తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్)
– తెలంగాణ రాష్ట్ర సాధనకు తమవంతు తోడ్పాటును అందించే ఉద్దేశంతో 1999లో ఈ సంస్థ ఆవిర్భవించింది. దీన్ని అమెరికాలో మధు కే రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించడం, పుస్తకాలు ప్రచురించడం, తెలంగాణ సంస్కృతిపై వివిధ కార్యక్రమాలను చేపట్టడం, సెమినార్లు నిర్వహించడం, తెలంగాణ పండుగలు, వేడుకలను నిర్వహించడం ద్వారా తెలంగాణ ఉద్యమ భావజాలవ్యాప్తికి ఈ సంస్థ చాలా తోడ్పాటును అందించింది. దీంతోపాటు ప్రజలను చైతన్యం చేసి తెలంగాణను అభివృద్ధిచేయాలనే లక్ష్యంతో తెలంగాణ డాట్ ఆర్గ్ అనే వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేసింది. తెలంగాణ బాంక్వెట్ నైట్ పేరుతో అమెరికాలో తెలంగాణ విషయాలపై అనేక సమావేశాలు నిర్వహించింది. వీటిలో ప్రసంగించేందుకు ప్రొ. మధుసూదన్ రెడ్డి, ఆర్ విద్యాసాగర్ రావు, ప్రొ. హరినాథ్, వీ ప్రకాశ్ లాంటి వాళ్లను ఆహ్వానించారు.
తెలంగాణ ఎన్నారై అసోసియేషన్
– అమెరికాతోపాటు ప్రపంచమంతటా తెలంగాణ గొంతు వినిపించడానికి, వారికి ఒక వేదిక కల్పించడానికి 2007లో తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (టీఈఎన్ఏ) ఏర్పడింది. ఈ సంస్థకు చైర్మన్ నారాయణ స్వామి వెంకటయోగి, అధ్యక్షుడు వెంకట్ మారోజు, ఉపాధ్యక్షుడు అమర్ కర్మిల్ల. ఈ సంస్థ తెలంగాణకు చెందిన కవులు, కళాకారులు, సాహిత్య, కళాసాంస్కృతిక, సామాజిక పరిశోధన రంగాలకు చెందిన వారిని ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది ఐదు పురస్కారాలను ప్రకటించింది. అవి…
1. తెలంగాణ సాహిత్యరంగంలో- కాళోజీ పురస్కారం
2. తెలంగాణ కళా సాంస్కృతిక రంగాల్లో అత్యుత్తమ రచనకు- చిందు ఎల్లమ్మ పురస్కారం
3. తెలంగాణ పరిశోధనా రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణకు- ప్రొ. జయశంకర్ పురస్కారం
4. తెలంగాణ సామాజిక రంగంలో మార్పు కోసం- కుమ్రం భీం పురస్కారం
5. కొత్త రచనల ప్రోత్సాహానికి ప్రచురణ సహాయం కోసం- సురవరం ప్రతాపరెడ్డి పురస్కారం
– తెలంగాణ ఎన్ఆర్ఐలు సకల జనుల సమ్మెకు మద్దతుగా అమెరికా రాజధాని వాషింగ్టన్లో 2011, అక్టోబర్ 15న తెలంగాణ కవాతు పేరుతో భారీ ప్రదర్శన నిర్వహించా రు. దీనిద్వారా తెలంగాణ సమస్యను కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకువచ్చింది.
మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (ఎంటీఎఫ్)
– ఇది 2013, ఆగస్టు 18న ఏర్పడింది. దీని వ్యవస్థాపక అధ్యక్షుడు నూకల వెంకటేశ్వర రెడ్డి. ఉపాధ్యక్షుడు అనిల్ దీప్ గౌడ్. ఈ సంస్థ 2013, 14లో తెలంగాణ అస్థిత్వ చిహ్నమైన బతుకమ్మ పండుగను చాలా ఘనంగా నిర్వహించింది. 2015లో జరిగిన బతుకమ్మ సంబురాలకు మెల్బోర్న్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆర్థిక సహాయాన్ని అందించింది.
వైద్యుల పాత్ర
– గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు, దవాఖానల ఏర్పాటు, వైద్యుల నియామకం, మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి విషయాల్లో తెలంగాణ ప్రాంతం ఏవిదంగా వివక్షకు గురైందో గ్రహించిన తెలంగాణ వైద్యులు వివిధ సంఘాలను, జేఏసీని ఏర్పాటు చేసుకుని తెలంగాణ ప్రాతంలో ఉన్న వైద్యరంగ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉద్యమంలో భాగంగా రాజకీయ జేఏసీ ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరితోపాటు పారామెడికల్ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బంది తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యారు. ఏ గోపాల కిషన్ అధ్యక్షతన తెలంగాణ డాక్టర్స్ ఫోరం, డా. రమేషన్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, డా. బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ వంటి సంఘాలు ఏర్పడ్డాయి.
– వైద్యులు తెలంగాణ ఉద్యమంలో భాగంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ వైద్య గర్జన పేరుతో తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో 2010, జనవరి 22న ఉస్మానియా మెడికల్ కాలేజీలో బహిరంగ సభను నిర్వహించారు.
– రాజకీయ జేఏసీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ప్రభుత్వ వైద్యులు విధులను బహిష్కరించారు. పల్లె పల్లె పట్టాలపైకి కార్యక్రమంలో భాగంగా వైద్యులు పట్టాలపై పాలిక్లినిక్ పేరుతో ఉద్యమకారులకు వైద్య సేవలు అందించారు. మిలియన్ మార్చ్ కార్యక్రమంలో వైద్యులు తెల్ల దుస్తులతో పాల్గొన్నారు. వంటా వార్పు కార్యక్రమంలో బూర నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ జేఏసీ సికింద్రాబాద్ క్లాక్‌టవర్ వద్ద పాల్గొన్నది. 42 రోజులపాటు జరిగిన సకల జనుల సమ్మెలో వైద్యుల పాత్ర ప్రధానమైనది. ఉచిత మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఉస్మానియా, కాకతీయ, గాంధీ మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు, వైద్యులు నిరాహార దీక్షలు చేశారు.
– తెలంగాణ వైద్యుల జేఏసీ 2013, మే 15న వికారాబాద్‌లో వైద్యుల శంఖారావం నిర్వహించింది.