పరిగిపిట్టతో సంబంధం ఉన్న పండుగ ఏది? ( తెలంగాణ సమాజం-సంస్కృతి )
తెలంగాణ పండుగలు
బోనాలు
- బోనం అంటే భోజనం అని అర్థం. గ్రామదేవతలకు భోజనాలు సమర్పించే పండుగ బోనాల పండుగ.
- బోనాల పండుగను ఆషాఢ మాసంలో జరుపుకొంటారు (జూలై/ఆగస్టు).
- ఈ బోనాల పండుగ జరిగే తంతును ఊరడి అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఊర పండుగ అని కూడా పేరు.
- లష్కర్ బోనాలు ఎలా మొదలయ్యాయంటే.. 1815లో హైదరాబాద్ రెజిమెంట్‌కు చెందిన సైనికుడు సూరటి అప్పయ్య ఉజ్జయినిలోని మహంకాళి దేవాలయాన్ని దర్శించుకుని జంటనగరాల్లో కలరా వ్యాప్తిచెందకుండా నిర్మూలన జరుగాలని ప్రార్థించాడు. అక్కడి నుంచి తిరిగివచ్చేటప్పుడు మహంకాళి విగ్రహాన్ని తీసుకొచ్చి సికింద్రాబాద్‌లో ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ బోనాలనే లష్కర్ బోనాలు అంటారు. లష్కర్ అంటే సైన్యం అని అర్థం.
- బోనాల ఉత్సవాలు ప్రతి ఏడాది ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయం (జగదాంబిక ఆల యం) వద్ద ప్రారంభమవుతాయి. అనంత రం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయం, బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయం ఇలా ప్రధాన ఆలయాల్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.
- జంటనగరాల్లోనే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాలను వివిధ గ్రామదేవతలకు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
పోతరాజు:
ఘల్లుఘల్లుమనే పెద్ద మువ్వలు కుట్టిన ఎరరంగు లాగు, కాళ్లకు గజ్జెలు, దవడలకు రెండు నిమ్మపండ్లు, కండ్ల కింద కాటుక, జులపాల జుట్టు, ఒళ్లంతా పసుపు పచ్చని బండారి పూసుకుని, చేతిలో పెద్ద కొరడా పట్టుకుని, డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తాడు. పోతరాజు గ్రామదేవతలకు సోదరుడు. ఒకప్పటి బైండ్ల పూజారి ప్రతిరూపమే పోతరాజు.
గావుపట్టడం: పోతరాజుకు పూనకం వచ్చినప్పుడు భక్తులు ఆయన దగ్గరకు మేకపోతును తీసుకొస్తారు. ఉగ్రరూపంలో ఉన్న పోతరాజు ఆ మేకపోతు గొంతు కొరికి తలను, మొండెంను వేరుచేస్తాడు. దీన్నే గావుపట్టడం అంటారు.
రంగం: బోనాల పండుగ రెండోరోజు రంగం కార్యక్రమం జరుగుతుంది. రంగం కార్యక్రమంలో పూనకం వచ్చిన మహిళ బోర్లించిన పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెబుతుంది. ఈ భవిష్యవాణిలో ప్రధానంగా వాతావరణ పరిస్థితులు, పంటలు మొదలైన వాటి గురించి భవిష్యత్తు చెబుతుంది. ముదిరాజ్ కులస్తురాలు అమ్మవారి పూజారిగా బోనాల పండుగరోజు ఉపవాసం చేసి, తర్వాత రోజు రంగం పేరుతో భవిష్యవాణి వినిపిస్తుంది. పచ్చికుండను కుమ్మరి రత్తయ్య వంశీయులు తయారు చేస్తారు. - బోనాల పండుగ సందర్భంగా చేసే నృత్యం గరగ నృత్యం.
- బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం 2014, జూన్ 16న రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
- బోనాల పండుగ సందర్భంగా నూతన దంపతులు అమ్మవారికి తొట్టెలు సమర్పిస్తారు.
- 1908లో మూసీనది వరదలవల్ల తీవ్రనష్టం జరిగిన సందర్భంలో మీర్ మహబూబ్ అలీఖాన్ (ఆరో నిజాం) హిందూమత సంప్రదాయాల ప్రకారం మీరాలం మండి దగ్గర మహంకాళి దేవతకు బోనం సమర్పించాడని పేర్కొంటారు.
- ఘటోత్సవం లేదా ఘటం ఊరేగింపు కార్యక్రమంలో అక్కన్న, మాదన్న ఆలయానికి చెందిన ఘటం ముందుగా ఉంటుంది. ఈ ఘటం ఊరేగింపు నయాపూల్ వద్ద ఘటం నిమజ్జనంతో ముగుస్తుంది.
- భక్తులు వేపాకులు వేసిన పసుపు నీళ్లను అమ్మవారి ముందు ఆరబోసి తమను చల్లగా చూడమని కోరుతారు. దీన్ని సాక ఇవ్వడం అంటారు. పూర్వం సాకగా వేపాకులు వేసిన నీళ్లకు బదులుగా తాటికల్లును ఆరబోసేవారు.
- ‘తెలంగాణ బోనాలు’ అనే పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించింది. ఈ పుస్తకాన్ని రాసింది ప్రొఫెసర్ ననుమాస స్వామి……
- తెలంగాణ సాహిత్య కళావేదిక బోనాలు-మహంకాళి జాతర అనే పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తకంలో హైదరాబాద్‌లో జరిగే బోనాల పండుగకు సంబంధించిన రికార్డులు కుతుబ్‌షాహీల కాలంలోని 1675 నుంచి ఉన్నాయి. సుల్తాన్ అబుల్ హసన్ తానీషా గోల్కొండ కోటలో ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించి 1675లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవం నిర్వహించాడు. ఇక్కడ ఏటా జరిగే బోనాల పండుగ గోల్కొండ బోనాలుగా ప్రసిద్ధి.
-
బతుకమ్మ
- ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.
- బతుకమ్మ పండుగను భాద్రపద బళ అమావాస్య నుంచి మహర్నవమి వరకు 9 రోజులు నిర్వహిస్తారు.
- బతుకమ్మను పేర్చడానికి ప్రధానంగా ఉపయోగించే పువ్వులు గునుగు, తంగేడు. వీటితోపాటు గుమ్మడి, కట్ల, దోస, చామంతి, తామర పువ్వులను కూడా పేర్చుతారు.
- తొమ్మిది రోజులు జరిగే బతుకమ్మ పండుగకు ఒక్కొక్క రోజు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆరో రోజు మాత్రం బతుకమ్మ ఆడరు. ఆ రోజును అరెం అంటారు.
- ఆఖరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు మలీద ముద్దలు తయారు చేస్తారు.
- రాష్ట్ర ప్రభుత్వం 2014, జూన్ 16న బతుకమ్మను రాష్ట్ర పండుగగా ప్రకటించింది.
- ఈ పండుగలో గౌరమ్మను పూజిస్తారు.
- బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసినవారు బండారు సుజాత శేఖర్. ఈమె బతుకమ్మ పండుగపై రాసిన పరిశోధన గ్రంథం తెలంగాణ బతుకమ్మ పౌరాణిక, సామాజిక, సాంస్కృతిక పరిశీలన.
- బతుకమ్మలో ఉపయోగించే తంగేడు పువ్వులు పేరిట పుస్తకాన్ని రాసింది ఆచార్య ఎన్ గోపి.
- బతుకమ్మ పుట్టుపూర్వోత్తరాల గురించి భట్టు నరసింహ కవి చెప్పినట్లు బిరుదురాజు రామరాజు తన తెలుగు జానపద గేయ సాహిత్యంలో వివరించారు.
-
తీజ్ పండుగ
- ఈ పండుగను వ్యవసాయ పనులు చేసుకునే లంబాడాలు ప్రతి ఏటా నాట్లు వేసుకునే ముందు నిర్వహిస్తారు.
- తీజ్ పండుగను సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఆషాఢ లేదా శ్రావణ మాసంలో జరుపుకొంటారు.
- ఈ పండుగను తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. పెండ్లికాని అమ్మాయిలు మాత్రమే ఈ పండుగను జరుపుకొంటారు.
- ఈ పండుగ తొలి రోజు వెదురు లేదా దసేరు చెట్టు తీగలతో చేసిన బుట్టల్లో మట్టి నింపి అందులో స్థానికంగా లభించే విత్తనాలు ముఖ్యంగా గోధుమలు నాటుతారు.
- ఈ బుట్టలను తొమ్మిది రోజులపాటు ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉంచి ప్రతిరోజు నీళ్లు పోస్తూ ప్రత్యేక పూజలు చేస్తారు.
- తొమ్మిదో రోజు మొలకెత్తిన విత్తనాల బుట్టలను దగ్గరిలోని చెరువుల్లో నిమజ్జనం చేస్తారు.
- ఈ ఉత్సవంలో లంబాడాలు మేరమ్మ దేవతను పూజిస్తారు. పిల్లలు, మహిళలను రక్షించే తల్లిగా మేరమ్మను భావిస్తారు. తీజ్ ఉత్సవంలో 7వ రోజున చుర్మో (రొట్టెలు, బెల్లం కలిపిన పదార్థం)ను మేరమ్మకు సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘ఢమోళి’ అంటారు.
- వెండితో చేసిన మేరమ్మ విగ్రహం ముందు మేకపోతును బలిచ్చే కార్యక్రమాన్ని ‘అకాడో’ అంటారు.
- తీజ్ ఉత్సవాల్లో ‘భోరడి ఝష్కేరో’ కార్యక్రమం ప్రత్యేకమైంది. బోరడి ఝష్కేరో అంటే రేగుముళ్లుతో గుచ్చడం అని అర్థం.
- మేరమ్మ దేవతతోపాటు సీత్లాభవాని మాతకు, సేవాలాల్ మహరాజ్‌కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
గమనిక: వర్షాకాల ప్రారంభంలో కనిపించే ఎరని ఆరుద్ర పురుగును తీజ్ అంటారు. అలాగే గోధుమ మొలకలను కూడా తీజ్ అంటారు.
గ్రామ దేవతలు – వివరాలు
పోచమ్మ: పోషణ చేసే అమ్మ. పొక్కుల రూపంలో పోసే అమ్మ
కట్టమైసమ్మ: కోటలను, చెరువు కట్టలను రక్షించే అమ్మ
ఎల్లమ్మ: ఎల్లలను, ఎల్లరిని, ఎల్లెడలా రక్షించే అమ్మ
పోలేరమ్మ: పొలిమేరలో ఉండే అమ్మ
ఊరడమ్మ: ఊరిని రక్షించే అమ్మ
ఉప్పలమ్మ: ఊరి పశువులను రక్షించే అమ్మ
బోనాల పండుగకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు
ఘటోత్సవం
– ఘటం అంటే కలశం. ఘటోత్సవం అంటే కలశంతో ఎదురెళ్లి అమ్మవారికి స్వాగతం పలుకడం. అమ్మవారిని ఆవాహన చేసి పురవీధుల్లో ఘటాన్ని ఊరేగిస్తారు.
ఫలహారం బండ్ల ఊరేగింపు
– బోనాల పండుగ రోజు గానీ, మరుసటి రోజు గానీ భక్తులు అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను ఫలహారంగా సిద్ధం చేస్తారు. వాటిని బండిలో పెట్టి ఊరేగించడాన్ని ఫలహారం బండి ఊరేగింపు అంటారు.
తొమ్మిది రోజులు, బతుకమ్మల పేర్లు నైవేద్యాలు
తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నువ్వులు, నూకలు
రెండో రోజు అటుకుల బతుకమ్మ ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ బెల్లం, శనగలు
నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ తడి బియ్యం, పాలు, బెల్లం
ఐదో రోజు అట్ల బతుకమ్మ అట్లు
ఆరో రోజు అలిగిన బతుకమ్మ బతుకమ్మ ఆడరు (అరెం)
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ బియ్యం పిండిని వేపకాయల
ఆకారంలో చేస్తారు
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ వెన్న, నువ్వులు, బెల్లం
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సత్తుపిండి, నువ్వుల పిండి, బెల్లం
మాదిరి ప్రశ్నలు
1. అకిపెన్, పెర్షపెన్ అనే పండుగలను కింది ఏ గిరిజన తెగవారు జరుపుకొంటారు? (3)
1) చెంచులు 2) కోయలు
3) గోండులు 4) నాయక్‌పోడ్‌లు
2. చైత్రపురబ్, ఎటికల, ఈటెల పండుగగా కింది ఏ పండుగను వ్యవహరిస్తారు? (2)
1) పెద్దదేవుని పండుగ
2) నిషాని దేవత పండుగ
3) సీత్లా భవాని పండుగ 4) ఏదీకాదు
3. పరిగిపిట్టతో సంబంధం ఉన్న గిరిజన పండుగ ఏది? (3)
1) రాజుల్ ముండ పండుగ
2) సీత్లా భవాని పండుగ
3) పెద్దదేవుని పండుగ
4) నిషాని దేవత పండుగ
4. భోగ్ బండార్ అనే ప్రత్యేకమైన నైవేద్యాన్ని (ఆవు నెయ్యి, బెల్లంతో చేసినది) ఏ పండుగ సందర్భంగా లంబాడాలు తయారు చేస్తారు? (2)
1) తీజ్ పండుగ
2) సేవాలాల్ మహరాజ్ జయంతి
3) సీత్లా భవాని పండుగ
4) ఏదీకాదు
5. ఏ పండుగ సందర్భంగా లంబాడాలు వేపచెట్టు కింద ఏడుగురు భవానీలకు ప్రతిరూపంగా ఏడు రాళ్లను పాతి
పూజిస్తారు? (1)
1) సీత్లా భవానీ పండుగ
2) నాగశేష పండుగ
3) పెద్దదేవుని పండుగ
4) ఏదీకాదు
6. కింది ఏ పండుగను నోవోంగ్ అని కూడా అంటారు? (1)
1) అకిపెన్ 2) పెర్షపెన్
3) రాజుల్ ముండ 4) ఏదీకాదు
7. కింది పండుగలు, అవి జరుపుకొనే గిరిజన తెగలను జతపర్చండి. (1)
ఎ. నాగశేష పండుగ 1. గోండులు
బి. గారెల మైసమ్మ జాతర
2. చెంచులు
సి. శివభయ్యా జాతర 3. బంజారాలు
4. కోయలు
1) ఎ-1, బి-2, సి-3
2) ఎ-2, బి-3, సి-4
3) ఎ-3, బి-4, సి-2
4) ఎ-4, బి-1, సి-2
8. కింది పండుగలు, అవి జరిగే నెలలను జతపర్చండి. (1)
ఎ. బొడ్డెమ్మ 1. భాద్రపద
బి. హోలి 2. ఫాల్గుణ
సి. వినాయక చవితి 3. ఆశ్వయుజ
డి. దీపావళి 4. చైత్ర
5. శ్రావణ
1) ఎ-1, బి-2, సి-1, డి-3
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-1, బి-2, సి-3, డి-5
4) ఎ-2, బి-3, సి-4, డి-5
9. మిథిలా స్టేడియానికి కింది ఏ పండుగతో సంబంధం ఉంది? (2)
1) దసరా 2) శ్రీరామ నవమి
3) వినాయక చవితి 4) దీపావళి
గందె శ్రీనివాస్
2016 గ్రూప్-2 విజేత
సిద్దిపేట
9032620623
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు