Stem twigs | కాండ నులితీగలు వేటి రూపాంతరం?
కాండం
– విత్తనం మొలకెత్తినప్పుడు మొదటగా ఏర్పడే నిర్మాణాన్ని ప్రథమ మూలం (Radicle) అని, తర్వాత భూమిపైకి ఏర్పడే నిర్మాణాన్ని ప్రథమ అక్షం లేదా కాండం (Plumule) అని అంటారు.
– కాండం సాధారణంగా ప్రథమ అక్షం నుంచి ఏర్పడుతుంది.
– శాఖలు, పత్రాలు, పుష్పాలు, ఫలాలను కలిగి నిటారుగా పెరిగే అక్షాన్ని కాండం అంటారు.
– సాధారణంగా లేతగా ఉన్నప్పుడు కాండం ఆకుపచ్చగా ఉండి తరువాత చేవదేరి ముదురు గోధుమ వర్ణంలోకి మారుతుంది.
– కాండం కణుపులను (Nodes), కణుపు మధ్యమాలను (Inter-nodes) కలిగి ఉంటుంది. కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతాలను కణుపులు అంటారు. రెండు కణుపుల మధ్య భాగాలను కణుపు మధ్యమాలు అంటారు.
– కాండం మొగ్గలను అగ్రస్థంగా (Terminal) లేదా గ్రీవస్థంగా (Axillary) కలిగి ఉంటుంది.
కాండం విధులు
– ఇది పత్రాలు, పుష్పాలు ఫలాలను కలిగిన శాఖలను విస్తరింపజేస్తుంది.
– ఇది నీరు, ఖనిజాలు, కిరణజన్య సంయోగక్రియోత్పన్నాలను సరఫరా చేస్తుంది.
– కొన్ని మొక్కల్లో కాండాలు ఆహారాన్ని నిలువచేయడం, శాఖీయ వ్యాప్తి, యాంత్రిక బలాన్ని అందించడం, రక్షణ లాంటి ఇతర విధులను నిర్వర్తిస్తాయి.
కాండ రూపాంతరాలు
– వివిధ రకాల విధులను నిర్వర్తించడానికి కాండంలో కలిగే మార్పులను కాండ రూపాంతరాలు అంటారు. అవి కింది రకాలుగా ఉంటాయి..
భూగర్భ కాండ రూపాంతరాలు
– కొన్ని మొక్కల్లో కాండాలు సాధారణంగా వాయుగతంగా పెరగడానికి భిన్నంగా మృత్తిక (Soil)లోకి వృద్ధిచెందుతాయి. ఇలాంటి కాండాలను భూగర్బ కాండాలు (Underground stems) అంటారు.
– భూగర్బ కాండాలు ఆహార పదార్థాలను నిలువ చేయడం, పెరుగుదల, ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి, శాఖీయ వ్యాప్తికి తోడ్పడేందుకు రూపాంతరం చెందుతాయి.
– భూగర్బకాండాలు నాలుగు రకాలుగా రూపాంతరం చెందుతాయి..
1. దుంప కాండం
ఉదా: సొలానం ట్యూబరోజం (ఆలుగడ్డ)
గమనిక: సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీఆర్ఐ) సిమ్లాలో ఉన్నది.
2. కొమ్ము (Rhizome)
ఉదా: జింజిబర్ (అల్లం- Ginger), కర్క్యుమా (పసుపు- Termeric)
3. కందం (Corm)
ఉదా: అమర్సోఫాలస్ (కంద-Zamikand), కొలకేసియా (చామగడ్డ-Taro)
4. లశునం (Bulb)
ఉదా: అలియం సెపా (నీరుల్లి-Onion)
వాయుగత కాండ రూపాంతరాలు
– చాలా మొక్కల్లో కాండం వాయుగతంగా ఉండి వివిధ రకాల విధులను నిర్వర్తించడానికి రూపాంతంరం చెందుతుంది.
– వాయుగత కాండాలు ఆరు రకాలుగా రూపాంతం చెందుతాయి. అవి..
1. కాండ నులితీగలు: ఇవి సన్నని, సున్నితమైన చుట్టుకొని ఉండే నిర్మాణాలు. ఇవి ఎగబాకడానికి తోడ్పడుతాయి. గ్రీవపు మొగ్గల నుంచి కాని లేదా కొన మొగ్గ నుంచి ఏర్పడే నిర్మాణాలు.
ఉదా : కుకుంబర్ (దోసకాయ), గుమ్మడి (Pumpkin), పుచ్చ (Watermelon)లలో గ్రీవపు మొగ్గల నుంచి కాండ నులితీగలు ఏర్పడుతాయి. ద్రాక్ష (Grapevines)లో కొన మొగ్గ నుంచి ఏర్పడుతాయి.
2. ముళ్లు: కాండపు మొగ్గలు (కోరకాలు) చేవదేరిన, నిటారు, మొనదేలిన ముళ్లుగా (Thorns) రూపాంతం చెందుతాయి. ఇవి మొక్కలను మేసే జంతువుల నుంచి కాపాడుతాయి.
ఉదా : సిట్రస్ (నిమ్మజాతి మొక్కలు), బోగన్విల్లియా (కాగితపు పూలచెట్టు)
3. పత్రాభకాండాలు: వర్షాభావ ప్రాంతాల్లోని కొన్ని మొక్కల కాండాలు రూపాంతరం చెంది ఏర్పరిచే నిర్మాణాలను పత్రాభకాండాలు (Phylloclades) అంటారు. బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి వాటి పత్రాలు కంటకాలు లేదా పొలుసాకులుగా రూపాంతరం చెందడం వల్ల పత్రాభకాండాలు పత్రహరితాన్ని కలిగి కిరణజన్యసంయోగ క్రియ జరుపుతాయి.
ఉదా: ఒపన్షియా (బ్రహ్మజెముడు), యుఫోర్బియా (నాగబాలు), కాజురైనా (సరుగుడు).
4. క్లాడోఫిల్లు: కిరణజన్య సంయోగక్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల గల శాఖలను క్లాడోఫిల్లు అంటారు.
ఉదా : ఆస్పరాగస్ (పిల్లి తీగలు)
5. లఘులశునాలు: కొన్ని మొక్కల్లోని శాఖీయ కోరకాలు (మొగ్గలు), పుష్ప కోరకాలు ఆహార పదార్థాలను నిలువ చేస్తాయి. అవి తల్లి నుంచి విడిపోయినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పర్చుకుని శాఖీయ ప్రత్యుత్పత్తిలో తోడ్పడుతాయి. ఈ నిర్మాణాలనే లఘు లశునాలు (Bulbils) అంటారు.
ఉదా : డయాస్కోరియా- శాఖీయకోరకాలు, అగేవ్ (కిత్తనార)- పుష్పకోరకాలు
6. కొక్కేలు: ఇవి స్పర్శజ్ఞానాన్ని కలిగి ఉన్న దృఢమైన వంపు తిరిగి ఉండే నిర్మాణాలు. ఇవి ఎగబాకటానికి తోడ్పడుతాయి.
ఉదా : హ్యుగోనియా
ఉప వాయుగత కాండ రూపాంతరాలు
– కొన్ని మొక్కల్లో కాండం సగభాగం భూమిపైన, సగ భాగం భూమిలోపల ఉంటుంది. ఇలాంటి కాండాన్ని ఉపవాయుగత కాండం అంటారు. వివిధ రకాల విధులను నిర్వర్తించడానికి ఈ కాండంలో కలిగే మార్పులను ఉపవాయుగత కాండ రూపాంతరాలు (Sub-aerial stem modifications) అంటారు. ఉపవాయుగత కాండాలు అన్నీ శాఖీయ వ్యాప్తికి తోడ్పడుతాయి. ఉపవాయుగత కాండ రూపాంతరాలు కింది విధంగా ఉంటాయి.
1. రన్నర్లు: కొన్ని మొక్కల్లోని భూగర్భ కాండాలు, ఉపవాయుగత కాండాలు కొత్త ప్రదేశాలకు (Niches) విస్తరించి వృద్ధ భాగాలు నశించినప్పుడు కొత్త మొక్కలను ఏర్పరుస్తాయి. ఇలాంటి మొక్కలను రన్నర్లు (Runners) అంటారు.
ఉదా : కొన్ని గడ్డి మొక్కలు, స్ట్రాబెర్రి (భూగర్బ కాండాలు), ఆక్సాలిస్ (ఉపవాయుగత కాండం)
2. స్టోలన్: కొన్ని మొక్కల్లో కాండం ప్రధానాక్షం పీఠభాగం నుంచి సున్నితమైన పార్శపు శాఖలు ఏర్పడుతాయి. వీటిని స్టోలన్లు (Stolon) అంటారు. ఇవి కొంతకాలం వాయుగతంగా పెరిగిన తరువాత వంగి భూమిని తాకినప్పుడు అబ్బురపు వేర్లను ఏర్పరుస్తాయి.
ఉదా : నీరియం (గన్నేరు), జాస్మిన్ (మల్లె)
3. ఆఫ్సెట్లు: కొన్ని నీటి మొక్కల్లో కాండం నుంచి ఒకే కణుపు మధ్యమం కలిగిన పార్శ శాఖ ఏర్పడుతుంది. దీన్నే ఆఫ్సెట్ (Offset) అంటారు. ఇది ప్రతి కణుపు వద్ద రోజెట్ (Rosette) క్రమంలో ఉండే పత్రాలను, చక్రాభ కాండం పీఠభాగం నుంచి ఏర్పడిన సంతులనం జరిపే వేర్లను (Balancing roots) కలిగి ఉంటుంది.
ఉదా: ఫిస్టియా (అంతర తామర), ఐకార్నియా (బుడగ తామర లేదా గుర్రపు డెక్క లేదా బెంగాల్ బీతి)
4. పిలక మొక్కలు: కొన్ని మొక్కల్లో ప్రధాన అక్షం పీఠభాగం, భూగర్భ కాండ భాగాల నుంచి పార్శపు శాఖలు ఏర్పడి, కొంతవరకు మృత్తికలో సమాంతరంగా వృద్ధి చెంది తరువాత ఏటవాలుగా పెరిగి భూమిపైకి వచ్చి పత్రయుత శాఖలను ఏర్పరుస్తాయి. ఈ శాఖలనే పిలక మొక్కలు (Suckers) అంటారు.
ఉదా : అరటి, అనాస (పైన్ ఆపిల్), క్రైసాంథిమమ్ (చామంతి)
ప్రాక్టీస్ బిట్స్
1. కాండంపై పత్రాలు ఏర్పడే ప్రాంతం?
1) కణుపు
2) కణుపు మధ్యమం
3) ప్రధానాక్షం
4) ప్రథమ మూలం
2. విత్తనం మొలకెత్తినప్పుడు కాండం ఏ భాగం నుంచి ఏర్పడుతుంది?
1) ప్రథమ మూలం
2) ప్రథమ అక్షం
3) పైరెండింటి నుంచి
4) ఏదీకాదు
3. కిందివాటిలో కాండం విధి?
1) ఆహారాన్ని నిలువ చేయడం
2) శాఖీయ వ్యాప్తి
3) యాంత్రిక బలాన్ని అందించడం
4) పైవన్నీ
4. ఆలుగడ్డ అనేది దేని రూపాంతరం?
1) వేరు
2) కాండం
3) పత్రం
4) పుష్పం
5. అల్లం, పసుపు రూపాంతరం?
1) వేరు
2) కాండం
3) పత్రం
4) పుష్పం
6. క్యారట్, ముల్లంగి, మొరంగడ్డ (స్వీట్ పొటాటో) రూపాంతరం?
1) వేరు
2) కాండం
3) పత్రం
4) పుష్పం
7. కాండ నులి తీగలు దిగువ వాటిలో దేని రూపాంతరం?
1) భూగర్భ కాండ రూపాంతరం
2) వాయుగత కాండ రూపాంతరం
3) ఉపవాయుగత కాండ రూపాంతరం
4) పైవన్నీ
8. పత్రాభ కాండాలు కలిగి న మొక్కలు?
1) బ్రహ్మజెముడు
2) నాగజెముడు
3) సరుగుడు
4) పైవన్నీ
9. కిందివాటిలో కందం (Corm) ఏది?
1) అల్లం
2) పసుపు
3) ఆలుగడ్డ
4) చామగడ్డ (కొలకేసియా)
10. కిందివాటిలో లశునం (Bulb) ఏది?
1) నీరుల్లి
2) సిట్రస్ ఫలం
3) ఆలుగడ్డ
4) క్యారట్
జవాబులు: 1-1
2-2
3-4
4-2
5-2
6-1
7-2
8-4
9-4
10-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు