విత్తన భాండాగార యజ్ఞం అంటే..?
వ్యవసాయ ఉత్పాదకత పెంపులో విత్తనానిదే కీలకపాత్ర. విత్తనం నాణ్యతమీద ఆధారపడే ఎరువులు తదితరాల పనితీరు, సామర్థ్యం ఉంటాయి. అందువల్ల దేశానికే తెలంగాణను విత్తర భాంఢాగారంగా తీర్చిదిద్దే వ్యూహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది.
భారత వ్యవసాయరంగం
-వ్యవసాయరంగం అభివృద్ధిలో అనిశ్చితికి కారణం దేశంలో 50 శాతం వ్యవసాయరంగం వర్షాధారం కావడమే. ఇది వ్యవసాయ ఉత్పత్తి నష్టాలను వేగవంతం చేస్తుంది.
-వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 2016-17లో 4.9శాతం వృద్ధిరేటు అలాగే మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2017-18లో 2.1శాతం చొప్పున నిలకడలేని ఒడిదొడుకులతో కూడిన వృద్ధిరేటు నమోదయ్యింది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి
-2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ విడుదలచేసిన 4వ ముందస్తు అంచనాల ప్రకారం రికార్డుస్థాయిలో 275.7 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఇది గత రికార్డు అయిన 2013-14 నాటికి ఉత్పత్తికంటే 10.6 మిలియన్ టన్నులు అధికం.
-2016-17లో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదలకు 2016లో రుతుపవనాలు సానుకూలంగా ఉండటం, ప్రభుత్వం తీసుకున్న వివిధ విధాన నిర్ణయాలు కారణంగా చెప్పవచ్చు.
-2017 సెప్టెంబర్‌లో విడుదలచేసిన మొదటి ముందస్తు అంచనాల ప్రకారం 2017-18 ఖరీఫ్ పంటకాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 134.7 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు. ఇది 2016-17 కాలంనాటి అంచనా 138.5 మిలియన్ టన్నుల కంటే 3.9 మిలియన్ టన్నులు తక్కువ.
-2017-18 ఖరీఫ్ కాలంలో మొత్తం వరి ఉత్పత్తి 94.5 మిలియన్ టన్నులు అని అంచనా వేశారు. 2017-18 ఖరీఫ్ కాలంలో మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తి 8.7 మిలియన్ టన్నులుగా అంచనావేశారు.
-ఇదేకాలంలో చెరుకు 337.7 మిలియన్ టన్నులు, నూనెగింజలు 20.7 మిలియన్ టన్నులు పత్తి 32.3 మిలియన్ బేళ్లు (ఒక బేల్-170 కిలోలు) ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు.
-దేశంలో పంటల సాగు సరళిని వ్యవసాయ వాతావరణ పరిస్థితులు, కమత పరిమాణం, ధరలు, లాభదాయకత, ప్రభుత్వ విధానాలు వంటి అంశాల ఆధారంగా తెలుసుకోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే-2017 ప్రకారం 179.8 మిలియన్ హెక్టార్ల సాగు విస్తీర్ణంతో ప్రపంచంలో భారత్ మొదటిస్థానంలో ఉంది. ఇది ప్రపంచ నికర సాగులో 9.6శాతం.
-వ్యవసాయ, అనుబంధ రంగం గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)లో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటాను పరిశీలిస్తే అత్యధికంగా పంటల ద్వారా 60 శాతం లభించగా, పశుపోషణ ద్వారా 26 శాతం, చేపలు, అటవీ ఉత్పత్తుల ద్వారా 5 శాతం లభిస్తుంది.
-2013-14 నుంచి 2015-16 వరకు వ్యవసాయ, అనుబంధ రంగాల జీవీఏలో వాటాలు
అంశం 2013-14 2014-15 2015-16
పంటలు 64 62 60
పశుపోషణ 23 24 26
అటవీ ఉత్పత్తులు 8 8 9
మత్స్య సంపద 5 5 5
అంచనాలు శాతాల్లో
-అటవీ, మత్స్య ఉత్పత్తుల ఆదాయం స్థిరంగా కొనసాగుతున్నది.
తెలంగాణ సంతులిత వ్యవసాయాభివృద్ధి
-తెలంగాణలో వ్యవసాయ సంతులిత అభివృద్ధికి ప్రభుత్వం 2014-15లో కొన్ని ముఖ్యమైన చర్యలు చేపట్టింది.
విత్తన భాంఢాగారం
-వ్యవసాయ ఉత్పాదకత పెంపులో విత్తనానిదే కీలకపాత్ర. విత్తనం నాణ్యతమీద ఆధారపడే ఎరువులు తదితరాల పనితీరు, సామర్థ్యం ఉంటాయి. అందువల్ల దేశానికే తెలంగాణను విత్తర భాంఢాగారంగా తీర్చిదిద్దే వ్యూహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది.
-వరి, మక్కజొన్న, సోయా, ఆముదం, పత్తి మొదలైన పంటలకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడానికి తగిన నేలలు, అనుకూల వాతావరణం తెలంగాణకు వరం అని చెప్పవచ్చు.
-ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్టిఫైడ్ విత్తనాలను ఉత్పత్తి చేయడానికి పంచవర్ష ప్రణాళికను సిద్ధం చేశారు. సీడ్ విలేజ్ ప్రోగ్రాం, సీడ్ ప్రొడక్షన్ ఇన్ స్టేట్ సీడ్ ఫార్మ్‌ల ద్వారా తెలంగాణ రాష్ర్టానికి చెందిన స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎస్డీసీ), ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా వంటి ప్రభుత్వ సంస్థల ద్వారా విత్తనోత్పత్తి కార్యక్రమానికి ప్రణాళికలు వేస్తున్నారు.
-వివిధ పంటలకు సంబంధించి 37.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 3.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉత్పత్తి చేస్తున్నారు. అవి ప్రధానంగా సంకర వరి, పత్తి, పెసలు మొదలైనవి. ఈ విత్తనాలను మన రాష్ట్ర రైతులతోపాటు, ఇతర రాష్ర్టాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.
-నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తిచేసి రైతులకు సరఫరా చేసేందుకు రాష్ట్ర బడ్జెట్లో రూ. 50 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో విత్తన సంబంధిత రంగాలను పటిష్టం చేయడం, పాతరకం విత్తనాల స్థానంలో కొత్తరకం విత్తనాలను ప్రవేశపెట్టే ప్రక్రియను మెరుగుపర్చడం, అదనపు గిడ్డంగుల నిర్మాణం, విత్తనశుద్ధి పరికరాల సేకరణ, విత్తన పరీక్ష ప్రయోగశాలలను పటిష్టం చేయడం మొదలైన చర్యలు ఉన్నాయి.
-సేద్యానికి ఆమోదయోగ్యమైన 536 హెక్టార్ల విస్తీర్ణంలో రాష్ట్రంలో 10 విత్తన క్షేత్రాలు ఉన్నాయి. వీటి ప్రధాన ఉద్దేశం సీడ్ విలేజ్ స్కీమ్ ద్వారా విత్తన సరఫరా చేయడం. ఈ క్షేత్రాలను పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుగాను విత్తనోత్పత్తి కోసం బ్రీడర్ విత్తనాన్ని సరఫరా చేస్తారు. అలాగే ఈ క్షేత్రాలకు నికరంగా సాగునీటిని అందించడానికి విత్తనశుద్ధి, నిల్వ వంటి మౌలిక సదుపాయాలను కూడా సమకూరుస్తారు.
పంట అభివృద్ధి క్షేత్రాలు
-తగిన నేలల్లో, సానుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో తెలంగాణలో సువిశాలమైన విస్తీర్ణాల్లో వరి, మక్కజొన్న, పప్పుధాన్యాలు, సోయా, ఆముదం, వేరుశనగ వంటి పంటలు విస్తారంగా పండుతున్నాయి. పంట విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు, ఉత్పత్తిని పెంచి, ఉత్పాదకతను ఇనుమడింపజేసేందుకు స్వయం సమృద్ధిని సాధించడానికి ఈ పంటల కింద పంట క్షేత్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు.
-వ్యవసాయంలో దీర్ఘకాలంగా ఆటుపోట్లను తట్టుకొని మంచి దిగుబడి సత్తా కలిగిన, ధృవీకృత విత్తనాలు రైతులకు సకాలంలో అందడం రాష్ట్రంలో ఇప్పటికీ సమస్యగానే ఉంది. దేశంలో 20 శాతం మంది రైతులు మాత్రమే ధృవీకృత విత్తనాలను వాడుతున్నారు. మిగిలిన 80 శాతం మంది రైతులు పంట నుంచి మిగిల్చిన విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో 70 నుంచి 80 శాతం రైతులు ధృవీకృత విత్తనాలను ఉపయోగిస్తున్నారు. సరఫరా కొరత ఏర్పడినప్పుడు సమస్యను అధిగమించేందుకు విత్తన వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది.
-దేశంలో 60 శాతం విత్తనాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయి. తెలంగాణ నుంచి 14 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. సీడ్ విలేజ్ కార్యక్రమం కింద 2015 ఖరీఫ్‌లో 1458 గ్రామాల్లోని 36,415 మంది రైతుల భాగస్వామ్యంతో 14,500 హెక్టార్ల భూమిలో 3.30 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
-వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వరి విత్తనోత్పత్తి ఎక్కువ. మహబూబ్‌నగర్ జిల్లాలో సంకర పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో సంకర మక్కజొన్న కార్యక్రమం నడుస్తున్నది. అదేవిధంగా వరి, ఆముదం, పప్పులు, వేరుశనగ, సోయాబీన్స్, కూరగాయల విత్తనాల కోసం కరీంనగర్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో సువిశాల వ్యవసాయ క్షేత్రాలను ఉపయోగిస్తున్నారు. అందువల్ల విత్తనాల కోసం పంట క్షేత్రాన్ని విస్తరించడానికి విత్తనోత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి విత్తన రంగంలో స్వయంసమృద్ధి సాధించడానికి పంట కాలనీలు నెలకొల్పాలని ప్రతిపాదించారు.
నూతన విత్తన విధానం
-తెలంగాణ రాష్ర్టాన్ని విత్తన వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను, రైతులకు మేలుచేసేలా నూతన విత్తన విధానాన్ని అమల్లోకి తేవాలని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. రాష్ర్టాన్ని విత్తన భాంఢాగారం చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లో గతేడాది అక్టోబర్ 27 నుంచి 29 వరకు 8వ జాతీయ విత్తన కాంగ్రెస్ సమావేశాలు ప్రభుత్వం నిర్వహించింది. రైతులను విత్తనోత్పత్తిదారులుగా మార్చేందుకు అవసరమైన శిక్షణ కోసం ప్రతి విత్తన కంపెనీకి ఒక గ్రామాన్ని దత్తత ఇవ్వాలని సూచించింది.
సదస్సు తీర్మానాలు
1. విత్తన మార్పిడి నిష్పత్తి పెంచడం, రైతులందరికీ నాణ్యమైన విత్తనాలను అందించేందుకు విత్తన సహకార సంస్థల ఏర్పాటు
2. అన్ని పంటలు, కూరగాయల ఫౌండేషన్, ధృవీకరణ, విత్తనం ఉత్పత్తికి రైతులకు ప్రోత్సాహం
మాదిరి ప్రశ్నలు
1. 2016-17లో భారత వ్యవసాయ, అనుబంధరంగాల్లో వృద్ధిరేటు ఎంత? (2)
1) 3.9 2) 4.9 3) 5.9 4) 2.9
2. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే 2017 ప్రకారం సాగు విస్తీర్ణంలో భారత స్థానం (4)
1) మూడు 2) రెండు 3) నాలుగు 4) ఒకటి
3. దేశంలో పంటల సాగు సరళిని కింది ఏ అంశాలు నిర్ణయిస్తాయి? (4)
1) వాతావరణ పరిస్థితులు 2) కమత పరిమాణం 3) ప్రభుత్వ విధానాలు 4) పైవన్నీ
4. దేశంలో మొత్తం సాగు విస్తీర్ణం మిలియన్ హెక్టార్లలో? (1)
1) 179.8 2)169.8 3) 159.8 4) 149.8
5. ప్రపంచ సాగు విస్తీర్ణంలో భారత్‌లో ఎంతశాతం ఉంది? (2)
1) 8.6 2) 9.6 3) 9.7 4) 6.6
6. 2016-17లో నికర సాగు విస్తీర్ణంలో తెలంగాణలో అత్యధికంగా ఏ జిల్లా ఉంది? (4)
1) మెదక్ 2) సూర్యాపేట
3) రంగారెడ్డి 4) నల్లగొండ
7. భూకమతాలను ఎన్నేండ్లకు ఒకసారి లెక్కిస్తారు? (2)
1) ఆరు 2) ఐదు 3) నాలుగు 4) మూడు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు