శాసనాలై నిలిచిన మహాకవులు

విష్ణుసూరి:
ఇతడు అద్వయానంద కృష్ణుని శిష్యుడు. ఈ మహాకవికి సంస్కృతంలో ఉన్న స్ఫూర్తి, పూర్తి సౌలభ్యం క్రీ.శ. 1295 నాటిదైన మగతల శాసనం వల్ల తెలుస్తున్నది.
రేపి:
క్రీ.శ. 1214 నాటి గణపవర శాసనంలో ఈ కవి ప్రశంస ఉన్నది. వందిసుతుడు, వేణీప్రియా భుజంగుడని, భరద్వాజ గోత్రుడని, సుచరితనిరతుడని, ఇతని కల్పనా శైలి సహృదయంగా అందరికి హత్తుకుంటుందని గణపవర శాసనంలోని 16వ శ్లోకం తెలుపుతుంది.
రవి చక్రవర్తి:
ఈయనకు కవి చక్రవర్తి అనే బిరుదు ఉన్నదని పాలక శాసనంలో గణపతిదేవ మహారాజు శాసనం ద్వారా తెలుస్తున్నది. వర్ణనలకంటే ఉత్ప్రేక్షాదులపై ఈ కవికి అభిరుచి ఉందని తెలుస్తుంది.
మాధవుడు:
ఈయన ఈశ్వరార్యపుత్రుడు. ఒకప్పటి మెదక్జిల్లా (నేటి సంగారెడ్డి)లోని ముదిమాణిక్యం గ్రామంలో దొరికిన శాసనం ఇతని కవిత్వానికి మచ్చుతునక.
వెంకట భట్టోపాధ్యాయుడు:
వేద శాస్ర్తార్థ తత్వజుడు. ఈయన రచించిన మన్ననూరి శాసనం సంస్కృతాంధ్ర సమ్మితము. ఈ పూర్తి శాసనాన్ని బీఎన్ శాస్త్రి, పరబ్రహ్మ శాస్త్రి పరిష్కరింపచేశారు.
మాయి భట్టోపాధ్యాయుడు:
మహబూబ్నగర్ జిల్లాలోని ఉమామహేశ్వర గ్రామంలో లభించిన శాసనంలో ఈ కవికి పదవాక్యప్రమాణజ్ఞుడనే బిరుదు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇతని కవిత్వంలో ప్రజ్ఞాశాలి అనడానికి ఉమామహేశ్వర శాసనం చివరున్న చక్రబంధమే తార్కాణం.
నాగదేవ కవి:
కాకతి రుద్రదేవుని సామంతుడైన గంగాధరుని ఆస్థానకవి దామోదరార్యుని కుమారుడు. ఈయన సకలశాస్త్ర పారంగతుడు. గంగాధరుని రంజన వంశాన్ని సహజ కావ్య సరళిలో ఎంతో మృదుమధురంగా బెకెల్లు శాసనంలో తెలిపాడు. ఇతని కవిత్వం.. శబ్ద రచనా సౌందర్యం, వస్వైక్యం, శబ్ద స్ఫూర్తి.
అనంతసూరి:
ఇమ్మాది మల్లికార్జునదేవుని ఆస్థాన కవి, పండితుడు గోవిందభట్టు దౌహిత్రుడు (కూతురి కొడుకు- మనుమడు). ఈయన విరచితమైన పానగల్లు శాసనం (క్రీ.శ. 1290) శబ్దార్థ ప్రాధాన్యంతో ఉంది. ఉపమానాలంకారాలు ఎక్కువగా ఉన్నాయి. కావూరి సుబ్రహ్మణ్యశాస్త్రి అనే శాసనకర్త పరిష్కరించాడని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే ఈ శాసనాన్ని ఇంగువ కార్తికేయశర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖకు అందించాడు.
అభినవ మయూరసూరి:
క్రీ.శ. 1245లో గణపతి దేవమహారాజు కాలంనాటి వడ్డమాను శాసనం ద్వారా మల్యాల గండ దండ నాయకుని ఆస్థాన కవుల్లో ఒకడని తెలుస్తున్నది. ఈ శాసనంలో 165 పంక్తులున్నప్పటికీ అందులో 41 పంక్తులు తెనుగు వచనంలో ఉన్నాయి. మిగిలినవి ప్రాకృత (బ్రాహ్మీ), సంస్కృత శ్లోకాలు. తెలంగాణలో ఉత్కృష్ట మహాశైలిలో శాసనం లభించింది. అయితే లింగాల శాసనంలో ఇతడు ఆత్రేయ గోత్రుడని, ఈశ్వర హరిపుత్రుడని కవిత్వపద వ్యాఖ్య శాసనం సంస్కృత శ్లోకాలతో ఉన్నది.
ఈశ్వరసూరి:
మయూరార్య పుత్రుడు, మహాశాసన, సంస్కృత కవి. ఈయన అంతగా తెలియని శబ్దాలంకార కవి. మహబూబ్ నగర్ జిల్లాలోని బూదపురంలో ఉన్న రెండు శాసనాలు (క్రీ.శ. 1256-1272) ఈశ్వర సూరి రచనా సామర్థ్యానికి మచ్చుతునకలు. మల్యాల గండ దండాదీశు ఆస్థాన కవుల్లో ఈయన ప్రథముడు. తెలంగాణలో పుట్టి కాశీపీఠంలో చదివి ఆస్థాన కవిగా మొదటివాడై అపశబ్దాభాస, అవ్యయాభాస-పునరుక్త్యాభాస, క్రియా పదభ్రమకవు, క్రియా పదత్రయ గోపకం స్త(స్థ)బకావళి-మిధునావళి-శబ్దాలంకారం, పాదాదియకము, అనవ్రతాక్షర ప్రయోగాలు ఈ మహాకవి రచనాశైలి.
నాగనాథుడు:
కౌశిక గోత్రికుడు. పశుపతి కుమారుడు. వరంగల్ జిల్లాలోని ఐనవోలు గ్రామంలో దొరికిన ప్రాచీన శాసనాలు ఇతని రచనలు రేచర్ల, కాకతీయ వంశాల వర్ణన శుద్ధ కావ్య ధోరణిలో చిత్రీకరించి రచించాడు. ఎందరో శాసనకవులు కూడా అంతరించిపోయారు. పిల్లలమర్రి, పాలంపేట, కోటగిరి, కొండిపర్తి, మెదక్, కుండినాపురం (నేటి కొండాపురం) మొదలైన శాసనకర్తలు (కవులు) పేర్లు తెలియనప్పటికీ వారి వాజ్ఞయ ప్రజ్ఞ కల్పనా చమత్కృతి, పరిశీలనా నైశిత్యం, భావములు అనంతం.
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
పుస్తక సమీక్ష / Book Review
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు