సివిల్స్ విజేతల సక్సెస్ స్పీక్
కొంత మంది లక్ష్యాన్ని ముందే నిర్దేశించుకుంటే కొంతమందికి పరిస్థితులు నిర్ణయిస్తాయి.. చేరుకునే మార్గాలు వేరైనా అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే.. యూపీఎస్సీలో విజేతలుగా నిలవడం.. ఒక్కొక్కరిది ఒక్కో కుటుంబ నేపథ్యం.. కష్టాలు ఎన్ని ఎదురైనా వారి అంకితభావం ముందు నిలువలేకపోయాయి.
మొదటి అటెంప్ట్ లోనే ఉత్తీర్ణులైనవారు కొంత మంది. అపజయానికి తలవంచక విజయం చేరే వరకు పట్టుదలతో విజయం సాధించినవారు కొందరు. చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళితే తప్పక విజయం సాధిస్తారని చెబుతున్న 2021 సివిల్ సర్వీస్ విజేతల సక్సెస్ స్టోరీలు మీకోసం..
రోజుకు 10 గంటలు చదవాలి : ఆకునూరి నరేష్ ( 117వ ర్యాంక్)
#మాది భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కాశింపల్లి గ్రామం. వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పదోతరగతి వరకు చదివాను. పాఠశాలలో ఉన్నప్పుడే ఏపీజే అబ్దుల్‌కలాంను స్ఫూర్తిగా తీసుకుని ఏదైనా సాధించాలనుకున్నాను. ఇంటర్ హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతున్నప్పుడు కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. నా తల్లిదండ్రులు ఆకునూరి అయిలయ్య, సులోచన. నా తల్లిదండ్రులకు ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లల పోషణ భారంగా ఉన్నా.. మమ్మల్ని ప్రయోజకులను చేయాలనుకున్నారు. వారి కోసం కష్టపడి చదివి ఐఐటీ మద్రాస్‌లో సీటు సాధించి బీటెక్ పూర్తిచేశాను. 2017లో ఢిల్లీలో ఏడాది కోచింగ్ తీసుకున్నాను. రెండుసార్లు సివిల్స్ రాసి విఫలమయ్యాను. మూడోసారి 2019లో రాస్తే రైల్వే పర్సనల్ సర్వీస్‌లో ఉద్యోగం వచ్చింది. కానీ నేననుకున్నది సాధించాలని మనసులో బలంగా ఉండటంతో ప్రిపరేషన్ ఆపలేదు. అందులో ట్రైనింగ్ పొందుతూనే ప్రిపరేషన్ కొనసాగించాను. సాయంత్రం శిక్షణ పూర్తవగానే చదివేవాడిని. శని, ఆదివారాలు ఎక్కువ సమయం కేటాయించి చదివాను. ఎప్పుడూ చదవడం మీదనే కాకుండా ఒత్తిడిని పోగొట్టుకోవడానికి ఆటలు ఆడటం, పాటలు వినడం చేశాను. నాకు 2020లో ప్రవళికతో వివాహం అయ్యింది. భార్య కూడా చాలా ప్రోత్సహించింది.
ఇలా చదవాలి
# రోజూ కనీసం 8 నుంచి 10 గంటలు చదివితేనే అన్ని సబ్జెక్టులు చదవడానికి అవకాశం ఉంటుంది. నేను ఎన్సీఈఆర్టీ పుస్తకాలు ఎక్కువగా చదివాను. వివిధ కోచింగ్, అకాడమీల పుస్తకాలు కూడా చదివితే అన్ని అంశాలు కవర్ చేయవచ్చు. ఒకరోజు ఎక్కువ సమయం తీసుకుని చదివి ఒకరోజు తక్కువ సమయం చదివితే అంతా గందరగోళం అవుతుంది. సబ్జెక్టుల వారీగా ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి. సాధ్యమైనన్ని ప్రాక్టీస్ టెస్ట్‌లు రాయాలి. టైం మేనేజ్మెంట్ కోసం మాక్ టెస్టులు పెట్టుకోవాలి. నిత్యం వార్తాపత్రికలు చదవాలి. వాటిలోని ఎడిటోరియల్ పేజీలు అనుసరించాలి. అందులోంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ సంబంధాలపై పట్టు సాధించాలి. ఇంటర్వ్యూలో ఎక్కువ జాతీయ, అంతర్జాయ సంబంధాలు, ప్రస్తుత పరిస్థితులపై అడుగుతారు. సొంత రాష్ట్రంలో అభివృద్ధి, ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు, సంక్షేమ పథకాలపై పట్టు సాధించాలి.
పట్టు వదలకుండా ప్రయత్నించాలి : మంత్రి మౌర్య భరద్వాజ్ (28వ ర్యాంక్)
నేపథ్యం
# మాది విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం. ఇంటర్ విశాఖపట్నం, బీటెక్ వరంగల్ నిట్‌లో పూర్తిచేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎలక్టానిక్స్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తున్నాను. బీటెక్ పూర్తయ్యాక 2017లో ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను. అప్పటి నుంచి నాలుగుసార్లు సివిల్స్ రాశాను. మొదటి సారి ఇంటర్వ్యూ దాకా వెళ్లలేక పోయాను. ఆ తర్వాత మూడుసార్లు ఇంటర్వ్యూలో విఫలమయ్యాను. ఐదోసారి విజయం సాధించి 28వ ర్యాంకు పొందాను. ఒకసారి ఓడిపోయామని ప్రయత్నాన్ని విరమించుకుంటే ఎప్పటికీ విజయం సాధించలేం. అందుకే పట్టువదలకుండా ప్రయత్నిస్తూ ఎన్నిసార్లయినా రాసి సివిల్స్ సాధించాలకున్నాను. నా సంకల్పానికి అమ్మ, నాన్న సహకారం అందించారు. నాన్న ఎంఎస్ ప్రసాద్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అమ్మ రాధాకుమారి వైద్యశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. నా ప్రిపరేషన్ కోసం అమ్మ నెలరోజులు సెలవు తీసుకుని కావాల్సినవన్నీ సమకూర్చింది. దీంతో రోజుకు కనీసం 8 గంటలు చదివాను.
ఇలా చదివితే విజయం
# మంచి మార్కులు సాధించాలంటే మొదటగా పరీక్ష విధానంపై పట్టు సాధించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనేది అంచనా వేసుకోవాలి. దానికి తగ్గట్టు ప్రిపరేషన్‌కు ఒక క్రమ పద్ధతిలో సబ్జెక్టుల వారీగా ప్రణాళిక వేసుకుని చదవాలి. వార్తాపత్రికలు, వాటిలోని ఎడిటోరియళ్లను తప్పనిసరిగా చదవాలి. నేను ఆన్లైన్లో వివిధ ఇన్స్టిట్యూషన్ల వెబ్సైట్లలో ఉన్న పుస్తకాలు చదివాను. మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేశాను. హ్యాండ్ రైటింగ్ కోసం మాక్‌టెస్టులు ప్రాక్టీస్ చేయాలి. సాధ్యమైనంత ఎక్కువ మాక్ టెస్టులు రాయడం వల్ల చేతిరాత మెరుగవుతుంది. కచ్చితంగా మూడు గంటల్లో పూర్తయ్యేలా టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఫలితం ఉంటుంది. వివిధ కోచింగ్ సెంటర్లలో పనిచేసే ఫ్యాకల్టీల సలహాలు, సూచనలు తీసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ సంబంధాలను ఎప్పటికప్పుడు అనుసరించాలి. ఇంటర్వ్యూలో తడబాటుకు గురికాకుండా సమాధానాలు చెప్పాలి. నాలుగుసార్లు ఇంటర్వ్యూను ఎదుర్కోవడం వల్ల గత అనుభవం బాగా ఉపయోగపడింది. ఇంటర్వ్యూలో ప్రశ్నలు సొంత రాష్ట్రం గురించే ఎక్కువగా అడుగుతారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఐటీ రంగం అభివృద్ధికి ఏవిధంగా కృషి చేస్తుంది? కంటోన్మెంట్ ప్రాంతం, తెలంగాణ ప్రభుత్వం మధ్య నెలకొన్న పరిస్థితులపై అడిగారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పర్యవసానాలు, క్రిప్టో కరెన్సీపై ప్రశ్నించారు.
సలహా..
# సివిల్స్‌కు ప్రిపేరయ్యేవారు నమ్మకం, పట్టుదల ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకోవాలి. అప్పుడే విజయం సాధిస్తారు.
వారం వారం టార్గెట్స్ పెట్టుకొన్నాను : ఉప్పలూరి చైతన్య (470వ ర్యాంక్)
#మాది విజయవాడ. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. ఇంటర్ వరకు విజయవాడలో, బీటెక్ విజయనగరం జేఎన్టీయూలో చేశాను. అమ్మ నిర్మలకుమారి, నాన్న బాపూజీరావు బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిప్యూటీ రీజినల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చాలామంది కలెక్టర్లు ప్రజలకు దగ్గరగా ఉంటూ చేస్తున్న సేవను, తీసుకువస్తున్న మార్పును చూసి నేను కూడా కలెక్టర్ కావాలని నిర్ణయించుకున్నాను. సివిల్స్ రాయడం ఇది నాలుగోసారి.
కోచింగ్ ఒక్కటే సరిపోదు
#ప్రిపరేషన్‌కు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోలేదు. వారం వారం టార్గెట్స్ పెట్టుకొని అవి పూర్తయ్యే వరకు సీరియస్‌గా కూర్చొని పూర్తిచేశాను. అవి పూర్తయ్యాక మళ్లీ అలాగే వారానికి ప్రణాళిక వేసుకున్నాను. అలా షార్ట్‌టైం టార్గెట్స్‌తో ప్రిపరేషన్ పూర్తి చేశాను. 2017లో ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను. ఎక్కువగా కోచింగ్ మెటీరియల్ చదివాను. కరెంట్ అఫైర్స్‌కి పేపర్ ఫాలో అయ్యాను. మొదట్లో కోచింగ్ తీసుకుంటే చాలనుకున్నాను. కానీ సివిల్స్ రాస్తున్నప్పుడు ఆ అభిప్రాయం తప్పని అర్థమయ్యింది. కోచింగ్ ఒక్కటే సరిపోదు, పేపర్‌ను ఎలా చదవాలి? ఏ యాంగిల్లో చదవాలి? అనేది తెలుసుకోవాలి. నా దృష్టిలో సివిల్స్‌కు రెండు పార్టులు ఉంటాయి. మొదటిది నాలెడ్జ్‌కు సంబంధించినది. రెండోది పరీక్ష రాసే విధానానికి సంబంధించినది.
సమయ పాలన పాటించాలి
# ప్రిలిమ్స్‌లో తప్పులను ఎలా తగ్గించుకోవాలి? క్వాలిఫై కావడానికి ఎలా చదవాలి? అనేది ముందు ఆలోచించాలి. మొదట్లో మెయిన్స్ రాసినప్పుడు మైండ్‌లో ఉన్నదంతా రాసేవాడిని. దాంతో సమయం సరిపోక అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేక మార్కులు కోల్పోయాను. తర్వాత అటెంప్ట్‌కు గతంలో చేసిన తప్పులేంటి అని నన్ను నేను రివ్యూ చేసుకొని సమయపాలన పాటించాను. పరీక్షలో ఏం రాయాలి? ఎంతరాయాలి? ఏ అంశంపై ఫోకస్ చేయాలనే దానిపైనే దృష్టిపెట్టాను. విజయం సాధించాను.
అనంత్ సార్ బోర్డు ఇంటర్వ్యూ
# ఇంటర్వ్యూకు బాలలత మేడం దగ్గర కోచింగ్ తీసుకున్నాను. టీసీ అనంత్ సార్ బోర్డు ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూకి ముందు ఇచ్చే డిటెయిల్డ్ అప్లికేషన్‌పైనే ప్రశ్నలు అడిగారు. దేశంలో స్పోర్ట్ పరిస్థితి గురించి, రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ (ఆర్‌ఈసీపీ) గురించి ప్రశ్నించారు. భారత్ ఆర్‌ఈసీపీలో చేరలేదు సరైందా? కాదా? అని ప్రశ్నించారు. భారత్ అందులో చేరకపోవడం ప్రస్తుతం సరైందే. కానీ భవిష్యత్తులో భారత్ ఇంకా స్ట్రాంగ్ అయ్యాక ఆర్‌ఈసీపీలో జాయిన్ కావాలని చెప్పాను. జాతీయ విద్యా విధానానికి సంబంధించి ఏవైనా నాలుగు అంశాలను వివరించమన్నారు. ఎక్కువగా పర్సనల్ విషయాలపై ఫోకస్ చేశారు.
సలహా..
#సివిల్స్ సాధించాలంటే మొండిగా కూర్చొని చదవాలి. అలా అని ఎక్కువసార్లు ఎక్కువ సమయం అంతా దానికే కేటాయించొద్దు. ఒక సంవత్సరం టార్గెట్ పెట్టుకొని దానిని పూర్తి చేయాలి. యూపీఎస్సీ మన నుంచి ఏం డిమాండ్ చేస్తుందో తెలుసుకొని, ఆ వైపుగా ప్రిపరేషన్ ఉండాలి. గతంలో సివిల్స్ రాసిన వాళ్ల తప్పులు, అనుభవాలను తెలుసుకొని మన విషయంలో అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఏం చదవాలో, ఎంత చదవాలో తెలుసుకొని చదివితే మొదటి అంటెప్ట్లోనే విజయం సాధించవచ్చు.
ఏఈగా పనిచేస్తూనే సివిల్స్ : బొక్క చైతన్యరెడ్డి (161వ ర్యాంక్)
ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. అలా ఐదు సార్లు రాసినా విజయం దక్కలేదు. అయినా మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో చదువుతూ ఆరోసారి విజయబావుటా ఎగురవేశారు హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సీటీ మొదటి గేట్ సమీపంలోని విద్యారణ్యపురికాలనీకి చెందిన చైతన్య రెడ్డి. ఆమె విజయ ప్రస్థానం ఆమె మాటల్లో..
అన్న సహకారంతో..
# మాది సూర్యాపేట జిల్లా నూతకల్ మండలం చిల్పకుంట్ల గ్రామం. తల్లిదండ్రులు బొక్క వెంకమ్మ, ముత్తారెడ్డి. నాన్న వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం రీత్యా 20 సంవత్సరాల క్రితం హనుమకొండకు వచ్చి స్థిరపడ్డాం. స్కూల్ ఎడ్యుకేషన్ హనుమకొండ, ఇంటర్ విజయవాడ, బీటెక్ వరంగల్ నిట్‌లో పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ప్రైవేట్ ఉద్యోగాన్ని వదిలేసి, 2016లో ఏఈగా జాబ్ సాధించాను. కొమురెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఇరిగేషన్ డిపార్ట్ మెంట్లో ఏఈగా పని చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. అన్నయ్య రవికిరణ్‌రెడ్డి ఎంతో సహకారం అందించాడు. జాబ్ చేసి అలసిపోయిన నాకు చదివి వినిపించి.. వివరించేవాడు.
ప్రజలకు సేవ చేయాలని
#ప్రజా సేవ చేయడానికే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. స్కూల్లో చదివే సమయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యురాలిని కావాలనే కోరిక ఉండేది. సివిల్స్ సాధిస్తే ప్రజలకు ఏ విధంగా సహాయం అందిస్తామో అని నాన్న పదే పదే చెప్పేవాడు. దీంతో సివిల్స్ వైపు అడుగులేశాను.
ప్రిపరేషన్
# గతంలో వచ్చిన ప్రశ్నలను బాగా చదివాను. టాపర్స్‌ను ఫాలో అయ్యాను. చదివిన వాటిని మళ్లీ గతంలో ఉన్న వాటితో సరిచూసుకునేదాన్ని. బేసిక్స్ బుక్స్ మాత్రమే ఒక ప్రణాళి ప్రకారం చదివాను. జాగ్రఫీ, హిస్టరీ NCERT బుక్స్, పాలిటిక్స్ లక్ష్మీకాంత్, ఎకానమీ మృనాల్ బుక్స్ ప్రిపేరయ్యాను. రోజుకు 6 నుంచి 10 గంటలు చదివాను.
స్మితా నాగరాజ్ బోర్డు
# స్మితా నాగరాజ్ మేడం బోర్డ్ ఇంటర్వ్యూ చేసింది. దాదాపు 30 నిమిషాల పాటు ఇంటర్వ్యూ సాగింది. ఇంటర్వ్యూలో తెలంగాణ, తెలంగాణ పథకాలపై ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించారు. వీటితో పాటు సివిల్ ఇంజినీరింగ్‌లో టెక్నాలజీ పై కూడా అడిగారు.
సలహా..
#కష్టపడే వారికి తప్పకుండా విజయం సొంతమవుతుంది. పరాజయాలు వస్తే కుంగిపోకూడదు. లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సివిల్స్‌లో ఎంత ఎక్కువ చదివామన్నది కాకుండా ఏం చదివామన్నదే ముఖ్యం. లక్ష్యం ముందు కష్టం చిన్నగా కనిపించాలి.
కష్టపడితే విజయం: అరుణ (308వ ర్యాంక్)
ఎగిసిపడే అలల్లా కొంతమంది ఓటమిని ఒప్పుకోరు. పట్టువదలని విక్రమార్కుడిలా విజయ తీరాలకు చేరుతారు. ఆ కోవలోకే వస్తారు అరుణ ఎం. మీపై మీరు నమ్మకంతో వెనకడుగు వేయకుండా కష్టపడితే తప్పకుండా విజయం వరిస్తుందనడానికి అరుణే మంచి ఉదాహరణ. ఐదుసార్లు సివిల్స్‌లో ఓటమి చవిచూసినా తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 308వ ర్యాంకు సాధించిన అరుణ సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం..
# అరుణది కర్ణాటకలోని తుముకూర్ జిల్లా. ఐదుగురు అక్కాచెల్లెళ్లలో మూడో అమ్మాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసింది. వాస్తవానికి ఆమె సివిల్స్ కొట్టాలని ఏనాడూ అనుకోలేదు. పది నుంచి పదిహేను వేల రూపాయలు వచ్చే ఏదైనా ఉద్యోగం చేసుకొని బతకాలనుకుంది. కానీ ఆమె తండ్రి తన పిల్లలు సివిల్స్ రాయాలని, స్వతంత్రంగా బతకాలని కోరుకునేవారు. పేదరికం అయినా అప్పులు చేసి పిల్లల్ని చదివించారు. అరుణ ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు 2009లో చదువులకు చేసిన అప్పుల వల్ల తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు ఆమె ఇద్దరు అక్కలు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ, ఆమె చదువుకు సహకరించారు.
ఐఏఎస్ అకాడమీ ఏర్పాటు
#చాలాసార్లు సివిల్స్‌లో అపజయాన్ని చూసినా తనలా సివిల్స్ రాసే వారిని ప్రోత్సహించాలను కున్నది. దీంతో ఆమె ఐఏఎస్ అకాడమీని బెంగళూరులో ఏర్పాటు చేసింది. గ్రామీణ యువకులను ప్రోత్సహిస్తూ సివిల్స్ సాధించడానికి తోడ్పాటు అందిస్తుంది.
# ఒక్కోసారి పరిస్థితులే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తండ్రి మరణం తన ప్రణాళికను, కలను మార్చివేసింది. తండ్రి కలను నెరవేర్చాలనుకుని, సివిల్స్ రాయాలని నిర్ణయించుకుంది. 2014లో మొదటిసారి సివిల్స్ రాసింది. కానీ ఫలితం రాలేదు. అలా ఐదుసార్లు రాసినా విజయం వరించలేదు. ఆరోసారి 2021 సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించింది. వెనుకబడిన తరగతులకు చెందిన అరుణ రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థి అయినా ఓపెన్‌లో 308వ ర్యాంకు పొందింది.
#వ్యవసాయదారులకు సాయం చేస్తూ వారి చిరునవ్వులో తన తండ్రిని చూసుకోవాలనుకుంటుంది. ‘నేను సివిల్స్ సాధించడం ద్వారా మా నాన్న కల నెరవేరింది. నా కలను మా నాన్నలా ఆత్మహత్య చేసుకోనివ్వను. రైతులకు సహాయం చేయడం ద్వారా నా కలను సజీవంగా బతికిస్తాను’ అంటుంది అరుణ.
ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే : శరత్‌నాయక్ (374వ ర్యాంక్)
కుటుంబం
# అమ్మ యమున అంగన్వాడీ టీచర్, నాన్న భాషా రైతు. టెన్త్, ఇంటర్ జగిత్యా లలోనే చదివాను. తర్వాత వెటర్నరీ అండ్ యానిమల్ హజ్బెండరీ కోర్సును కోరుట్లలో పూర్తి చేశాను.
ప్రిపరేషన్
#ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదువుతూ నోట్స్ తయారు చేసుకున్నాను. ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు డిగ్రీ క్లాసులు ఉండేవి. తర్వాత పూర్తిగా సివిల్స్ సబ్జెక్ట్ చదివే వాడిని. వెటర్నరీ డిగ్రీ 2020లో పూర్తయ్యింది. సంవత్సరం పాటు హైద రాబాద్లోని లైబ్రరీలో కూర్చొని చదివాను. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. బైపీసీ చదవడం వల్ల అవగాహన లేని ఎకానమీ, పాలిటీ, హిస్టరీపై ఎక్కువ దృష్టి పెట్టాను. 6 నెలల్లో మెయిన్స్ ప్రిపరేషన్ అయ్యేలా చూసుకున్నాను. రోజుకు 12 గంటలు కష్టపడి చదివాను. అందులో దాదాపు 8 గంటలు రాయడంపైనే దృష్టి పెట్టాను. ప్రిలిమ్స్‌కు నాలుగు నెలల ముందు నుంచి పూర్తిగా బేసిక్ ప్రిప రేషన్‌పైనే దృష్టి పెట్టాను. రోజూ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేసి, సీనియర్స్‌తో దిద్దిం చుకునేవాడిని. రెండు నెలలు ముందు మార్కెట్లో దొరికే వివిధ సబ్జెక్టుల మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేస్తూ ఏ అంశంలో వీక్‌గా ఉన్నానో తెలుసుకొని దానిని బాగా చదివాను.
స్మితా నాగరాజ్ మేడం బోర్డు
# బాలలత మేడం దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాను. స్మితా నాగరాజ్ మేడం బోర్డు ఇంటర్వ్యూ చేసింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి కారణాలు, భారత్ ఏ దేశాలతో సరిహద్దులు పంచుకుంటుందో అడిగారు. ఆ దేశాల పేర్లు చెప్పగా.. అఫ్గానిస్థాన్‌తో బోర్డర్ పంచుకోవడం లేదు కదా? అని ప్రశ్నించగా.. పంచుకుంటుందని బోర్డర్ పేరు చెప్పాను. వెటర్నరీ డాక్టర్‌గా ఎలాంటి వెటర్నరీ పాలసీ తెస్తావు? కొవిడ్‌ను ఎలా అరికడతావు? చైనా పొలిటికల్ సిస్టమ్‌తో ఇండియా పొలిటికల్ సిస్టమ్‌ను ఏ విధంగా పోలుస్తావు? అని అడిగారు. తెలంగాణ గురించి అడుగుతూ చిన్న రాష్ట్రాలు అవసరమేనా? అని ప్రశ్నిం చారు. రాష్ట్రాల విభజన ప్రజల ఇష్టంతోనే జరుగుతుందా? అని అడిగారు. ప్రధానమంత్రి సెక్యూరిటీ గురించి, ప్రొటోకాల్ గురించి ప్రశ్నించారు.
సలహా
# ముందుగా సివిల్స్ చదవాలనే అంకితభావం, పట్టుదల ఉండాలి. బేసిక్ బుక్స్, కాన్సెప్ట్ పై దృష్టి పెట్టాలి. తర్వాత సబ్జెక్ట్ బుక్స్ చదవాలి. నోట్స్ తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ ప్రాక్టీస్ టెస్ట్‌లు రాస్తూ, ఎక్కడ, ఏ సబ్జెక్టులో డౌట్స్ వస్తున్నాయో గమనించి వాటిపై దృష్టి పెట్టి చదవాలి. తప్పులను సరిదిద్దుకోవాలి. రోజువారీ, వారం, మంత్లీ ప్లాన్ ఉండాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?