ఓటరులో చైతన్యం.. ఓటుతోనే భవితవ్యం
- భారత ఎన్నికల సంఘం
- నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
- భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద
ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు తప్పనిసరి. అందుకే ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు వంటివని చెప్పవచ్చు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రాజ్యాంగబద్ధంగా 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పాటై పని ప్రారంభించింది.
భారత ఎన్నికల సంఘం అమలులోకి వచ్చిన జనవరి 25ను ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవంగా మంత్రి మండలి సూచనల మేరకు 2011 నుంచి నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన పౌరులు ఓటు నమోదు చేసుకోవడానికి ముందుకు ఉత్సాహంగా రావడం లేదని గ్రహించిన నాటి ప్రధాని మన్మోహన్సింగ్ నేతృత్వంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యువత తమను తాము ఓటర్‌గా నమోదు చేసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు రావడానికి వారిలో చైతన్యం కల్పించే ఉద్దేశంతో 2011 జనవరి 25న మొట్టమొదటిసారి జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రతి సంవత్సరం ఓటర్ల దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకొంటున్నారు. వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఓటుహక్కు నమోదు కోసం యువత ఉత్సాహంగా ముందుకు రావడానికి కృషి చేస్తున్నారు. గతంలో ‘ఓటర్లు ఓటర్‌గా గర్వపడుతున్నారు’ ‘ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు’ అనే లోగోను కలిగి ఉన్న బ్యాడ్జీలను యువతకు అందించి ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడం జరిగింది. గత సంవత్సరం 2022లో జరిగిన 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం థీమ్ ‘ఓటర్లలో సాధికారతను పెంచడం, అప్రమత్తతను కలిగించడం, రక్షణ కల్పించడం, సమాచార ప్రసారం కలిగించడం’.
ప్రతి సంవత్సరం జరుపుకొనే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతి థీమ్ ఉద్దేశం ఓటుహక్కు దాని వినియోగం, ఆవశ్యకత పట్ల అవగాహన పెంపొందించడం. అబ్రహం లింకన్ అన్నట్లు ‘ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది’ కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
ఓటు వేయకపోతే నువ్వు లెక్కలోకి రావు- నాన్సి పెలోసి
ఓటు వేయనివాడు చనిపోయిన వాడితో సమానం అనే నానుడి ఓటు హక్కు ప్రాముఖ్యత తెలియజేస్తుంది.
హిల్లరీ క్లింటన్ అభిప్రాయం ప్రకారం ‘ఓటు అనేది ప్రతి పౌరుడి హక్కు మన ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడే బాధ్యత మనదే’.
భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో గల 324 నుంచి 329 అధికరణలు భారత ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధుల గురించి తెలుపుతున్నవి.
భారత ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం పేరు ‘నిర్వచన సదన్’. ఇది ఢిల్లీలో ఉంది.
ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ.
భారత ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్లను భారత రాష్ట్రపతి నియమిస్తాడు.
పదవీకాలం: 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు నిండే వరకు కొనసాగుతారు.
వేతనం: ప్రధాన, ఇతర కమిషనర్ల నెలసరి వేతనం రూ.2,50,000. దీన్ని భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
తొలగింపు: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి వలె పార్లమెంట్ తీర్మానం మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు. ఇతర కమిషనర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్ సలహా మేరకు రాష్ట్రపతి తొలగిస్తాడు. ప్రస్తుతం భారత ఎన్నికల కమిషన్‌లో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు సాధారణ ఎన్నికల కమిషనర్లు ఉన్నారు.
1950 నుంచి 1989 వరకు భారత ఎన్నికల సంఘం ఏక సభ్య సంఘం కానీ 1989 అక్టోబర్ 16 నుంచి దీన్ని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం బహుళ సభ్య సంఘంగా మార్చింది.
1990 జనవరిలో వి.పి.సింగ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసి మళ్లీ భారత ఎన్నికల సంఘాన్ని ఏక సభ్య సంఘంగా మార్చింది. కానీ మళ్లీ 1993 అక్టోబర్‌లో పి.వి.నరసింహారావు ప్రభుత్వం ఆనాటి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ టి.ఎన్.శేషన్ ప్రాబల్యం తగ్గించడం కోసం భారత ఎన్నికల సంఘాన్ని త్రిసభ్య సంఘంగా మార్చింది. ఈ ముగ్గురికి సమాన హోదా, జీతభత్యాలు కల్పిస్తూ ఎక్కువ మంది కమిషనర్ల నిర్ణయమే చెల్లుతుంది.
ప్రస్తుతం భారత ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ కాగా ఇతర ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌గోయెల్
భారత తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్- సుకుమార్ సేన్. ఈయన 21.03.1950 నుంచి 19.12.1958 వరకు కొనసాగారు.
భారత ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసిన తొలి, ఏకైక మహిళ- వి.ఎస్.రమాదేవి ఈమె 26.11.1990 నుంచి 11.12. 1990 వరకు పనిచేశారు.
భారతదేశానికి 10వ, అత్యంత ప్రసిద్ధిగాంచిన, వివాదాస్పద ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా టి.ఎన్.శేషన్‌ను పేర్కొంటారు. ఈయన 12.12.1990 నుంచి 11.12.1996 వరకు కొనసాగారు. అనేక ఎన్నికల సంస్కరణలు చేసిన ఫలితంగా రామన్ మెగసెసె అవార్డు పొందాడు.
ఓటర్ గుర్తింపు కార్డును టి.ఎన్.శేషన్ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రవేశపెట్టారు.
అత్యధిక కాలం భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసినవారు కె.వి.కె. సుందరం (1958-1967). ఈయన 8 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పనిచేశారు.
అతితక్కువ కాలం భారత ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసినవారు నాగేంద్రసింగ్ (1.10.1972-6.2.1973) ఈయన నాలుగు నెలల ఆరు రోజులు పనిచేశారు.
భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో గల 324-329 అధికరణలు భారత ఎన్నికల సంఘం అధికారాలు, విధుల గురించి తెలుపుతున్నాయి. అవి..
అధికరణ-324: భారత ఎన్నికల సంఘం భారత పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసన సభలోని విధాన సభ, విధాన పరిషత్‌లకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తదితర ఎన్నికలను నిర్వహిస్తుంది.
అధికరణ-325: ఓటుహక్కును పౌరులకు అందించడంలో కుల, మత, జాతి, వర్గ, లింగ అనే ఐదు రకాల వివక్షతలను నిషేధించింది.
అధికరణ-326: 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులకు వయోజన ఓటు హక్కు కల్పించడమైంది.
గమనిక: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు వయోజన ఓటు హక్కు వయోపరిమితి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ 61వ రాజ్యాంగ సవరణ చట్టం-1988 ప్రకారం రాజీవ్‌గాంధీ ప్రభుత్వం దీన్ని 18 సంవత్సరాలుగా నిర్ణయించింది.
అధికరణ-327: ఎన్నికలకు సంబంధించి చట్టాలను పార్లమెంట్ రూపొందిస్తుంది. అని తెలుపుతుంది.
అధికరణ-328: రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు సంబంధించిన చట్టాలను పార్లమెంట్ రూపొందించకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకోవచ్చు.
అధికరణ-329: ఎన్నికల చిహ్నాలు, ఎన్నికల వాయిదా మొదలైన విధులు. వివాదాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. వాటిని ఎన్నికల కమిషనే పరిష్కరిస్తుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.
73వ రాజ్యాంగ సవరణ-1993 ప్రకారం ఏర్పాటు చేసిన చట్టంలోని ఆర్టికల్ 243(కె), ఆర్టికల్ 243(జెడ్‌ఎ) రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటును వివరిస్తున్నాయి. ఇది రాజ్యాంగ బద్ధ సంస్థ.
గవర్నర్ ఆ రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు సంబంధించిన అర్హతలు, పదవీకాలం, షరతులు నిర్ణయిస్తాడు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం- 1994 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏకసభ్య కమిషన్. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు.
జీతభత్యాలు: హైకోర్టు న్యాయమూర్తుల వేతనానికి సమాన స్థాయిలో ఎన్నికల కమిషనర్ వేతనం ఉంటుంది.
తొలగింపు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు న్యాయమూర్తిని తొలగించిన పద్ధతిలోనే పార్లమెంట్ తొలగిస్తుంది.
విధులు: రాష్ట్ర స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళిని రూపొందిస్తుంది. ఎన్నికల నిర్వహణ, నియంత్రణకు సంబంధించిన అధికారాలను కలిగి ఉంటుంది.
నోట్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్- వికాస్‌రాజ్.
ప్రాక్టిస్ బిట్స్
1. భారత ఎన్నికల సంఘం నిర్మాణం, స్వతంత్ర ప్రతిపత్తి గురించి తెలిపే అధికరణం ఏది?
ఎ) 312 బి) 315
సి) 324 డి) 124
2. భారత ఎన్నికల సంఘం ఏరోజున ఏర్పాటైంది?
ఎ) 1950 జనవరి 26
బి) 1947 జనవరి 25
సి) 1950 జనవరి 25
డి) 1956 జనవరి 26
3. దేశంలో తొలి ఓటర్స్ డే ను ఏరోజున నిర్వహించారు?
ఎ) 1950 జనవరి 25 బి) 1971
సి) 2011 జనవరి 26
డి) 2011 జనవరి 25
4. ఈవీఎంలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది?
ఎ) లోహ్ర కమిటీ
బి) దినేష్ గోస్వామి కమిటీ
సి) శేషన్ కమిటీ
డి) 15వ లా కమిషన్
5. ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తిమంతమైంది అన్నది ఎవరు?
ఎ) ఉడ్రోవిల్సన్ బి) అరిస్టాటిల్
సి) హిల్లరీ క్లింటన్ డి) అబ్రహం లింకన్
6. వయోజన ఓటు హక్కు గురించి భారత రాజ్యాంగంలోని ఏభాగం, ఏ ఆర్టికల్ తెలుపుతుంది?
ఎ) 16వ భాగం, 326వ ఆర్టికల్
బి) 15వ భాగం, 324వ ఆర్టికల్
సి) 5వ భాగం, 124వ ఆర్టికల్
డి) 15వ భాగం, 326వ ఆర్టికల్
7. కిందివాటిలో సరికానిది ఏది?
1. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఆరు సంవత్సరాలు
2. ప్రధాన, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తాడు
3. భారత ఎన్నికల సంఘం బహుళ సభ్య సంఘం
4. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్రపతి
తొలగిస్తాడు
ఎ) 4 బి) 1
సి) 1, 3 డి) ఏదీకాదు
8. ఓటర్ గుర్తింపు కార్డును ప్రవేశపెట్టినది?
ఎ) సుకుమార్‌సేన్
బి) కె.వి.కె. సుందరం
సి) జె.ఎమ్.లింగో
డి) టి.ఎన్.శేషన్
9. జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు
నిర్వహిస్తారు?
ఎ) జనవరి 26 బి) ఆగస్టు 15
సి) జనవరి 25 డి) ఆగస్టు 26
10. ఎన్నికల ఫిర్యాదు టోల్ ఫ్రీ నెంబర్?
ఎ) 1001 బి) 1930
సి) 1950 డి) ఏదీకాదు
11. భారత ఎన్నికల కమిషన్ ప్రధాన
కార్యాలయం పేరు?
ఎ) యోజనా భవన్ బి) దోల్పుర్ భవన్
సి) అంబేద్కర్ సదన్ డి) నిర్వచన్ సదన్
సమాధానాలు
1. సి 2. సి 3. డి 4. బి
5. డి 6. డి 7. డి 8. డి
9. సి 10. సి 11. డి
ఎం.హేమచందర్‌రెడ్డి , రాజనీతి శాస్త్ర
అధ్యాపకులు,ప్రభుత్వ జూనియర్ కళాశాల,హుజూర్నగర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు