Success Stories | ఎంసెట్ ర్యాంకర్స్ వాయిస్
TS Eamcet 2023 | బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్ బీఎస్సీ, బీవీఎస్సీ, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెలువడ్డాయి.. ఈ పరీక్ష సుమారు లక్షకుపైగా రాశారు. దీనిలో ర్యాంకులు సాధించినవారు చదివిన తీరు, లక్ష్యాలు, సలహాలు ‘నిపుణ’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లో..
1.నా కల.. కార్డియాలజిస్ట్
బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్
మార్కులు- 155.008732
1వ ర్యాంక్
కుటుంబ నేపథ్యం ? విద్యాభ్యాసం?
మాది ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి జిల్లా, మల్లయ్యపేట మండలం, కాతేరు గ్రామం. నాన్న సాయిరామకృష్ణ రైతు, అమ్మ రజని గృహిణి. 10వ తరగతి, ఇంటర్ రాజమండ్రిలో చదివాను.
ఎన్ని గంటలు చదివావు?
మా కాలేజీలోనే ప్రిపరేషన్ జరిగింది. రోజుకు 13-16 గంటలు చదివాను.
మెరిట్ టెస్ట్‌లు?
ఏపీ ఎంసెట్, నీట్ మాత్రమే రాశాను.
భవిష్యత్ లక్ష్యాలు ఏంటి?
ఎంబీబీఎస్ సీట్ సంపాదించి కార్డియా లజీలో స్పెషలైజేషన్ తీసుకొని కార్డియాలజిస్ట్‌గా స్థిరపడాలనుకుంటున్నాను.
విద్యార్థులకు సలహాలు, సూచనలు
ఎంసెట్, ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి ప్యాషన్‌తో, కృషి, పట్టుదలతో ప్రిపేరైతే అనుకున్న ర్యాంక్ సాధించవచ్చు. అపజయాలు ఎదురైనా వాటిలో లోపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండాలి.
2.నిరంతర ప్రయత్నమే విజయానికి మార్గం
నాసిక వేంకట తేజ
మార్కులు- 154.601
2వ ర్యాంక్
కుటుంబ నేపథ్యం ? విద్యాభ్యాసం?
మాది ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా, చీరాల మండలం. నాన్న సుధీర్ బాబు, అమ్మ శ్రీదేవి ఇద్దరూ చేనేత వృత్తి చేస్తున్నారు. నా విద్యాభ్యాసం అంతా చీరాలలోనే జరిగింది. ఇంటర్ విజయవాడలో చదివాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
రోజూ 10-12 గంటలు కాలేజీలోనే చదివాను. కాలేజీలో రాసిన మాక్ టెస్ట్‌లు ఎంతో తోడ్పడ్డాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం, లెక్చరర్ల సూచనలు ఎంతో ఉపకరించాయి.
మెరిట్ టెస్ట్‌లు?
నీట్, ఎంసెట్ రాశాను.
కాలేజీలో రెండిటిపై క్రమపద్ధతిలో కోచింగ్ ఇచ్చారు.
భవిష్యత్ లక్ష్యాలు?
నీట్లో వచ్చిన ఫలితాలను బట్టి సీటు వచ్చిన కాలేజీలో జాయినై, అక్కడి టీచింగ్‌ను బట్టి స్పెషలైజేషన్ ఎంచుకొని డాక్టర్ వృత్తిలో స్థిరపడతాను.
విద్యార్థులకు సలహాలు, సూచనలు?
ఏకాగ్రత, పట్టుదలతో చదివి, అనుకున్న ర్యాంక్ సాధించే వరకు దీక్షగా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒకసారి ప్రయత్నించి రాలేదని నిరుత్సాహ పడకుండా బెటర్ ర్యాంక్ కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి.
3.న్యూరాలజిస్ట్‌గా సేవలందిస్తా
పసుపులేటి లక్ష్మీసఫల్
మార్కులు – 154.520464 3వ ర్యాంక్
కుటుంబ నేపథ్యం ? విద్యాభ్యాసం?
మాది హైదరాబాద్‌లోని కోకాపేట. నాన్న శ్రీచరణ్ ఎమర్జెన్సీ ఫిజీషియన్ డాక్టర్, అమ్మ గృహిణి (బయో టెక్నాలజీలో మాస్టర్స్ చేశారు). హైదరాబాద్‌లోనే 8 నుంచి 10వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో, ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదివాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
నా ప్రిపరేషన్ మొత్తం కాలేజీలోనే జరిగింది. రోజుకు 10 నుంచి 12 గంటలు ప్రిపేరయ్యాను.
మెరిట్ టెస్ట్‌లు?
ఎంసెట్, నీట్ రాశాను.
భవిష్యత్ లక్ష్యాలు?
ఎంబీబీఎస్‌లో న్యూరాలజీ స్పెషలైజేషన్ తీసుకొని న్యూరాలజిస్ట్‌గా స్థిరపడాలనుకుంటున్నాను.
విద్యార్థులకు సలహాలు, సూచనలు?
భవిష్యత్ లక్ష్యంపై ఒక అవగాహన ఉండాలి, దానికోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా మలచుకొని, ఏకాగ్రత, పట్టుదలతో కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి.
4. గత పరీక్ష పత్రాలనూ పరిగణించాలి
దేవగూడి గురు శశిధర్ రెడ్డి
6 వ ర్యాంక్
మార్కులు – 152.445127
కుటుంబ నేపథ్యం ? విద్యాభ్యాసం?
మాది కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం. నాన్న మల్లేశ్వర్ రెడ్డి VIYASHలోని ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు. అమ్మ సుష్మ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. 1-7వ తరగతి వరకు ప్రొద్దుటూరులో, 8-10వ తరగతి వరకు విజయవాడలోని ప్రైవేటు స్కూళ్లలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
ఇంటర్ కాలేజీవారే కోచింగ్ ఇచ్చారు. రోజూ 12-14 గంటలు చదివాను.
మెరిట్ టెస్ట్‌లు?
ఎంసెట్, నీట్ రాశాను.
భవిష్యత్ లక్ష్యాలు?
నీట్లో ర్యాంక్‌ను బట్టి టాప్ 3 కాలేజీలో ఎంబీబీఎస్ తీసుకొని న్యూరాలజిస్ట్‌గా స్థిరపడాలని అనుకుంటున్నాను.
విద్యార్థులకు సలహాలు, సూచనలు?
అనుకున్న ర్యాంక్, లక్ష్యం చేరేవరకు ఫోకస్డ్గా, నిబద్ధత, పట్టుదలతో ప్రిపేరవ్వాలి. ప్రిపరేషన్లో మెళకువలను తెలుసుకొని సాధనను సులభం చేసుకోవాలి. భయపడకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. పూర్వపు ప్రశ్నపత్రాలను తరచుగా పరిశీలిస్తూ అందులో వచ్చే ప్రశ్నలను కూడా చదవాలి.
5.నిరంతర రివిజన్తో విజయం
కొల్లబత్తుల ప్రీతమ్ సిద్ధార్థ్
10 వ ర్యాంక్
మార్కులు – 152.445127
కుటుంబ నేపథ్యం ? విద్యాభ్యాసం?
మాది హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్. నాన్న హర్షవర్ధన్ న్యూరోసర్జన్, అమ్మ శాంతి గైనకాలజిస్ట్. హైదరాబాద్‌లోనే పదవ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో, ఇంటర్ ప్రైవేట్ కాలేజీలో చదివాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
కాలేజీవారు ఎంసెట్‌కు క్రమపద్ధతిలో కోచింగ్ ఇచ్చారు. ఎగ్జామ్‌కు ఐదు నెలల ముందు నుంచి రోజుకు 10 గంటలు ప్రిపేరయ్యాను. హిమాయత్పగర్లోని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను. వారి టీచింగ్, మాక్ టెస్ట్‌లు, ప్రిపరేషన్ మాడల్ ప్రశ్నపత్రాలు ఎంతో ఉపయోగపడ్డాయి. కాలేజీలో ఎంసెట్ కోసం ప్రిపేరవుతూ, నీట్‌కు సంబంధించి డౌట్స్‌ను క్లారిఫై చేసుకోవడానికి, ఇన్స్టిట్యూషన్లోని టీచర్స్ ఎంతగానో సహాయం చేశారు.
మెరిట్ టెస్ట్‌లు?
10వ తరగతిలో ఉండగా NSO, IMO, NTSC వంటి కాంపిటీటివ్ పరీక్షలు రాశాను. ఇప్పుడు ఎంసెట్, నీట్ రాశాను.
భవిష్యత్ లక్ష్యాలు?
నీట్లో సాధించిన మార్కులను అనుసరించి ఢిల్లీ ఎయిమ్స్లోగాని, జిప్మర్లోగాని, ఏదైనా మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి స్పెషలైజేషన్ అంటూ ఏం అనుకోలేదు. చేరే కాలేజీలోని బోధనా పద్ధతులను అనుసరించి ఎంబీబీస్ చివరి సంవత్సరానికి స్పెషలైజేషన్‌ను ఎంచుకుంటాను.
విద్యార్థులకు సలహాలు, సూచనలు?
నేటి విద్యార్థులు ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతున్నారు. అది మంచిది కాదు. అది ముఖ్యంగా ఇటువంటి పరీక్షల్లో ఉపయోగపడదు. ఆందోళన చెందడం వల్ల మెదడు పనితీరు సరిగా ఉండదు. దానివల్ల ప్రతిసారీ మిగిలిన సమయాన్ని తలుచుకుంటూ మరింత కంగారు పడతారు. ఎప్పటికప్పుడు వీలైనంత ఎక్కువసార్లు రివైజ్ చేస్తూ ఉండాలి. పరీక్షలకు స్ట్రెస్ తీసుకోకుండా సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పదే పదే సమయం గురించి ఆలోచించకుండా రాయాల్సిన ప్రశ్నల మీద దృష్టిసారించాలి. కంగారు, ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎక్కువ ప్రశ్నలకు జవాబులను రాయగలం.
6.సమయాన్ని విభజించుకోవాలి
ఎంసెట్ ఇంజినీరింగ్ 1వ ర్యాంక్
సనపాల అనిరుధ్
ఎంసెట్ మార్కులు- 158.898780
కుటుంబ నేపథ్యం ఏంటి? విద్యాభ్యాసం?
మాది శ్రీకాకుళం జిల్లాలోని నందిగ్రామ్ మండలం, దిమిలాడ గ్రామం. ప్రస్తుతం విశాఖపట్నంలోని సీతంపేటలో స్థిరపడ్డాం. నాన్న ఖాజేశ్వరరావు వైజాగ్ ఎస్ఐ, అమ్మ గృహిణి. ఇంటర్ విజయవాడలో ప్రైవేట్ కాలేజీలో చదివాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
కాలేజీలోనే ఎంసెట్‌కు, జేఈఈకి కోచింగ్ ఇచ్చారు. ఎంసెట్‌కు 3 నుంచి 4 వారాల ముందు నుంచి రోజుకు 12 గంటలు ప్రిపేర్ అయ్యాను. జేఈఈ కోసం కూడా 12 గంటలు ప్రిపేర్ అయ్యాను.
మెరిట్ టెస్ట్‌లు ?
ఏపీ ఎంసెట్, జేఈఈ మెయిన్స్ రాశాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అయ్యాను. అది కూడా రాస్తాను.
భవిష్యత్ లక్ష్యాలు?
ఐఐటీ బాంబేలో సీట్ సంపాదించి, సీఎస్ఈ బ్రాంచ్‌లో చేరుతాను. ఆ తరువాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తిచేసి విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకుంటున్నాను.
విద్యార్థులకు సలహాలు, సూచనలు?
పరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రతి విద్యార్థి సమయాన్ని చాలా ముఖ్యంగా పరిగణించాలి. ఆందోళనకు కొంచెం కూడా తావివ్వకూడదు. కంగారు పడటం వల్ల సమయాన్ని వృథా చేసుకోవడమే కాకుండా వచ్చిన జవాబులను కూడా పూర్తిగా రాసే వీలుండదు. కాబట్టి వీలైనంత వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నేను అలానే చేశాను. సమయం అనేది చాలా విలువైనది. ముఖ్యంగా ఇటువంటి పరీక్షలకు సమయం చాలా ప్రధనం. ఉన్న సమయం తక్కువ కనుక ప్రతి క్షణం విలువైనదిగా భావించి ఉన్న ప్రశ్నలకు తగినట్టు సమయాన్ని విభజించుకొని పరీక్షలకు సన్నద్ధమవ్వాలి. అప్పుడు మాత్రమే అనుకున్న విధంగా పరీక్షలను సంపూర్ణంగా అటెంప్ట్ చేయగలరు.
7. పరీక్షలో ప్రతిక్షణం కీలకం
మాజేటి అభినీత్ 4వ ర్యాంక్
ఎంసెట్ మార్కులు 156.582397
కుటుంబ నేపథ్యం ఏంటి?
విద్యాభ్యాసం?
మాది హైదరాబాద్‌లోని కొండాపూర్. నాన్న శశిధర్, అమ్మ క్రాంతి కుమారి ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. నేను 8వ తరగతి వరకు మహర్షి విద్యామందిర్‌లో చదివాను. 9,10వ తరగతి FIITJEE జూనియర్ కాలేజీలో చదివాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
కాలేజీలోనే ఎంసెట్‌కు, ‘జేఈఈ’కి ప్రిపేర్ అయ్యాను. ప్రత్యేకంగా ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్లో చేరలేదు. రోజుకు 8 నుంచి 10 గంటలు ప్రిపేర్ అయ్యాను.
మెరిట్ టెస్ట్‌లు ?
ప్రస్తుతానికి ఎంసెట్, జేఈఈ మెయిన్స్ రాశాను. అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యాను, అడ్వాన్స్డ్ కూడా రాయబోతున్నాను.
భవిష్యత్ లక్ష్యాలు?
ఐఐటీ బాంబేలో సీఎస్ఈ బ్రాంచ్‌లో చేరి పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడటం నా లక్ష్యం.
విద్యార్థులకు సలహాలు, సూచనలు?
ప్రిపేర్ అయ్యే ప్రక్రియలోనే ఫలితం ఉంటుంది. ప్రిపేర్ అయ్యే అంశాలు, పూర్వపు ప్రశ్నా పత్రాలు చూసుకుంటూ ఉండాలి. ప్రతిక్షణం విలువైనదిగా భావించాలి. ఏ ప్రశ్నకు, ఎటువంటి ప్రశ్నకు ఎంత సమయం పడుతోందో ప్రాక్టీస్‌లో తెలుసుకొని కంగారు పడకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఇతర స్టడీ బుక్స్, స్టడీ మెటీరియల్స్‌తో పాటు స్టేట్‌బోర్డ్ వారి టెక్స్ పుస్తకాలను ప్రాధాన్యంగా తీసుకొని ప్రిపేర్ అయితే మేలు.
8. సివిల్స్పైనా మక్కువ..
వడ్డే షన్వితా రెడ్డి 7వ ర్యాంక్
ఎంసెట్ మార్కులు 155.951537
కుటుంబ నేపథ్యం ? విద్యాభ్యాసం?
మాది నల్లగొండ జిల్లా, మాడుగులపల్లి మండలం, బొమ్మకల్ గ్రామం. నాన్న మధుసూదన్ రెడ్డి అడవిదేవులపల్లి ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా చేస్తున్నారు. అమ్మ లలితా రెడ్డి గృహిణి. నేను 9, 10వ తరగతి గుడివాడలోని కేకేఆర్ గౌతమ్స్ కాన్సెప్ట్ స్కూల్లో చదివాను. ఇంటర్ విజయవాడలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో చదివాను.
ఎలా ప్రిపేర్ అయ్యారు?
కాలేజీలో ఇచ్చే కోచింగ్‌తోనే ప్రిపేర్ అయ్యాను. రోజుకు 13-14 గంటలు ప్రిపేర్ అయ్యేదాన్ని.
మెరిట్ టెస్ట్‌లు ?
ఎంసెట్, జేఈఈ మెయిన్స్ రాశాను. జేఈఈ అడ్వాన్స్డ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. అడ్వాన్స్డ్ కూడా రాస్తాను. జేఈఈ మెయిన్స్‌లో 300వ ర్యాంక్ సాధించాను.
భవిష్యత్ లక్ష్యాలు?
ఐఐటీ బాంబేలో సీట్ సాధించి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా స్థిరపడాలని ఉంది. అదేవిధంగా సివిల్స్‌పై కూడా అంతే మక్కువ ఉంది.
విద్యార్థులకు సలహాలు, సూచనలు?
నేర్చుకునే ఏ అంశమైనా సగం సగం కాకుండా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. వీలైనన్ని ఎక్కువ మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల అవగాహన వస్తుంది. ఎటువంటి ప్రశ్నకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో తెలుసుకోవడం వల్ల సమయ విభజన సులభమవుతుంది. దీని వల్ల ఉన్న తక్కువ సమయాన్ని చక్కగా వినియోగించుకొని ఏ ప్రశ్నను కంగారు పడి విడిచిపెట్టే ఆస్కారం ఉండదు. పరీక్షలకు హాజరయ్యామంటే చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఎన్నో గంటల ప్రిపరేషన్ తరువాతే పరీక్షకు హాజరవుతాం. ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా కంగారు పడటం వల్ల ఇన్నాళ్లు కష్టపడి ప్రిపేర్ అయిన సమయాన్ని చేతులారా వృథా చేసుకున్నట్టే. ప్రశ్నాపత్రాన్ని పూర్తిగా చదివి ఆత్మవిశ్వాసంతో, భయాన్ని విడిచిపెట్టి 100 శాతం మనవంతు ఏ లోపంలేకుండా ప్రయత్నించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?