యూరప్ వెలుగు – ఫ్రెంచ్ విప్లవం
16వ లూయీ (1774-92)
-ఇతడు ఉత్తముడు, స్నేహశీలి అయినా చురుకుదనం, స్థిరచిత్తం లేనివాడు. నాటి పరిస్థితుల్లో దేశాన్ని పాలించగల రాజకీయ అనుభవం, సమర్థత అతనికి లేవు. తన శిరసు మీద ఉంచిన కిరీటాన్ని భూగోళమంత భారంగా భావించాడు. అతనికి పరిపాలనపై ఆసక్తి లేదు. అతని భార్య మేరీ ఆంటోనైట్ ఆస్ట్రియా మహారాణి, రోమన్ సామ్రాజ్యాధినేత మెరియా థెరిసా కుమార్తె. ఆమెకు రాజకీయ అనుభవం లేకపోయినా రాజకీయాల్లో జోక్యం కలిగించుకుంది. ప్రజలంటే ఎప్పడూ తనను పరివేష్టించి ఉండి పొగడ్తలతో ముంచే భూస్వాములేనని భావించింది. ఆమె విదేశీ వనితగా, శతృరాజ్యమైన ఆస్ట్రియా రాకుమార్తెగానే ప్రజల మనసుల్లో ముద్రితమైంది.
-విప్లవానికి ముందు ఫ్రెంచ్ పరిపాలనా వ్యవస్థ అవకతవలతో నిండి ఉంది. నిరంకుశత్వం, అరాచకం అన్ని రంగాలకు విస్తరించింది. రాజకుటుంబం నివసించే వర్సేకోట విందులు విలాసాలకు నిలయమైంది. కోటలో ఉండే 18 వేల మందిలో 16 వేల మంది చక్రవర్తి, అతని కుటుంబానికి వ్యక్తిగత సేవలకు ఉద్దేశించినవారే వారిలో ఒక్క రాణి సేవకే 500 మందిని ఉపయోగించేవారు.
-రాచకుటుంబ విహారాలకు 200ల వాహనాలుండేవి. రాజు ఉపయోగించే టేబుల్ ఖరీదు ఒకటిన్నర మిలియన్ డాలర్లు. ఈ కారణంగా వర్సే రాజప్రసాదాన్ని దేశం మీద నిర్మించిన సమాధిగా వర్ణించారు. విప్లవానికి ముందు దేశమంతా ఒకేవిధమైన పరిపాలనా విభాగాలు లేవు. న్యాయ వ్యవస్థ అన్యాయ వ్యవస్థగా ఉండేది. న్యాయ విభాగాల్లో పార్లిమాలు అనే న్యాయస్థానాలుండేవి. వాటిలో పారిస్ పార్లిమా ఉన్నతమైనది. అయినా దేశమంతా ఒకే న్యాయస్మృతి లేదు. వివిధ రకాల శిక్షాస్మృతులు ఉండేవి. శిక్షలు కఠినంగా ఉండేవి. లెటర్ డి కాచెట్ అనే ఆజ్ఞాపత్రం ద్వారా ఎవరినైనా, కారణం తెలుపకుండా నిర్బంధించే అధికారం రాజుకు ఉండేది. న్యాయమూర్తి పదవులు అమ్మకానికి ఉండేవి. వాటిని కొన్నవారు నేరస్తులపై భారీగా జరిమానాలు విధించి డబ్బు వసూలు చేసేవారు. దేశంలో ఒకే విధమైన తూనికలు, కొలతలు లేవు. ఫ్రెంచ్ సైన్యం అవసరంలేని హోదాలను అధికారాలకు నిలయంగా ఉండేది. సైన్యంలో మొత్తం 1,35,000 మంది ఉండగా వారిలో అధికారులు 35 వేల మంది. అందులో 3,500 మంది మాత్రమే అవసరం. వీరందరికి ఏడాదికి 46 మిలియన్ల డాలర్లు ఖర్చయ్యేది.
సాంఘిక కారణాలు
-ఫ్రెంచ్ విప్లవం రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిందనడంకంటే సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా సంభవించిందనడం సముచితం. ఫ్రెంచ్ సమాజం ప్రధానంగా రెండు వర్గాలుగా చీలిపోయింది. అవి.. ఉన్నతవర్గం, సామాన్యవర్గం.
-ఉన్నతవర్గం తిరిగి మతాధికారులు, భూస్వాములుగా పునర్విభజింపబడగా, సామాన్యవర్గం మధ్యతరగతి, సామాన్యులుగా విడిపోయింది.
-ఉన్నత వర్గానికి చెందిన క్రైస్తవ మతాచార్యులు విలాసవంతమైన జీవితం గడిపారు. 24 మిలియన్లు ఉన్న ఫ్రాన్స్ జనాభాలో వీరి సంఖ్య 1,35,000. విశాలమైన భూభాగాలు చర్చి ఆధీనంలో ఉండటంవల్ల వీరు సంపన్నులయ్యారు. ప్రజలు ప్రత్యేకంగా చర్చికి పన్నులు చెల్లించాల్సి ఉండటంతో వారి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఫలితంగా మతాచార్యులు కోటలు, ప్రసాదాలు సమకూర్చుకుని సుఖాలకు అలవాటుపడి ఆధ్యాత్మిక జీవనానికి దూరమయ్యారు. సమాజం, ప్రభుత్వంలో కొన్ని ప్రత్యేక హక్కులు, అవకాశాలు వీరి సొంతమయ్యాయి. కాగా, కింది స్థాయి మతాచార్యులు సామన్యవర్గం నుంచి రావడంతో మత కార్యకలాపాలను శ్రద్ధతో నిర్వహించేవారు. ఉన్నతవర్గ మతాచార్యవర్గ కార్యకలాపాలను వీరు వ్యతిరేకించారు. అందుకే విప్లవం వచ్చినప్పుడు వీరు దాన్ని సమర్థించి సామాన్యుల్లో కలిసిపోయారు.
-ఉన్నతవర్గంలో రెండో స్థానం భూస్వాములది. ఫ్రెంచ్ జనాభాలో వీరి సంఖ్య 1,50,000. విశాలమైన భూములతోపాటు వీరు కోటలో సైన్యాలు, న్యాయస్థానాలు కలిగి ఉండేవారు. ప్రభుత్వం, సైన్యం, చర్చిలో ఉన్నత పదవులన్నీ వీరి కోసమే అన్నట్టుండేవి. చర్చి, థియేటర్లో ముందువరస సీట్లన్నీ వీరికే కేటాయించబడేవి. వీరు ఎక్కువకాలం వర్సే రాజప్రసాదంలోనే గడుపుతూ రాజు నుంచి ప్రయోజనాలు ఆశిస్తుండేవారు. యుద్ధకాలంలో తమ సైన్యాలతో రాజుకు సహకరించేవారు. తమలో తాము ఘర్షణ పడుతూ శాంతికి విఘాతం కలిగించారు. అయితే మతాచార్యుల్లో మాదిరిగానే భూస్వాముల్లో కూడా సామాన్య భూస్వామ్య వర్గం ఉండేది. ఇది కూడా విప్లవకాలంలో విప్లవకారుల పక్షమే వహించింది. ఫ్రెంచ్ జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న ఈ వర్గం దేశ సంపదలో 40 శాతం సొంతం చేసుకుని ఉండగా, మిగిలిన 99 శాతం జనాభా ఉన్న సామాన్యవర్గం వద్ద 60 శాతం సంపద మాత్రమే ఉండేది. ఈ వ్యత్యాసం చాలదన్నట్టు ఉన్నతవర్గానికి అన్నిరకాల పన్నుల నుంచి మినహాయింపు లభించింది. ఈ ప్రత్యేకమైన అవకాశమే వీరిని సామాన్యవర్గం నుంచి వేరుచేసింది.
-సామాన్యవర్గంలో కూడా రెండు తరగతులుండేవి. ఎగువ తరగతిలో ప్రభుత్వ అధికారులు, బ్యాంకర్లు, వర్తకులు, న్యాయవాదులు, వైద్యులు ఉండేవారు. వీరిని మధ్యతరగతి (బూర్జువా) అనవచ్చు. తమతమ వృత్తుల్లో రాణించి ఆర్థికంగా మెరుగైన స్థితిని చేరుకున్నారు. సామాన్యులుగానే వర్గీకరించబడ్డారు. రాజకీయాల్లో, ప్రభుత్వంలో తగిన ప్రాతినిథ్యం లభించలేదని భావించారు. ఫ్రెంచ్ విప్లవాన్ని విశేషంగా ప్రభావితం చేసిన మేధావివర్గం వీరినుంచే ఆవిర్భవించింది. మేధావుల ఆలోచనలతో ప్రభావితమైన ఈ వర్గమే అంతిమంగా విప్లవానికి నాయకత్వం వహించి అధికారాన్ని చేజిక్కించుకుంది.
-సామాన్యవర్గం దిగువతరగతిలో రైతులు, సేద్య బానిసలు ఉన్నారు. కొద్దిపాటి సొంతభూములున్నప్పటికి రైతుల పరిస్థితి సేద్య బానిసల కంటే భిన్నంగా ఉండేదికాదు. వీరు తమకు నచ్చిన పంట పండించుకునే అవకాశం లేదు. వీరి పంట పొలాలను భూస్వామి పెంపుడు జంతువులు నాశనం చేస్తున్నా వాటిని అదిలించే అధికారం లేదు. వీరు భూస్వామికి వెట్టి చేయాలి. కోటలు, రహదారులు, భవనాలను ఉచితంగా నిర్మించి ఇవ్వాలి. వారంలో కొన్ని రోజులు భూస్వామి పొలంలో ప్రతిఫలం లేకుండా పనిచేయాలి. ప్రభుత్వం నడపడానికి అవసరమైన పన్నులన్నీ మధ్యతరగతితో కలిసి వీరే చెల్లించాలి. రాజుకు, భూస్వామికి, చర్చికి పన్నులు చెల్లిస్తారు. వీటిలో డెయిరీ అనే భూమిపన్ను, టైథీ, పీటర్ పెన్స్ అనే చర్చి పన్నులు, విండ్టీమ్ అనే ఆదాయ పన్ను, గాచెల్లె అనే ఉప్పు పన్ను, కార్వీ అనే రహదారి పన్నులు ఉన్నాయి. వీటి నుంచే ఫ్రాన్స్‌లో భూస్వాములు యుద్ధాలు చేశారు. మతాచార్యులు ప్రార్థనలు చేశారు. ప్రజలు పన్నులు కడతారు అనే మధ్యయుగ నానుడి ఆవిర్భవించింది. ఈ పన్నులన్నీపోగా ఫ్రాన్స్ రైతుకు పండించిన పంటలో 20 శాతం మాత్రమే మిగిలేది. అది కనీస అవసరాలకు ఏ మాత్రం సరిపోలేదు. కాయలు, దుంపలు తిని ఆకలి తీర్చుకోవాల్సి వచ్చేది. అందుకే విప్లవానికి ముందు ఫ్రాన్స్‌లో 90 శాతం మంది తిండిలేక మరణించగా మిగిలిన 10 శాతం తిన్నదరగక మరణించారని వ్యాఖ్యానించారు.
వైజ్ఞానిక కారణాలు
-17, 18 శతాబ్దాల్లో ఐరోపాలో నూతన పరిశోధనలు జరిగి శాస్త్రీయ విజ్ఞానం కొత్తపుంతలు తొక్కింది. డెకార్ట్, రాబర్ట్ బాయల్ భౌతిక, గణితశాస్ర్తాల్లో నూతన సిద్ధాంతాలు రూపొందించారు. భౌతిక ప్రపంచం ప్రకృతి సూత్రాల ఆధారంగా నడుస్తుందని న్యూటన్ సిద్ధాంతీకరించాడు. ఫలితంగా ప్రజల్లో హేతువాద దృష్టి ప్రబలి సంప్రదాయక భావనలపై నిరసన ఏర్పడింది. శాస్త్రవేత్తలు, మేధావులు బైబిల్ వంటి మత గ్రంథాలను విశ్వసించక హేతువాద దృష్టితో భౌతిక శక్తుల ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఈ సిద్ధాంతాన్ని డేయిజమ్ అని, దీన్ని అనుసరించిన వారిని డేయిస్ట్లని అంటారు. డేయిజమ్ రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలను కూడా ప్రభావితం చేయడంతో రాచరికం దైవదత్తమనే సిద్ధాంతం, సామాజిక, ఆర్థిక అసమానతలు భగవంతుని సృష్టే అని నిర్హేతు భావనలకు కాలం చెల్లినట్లయ్యింది. రాజకీయ, సామాజిక రంగాలను కూడా శాసించేవి భౌతిక సూత్రాలేనని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో డేయిస్ట్లు అయిన ఫ్రెంచ్ తత్వవేత్తలు తమ నూతన రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాల ప్రతిపాదన ద్వారా విప్లవానికి అవసరమైన భౌతిక వాతావరణాన్ని రూపొందించారు. ఐరోపాలోని అన్ని రాజ్యాల్లో ఒకేవిధమైన పరిస్థితులున్నప్పటికీ విప్లవం ఫ్రాన్స్‌లోనే సంభవించడానికి ఫ్రెంచ్ మేధావులు, తత్వవేత్తలు నిర్వహించిన పాత్రే ప్రధానకారణం. వీరిలో మాంటెస్క్యూ, వోల్టేర్, రూసోలు ప్రముఖులు.
మాంటెస్క్యూ
-ఇతడు రాచరికవాది. క్యాథలిక్ న్యాయమూర్తి అయినా రాచరిక వ్యవస్థను తీవ్రంగా ఖండించారు. చర్చిలోని లోపాలను దుయ్యబట్టాడు. ఫ్రెంచ్ రాచరిక, మత సంప్రదాయాలను విమర్శించాడు.
-ది స్పిరిట్ ఆఫ్ లాస్ అనే తన గ్రంథంలో బ్రిటిష్ వ్యవస్థ స్థిరంగా ఉండటానికి ఆ దేశంలో శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య అధికార విభజన జరగడమే కారణమని అభిప్రాయపడ్డాడు. బ్రిటన్‌లోని ఉదారవాదం, ఫ్రాన్స్‌లోని నిరంకుశత్వాల మధ్య ఉన్న తేడాను స్పష్టం చేశాడు.
వోల్టేర్
-యూరప్‌ను తన పద్యాలు, నాటకాలు, వ్యాసాలు, చరిత్ర, తత్వకథలు, వ్యంగ్యంతో ముంచెత్తిన మహారచయిత, తత్వవేత్త వోల్టేర్. రాజులు, భూస్వాములు, మతాచార్యుల దుశ్చర్యలను ఖండించిన వోల్టేర్ రాజ్యాంగబద్ధ రాచరికాన్ని ప్రాజ్ఞ నిరంకుశత్వాన్ని సమర్థించాడు. ఇతడు సహజ హక్కుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, డేయిజమ్కు సరైన భాష్యం చెప్పాడు. శాస్త్ర విజ్ఞానంపై గట్టినమ్మకం ఉన్న వోల్టేర్, విశ్వసించాల్సింది భగవంతున్ని కానీ మత గ్రంథాలను కాదని, అవి మానవ కల్పితాలని అందులో అద్భుతాలన్నీ భ్రమలని అన్నాడు. వోల్టేర్ రచనల ప్రభావం ఫ్రెంచ్ విప్లవం మీద అమితంగా పడింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు