రాజకీయ పార్టీగా తెలంగాణ ప్రజాసమితి ( తెలంగాణ హిస్టరీ)
గత తరువాయి..
# తెలంగాణ ప్రజాసమితిని రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు 1971, జనవరి 4న సమితి అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి ప్రకటించారు. ఈ సమయంలో ఇందిరాగాంధీ పార్లమెంట్‌ను రద్దు చేయడంతో మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి పార్టీ (టీపీఎస్) ‘పార’ గుర్తుతో పోటీ చేయగా, ఇందిరా కాంగ్రెస్ ఆవు-దూడ గుర్తుతో పోటీ చేసింది.
# ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 14 లోక్‌సభ స్థానాల్లో 10 లోక్‌సభ స్థానాలను 47.5 శాతం ఓట్లతో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. సీపీఐ ఎం కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే అది కూడా 7,600 ఓట్ల మెజారిటీతో గెలిచింది. ఈ మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభంజనం దేశ వ్యాప్తంగా వీచినా తెలంగాణలో మాత్రం తెలంగాణ ప్రజా సమితి 14 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలను గెలుచుకొని తెలంగాణ ఆకాంక్షను బలంగా చాటింది.
# 1972లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇందిరాగాంధీ టీపీఎస్ని విలీనం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. చెన్నారెడ్డిని నిస్సహాయస్థికి నెట్టి తనకనుకూలంగా పరిస్థితిని మార్చుకోవాలనుకున్నారు. తెలంగాణ నుంచి గెలిచిన పదిమంది ఎంపీల్లో ఎనిమిది మందిని తనవైపు తిప్పుకొన్నారు. ఈ ఎంపీలంతా ఇందిరతో చేయి కలిపి టీపీఎస్ విలీనానికి రంగం సిద్ధం చేశారు. పదిమంది ఎంపీల్లో చెన్నారెడ్డి వెంట ఉన్నది ఎం సత్యనారాయణ రావు, ఎస్బీ గిరి మాత్రమే. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో చెన్నారెడ్డి కొన్ని షరతులతో టీపీఎస్ విలీనానికి ఒప్పుకొన్నారు.
ముఖ్యమంత్రి రాజీనామా
#1971, సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ సీఎం బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 18న కాంగ్రెస్ లో విలీనానికి టీపీఎస్ కార్యవర్గం నిర్ణయించింది. 19న టీపీఎస్ అత్యున్నత నిర్ణయాధికార విభాగమైన రాష్ట్ర కౌన్సిల్ దీన్ని ఆమోదించింది. 24న ఢిల్లీలోని ఏఐసీసీ కూడా టీపీఎస్ విలీనానికి తీర్మానం చేసింది. ఈ విధంగా టీపీఎస్ కాంగ్రెస్ లో విలీనమైంది. 1975, సెప్టెంబర్ 25న చెన్నారెడ్డి సూచన మేరకు పీవీ నర్సింహారావును ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. సెప్టెంబర్ 30న పీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. చెన్నారెడ్డి ప్రధాని ముందు పెట్టిన షట్ సూత్రాల్లో కేవలం మొదటిది మాత్రమే అమలైంది. తన సూచన మేరకు ముఖ్యమంత్రిగా నియమితులైన పీవీ.. చెన్నారెడ్డి చెప్పిన ఆరుగురు మంత్రుల పేర్లలో కేవలం ఇద్దరినే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. దీంతో పీవీతో చెన్నారెడ్డికి మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఇందిరాగాంధీ టీపీఎస్ విలీనం తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయాన్ని వదిలేసి 15 ఏండ్లలో తెలంగాణను అభివృద్ధి చేసే ప్రణాళికను ముందుపెట్టింది.
తెలంగాణ అమరవీరుల స్థూపం
# 1969 ఉద్యమంలో అమరులైన వారి జ్ఞాపకార్థం అమరవీరుల స్మారక స్థూపాన్ని నెలకొల్పాలని విద్యార్థి సభ నిర్ణయించింది. 1970, ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో ఈ స్మారక స్థూపానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ శంకుస్థాపనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వ అనుమతి లేనప్పటికీ అనేక నిషేధాజ్ఞలను ఉల్లంఘించి గన్‌పార్క్‌లో అప్పటి నగర్ మేయర్ లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు.
# ఈ సందర్భంగా నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు పోలీసులు మర్రి చెన్నారెడ్డి, మేయర్ లక్ష్మీనారాయణ, టీ గోవింద్ సింగ్, మల్లికార్జున్ మొదలైన నాయకులను అరెస్ట్ చేశారు. 1970, ఫిబ్రవరి 28న గన్‌పార్క్‌లో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని పోలీసులు తొలగించారు. ఆ తరువాత కాలంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మున్సిపల్ కార్పొరేటర్ల కృషి వల్ల ఈ స్థూపాన్ని ప్రారంభించారు.
# ఈ స్థూప నిర్మాణం 1975లో పూర్తయ్యింది. ఈ స్థూపాన్ని నిర్మించిన కళాకారుడు, శిల్పి ఎక్కా యాదగిరి రావు. కానీ విషాదకరమైన విషయం ఏమిటంటే ఈ స్థూపాన్ని ఇప్పటి వరకు ఆవిష్కరించలేదు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ ప్రాంతంలో నిర్మించిన మరో అమరవీరుల స్థూపాన్ని 1970, ఫిబ్రవరి 25న నగర డిప్యూటీ మేయర్ మ్యాడం రామచంద్రయ్య శంకుస్థాపన చేశారు.
స్థూపం ప్రత్యేకతలు
#ఈ స్థూపం అడుగు భాగాన్ని నల్లని రాయితో తయారు చేశారు. ఈ స్థూపానికి నాలుగు వైపులా ఉన్న శిలాఫలకాలపై ప్రతి వైపు తొమ్మిది రంధ్రాలున్నాయి. అప్పటి తెలంగాణలోని తొమ్మిది జిల్లాలకు సంకేతం ఈ తొమ్మిది రంధ్రాలు. అడుగు భాగంపై నిర్మించిన స్థూపం ఎర రంగు రాయితో నిర్మించారు. ఎరుపు రంగు త్యాగానికి గుర్తుగా ఎరుపురాయిని ఎంచుకున్నారు. ఈ స్థూపం దగ్గర ఉన్న మరొక తోరణాన్ని సాంచీ స్థూపం నుంచి స్వీకరించారు. శిలాఫలకానికి నాలుగు వైపులా చెక్కిన పుష్పాలు అమరవీరులకు అర్పించే నివాళులకు సంకేతం.
#స్థూపం మధ్యభాగంలో ఉన్న స్తంభంపై ఏ వైపు నుంచి చూసినా దానిపై గీతలు కనిపిస్తాయి. ఈ తొమ్మిది గీతలు కూడా తొమ్మిది జిల్లాలకు సంకేతం. స్థూపంపై భాగంలో అశోకుని ధర్మచక్రాన్ని నిర్మించారు. 1969 ఉద్యమంలో చనిపోయిన అమరవీరులు ధర్మ సంస్థాపన కోసం తమ ప్రాణాలు బలిపెట్టారని తెలియజేయడానికి స్థూపం పై భాగంలో ఈ అశోకుని ధర్మచక్రాన్ని నిర్మించారు. స్థూప శీర్ష భాగంలో నిర్మించిన తొమ్మి ది రేకులు కలిగిన మల్లెపువ్వు స్వచ్ఛతకు సంకేతం. అమరవీరుల స్వచ్ఛమైన త్యాగానికి, సాహసానికి సంకేతంగా మల్లెపువ్వును స్థూప శీర్ష భాగంలో ఏర్పాటు చేశారు.
జై ఆంధ్ర ఉద్యమం
# కాసు బ్రహ్మానంద రెడ్డి రాజీనామా అనంతరం 1971, సెప్టెంబర్ 30న పీవీ నర్సింహారావు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. పీవీ నర్సింహారావు విశాలాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనడం, బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో పనిచేయడం వల్ల కూడా ఆంధ్ర ప్రాంతీయులు ఇతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించలేదు.
# 1972లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచింది. ఈ విజయానంతరం ముఖ్యమంత్రి అభ్యర్థిగా పీవీ నర్సింహారావు అభ్యర్థిత్వాన్ని అధిష్టానం స్పష్టం చేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తరువాత కాలంలో అంటే 1972, ఫిబ్రవరి 14న జస్టిస్ ఓబుల్ రెడ్డి అధ్యక్షతన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కాదని తీర్పు చెప్పింది.
# ఈ తీర్పు అనంతర కాలంలో 1972, ఫిబ్రవరి 17న వరంగల్‌లోని ఆజాంజాహీ మిల్లు మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఇందిరాగాంధీ తెలంగాణకు అన్యాయం జరగనీయబోనని ప్రకటించారు. దీంతో ఇందిరాగాంధీ సూచన మేరకు పీవీ నర్సింహారావు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసు వాదించిన న్యాయవాదుల్లో ముఖ్య న్యాయవాది వీ నర్సింగరావు (పీవీ వియ్యంకుడు).
#ముల్కీ నిబంధనలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో పీవీ నర్సింహారావు కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా కేంద్రప్రభుత్వం భూ సంస్కరణల చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో పీవీ నర్సింహారావు కింది నిర్ణయాలు తీసుకున్నారు.
1) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1972, మే 2న జారీ చేసిన ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలో అన్ని రకాల భూ లావాదేవీలను నిలిపివేసింది.
2) 1972, సెప్టెంబర్ 15న భూ గరిష్ఠ పరిమితి బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది.
#ఈ భూగరిష్ఠ పరిమితి చట్టం వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల భూ స్వాములు పీవీ నర్సింహారావుకు వ్యతిరేకంగా మారారు. ఇలా రాష్ట్రంలో అన్ని పరిస్థితులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్న కాలంలో 1972, అక్టోబర్ 3న ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
# ఈ తీర్పులో తెలంగాణలో కొనసాగుతున్న ముల్కీ నిబంధనలు రాజ్యాంగంలోని 35(బి) కింద చట్టబద్ధమైనవే అని పేర్కొంది. ఈ తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి పీవీ సుప్రీంకోర్టు ‘నిర్ణయం ఈ సమస్య పట్ల సందేహానికి, వివాదానికి తావులేని వ్యాఖ్యానాన్ని ఇచ్చిందని’ హర్షం వ్యక్తం చేశారు.
# ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో అప్పటికే పీవీకి వ్యతిరేకంగా ఉన్న ఆంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు జై ఆంధ్ర అనే కృత్రిమ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. దీంతో ఆంధ్ర ప్రాంతంలోని విద్యార్థులు, సమ్మెలు, సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. ఈ సమయంలో అక్టోబర్ 24న ముఖ్యమంత్రి అధికార పర్యటనలో భాగంగా ఏలూరును సందర్శించగా అక్కడి విద్యార్థులు పీవీని అవమానించారు. జై ఆంధ్ర ఉద్యమాన్ని చల్లార్చడానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1972, నవంబర్ 27న పంచసూత్ర పథకాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటించారు.
మాదిరి ప్రశ్నలు
1. తెలంగాణ ప్రజాసమితిని రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్లు మర్రి చెన్నారెడ్డి ఎప్పుడు ప్రకటించారు?
1) 1971, జనవరి 4
2) 1971, జనవరి 6
3) 1972, జనవరి 4
4) 1972, జనవరి 6
2. 1971లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో ఆవు దూడ గుర్తుతో పోటీ చేసింది?
1) తెలంగాణ ప్రజా సమితి
2) ఇందిరా కాంగ్రెస్
3) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
4) భారతీయ జనసంఘ్
3. కింది వాటిలో సరైనవి?
1) 1971లో లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి 14 లోక్‌సభ స్థానాల్లో 10 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంది
2) ఈ ఎన్నికల్లో ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కేవలం 3 స్థానాలు మాత్రమే గెలుచుకుంది
3) 1 సరైనది 4) 1, 2 సరైనవి
4. పీవీ నర్సింహారావు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎప్పుడు
ఎన్నికయ్యారు?
1) 1971, సెప్టెంబర్ 15
2) 1971, అక్టోబర్ 15
3) 1971, సెప్టెంబర్ 30
4) 1971, అక్టోబర్ 15
5. తెలంగాణ అమరవీరుల స్మారక స్థూప నిర్మాత?
1) ఎక్కా యాదగిరి 2) బీఎస్ రాములు
3) బీవీఆర్ చారి 4) వీ ప్రకాశ్
6. కింది వాటిలో సరైనవి?
1) 1970, ఫిబ్రవరి 23న అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేసినది- మేయర్ లక్ష్మీనారాయణ
2) 1970, ఫిబ్రవరి 25న సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేసినది- డిప్యూటీ మేయర్ మ్యాడం రామచంద్రయ్య
3) 1 4) 1, 2
7. ఎవరి అధ్యక్షతన గల హైకోర్టు ఫుల్ బెంచ్ ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధం కావని తీర్పు చెప్పింది?
1) జస్టిస్ గురువారెడ్డి
2) జస్టిస్ ఓబుల్ రెడ్డి
3) జస్టిస్ వీ నర్సింగరావు
4) జస్టిస్ హిదాయతుల్లా
8. ముల్కీ నిబంధనలు చట్టబద్ధమైనవేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఎప్పుడు?
1) 1972, అక్టోబర్ 3
2) 1971, సెప్టెంబర్ 3
3) 1971, అక్టోబర్ 3
4) 1972, సెప్టెంబర్ 3
9. ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్లో పంచసూత్ర పథకాన్ని ప్రకటించినది?
1) 1973, నవంబర్ 27
2) 1972, నవంబర్ 27
3) 1971, నవంబర్ 27
4) 1974, నవంబర్ 27
10. 1971 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఏ గుర్తుపై పోటీ చేసినది?
1) ఆవు దూడ 2) కారు
3) పార 4) విల్లు
11. 1971 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి సాధించిన ఓట్ల శాతం?
1) 47.5 2) 51.5
3) 52.5 4) 48.5
జవాబులు
1-1, 2-2, 3-4, 4-3, 5-1, 6-4, 7-2, 8-1, 9-2, 10-3, 11-1
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు