గ్రూప్స్ గైడెన్స్.. కలెక్టర్ బుర్రా వెంకటేషం విజయ గాథ
నాలుగేండ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. తల్లి కూలిపనులు చేస్తూ చదివించింది. ఇన్ని కష్టాలు చూసి చిన్నవయస్సులోనే కలెక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్యూషన్లు చెబుతూ డిగ్రీ పూర్తిచేశారు. 1995 సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించి ఉమ్మడి ఏపీలోనే టాపర్‌గా నిలిచారు. తను అనుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించారు. ఆయనే జనగామ జిల్లాలోని ఓబుల్ కేశవాపురంలో జన్మించిన బుర్రా వెంకటేశం. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఉద్యోగార్థుల కోసం ఆయన సలహాలు, సూచనలు..
-అంకితభావంతో చదివితే ఉద్యోగం సొంతం
-ఉద్యోగార్థులకు బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ బుర్రా వెంకటేశం సలహాలు, సూచనలు
అనేక సబ్జెక్టుల సమాహారం
– పోటీపరీక్షలకు, అకడమిక్ పరీక్షలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అకడమిక్ ఒక సబ్జెక్టుకు పరిమితం. పోటీపరీక్ష అనేక సబ్జెక్టుల సమాహారం. ఈ వ్యత్యాసాన్ని చాలామంది గుర్తించడం లేదు. పోటీపరీక్షలను సైతం అకడమిక్ చదువులాగానే భావిస్తున్నారు. అకడమిక్స్‌లో నిష్ణాతులైన వారు కూడా ఉద్యోగాలను సాధించక లేకపోవడానికి కారణం ఇదే. పోటీపరీక్షల్లో అభ్యర్థికి ఎంత నాలెడ్జ్ ఉంటుందనేది చూడరు. ఆయా సబ్జెక్టుల్లో ఏ మేరకు ప్రవేశం ఉందా? అని మాత్రమే పరిశీలిస్తారు. దీనిని అవగాహన చేసుకోవాలి. పరీక్షను బట్టి సబ్జెక్టు లోతులకు వెళ్లకుండా సిద్ధం కావాలి. 10, ఇంటర్మీడియట్ సబ్జెక్టులపై పూర్తిస్థాయి పట్టు ఉంటే సివిల్స్ సర్వీస్ ఎగ్జామ్స్‌ను కూడా సాధించవచ్చు.
ఆత్మవిశ్వాసం
కొందరు ఎన్నో విషయాలు చెబుతారు. తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. కానీ లోపల ఎక్కడో వారిపై వారికే అపనమ్మకం ఉంటుంది. ఆ అపనమ్మకం వల్లే విజయం సాధించలేకపోతుంటారు. తన మీద తనకు ఎంత నమ్మకం ఉన్నదనేదే ముఖ్యం. 1990-95 మధ్యలో చదువుకున్నవారు చాలామంది గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మొదట ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్‌లో పేర్లు నమోదు చేసుకునేవారు. టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవారు. ఎందుకంటే క్లరికల్, టైపిస్ట్, గ్రూప్-3, 4 ఉద్యోగాలు వచ్చేవి. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నేను పెట్టుకున్న లక్ష్యం వేరు కాబట్టి. పదోతరగతిలోనే ఐఏఎస్ కావాలని నోటుబుక్కులో రాసిపెట్టుకున్నాను. కచ్చితంగా సాధిస్తాననే ఆత్మవిశ్వాసంతో చదివాను. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఇతరుల నమ్మకాలు, ఆలోచనలతో సంబంధం లేకుండా ప్రిపేరయ్యాను. ఆలిండియా స్థాయిలో ర్యాంకు సాధించాను. స్వయం ప్రేరితంగా పరీక్షకు సిద్ధం కావాలి. తల్లిదండ్రులు, స్నేహితులు, ఇతర బంధువుల కోసం కాకుండా స్వయం ప్రేరితంగా పరీక్షకు సిద్ధం కావాలి. అలాకాని వారు కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో సక్సెస్ కాలేరు.
లక్ష్యం దిశగా సాగాలి
పోటీ పరీక్షలపై స్పష్టత లేకపోవడం, లక్ష్యమంటూ లేకుండా గాలివాటుగా ప్రయత్నించడం వల్ల లాభం ఉండదు. రాజమండ్రిలో సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో అటెండర్ ఉండేవాడు. అప్పుడు నా జీతం రూ.15 వేలు మించి ఉండేది కాదు. కానీ అటెండర్‌కు తోటలు, ఇంటి అద్దెల ద్వారా నెలకు రూ.50 వేలు వచ్చేవి. దీంతో ఎందుకు ఈ ఉద్యోగం, డిగ్రీ పూర్తి చేస్తే రికార్డ్ అసిస్టెంట్ అవ్వచ్చు కదా అని చెప్పాను. దానికి అతడు సబ్‌కలెక్టర్ దగ్గర పనిచేస్తున్నానంటే ఊర్లో ఎంతో గౌరవం. దానిని ఎందుకు పోగొట్టుకోను. డిగ్రీ సంగతి అడిగితే టోపీ పెట్టుకుని మీతోపాటు వచ్చానా? ఇంటికి పోయానా? అంతే నన్ను అడిగేవారు ఎవరూ ఉండరు. మీరు రమ్మంటే తప్ప. అదే క్లర్క్, లేకుంటే రికార్డ్ అసిస్టెంట్ అయితే ఎప్పుడు ఏ ఫైల్ అడుగతరో తెల్వదు. నానా తలప్పులు అని చెప్పాడు. తనకు ఏ పని అయితే సరిపోతుందో అదే స్పష్టంగా చెప్పాడు. ఉద్యోగార్థులకు కూడా ఆ స్పష్టత ఉండాలి. ప్రతి ఒక్కరూ ఒక విలక్షణమైన వ్యక్తిత్వం, విభిన్న అవసరాలు ఉన్నవారు. అది గుర్తు పెట్టుకోవాలి. వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఒక రంగాన్ని ఎంచుకోవాలి. అప్పుడే ఇష్టంగా చేయగలం. దానివల్ల కష్టం అనిపించదు. మంచి ఫలితం వస్తుంది. ఇష్టం లేని రంగంలోకి వెళ్లినా, పడిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ చదివినా ఒరిగే ప్రయోజనం శూన్యం. అందుకే ఒక లక్ష్యం నిర్దేశించుకొని ఆ దిశగా విశేష కృషి చేస్తే విజయం వరిస్తుంది.
దీక్షతో చదవాలి
ఇలా ప్రిపేరయితేనే వస్తుందని ఏదీ లేదు. కాకపోతే పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. విజయమంటే ఏమిటీ అని గురువును ఒక శిష్యుడు అడిగాడు. అప్పుడు ఆ గురువు తన శిష్యుడి ని ఒక నదిలోకి తీసుకెళ్లాడు. తలపై చెయ్యిపెట్టి బలవంతంగా ముంచుతున్నాడు. మొదట రెండు, మూడు నిమిషాల పాటు గురువుపై గౌరవంతో మౌనంగా ఉన్నా తుదకు ఊపిరాడక చనిపోయే పరిస్థితి వచ్చింది. అంతే ఆ సమయంలో మొత్తం శక్తిని కూడ దీసుకుని గురువు పట్టును తప్పించుకుని నీటి నుంచి పైకి లేచాడు. అప్పుడు గురువు ఇలా అన్నాడు. బతకడమే గొప్ప అని భావించి ఆ సందర్భం నుంచి బయట పడటమే విజయం అంటే అని వివరించాడు. ఉద్యోగార్థులు కూడా ఇదే చివరి అవకాశం అన్నంత దీక్షతో చదవాలి. అప్పుడు కచ్చితంగా విజయం సాధిస్తారు. అవసరమనేది మనలో ఉండే శక్తిని కూడా బయటకు తీసుకొస్తుంది.
సబ్జెక్టు భావం అర్థం చేసుకోవాలి
కోచింగ్ అనేది పోటీపరీక్షలకు సిద్ధమయ్యే శక్తిసామర్థ్యాలు, బలాలు, బలహీనతలపై ఆధారపడి ఉంటుంది. అప్పటి మా రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పుడు మాకు ఆర్థిక ఇబ్బందులతో పాటు ఏరియా పావర్టీ ఉండేది. అంటే ఆసిఫాబాద్ అడవుల్లోని గూడేల్లో ఉన్న వ్యక్తి, హైదరాబాద్ స్లమ్ ఏరియాలో ఉన్న వ్యక్తి ఎదుర్కొనే పేదరికం ఒకటే అయినా, ఏరియా పావర్టీ వేరు. హైదరాబాదీకి సమస్త సమాచారం అందుబాటులో ఉండేది. ఆసిఫాబాద్ లాంటి ఏరియాల్లోకి పేపర్ కూడా వెళ్లకపోయేది. అందుకే అప్పుడు పోటీ పరీక్షలంటే పట్నం వచ్చేవాళ్లు. ఇక్కడ ఉండే స్థోమత లేని వాళ్లు వారానికో, నెలకో ఒకసారి వచ్చి కావాల్సిన సమాచారాన్ని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లేవారు. అందుకు నేనే ఒక ఉదాహరణ. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి ఊరికీ టీవీలు, ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల మెటీరియల్స్ ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇంటి వద్దనే ఉంటూ సిద్ధం కావచ్చు. ఇంక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నాలుగైదు రకాల స్టడీ మెటీరియల్స్‌ను కొనుక్కోవడం, చదవడం కూడా వృథానే. ఏ మెటీరియల్ చదివినా ఫర్వాలేదు. కానీ సంబంధిత సబ్జెక్టు మూల భావం అర్థం చేసుకోవాలి. పూర్తిగా విశ్లేషించగలిగాలి. ఆ మేరకు నైపుణ్యాలు పెంచుకోవాలి. అన్నింటికంటే ప్రధానంగా సాధ్యమైనంత వరకు సాధన చేయాలి. శిక్షణ ఎన్ని రోజులు, ఎలా తీసుకున్నావు? మెటీరియల్ ఏం చదివావు అన్నది కాదు, ఏ మేరకు ప్రాక్టీస్ చేశావన్నదే కీలకం.
తగ్గనున్న పోటీ
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా కాంపిటీషన్ చాలా తగ్గుతుంది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్‌కు డీఎస్సీ రాస్తే లక్షల మందితో పోటీ పడాల్సి వచ్చేది. ప్రస్తుతం పూర్వ వరంగల్ ఇప్పుడు ఆరు జిల్లాలుగా మారింది. ఇప్పుడు ఆ పోటీ తగ్గనుంది. అన్ని ఖాళీలను లెక్కలోకి తీసుకున్నా ప్రస్తుతమున్న ఒక్కో జిల్లాకు 500-1000పైగా పోస్టులు సొంతంగా ఉన్నాయి. ఆయా జిల్లాల్లో డిగ్రీలు పూర్తయి, ఉద్యోగాల కోసం చూసేవారు సుమారు 10 వేల మంది ఉండవచ్చు. దానిలో పట్టుదలతో చదివేవారు కూడా చాలా తక్కువ మందే ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు 1:4 లేదంటే 1:5 మాత్రమే పోటీ ఉండవచ్చు.
ఒత్తిడిని అధిగమించాలి
ఒత్తిడి, ఆదుర్దా అభ్యర్థులకు సర్వసాధారణంగా ఉంటుంది. ఒకరకంగా చూస్తే అవి పరిమితిగా ఉంటే పర్వాలేదు. పాజిటివ్‌గా పనిచేస్తుంది. లిమిట్ క్రాస్ అయితే నెగెటివ్ ప్రభావాన్ని చూపుతుంది. గెలుస్తామనే ధీమాతోనే యుద్ధంలోకి దిగాలి. అంతేకానీ ఓడిపోతామనే అపోహలను రానివ్వకూడదు. ‘మనిషి ఉద్యోగాన్ని సంపాదించగలడు కానీ ఉద్యోగం మనిషిని సంపాదించలేదు’. దీనిని మనసులో పెట్టుకొని బాగా చదవాలి. అబ్దుల్ కలాం ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నం చేసినా రాలేదు. అయినా నిరాశ పడలేదు. అక్కడితో ఆగిపోలేదు సంబంధం లేని ఏరోనాటిక్ సబ్జెక్టు తీసుకుని ఎవరూ ఊహించని శాస్త్రవేత్తగా ఎదిగారు. అబ్రహం లింకన్.. అన్ని ఎన్నికల్లో, వ్యాపారాల్లో నష్టపోయాడు. ఎప్పుడూ నిరాశ పడలేదు. డిప్రెషన్లోకి వెళ్లి ఉంటే వారు ఆ స్థాయికి చేరుకునే వాళ్లు కాదు. ప్రయత్నం చేయాలి. కంగారు పడుతూ, చెమటలు కక్కుతూ కూర్చుంటే ఎగ్జామ్ రాయలేం. ఆశావాద దృక్పథాన్ని అలవర్చుకుంటే చాలావరకు ఒత్తిడి తగ్గుతుంది.
సలహాలు
ఉద్యోగార్థులు అన్నింటికంటే ముఖ్యంగా అవకాశాన్ని గుర్తించగలగాలి. 80 వేల పైచిలుకు పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇలాంటి అవకాశం. అంటే భవిష్యత్తులో తక్కువగా పోస్టులను భర్తీ చేయవచ్చు. ఉన్నతస్థానాలకు ఎదగడానికి, నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా మారడానికి ఇదొక మంచి అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. గెలుపులో నేను ఉంటాను అని మనమీద నమ్మకం పెంచుకోవాలి. అందుకు విశేషంగా కృషి చేయాలి. యూట్యూబ్ వీడియోలు, సినిమా వ్యామోహంలో పడి కాలాన్ని వృథా చేసుకోవద్దు. దీక్షతో చదవండి. ఈ పోటీ ద్వారా చాలా నేర్చుకుంటారు. ఉద్యోగం రాకున్నా మిమ్మల్ని మీరు జయించిన వ్యక్తిగా మారి.. ఉద్యోగాన్ని మించిన ఉన్నతస్థాయి శిఖరాలకు చేరుకుంటారు.
ప్రతి నియోజకవర్గంలో స్టడీ సెంటర్
ఇప్పటికే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వాటికి తోడుగా ఉన్నత విద్యాశాఖ సహకారంతో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాం. అభ్యర్థులకు 5, 10 కిలోమీటర్ల దూరంలోనే అన్ని వసతులు కల్పిస్తాం. స్టడీ మెటీరియల్ అందిస్తాం. సహాయకులను నియమించి సందేహాలను నివృత్తి చేయిస్తాం. కోచింగ్ దొరకలేదని ఎవరూ బాధకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. బీసీ అభ్యర్థులే గాకుండా నిరుపేదలు కూడా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావచ్చు.
గెలుపు సూత్రాలు
స్వశక్తి మీద పూర్తి నమ్మకం ఉండాలి. విద్వత్తు మీద విశ్వాసం పెచుకోవాలి. పసిపిల్లలకు ఉగ్గులాగ చేసి అన్నం పెడతాం. పెద్దవాళ్లకు మసాలాలు వేసి పెడతాం. స్థాయిని బట్టి భోజనం లాగానే స్థాయిని బట్టి సాధన చేస్తే గెలుపు తథ్యం. బలమైన పాయింట్ ఏంటి? బలహీన పాయింట్ ఏంటి? అనేవి తెలుసుకోవాలి. అంటే నిన్ను నీవు తెలుసుకుంటే విజయం అందుకోవచ్చు. ఎక్కువ కాంపిటీషన్ ఉందని, పేపర్ లీకయిందని, రికమండేషన్లు, డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందనే రకరకాల వార్తలు వస్తుంటాయి. అవన్నీ పుకార్లే. వాటిని నమ్మితే చదువు మీద ధ్యాస పెట్టలేం.
– మ్యాకం రవికుమార్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?