుడు నేనెంతో ప్రశాంతంగా ఉన్నాను.
2. నా మనసు, శరీరం రెండూ మరింత ప్రశాంతంగా ఉన్నాయి.
3. నేను ఇంకా ఇంకా ప్రశాంతంగా ఉన్నాను.
-ఇప్పుడు మీ మనసంతా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మారిపోతున్నస్థితిని పరిపూర్ణంగా అనుభూతి చెందండి. ఈ మానసికస్థితి మీ అన్కాన్షస్కు అలవాటు చేయండి. మీకు కావలసినప్పుడల్లా మూడు అంకెలు లెక్కపెట్టగానే, మీ అంతరంగానికి అలవాటైన ఈ ప్రశాంతత ఒక్కసారిగా మీ మనసంతా నిండిపోయేలా ఒక పోస్ట్ హిప్నోటిక్ సజెషన్ ఇచ్చుకోండి. మీలో ఇకపై ఎప్పుడైనా సరే యాంగ్జయిటీ తలెత్తగానే ఒకటి… రెండు… మూడు…అని అంకెలు లెక్కపెట్టేసరికి మీ మనసంతా ప్రశాంతత అలుముకుంటుంది.
ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి
-వేళకు భోజనం చేయడం తప్పనిసరి. దీనివల్ల శరీరానికి కావలసిన పౌష్టికత అంది, మెదడు కూడా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎక్కువ తింటే నిద్ర వస్తుంది అనుకోవడం ఒక దురభిప్రాయం మాత్రమే. తగిన ఆహారంతోపాటు పళ్లు, పండ్ల రసాలు తీసుకుంటుండాలి. ప్రతి మూడున్నర గంటలకోసారి ఆహారాన్నికానీ, పండ్లు గానీ తీసుకోవాలి.
-మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మాంసకృత్తులు ఎక్కువ ఉండే ఇడ్లీ, దోశ, అటుకులు, ఉడికించిన గుడ్లు, బ్రెడ్ ఇష్టపడేవారైతే, జున్ను, వెన్న, గుడ్డు తినాలి.
-మధ్యాహ్నం భోజనంలో అన్నంతోపాటు సలాడ్ తప్పనిసరిగా తీసుకోవాలి. పప్పుధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
-రాత్రి భోజనంలో అన్నానికి బదులు చపాతీలు, జొన్నరొట్టెలు, గోధుమ రవ్వ ఉప్మా ఏదో ఒక వెరైటీని తీసుకుంటే మంచిది.
-రాత్రిళ్లు మేలుకుని చదివేటప్పుడు కాఫీ, టీలకు బదులు పాలు తాగడం మంచిది. ఖర్జూరం, ఎండు ద్రాక్ష, నానబెట్టి వాటి రసాన్ని పిండి తీసుకోవటం చాలా మంచిది. ఎండలు ముదిరాయి కాబట్టి కొబ్బరినీళ్లు కూడా చాలా మేలుచేస్తాయి.
భయం వీడితే.. జయం మీదే…
మార్చినే తలుచుకుంటే మూర్ఛలే ముం చుకొచ్చే….అంటూ విద్యార్థులు పరీక్షా కాలంలో ఆందోళన చెందడం సహజం. పరీక్షల సీజన్ ప్రారంభానికి కేవలం 10 రోజుల సమ యం మాత్రమే మిగిలి ఉంది. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉం డాలి. వివిధ సబ్జక్టుల్లో ఇప్పటివరకు చదివి అవగాహన చేసుకున్న అంశాలనే మళ్లీ మళ్లీ పునఃశ్చరణ చేయాలి. కొందరు విద్యార్థులకు పరీక్షలంటే భయం.. టెన్షన్…రాత్రింబవళ్లు తెగ చదివేయాలన్న ఆతృత.. కానీ నిద్రపోకుండా అతిగా మేలుకోవడం, సరైన ప్రణాళిక, టైం మేనేజ్మెంట్, సరైన ఆహార నియమాలు పాటించకలేకపోతే పరీక్షల కాలంలో ఇబ్బందులు తప్పవు.
కాలం విలువైనది… సమయపాలన అవసరం
బద్దకాన్ని, వాయిదా తత్వాన్ని వీడి చదువుపైనే పూర్తి దృష్టి సారించాలి. కాలం ఎంతో విలువైనది.. పరీక్షా సమయాల్లో ప్రతిక్షణం కీలకమైనది. తెల్లవారు జామున 4 గంటలకే లేచి కఠినమైన విషయాలను చదువుకుంటే బాగా అవగతమవుతాయి. బాగా చదువుకోవడానికి వేకువజాము సమయం అత్యంత అనుకూలమైంది. చదువుకునే గది వాతావారణం ప్రశాంతంగా ఉండాలి. టీవీ, మొబైల్, ఆడియో ప్లేయర్లు సమీపంలో ఉంచుకోవద్దు. చదివేటప్పుడు దృష్టి మరలితే విలువైన సమయం వృథా అవుతుంది. చదువుకు ఆటంకం కలిగించే అంశాలను గుర్తించి వాటికి దూరంగా ఉండండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వాదనలకు, ఘర్షణలకు దిగవద్దు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలతో విద్యార్థులకు తిప్పలే
పరీక్షా కాలంలో అందరికీ ఇష్టమైన ప్రపంచ కప్ క్రికెట్ పోటీలతో విద్యార్థులకు తిప్పలు తప్పేలా లేవు. విద్యార్థులు టీవీలకు అతుక్కు పోకుండా, ఇష్టాన్ని సైతం అణుచుకోకుండా కేవలం పోటీల స్కోర్ మాత్రమే తెలుసుకుంటూ చదువుపైనే దృష్టి సారించండి. క్రికెట్‌కు బానిసైతే విలువైన పరీక్షలు సరిగా రాయక విద్యాసంవత్సరం కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి.
టైం మేనేజ్మెంట్ ముఖ్యం..
– ఉదయం లేవగానే కఠినమైన సబ్జక్టు చదవడం
– ప్రిపరేషన్ టైంలో మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఉండాలి. అలసటగా అనిపిస్తే నిమిషంపాటు ఇంటిపైకప్పు వైపు చూస్తూ స్కై వాకింగ్ చేస్తే మెదడు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చదువు కొనసాగిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చు.
-రాత్రి 8 నుంచి 11.00 మధ్య సులభమైన సబ్జెక్టులు చదువుతూ ఉండాలి.
-రాత్రి మెత్తం మేల్కోని ఉండకుండా 11.00ల కల్లా నిద్రపోవాలి. రాత్రి ఎక్కువగా మేలుకుంటే మెలటోనిన్ హార్మోన్ సమతుల్యత దెబ్బతిని నీరసంతో పాటు మెదడు సక్రమంగా పనిచేయదు.
చేతి రాత.. కీలకమే
చేతి రాత కూడా మార్కుల సాధనలో ఉపయోగపడుతుంది. చేతి రాత మరి అందం గా ఉండకపోయినా.. రాసింది సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. సమాధానాలు రాసేటప్పుడు అంతా గుండుగుత్తగా రాయకుండా మధ్యలో హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ పెడుతూ ఉండాలి. ముఖ్యమైన విషయాలు పాయింట్వైస్గా రాయాలి. ప్రధానాంశాలను అండర్లైన్ చేయాలి. కాగితంపై ఒత్తి పట్టి రాయొద్దు. పరీక్ష రోజే కొత్త పెన్ను వాడొద్దు. రెండురోజుల ముందుగానే ఆ పెన్నుతో రాస్తూ అలవాటు చేసుకోవాలి.
ధ్యానంతో ఏకాగ్రత
పరీక్షల్లో జ్ఞాపక శక్తికి ప్రాముఖ్యం ఎక్కువ. దాన్ని పెంచుకోవడానికి ధ్యానం ఒక మార్గం. అది ఒత్తిడిని జయించి ఏకాగ్రత సాధించేందుకు దోహదపడుతుంది.
భయం వీడితే జయం మీదే
భయం వీడితే జయం మీదే …. ఆత్మ విశ్వాసమే లక్ష్యసాధనకు ప్రధాన ఆయుధం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితుల సూచనలు, ప్రణాళికాబద్ధ ప్రిపరేషన్ దోహదపడతాయి. భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షాహాల్లోకి వెళ్లగలిగితే సగం విజయం సాధించినట్లే. మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఒత్తిడికి గురికాకుండా పరీక్షహాల్లో ప్రశ్నపత్రం తీసుకోగానే క్షుణ్ణంగా చదివి వెంటనే ఓ ప్రణాళిక రూపొందించుకోవాలి. బాగా వచ్చిన ప్రశ్నలు, కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు, రాని ప్రశ్నలను గుర్తిం చాలి. మొదట బాగా వచ్చిన ప్రశ్నలనే రాయాలి. తరువాత కొద్ది లోపంతో వచ్చిన ప్రశ్నలు ఆ తరువాత మిగతావాటి గురించి ఆలోచించాలి. సమయాన్ని గమనిస్తూ అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా జాగ్రత్త పడాలి.
ప్రశ్నపత్రాన్ని అర్థం చేసుకోవడంలోనే విజయం
విద్యార్థి సగం విజయం ప్రశ్నప్రతాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. ప్రశ్న ఎలా ఇచ్చాడు.. దానికి తగిన సమాధానం ఎలా రాయాలో ముందుగా రెండు నిమిషాలు ఆలోచించాలి. బట్టీ విధానం ద్వారా కాకుండా అవగాహనతో కూడిన చదువుతో విజయం వరిస్తుంది. గైడ్లు, టెస్ట్ పేపర్లతో కుస్తీ పట్టకుండా పాఠ్యపుస్తకాలను అర్థం చేసుకొని చదవాలి. టార్గెట్ ఓరియెంట్ చదువుతో విద్యార్థి టెన్షన్ పడే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వార్షిక పరీక్షలను సాధారణ పరీక్షలవలే భావిస్తే అధిక మార్కులు సాధించవచ్చు. మానసిక ప్రశాంతతకు యోగ, ధ్యానంతో ఏకాగ్రత సాధించవచ్చు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను పరీక్షలున్నాయంటూ ప్రతిరోజు ఇబ్బందులు గురిచేయవద్దు. ప్రశాంత వాతావరణంలో చదువుకోనివ్వాలి.
కేవీఎన్ ఆచార్య, ప్రిన్సిపాల్, గురుకుల పాఠశాల సర్వేల్, నల్లగొండ జిల్లా
కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి.
ముందుగా పరీక్షలంటే భయం వీడాలి. ప్రణాళికబద్ధంగా, సమయపాలన పాటిస్తూ, ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. ప్రతి పాఠంలో కీ పాయింట్స్ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ మిగిలిన 22 రోజుల సమయాన్ని పూర్తిస్థాయిలో రివిజన్‌కే కేటాయిస్తే మంచిది. కొత్తగా నేర్చుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. క్రమపద్ధతిలో రివిజన్ చేసుకుంటే పరీక్షలో తికమకపడే పరిస్థితి ఉండదు. పరీక్ష హాల్లో పరీక్ష పత్రాన్ని క్షుణ్ణంగా చదివి, అర్థం చేసుకొని సరైన సమాధానాలు రాయాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. పరీక్షలో జవాబులు నీట్‌గా, గుండ్రంగా, కొట్టివేతలు లేకుండా రాయండి. వేగంగా రివిజన్ చేసుకోవడమే నా విజయ సూత్రం.
-గణితం విషయంలో మీకు మీ టీచర్స్ అందించిన గైడ్‌లైన్స్ ప్రకా రం ముఖ్యమైన లెక్కలన్నింటినీ శ్రద్ధగా, ఇప్పుడే మొదటిసారి చేస్తున్నట్లుగా వరుసగా చేయండి. లెక్క మొదలు పెట్టగానే మీకు ఫార్ములా గుర్తురాని లెక్కలను కనీసం ఏడు సార్లు వరుసగా చేయండి. దీనివల్ల న్యూరోట్రాన్స్మిషన్ మరింత చక్కగా పటిష్టమవుతుంది
-ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించి ముఖ్యమైన గ్రామర్ టిప్స్‌ను కవర్ చేసే ప్రశ్నలన్నింటినీ ఉదాహరణల్లో ఇచ్చిన పేర్లను అటూ, ఇటూ మార్చి ప్రాక్టీసు చేయండి. లేదా, మీ సొంత వాక్యాలను ప్రయోగించండి.
-కఠిన పదాలతో, సుధీర్ఘంగా ఉండే ప్రశ్నలను ఒకసారి చూడకుండా రాయండి. ప్రశ్నకు సంబంధించిన కీలకాంశాలన్నీ మీ జవాబులో ఒక వరుసక్రమం ప్రకారం కవరవ్వాలి. అలా కవర్ అయ్యేంతవరకూ అ జవాబును మళ్లీమళ్లీ రాయండి.
-ఇంపార్టెంట్ అని వర్గీకరింపబడిన ప్రశ్నల్లో మీరు ఎక్కువగా శ్రమ పడవలసిన ప్రశ్నలకు ప్రాధాన్యత ఇవ్వండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?