Wrought pen | గళమెత్తిన కలం
-కథలు : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చిత్రించిన కథలు వచ్చాయి. తెలంగాణ చౌక్ పేర కొన్ని కథలు కర్ర ఎల్లారెడ్డి, డాక్టర్ బీవీఎన్ స్వామి సంపాదకత్వంలో వెలువడినాయి.
-మా పంతులు – డాక్టర్ పి. యశోదారెడ్డి
-యుద్ధనాదం, రేపుమాపు – పెద్దింటి అశోక్‌కుమార్
-కొత్త రంగులద్దుకున్న కల, నిత్యగాయాల నది – బెజ్జారపు రవీందర్
-నాలుగు కోట్ల పిడికిళ్లు – వెల్దండి శ్రీధర్
-తెలంగాణం – ఓదెల వెంకటేశ్వర్లు
-నవలలు: ఉద్యమాన్ని చిత్రించిన నవలలు కూడా వచ్చాయి. అందులో పరవస్తు లోకేశ్వర్ రాసిన సలాం హైదరాబాద్, అంపశయ్య నవీన్ రాసిన ముళ్లపొదలు, బీఎస్ రాములు రాసిన రాసిన లోచూపు.
-ఇవే కాకుండా కాళోజీ నారాయణరావ్ రచనలైన తెలంగాణ ఉద్యమ కవితలు-1969 ఇది నా గొడవ మొదలైనవి తెలంగాణ విద్యార్థులను, యువకులను ఎంతగానో ప్రభావితం చేశాయి.
-జానపద కళారూపాల ద్వారా మిద్దె రాములు (ఒగ్గుకథ), చిందు ఎల్లమ్మ (చిందు యక్షగానం), దర్శనం మొగులయ్య (పన్నెండు మెట్ల కిన్నెర) మొదలైనవారు ఉద్యమానికి బాసటగా నిలిచారు.
-సినిమారంగం: సినిమా రంగంలో ఆంధ్రా ఆధిపత్యాన్ని ఎదుర్కొని తెలంగాణ పోరాటాన్ని ఒక సినిమాగా తీశారు శంకర్ (జైబోలో తెలంగాణ), రఫీ (ఇంకెనాళ్లు). ఈ సినిమాల ద్వారా వీరు తెలంగాణలో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చారు.
-అంతేకాకుండా తెలంగాణ బతుకును, జీవన చిత్రాన్ని, తెలంగాణ సంస్కృతిని, చరిత్ర, వారసత్వాన్ని తమ చిత్రాల ద్వారా భవిష్యత్ తరాలకు కాపు రాజయ్య, తోట వైకుంఠం, కె.లకా్ష్మగౌడ్, ఏలే లక్ష్మణ్ అందించారు.
-శిల్పకళలో అద్భుతమైన ప్రావీణ్యం సంపాదించినవారు ఎక్కా యాదగిరి (తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని చెక్కారు), బీవీఆర్ చారి (తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త).
ఉద్యమంలో మేధావుల పాత్ర
కొండా లక్ష్మణ్ బాపూజీ
-ఈయన మూడు దశల ఉద్యమాల్లో పాల్గొన్న పోరాటయోధుడు (నిజాంకు వ్యతిరేకంగా, తొలి, మలిదశ)
-1969లో తొలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి తెలంగాణ కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన తొలి నేత బాపూజీ.
-బాపూజీ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు. 1931లో గాంధీని కలసి ఆయన ప్రభావంతో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
-నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు.
-టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో కేసీఆర్‌ను ప్రోత్సహించడమే కాకుండా తన నివాసం జలదృశ్యాన్ని పార్టీ ఆఫీస్ కోసం కేటాయించారు.
-95 ఏండ్ల వయసులో చలికాలంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సత్యాగ్రహం దీక్ష చేయడం ఆయన దృఢ వైఖరికి, వేసవిలో చార్మినార్ నుంచి అమరవీరుల స్థూపం వరకు చేసిన పాదయాత్ర ఆయన సంకల్పానికి నిదర్శనాలు.
-తెలంగాణ శ్వాసగా జీవించిన బాపూజీ 2012 సెప్టెంబర్ 21న కన్నుమూశారు.
ఆర్ విద్యాసాగర్ రావు
-ఈయన 1997లో కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజినీర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. వృత్తిపరంగా ఇంజినీర్ అయినప్పటికీ, ప్రవృత్తిపరంగా మంచి కవి, నాటక కర్త, నాటక ప్రయోక్త.
-వృత్తిపరమైన జీవితం ప్రారంభదశలో ప్లస్ మైనస్ అనే కవితా సంకలనాన్ని వెలువరించారు.
-సాగునీటిరంగ సమస్యలు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, సీమాంధ్ర పాలకులు చూపుతున్న వివక్షపై వందలాది వ్యాసాలు రాశారు. ఆయన రాసిన ఈ విశ్లేషణాత్మక వ్యాసాలు తెలంగాణ ఉద్యమకారులకు వజ్రాయుధంగా ఉపయోగపడినాయి.
-ఈయన రాసిన వ్యాసాలను నీళ్లు నిజాలు అనే పేరుతో ఒక పుస్తకరూపంలో విడుదల చేశారు. వ్యాసాలు రాయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది సభల్లో పాల్గొని ఉపన్యసిస్తూ ప్రజలను చైతన్యపరిచారు.
జర్నలిస్టుల పాత్ర
-తెలంగాణ ఉద్యమం జర్నలిస్టులను సైతం ఏకం చేసింది. భిన్న పార్టీలను, ఉద్యమ సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో తెలంగాణ జర్నలిస్టులు గణనీయమైన పాత్ర పోషించారు. 2001 మే 31న బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అల్లం నారాయణ అధ్యక్షతన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (టీజేఎఫ్) ఏర్పడింది. తెలంగాణ జర్నలిస్టులు మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని ప్రజలకు అందించడం ద్వారా వారిలో చైతన్యం నింపారు. 2010 ఏప్రిల్ 28న తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో రాష్ట్ర సాధన కోసం ఒక రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.
-2010 అక్టోబర్ 4న టీజేఎఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మీడియా మార్చ్ నిర్వహించారు. అంతేగాకుండా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 2010 డిసెంబర్ 5న ఆర్టీసీ కళాభవన్‌లో తెలంగాణ పాత్రికేయుల మహాసభ నిర్వహించారు. వందలాది మంది జర్నలిస్టులు అమరవీరుల స్థూపం (గన్‌పార్క్) నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రీయ లోక్‌దళ్ నేత అజిత్‌సింగ్ హాజరయ్యారు.
-ప్రత్యేకంగా తెలంగాణ పాత్రికేయుల సంఘం ఏర్పాటు చేసుకోవడానికి ఈ వేదికపై నుంచే కేసీఆర్ రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
-2011 మే 19న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో వందలాది మంది పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు. ఒక చేత్తో కలం-మరో చేత్తో ఉద్యమం అనే నినాదాన్నిచ్చిన ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు.
-వీ-సిక్స్, హెచ్ఎంటీవీ, టీ న్యూస్, నమస్తే తెలంగాణ వంటి మీడియా సంస్థలపై సీమాంధ్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా 2012, అక్టోబర్ 16న తెలంగాణ పది జిల్లాల్లో జర్నలిస్టులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు.
-అక్టోబర్ 30న తెలంగాణ జర్నలిస్టులు, టీజేఎఫ్ ఆధ్వర్యంలో సీమాంధ్ర సర్కార్ తెలంగాణ జర్నలిస్టులపై చూపిస్తున్న వివక్షకు నిరసనగా సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. శ్రీకృష్ణ కమిటీ తన రిపోర్టులోని 8వ అధ్యాయంలో మీడియా మేనేజ్మెంట్ను ప్రత్యేకంగా పేర్కొన్నది.
-అందులో ఆంధ్రప్రదేశ్‌లోని 13 ఎలక్ట్రానిక్ చానళ్లు, 5 స్థానిక పత్రికలు ప్రజాభిప్రాయాన్ని మలచడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. వీటిలో రెండు చానళ్లు మినహా మిగిలినవన్నీ సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నవే అయినప్పటికీ, స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న జర్నలిస్టులు ఇక్కడి సంఘటనలు, ప్రజల సెంటిమెంట్‌ను రిపోర్టు చేయగలిగారు.
-ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ కార్యక్రమాలను రిపోర్టు చేస్తున్నవారిలో ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికే జర్నలిస్టులే అధికమని శ్రీకృష్ణ కమిటీ తన 8వ అధ్యాయంలో పేర్కొనడం గమనించదగ్గ విషయం.
-ఈ విధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో జర్నలిస్టుల పాత్ర మరువరానిది. తెలంగాణవాదులపై, విద్యార్థులపై జరుగుతున్న దాడులను, అణచివేతను ఎప్పటికప్పుడు బయటి ప్రపంచానికి నిర్భయంగా అందించడం ద్వారా జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమం నలుమూలలకు విస్తరించడానికి దోహదం చేశారు. ఎందరో జర్నలిస్టులు గాయాలపాలై, లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్రం సాకారం కావడంలో సఫలీకృతం కాగలిగారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొ.జయశంకర్ సార్
-తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి (తొలి, మలి) తన జీవితాన్ని అంకితం చేసిన ధన్యజీవి జయశంకర్ సార్.
-1952 నాన్‌ముల్కీ ఉద్యమం నుంచి 2011 వరకు ఉద్యమమే ఊపిరిగా జీవించి నీళ్లు, నిధులు ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని అంకెలతో సహా వివరించి ఆంధ్రపాలకుల దిమ్మతిరిగేలా చేసిన కర్మయోగి.
-1934 ఆగస్టు 6న అక్కంపేట (వరంగల్)లో జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు.
-1969లో తొలిదశ ఉద్యమంలో వరంగల్ కేంద్రంగా కీలక పాత్ర పోషించారు. ప్రజల్లో తెలంగాణ భావజాలాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా పర్యటనలు, ఉపన్యాసాలు, రచనలు చేశారు.
-తెలంగాణ సమస్యలపై ఎన్నో సంపాదకీయాలు, పరిశోధన పత్రాలు ఇంగ్లిష్, తెలుగులో వెలువరించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ వాదాన్ని వినిపించారు.
-తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదికలను స్థాపించారు.
-తెలంగాణ సమస్యలపై పరిశోధనలు, ప్రచురణలు నిర్వహించే సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్‌కు చైర్మన్‌గా పనిచేశారు.
-రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని భావించి టీఆర్ఎస్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి కేసీఆర్‌కు మార్గదర్శకుడిగా వ్యవహరించారు.
-చిదంబరం ప్రకటనతో (2009 డిసెంబర్ 9) తన దీక్షను విరమింపజేసేందుకు ప్రొ.జయశంకర్ కేసీఆర్‌కు నిమ్మరసాన్ని తాగించారు.
-జయశంకర్ 2011 జూన్ 21న మరణించారు. తుదిశ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పోరాడిన మహనీయుడు జయశంకర్ సార్.
జయశంకర్ సార్ చేపట్టిన పదవులు
-1979-81 వరకు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు.
-1982-91 వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు.
-1991-94 మధ్య కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ఉన్నారు.
రచనలు
-తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్
-తల్లడిల్లుతున్న తెలంగాణ
-తెలంగాణ రాష్ట్రంపై విస్త్రృత అంగీకారం – నిజనిజాలు
-జయశంకర్ సార్ స్వీయ చరిత్ర ఒడువని ముచ్చట్లును కొంపల్లి వెంకట్‌గౌడ్ రచించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు