ఒక వంతుకు కుదించిన పోచంపాడు ప్రాజెక్టు.. ఎందుకంటే..?
– 1958లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక ప్రత్యేక చీఫ్ ఇంజినీర్ పోచంపాడు ప్రాజెక్టు పథకాన్ని కేంద్ర జల, విద్యుత్తు సంఘం పరిశీలన కోసం తీసుకెళ్లారు. పూర్తిస్థాయి ప్రాజెక్టు పథకాన్ని సంఘం ముందుకు తీసుకెళితే అనుమతి లభించదని, దాన్ని రూ. 13 లేదా 14 కోట్ల అంచనా వ్యయం కాగల పాక్షిక ప్రాజెక్టుగా కుదించి సమర్పించాలని ఆ సంఘం సభ్యుడొకరు స్పెషల్ చీఫ్ ఇంజినీర్‌కు సలహా ఇచ్చాడట.
– దీంతో రూ.67.35 కోట్ల అంచనా వ్యయంతో, 257 టీఎంసీల నీటి వినియోగంతో, 16.20 లక్షల ఎకరాలకు తెలంగాణలోని 6 జిల్లాల్లో సాగునీటి వసతి కల్పించగల పోచంపాడు ప్రాజెక్టు పథకం రూ.15.25 కోట్ల అంచనా వ్యయంతో 66 టీఎంసీల వినియోగంతో 2 జిల్లాల్లో కేవలం 3 లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరందించే పథకంగా నాలిగింట ఒక వంతుకు కుదించారు.
– 1959, మార్చిలో ఈ కుదించిన పథకాన్ని నీలం సంజీవరెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఈ పథకం ప్రకారం పోచంపాడు నీరు 6 జిల్లాలకు బదులు 2 జిల్లాలకే పరిమితం కానున్నది. దక్షిణ కాలువ ద్వారా నిజామాబాద్‌లో 14,570 ఎకరాలు, కరీంనగర్లో 3,25,430 ఎకరాలకు సాగునీరివ్వాలని ఈ కుదించిన పథకంలో ప్రభు త్వం నిర్ణయించింది. కడెం ప్రాజెక్టు నుంచి పూర్వం ప్రతిపాదించిన ఉత్తర కాలువ, విద్యుత్ ఉత్పాదన, చెన్నూరు దాకా నిర్మించాలనుకున్న దక్షిణ కాలువ, మానేరు డ్యాం అన్నీ రద్దయ్యాయి.
అధికారులను తప్పుపట్టిన అంచనాల కమిటీ
– పోచంపాడు వద్ద గోదావరిలో లభ్యమయ్యే నీటిని పూర్తిగా భవిష్యత్తులో వినియోగించడానికి తగిన సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారని ప్రాజెక్టు నివేదిక 7వ అధ్యాయంలో పేర్కొన్నారు. అలాంటప్పుడు 66 టీఎంసీలుగా ఎందుకు పేర్కొన్నారో తెలియడంలేదని శాసనసభ అంచనాల కమిటీ తమ నివేదికలో ఆశ్చర్యాన్ని వ్యక్తంచేసింది. పోచంపాడు ప్రాజెక్టు పథకంలో చేసిన సవరణలపై అనుమానాలను నివృత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యదర్శి అంచనాల కమిటీ ముందు హాజరయ్యారు.
– కమిటీ సభ్యుల అనుమానాలను తొలగించడానికి బదులు అనేక కొత్త అనుమానాలకు తావిచ్చే విధంగా ఆయన వ్యవహరించారని అంచనాల కమిటీ అభిప్రాయపడింది. పోచంపాడు ప్రాజెక్టు సైజును నాలుగో వంతుకు కుదించడానికి, నీటి వినియోగం 66 టీఎంసీలుగా తగ్గించి పేర్కొనడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది పరీవాహక రాష్ర్టాలతో లేదా కేంద్ర జల, విద్యుత్ సంఘం సభ్యునితో జరిపిన చర్చలకు సంబంధించిన రికార్డులు లేదా ఆధారాలు, ప్రాజెక్టును నాలుగో వంతుకు కుదించాలని సంఘం సభ్యుడు ఇచ్చిన సలహాకు సంబంధించిన ఆధారాలేవీ అంచనాల కమిటీకి ఈ ప్రభుత్వ కార్యదర్శి చూపించలేకపోయాడు.
నిష్కారణంగా దేవనూరు ప్రాజెక్టును వదిలేసిన ప్రభుత్వం
– నాలుగో వంతుకు కుదించిన పోచంపాడు ప్రాజెక్టు ప్రతిపాదనకు త్వరగా అనుమతులు కోరుతూ 1959, మార్చిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. 1959, ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ మంత్రి కేంద్ర ఇరిగేషన్, పవర్ సహాయ మంత్రికి పోచంపాడు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని లేఖ రాశారు.
– రెండో పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టును చేర్చడానికి వీలుగా తమ ప్రభుత్వం మంజీరాపై నిర్మిస్తున్న దేవనూరు ప్రాజెక్టను విరమించుకుంటుందని పేర్కొన్నారు. దేవనూరు ప్రాజెక్టు 27 టీఎంసీల వినియోగంతో మెదక్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి 150 క్యూసెక్కుల తాగునీరు, 14,250 కిలోవాట్ల విద్యుదుత్పాదన ఫ్రీక్ పవర్ 40 వేల కిలోవాట్లుంటుందని అంచనా, దిగువన ఉన్న నిజాం సాగర్‌కు నదిలో ఇసుక కొట్టుకురాకుండా నివారించడం లక్ష్యాలుగా రూ.11.95 కోట్లు అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టు, రెండో పంచవర్ష ప్రణాళికలో దేవనూరు ప్రాజెక్టుకు రూ.2.20 కోట్ల వ్యయం చేయడానికి ప్రణాళికా సంఘం ప్రతిపాదించింది. దేవనూరు ప్రాజెక్టును వదులుకోవడంవల్ల నిజాంసాగర్‌కు నష్టం వాటిల్లడమే కాకుండా జంటనగరాలు తాగునీటిని, మెదక్ జిల్లా సాగునీటిని నష్టపోయాయి. విద్యుత్తును కూడా నష్టపోయాయి.
– 1959, ఆగస్టులో సీఎం నీలం సంజీవరెడ్డి దేవనూరును వదులుకున్నందున పోచంపాడుకు అనుమతి ఇవ్వాలని ప్రణాళికా సంఘం సభ్యుడు సీఎం త్రివేదిని కోరినప్పుడు, దేవనూరు జల విద్యుత్ ప్రాజెక్టును మీరు వదులుకున్నా పోచంపాడుకు బదలాయించడానికి విద్యుత్ శాఖ వద్ద నిధులేమీ మిగలలేదని స్పష్టం చేశారు. దేవనూరు ప్రాజెక్టును నిర్మించడం ఇష్టంలేని ముఖ్యమంత్రి, నెపాన్ని కేంద్ర ప్రభుత్వం మీదకు నెట్టడానికి కావల్సిన ఆధారాలను సృష్టించడం కోసం ప్రణాళిక సంఘం సభ్యుడు సీఎం త్రివేదికి రెండో పంచవర్ష ప్రణాళికలో అవసరమైన సర్దుబాట్లు చేసి పోచంపాడు ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకూర్చాలని లేఖ రాశారు.
భారీ స్థాయి ప్రాజెక్టు కోసం టీఆర్సీ ప్రయత్నం
– రీజీనల్ కమిటీ ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర నీటిపారుదల, విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీంను, ప్రణాళికా సంఘం సభ్యుడు సీఎం త్రివేదిని కలిసి పూర్తిస్తాయి పోచంపాడు ప్రాజెక్టును వెంటనే అనుమతించాలని కోరినట్లు, దానికి త్రివేది సానుకూలంగా స్పందించి ఈ అంశాన్ని ప్రభుత్వం, ప్రణాళికా సంఘం వీలైనంత త్వరగా పరిశీలిస్తుందని హామీ ఇచ్చినట్లు 1960, అక్టోబర్ నివేదికలో రీజినల్ కమిటీ తెలిపింది. రీజినల్ కమిటీ ప్రతినిధి బృందం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన విజ్ఞప్తి పత్రంలో 1951లో కేంద్ర ప్రణాళికా సంఘం పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలోని గోదావరి పరీవాహక ప్రాంత ప్రాజెక్టులకు 494 టీఎంసీల నీటిని కేటాయించింది. రాష్ట్ర అవసరాల్లో 95 శాతం వరకు కేటాయింపులు చేశారు. 216 టీఎంసీలు పోచంపాడుకు కేటాయించామని గుర్తు చేశారు.
– తెలంగాణ రీజినల్ కమిటీ పోచంపాడు ప్రాజెక్టును 19.75 లక్షల ఎకరాలకు సాగునీరందించే, 125 లక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయగల ప్రాజెక్టుగా భారీ స్థాయిలోనే నిర్మించాలని ప్రాజెక్టును కుదించవద్దని ఒకవేళ రెండో పంచవర్ష ప్రణాళికలో చివరి సంవత్సరంలో కూడా చేర్చినట్లయితే తెలంగాణ మిగులు నిధులతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇంతకుపూర్వం 1958, నవంబర్ 19న కూడా పూర్వపు హైదరాబాద్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టాలని రీజినల్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
– 1959, జూలైలో తెలంగాణ అభివృద్ధిపై రీజినల్ కమిటీ నియమించిన సబ్ కమిటీ కూడా ఈ ప్రాజెక్టును భారీస్థాయిలో వెంటనే నిర్మాణం ప్రారంభించాలని సూచించిన నివేదికను టీఆర్సీ ఆమోదించింది. ఇవేవీ నీలం సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. రీజినల్ కమిటీ వేదన అరణ్య రోదనే అయింది. అదే సమయంలో రీజినల్ కమిటీ ఆకాంక్షలకు పూర్తి భిన్నంగా దేవనూరు ప్రాజెక్టును విరమించుకుంటూ, పోచంపాడును నాలుగో వంతుకు కుదిస్తూ సంజీవరెడ్డి ప్రభుత్వం కేంద్రానికి అనుమతి కోసం రిపోర్టును పంపింది. మార్చిన పోచంపాడు ప్రతిపాదనలు కేంద్రానికి పంపిన విషయం గాని, దేవనూరు ప్రాజెక్టును విరమించుకున్న విషయాన్ని గాని రీజినల్ కమిటీకి ప్రభుత్వం తెలపకుండా దాచిపెట్టింది.
53 నుంచి 12 టీఎంసీలకు కుదించిన కడెం ప్రాజెక్టు
– అదేవిధంగా 53 టీఎంసీల కేటాంయింపులు న్న ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం 12 టీఎంసీలకే పరిమితం చేయడం మరో దారుణం. కడెం ప్రాజెక్టులకు 53 టీఎంసీల కేటాయింపులు మినహాయించే పోచంపాడుకు 216 టీఎంసీలను 1951లో కేంద్రం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం 1961లో నియమించిన కృష్ణా-గోదావరి కమిషన్ 1962, ఆగస్టులో ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పోచంపాడు ప్రాజెక్టు స్థలం వద్ద నదిలో 66 టీఎంసీలకు మించి నీరు లభ్యమవుతున్నదని, పెద్ద సైజు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని, దిగువ ప్రాంతంలో వచ్చే వరదలను అరికట్టడానికి కూడా పెద్ద రిజర్వాయర్ ఉండాలని అభిప్రాయపడింది.
కుదించినదానికే కేంద్రం అనుమతి
– కేంద్ర ప్రభుత్వం నీలం సంజీవరెడ్డి పలుకుబడి ముందు తలవంచింది. ఆయన ఒత్తిళ్లకు లొంగి 1963, మార్చి 23న నాలుగో వంతుకు కుదించిన చిన్న సైజు పోచంపాడు ప్రాజెక్టుకు అనుమతిని మంజూరు చేసింది. 1963, జూలై 26న ప్రధాని నెహ్రూతో శంకుస్థాపన చేయించింది. దీన్ని అవకాశంగా తీసుకుని గోదావరిలో లభ్యమయ్యే మొత్తం నీటిని తామే వినియోగించుకోవాలనే దురాశతో మహారాష్ట్ర తమ ప్రాంతంలో అనేక పెద్ద ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 1959 తర్వాత కేంద్రం గంపగుత్తగా 400 టీఎంసీలను మహారాష్ట్రకు కేటాయించింది.
– 1951 నాటి పరిస్థితి చూస్తే ఖోస్లా-గోదావరి కమిషన్ నివేదిక ప్రకారం గోదావరిలో కొత్త ప్రాజెక్టులకు వినియోగానికి అందుబాటులో ఉన్న నీటి పరిమాణం 444 టీఎంసీలు కాగా మహారాష్ట్ర తమ ప్రాంత ప్రాజెక్టుల కోసం 210 టీఎంసీలు కావాలని కేంద్రాన్ని కోరింది. ఇక మిగిలింది 234 టీఎంసీలు పోచంపాడు వద్ద లభ్యమవుతున్నది. ఇంత నీరు అందుబాటులో ఉన్నా కేవలం 66 టీఎంసీలనే పోచంపాడుకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
– ఒక దశలో పోచంపాడుకు కేంద్రం అనుమతి పొందడంలో జాప్యాన్ని భరించలేకపోతున్నట్లు నటిస్తూ 1961, మే 1న కనీసం 41 టీఎంసీలు పోచంపాడుకు కేటాయించినా చాలునని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు. 1961, జూన్‌లో సవరించిన పోచంపాడు ప్రాజెక్టు నివేదికను కూడా కేంద్రానికి పంపింది. ఇది ఈ ప్రాంతం పట్ల సీమాంధ్ర పాలకులు చూపిన వివక్షకు తార్కాణం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు