తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న ‘నీలం’
గోదావరి బహుళార్ధసాధక ప్రాజెక్టు
-కడెం రిజర్వాయర్‌పై 79 మైళ్ల పొడవైన ఉత్తర కాలువ నిర్మాణానికి 1949లో హైదరాబాద్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఆరేండ్లలో దీన్ని పూర్తిచేయాలని నిర్ణయించారు. పవర్ ప్రాజెక్టు, రిజర్వాయర్, కాలువల నిర్మాణానికి రూ.75 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 53 టీఎంసీలతో 2లక్షల 27వేల ఎకరాలకు సాగునీరందించాలని జేఎన్ చౌదరి ప్రభుత్వం సంకల్పించింది. కృష్ణాపురం డ్యాం నిర్మాణం పూర్తయ్యేవరకు గోదావరి నది నుంచి కడెం ప్రధాన కాలువ 21వ మైలు వరకు కాలువ ద్వారా 900 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-1956కు పూర్వమే ఈ కాలువ నిర్మాణం పూర్తయ్యింది. 1951లో ప్రణాళికా సంఘం గోదావరి ప్రాజెక్టుకు 227 టీఎంసీలు, లోయర్ మానేరుకు 32 టీఎంసీలు కేటాయించింది. గోదావరి నది పక్కన రామగుండం తదితర ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపన, థర్మల్ పవర్ ప్లాంట్లను నెలకొల్పడం, గోదావరి పారిశ్రామిక, వ్యవసాయిక అభివృద్ధి ప్రణాళికలో భాగం. (పోలీసు చర్య తర్వాత నిజాం పాలన ముగిసి పోవడంతో గోదావరి ప్రాజెక్టులు, రామగుండం ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధి ప్రణాళికను అమలుచేసే బాధ్యతను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేపట్టాయి)
గోదావరి ఉత్తర కాలువ ప్రాజెక్టు
-గోదావరి బహుళార్ధ సాధక ప్రాజెక్టు మొదటిదశకు గోదావరి ఉత్తర కాలువ ప్రాజెక్టుగా పేరుపెట్టారు. దీనిద్వారా 6,90,000 ఎకరాలకు సాగునీరందించాలని సంకల్పించారు. 5,465 ఫీట్ల పొడవైన కడెం డ్యాం నిర్మాణానికి, 48 మైళ్ల కాలువ నిర్మాణానికి ప్రభుత్వం 1949లో రూ. 441 లక్షలను మంజూరు చేసింది. దీని నిర్మాణ పనులు 1949లోనే మొదలయ్యాయి. 1955 నాటికి సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరందించడానికి కడెం ప్రాజెక్టు సిద్ధమైంది. గోదావరి ప్రాజెక్టులో కడెం డ్యాం, గోదావరి ఉత్తర కాలువ నిర్మాణాన్ని మొదటి దశగా వ్యవహరించారు.
20 లక్షల ఎకరాలకు సాగునీరు..
-రెండో పంచవర్ష ప్రణాళిక కాలం పూర్తయ్యే నాటికి తెలంగాణలోని 6 జిల్లాల్లో (ఖమ్మంతో కలిపి) గోదావరి 2,3,4 దశలను పూర్తిచేసి 20.50 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలని 1955-56లో అప్పటి హైదారబాద్ సర్కార్ ప్రతిపాదించింది. మొదటి దశలో ఉన్న కడెం డ్యాం, గోదావరి ఉత్తర కాలువ పనులు పూర్తి కావస్తున్నందున రెండో దశలో పికప్ డ్యాం (కృష్ణాపురం డ్యాంకు 7 మైళ్ల దిగువన) మానేరు వరకు దక్షిణ కాలువ, విద్యుచ్ఛక్తి విభాగం, మానేరు కాలువల నిర్మాణం రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించారు.
మూడో దశ
-కృష్ణాపురం డ్యాం నిర్మాణం, గోదావరి ఉత్తర కాలువ హెడ్ వర్క్స్, ఉత్తర కాలువ ద్వారా కడెం రిజర్వాయర్‌ను నింపుతూ కాలువ టెయిల్ ఎండ్ వరకు నిర్మాణ పనులు పూర్తి చేయడం, వరంగల్ వరకు మానేరు దక్షిణ కాలువలోని (166 మైళ్లు) మోరించ బ్రాంచి నిర్మాణ పనులు పూర్తి చేయడం.
నాలుగో దశ
-మానేరు ప్రాజెక్టులో భాగమైన మున్నేరు-ఆకేరు బ్రాంచి, ఆకేరు-మూసీ, మూసీ-కనగల్ ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి చేయడం.
-ఈ నాలుగు దశల పనుల అంచనా వ్యయం రూ. 85 కోట్లు. వీటికి సంబంధించి మొదటి దశ ద్వారా 1,67,000 ఎకరాలకు, రూ. 33.13 కోట్ల వ్యయమయ్యే రెండో దశద్వారా 5లక్షల 52వేల ఎకరాలకు (ఇందులో లక్ష ఎకరాలు నాందేడ్ జిల్లాలో ఉన్నాయి), మూడో దశ ద్వారా 5లక్షల 66వేల ఎకరాలు, నాలుగో దశలో భాగంగా 8లక్షల 65వేల ఎకరాలు మొత్తం కలిపి 20,50,000 ఎకరాలకు సాగునీటిని అందించాలని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం నిర్ణయించింది.
-గోదావరి ప్రాజెక్టు దేశంలోనే గొప్పదని నిపుణులు పేర్కొన్నారు. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో సుమారు 40 లక్షల మందికి ఈ ప్రాజెక్టు ద్వారా లాభం చేకూరుతుందని భావించారు. కానీ ప్రణాళికా సంఘం రెండో పంచవర్ష ప్రణాళికలో తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులకు కేవలం 16.11 కోట్లు కేటాయించడంతో ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. గోదావరి బహుళార్ధసాధక ప్రాజెక్టు పథకం 1942లోనే రూపొందించారు. దానికి 1949లో మార్పులు చేశారు. ఆ తర్వాత 1955, సెప్టెంబర్‌లో, 1956లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.
పోచంపాడు ప్రాజెక్టు
-కృష్ణాపురం దిగువన పోచంపాడు వద్ద గోదావరి ప్రాజెక్టును ప్రారంభించాలని బూర్గుల ప్రభుత్వం నిర్ణయించింది. 1955, సెప్టెంబర్‌లో రూపొందించిన ప్రాజెక్టు నివేదికలో నాలుగు దశల్లో గోదావరి ప్రాజెక్టును నిర్మించాలని పేర్కొనగా, 1956, జూలైలో మళ్లీ మార్పులు చేశారు. నాందేడ్ వద్ద (1956 నవంబర్ తర్వాత ఆ ప్రాంతం మహారాష్ట్రలో భాగమవుతుండటంతో) నిర్మించాలనుకున్న కవాల్‌గూడ డ్యాంను ఈ పథకం నుంచి తొలగించి పోచంపాడును మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పోచంపాడుకే ప్రాధాన్యం
-1958, ఆగస్టులో మద్రాసులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సమావేశంలో అప్పటి కేంద్ర జల, విద్యుచ్ఛక్తి కమిషన్ సభ్యుడు కేఎల్ రావు మాట్లాడుతూ.. ‘ఇరుగు పొరుగు ప్రాంతాల కన్న తెలంగాణ అత్యధికంగా వ్యవసాయం పైనే ఆధారపడిన ప్రాంతం. నీటిపారుదల వసతి పంజాబ్‌లో 32 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 25 శాతం ఉండగా, తెలంగాణలో 10 శాతం భూమికే లభిస్తున్నది. ఇందులో కాల్వలు, బావుల కింది నీటివసతి శాతం చూస్తే పంజాబ్‌లో 32, ఉత్తరప్రదేశ్‌లో 25 శాతం ఉండగా తెలంగాణలో 4 శాతం మాత్రమే ఉందన్నారు.
-నీటి వసతికి గొప్ప ఆధారం (గోదావరి) ఉండి సారవంతమైన భూములు, తగినంత వర్షపాతం ఉండి కూడా తెలంగాణ బీడువడి, పేదరికంలో మగ్గుతున్నది. ఈ వనరులేవీ ప్రజలకు ఉపయోగపడటంలేదు. బీడువడిన భూములను గోదావరి జలాలతో సశ్యశ్యామలం చేయగల సమగ్రమైన పోచంపాడు ప్రాజెక్టును నిర్మించకుండా తెలంగాణలో అభివృద్ధి సాధ్యపడదు. ప్రస్తుతం దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న తెలంగాణ పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణంతో భారతదేశానికే గొప్ప ధాన్యాగారంగా విరాజిల్లుతుందన్నారు.
-గోదావరి లోయ మొదట్లో, చివర్లో మాత్రమే కాక విశాలమైన భూమికి పోచంపాడు ప్రాజెక్టు ద్వారా నీటి వసతిని పొంది మధ్య ప్రాంతం తెలంగాణ కూడా సస్యశ్యామలంగా మారాలని ఆయన పేర్కొన్నారు.
-‘తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, భారతదేశ వికాసానికి నీటిపారుదల సౌకర్యం అత్యంత అవసరం. గోదావరి లోయలోని అన్ని ప్రాజెక్టుల్లోకెల్లా పోచంపాడు ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలది. 1794లో కావేరీ నదిపై ప్రస్తుతం ఉన్న కృష్ణరాజసాగర్ స్థలంలో ఒక డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించిన సందర్భంగా టిప్పు సుల్తాన్ ఏ నమ్మకాన్ని వ్యక్తపరిచాడో మనం అదే నమ్మకాన్ని ఏర్పర్చుకుందాం. ప్రారంభం మాత్రం నా చేతిలో ఉన్నది. కానీ దీన్ని పూర్తి చేయడం దేవునిపై ఉందంటూ పోచంపాడు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు కేఎల్ రావు.
‘నీలం’ నిలిపివేసిన ప్రాజెక్టులు.. పోచంపాడుకు మంగళం
-రాష్ర్టాల పునర్విభజన తర్వాత తెలంగాణ ఆంధ్రరాష్ట్రంలో విలీనమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం పోచంపాడు ప్రాజెక్టుతోపాటు గోదావరి నదిపై నిజాం ప్రభుత్వం, పూర్వపు వెల్లోడి, బూర్గుల ప్రభుత్వాలు నిర్మించాలనుకున్న ప్రాజెక్టులను రెండో పంచవర్ష ప్రణాళికలో చేర్చకుండా వాటి ఊసులేకుండా చేయగలిగింది. రెండో పంచవర్ష ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా వ్యయాన్ని రూ. 175.36 కోట్లుగా.. అందులో తెలంగాణకు రూ. 55.5 కోట్లు, ఆంధ్రకు 119.87 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులకు కేవలం రూ. 16.11 కోట్లు ప్రణాళికాసంఘం కేటాయించింది.
-రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్ర విభజనకు ముందు నిర్మించాలనుకుని ప్రణాళికా సంఘం ఆమోదించిన ఏ ప్రాజెక్టును నిలిపివేయకూడదు. యథాతథంగా కొనసాగించాలి. కానీ తెలంగాణకు నిధులు కేటాయించడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపని నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం పోచంపాడు ప్రాజెక్టుతో సహా పూర్వపు ప్రభుత్వాలు తలపెట్టిన, ప్రణాళికా సంఘం 1951, జూలై 27, 28 తేదీల్లో ఆమోదించిన పలు ప్రాజెక్టులను నిలిపివేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు