Development and planning | దేశంలో పారిశ్రామికాభివృద్ధి- ప్రణాళికల దన్ను
పరిశ్రమ అంటే దేశంలో లభ్యమవుతున్న ముడిసరుకులను ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించి ఉత్పాదక, వినియోగ వస్తువులుగా తయారుచేసే ప్రదేశం. ఈ ప్రకియనే పారిశ్రామికీకరణ అంటారు.
-పారిశ్రామికీకరణతో ప్రజల తలసరి ఆదాయం, వినియోగ వ్యయం, మానవవనరులు అభివృద్ధి చెందుతాయి. 18 నుంచి 19వ శతాబ్దం మధ్యకాలంలో వ్యవసాయం, యాంత్రిక ఉత్పత్తి, గనుల తవ్వకం రవాణా, సాంకేతికత పరిస్థితులపై గొప్ప ప్రభావాన్ని చూపిన కాలాన్ని పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్నారు. ఇది ఇంగ్లండులో ప్రారంభమై అనంతరం ఐరోపా, ఉత్తర అమెరికా అనంతరం ప్రపంచమంతా వ్యాపించింది. ఆధునిక పారిశ్రామిక వ్యవస్థ ఆవిర్భవించకముందే దేశంలో తయారైన వస్తువులు ప్రపంచమంతా వ్యాపించాయి. 18వ శతాబ్దంలో ప్రారంభమైన మొదటి పారిశ్రామిక విప్లవం సుమారు 1850 నాటికి రెండో పారిశ్రామిక విప్లవంలో కలసిపోయింది. ఇప్పటిదాక తెలిసినంతవరకు పారిశ్రామిక విప్లవం అనే పదం బ్రిటన్ అర్థికవేత్త ఆర్నాల్డ్ తోయిన్బి బ్రిటన్ ఆర్థికాభివృద్ధిని వివరించడానికి ఎక్కువగా ఉపయోగించాడు. మొదటిసారిగా ఆధునికయుగంలో దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధి పరిశ్రమలపై ఆధారపడింది. వ్యవసాయం ప్రాధాన్యతగల దేశాల కంటే పారిశ్రామిక రంగం ప్రాధాన్యతగల దేశాలు త్వరగా అభివృద్ధి చెందాయి. పారిశ్రామిక విప్లవం మానవ చరిత్రలో ఒక ప్రధానమైన మలుపు. దేశంలో తయారైన మజ్లిస్, కాలికో వస్ర్తాలకు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉంది. మన దేశంలో తయారైన వస్తువులు మన అవసరాలు తీర్చడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయ్యేవి.
-నూలు, పట్టు వస్ర్తాలు, కాలికో, కళాత్మక వస్తువులు, ఉన్ని వస్ర్తాలు మొదలైనవి దేశ ఎగుమతుల్లో ముఖ్యమైనవి. వర్తకం పేరుతో బ్రిటిష్ వారు భారత్‌కు వచ్చి, దేశాన్ని వలస దేశంగా మార్చి, మనదేశంలోని ముడి సరుకులను వారి దేశానికి తరలించి, తయారైన వస్తువులను మనదేశానికి తీసుకొచ్చి విక్రయించారు. దేశ స్వాతంత్య్రానంతరం రెండో పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.
దేశంలో పరిశ్రమల ఆవశ్యకత
1. వ్యవసాయంపై జనాభా ఒత్తిడిని తగ్గించడం
2. జాతీయ ఆదాయం పెంచడం కోసం
3. ఉద్యోగవకాశాలు కల్పించడం కోసం
4. ఆర్థిక స్థిరత్వం సాధించడం కోసం
5. జీవన ప్రమాణాలు పెంచడం కోసం
6. అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధించడం కోసం
7. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం
8. విదేశీమారక ద్రవ్యం కోసం పరిశ్రమల నిర్మాణాన్ని కిందివిధంగా విభజించవచ్చు.
ఉపయోగాన్ని బట్టి పరిశ్రమల విభజన
1) ప్రాథమిక పరిశ్రమలు: ఉత్పాదక వస్తువులను ఉత్పత్తిచేసే భారీ ఇంజినీరింగ్ పరిశ్రమలు, యంత్రాలను తయారుచేసే పరిశ్రమలు ప్రాథమిక పరిశ్రమలు.
2) వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు: అంతిమ ఉపయోగంలో వినియోగించే వస్తువులను తయారుచేసే పరిశ్రమలు.
ఉదా: టీవీలు, రేడియోలు, ఔషధాలు, వస్త్రాలు, తోళ్లు, కాగితాలు, ఉప్పు, పంచదార వంటి వినియోగ వస్తువులను ఉత్పత్తి చేస్త్తాయి.
3) మాధ్యమిక వస్తువులను ఉత్పత్తిచేసే పరిశ్రమలు: వ్యవసాయానికి, పరిశ్రమల నిర్మాణానికి అవసరమైన ఉత్పాదకాలను తయారుచేసేపరిశ్రమలను మాధ్యమిక వస్తువులను ఉత్పత్తిచేసే పరిశ్రమలు అంటారు.
ఉదా: ఇనుము-ఉక్కు, సిమెంటు, విద్యుచ్ఛక్తి పరిశ్రమలు, బొగ్గు, సిమెంటు, ఆల్కహాల్, రసాయనాల పరిశ్రమలు.
ముడిపదార్థ స్వభావాన్ని బట్టి పరిశ్రమలను మూడు రకాలుగా విభజించవచ్చు..
1) వ్యవసాయాధారిత పరిశ్రమలు
2) అటవీ ఆధారిత పరిశ్రమలు
3) ఖనిజాధారిత పరిశ్రమలు
యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలు
1) ప్రభుత్వరంగ సంస్థలు: ప్రభుత్వరంగ పరిశ్రమల యాజమాన్యం, నిర్మాణం, నియంత్రణ, ప్రభుత్వం చేతిలో ఉంటాయి.
ఉదా: ఓఎన్జీసీ, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్, కోల్ ఇండియా లిమిటిడ్, ఎయిర్ ఇండియా మొదలైనవి.
2) ప్రైవేటురంగ సంస్థలు: ప్రైవేటురంగ పరిశ్రమల యాజమాన్యం, నిర్మాణం, నియంత్రణ ప్రైవేటురంగం లేదా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటుంది. ఉదా: రిలయన్స్, టాటా, ఇన్ఫోసిస్, అశోకా లేలాండ్
3) ఉమ్మడిరంగ సంస్థలు: ఉమ్మడిరంగ సంస్థల యాజమాన్యం, నిర్వహణ, నియంత్రణ ప్రభుత్వం, ప్రైవేటు వ్యవస్థాపకులు, పెద్ద సంఖ్యలో ప్రజల చేతిలో ఉంటుంది.
ఉదా: కొచ్చిన్ రిఫైనరీ లిమిటెడ్, గోవా కార్బన్ లిమిటెడ్, బీపీసీఎల్ మొదలైన సంస్థలు ఉమ్మడిరంగంలో ఉన్నాయి.
పెట్టుబడి పరిమాణాన్ని బట్టి నిర్మాణం
1) పెద్ద పరిశ్రమలు: పెద్ద పరిశ్రమల్లో పెట్టుబడి పరిమితి రూ. 10 కోట్ల కంటే ఎక్కువ, రూ. 100 కోట్ల కంటే తక్కువ.
2) మధ్యతరహా పరిశ్రమలు: పెట్టుబడి పరిమితి రూ. 5 కోట్ల కంటే ఎక్కువ, రూ. 10 కోట్ల కంటే తక్కువ ఉండే పరిశ్రమలను మధ్యతరహా పరిశ్రమలు అంటారు. సేవా సంస్థలకు పెట్టుబడి పరిమితి రూ. 5 కోట్లు.
3) మెగా పరిశ్రమలు: మెగా పరిశ్రమల్లో పెట్టుబడి పరిమితి రూ. 100 కోట్ల కంటే ఎక్కువు ఉంటుంది.
4) సూక్ష్మ పరిశ్రమలు: పెట్టుబడి పరిమితి రూ. 25 లక్షల కంటే తక్కువ ఉంటే సూక్ష్మ పరిశ్రమలు అంటారు. ఈ పరిమితిని సేవా సంస్థలకు రూ. 10 లక్షలుగా నిర్ణయించారు.
5) చిన్న పరిశ్రమలు: పెట్టుబడి పరిమితి రూ. 25 లక్షల కంటే ఎక్కువ, రూ. 5 కోట్ల కంటే తక్కువ ఉండే పరిశ్రమలను చిన్న పరిశ్రమలు అంటారు. సేవా సంస్థలకు ఈ పెట్టుబడి పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ.2 కోట్లుగా నిర్ణయించారు.
6) కుటీర పరిశ్రమలు: కర్మాగారాల్లో కాకుండా గృహాల్లో ఉత్పత్తయ్యే వస్తు, సేవలను తయారుచేసే పరిశ్రమలను కుటీర పరిశ్రమలు అంటారు. ఇవి సాధారణంగా అసంఘటిత రంగానికి లోబడి ఉండి చిన్నతరహా పరిశ్రమల వర్గానికి చెందుతాయి.
7) అనుబంధ పరిశ్రమలు: పెద్దతరహా పరిశ్రమలకు అవసరమైన విడిభాగాలు, యంత్ర పరికరాలను తయారుచేసే సంస్థలను అనుబంధ పరిశ్రమలు అంటారు. ఈ పరిశ్రమల పెట్టుబడి పరిమితి రూ. కోటికి మించకూడదు.
8) అతిచిన్న పరిశ్రమలు: అతిచిన్న సంస్థ ఏ ప్రాంతంలో ఉందనేదానితో సంబంధం లేకుండా సంస్థ యంత్రాలపై పెట్టుబడి రూ. 25 లక్షలకు పరిమితమైతే ఆ పరిశ్రమలను అతిచిన్న పరిశ్రమలు అంటారు.
సంస్థల ఆధారంగా నిర్మాణం
1) పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు: సభ్యులందరు స్వచ్ఛందంగా కలిసిన సమూహం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. కాబట్టి దీనిలో సభ్యులు విడివిడిగా న్యాయాత్మక అప్పులు పరిమితిగా ఉంటాయి.
2) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు: కనిష్టంగా ఇద్దరు, గరిష్టంగా 50 మంది సభ్యులకు మించకుండా ఉండే స్వచ్ఛంద సమూహాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటారు. దీనిలో రుణబాధ్యత పరిమితం. వాటాల బదిలీ దాని సభ్యులకు పరిమితమవుతుంది. ఈ కంపెనీ వాటాలు లేదా డిబెంచర్లు చందాదారులుగా సాధారణ ప్రజలను ఆహ్వానించడాన్ని అనుమతించరు.
3) ప్రభుత్వ కంపెనీలు: కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న కంపెనీలను ప్రభుత్వ కంపెనీలు అంటారు. ప్రభుత్వ కంపెనీల్లో అత్యధికంగా మూలధనం లేదా వాటాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయి. ప్రభుత్వ కంపెనీలు ప్రభుత్వ లిమిటెడ్ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా నమోదుకావచ్చు. కాని ఈ రెండు కంపెనీల యాజమాన్యం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. ప్రభుత్వేతర కంపెనీలకులేని సదుపాయాలు ప్రభుత్వ కంపెనీలకు ఉంటాయి. ప్రభుత్వ కంపెనీలు స్థాపించడానికి ఒక ప్రత్యేక చట్టం అవసరం లేదు. ఉదా: ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు.
పంచవర్ష ప్రణాళికల కాలంలో దేశంలో పారిశ్రామికాభివృద్ధి
మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56): మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇవ్వడంతో గతంలో ఉన్న పరిశ్రమలనే అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రణాళికలో పరిశ్రమలరంగ పెట్టుబడి లక్ష్యం రూ. 800 కోట్లు. దీనిలో ప్రభుత్వరంగానికి రూ. 94 కోట్లు కేటాయించారు. కాని రూ. 57 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిపి మొత్తం రూ. 340 కోట్లు కొత్త ప్రాజెక్టులు, ప్రాజెక్టుల ఆధునీకరణపై వ్యయం చేశారు. పారిశ్రామిక ఉత్పత్తి సాధారణ సూచీలో 39 శాతం పెరుగుదల సాధించింది. వార్షిక వృద్ధిరేటు లక్ష్యం 7 శాతం కాగా, వాస్తవంగా 6 శాతం వార్షిక వృద్ధిరేటును సాధించింది. ఈ ప్రణాళిక కాలంలో సింద్రిలో, నంగల్‌లో ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్‌లో రైలింజిన్ కర్మాగారం, బెంగళూరులో టెలిఫోన్ కర్మాగారం, పింప్రిలో పెన్సిలిన్ మందుల ఉత్పత్తి కర్మాగారం, హిందుస్థాన్ మెషీన్‌టూల్స్, హిందుస్థాన్ షిప్‌యార్డ్, హిందుస్థాన్ యాంటిబయాటిక్స్, హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్లను ఏర్పాటు చేశారు.
రెండో పంచవర్ష ప్రణాళిక (1956-61): రెండో పంచవర్ష ప్రణాళికలో మౌలిక, భారీ పరిశ్రమల స్థాపన, విస్తరణలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పారిశ్రామికీకరణ వేగాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో కుటీర, చిన్నతరహా పరిశ్రమల స్థాపన, గ్రామాల్లో జీవన ప్రమాణాలు పెంచడం.
-రెండో పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలరంగంపై రూ. 1810 కోట్లు వ్యయం చేశారు. ప్రణాళిక మొత్తం వ్యయంలో ఇది 27 శాతం. ఈ ప్రణాళికలో పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధిరేటు లక్ష్యం 10.5 శాతం కాగా, సాధించిన పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి 7.25 శాతం. రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రభుత్వరంగం ఆధ్వర్యంలో మూడు ఉక్కు కర్మాగారాలను స్థాపించారు. పశ్చిమ జర్మనీ సహకారంతో ఒడిశాలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం, USSR సహకారంతో మధ్యప్రదేశ్‌లో (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో) భిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం, UK సహకారంతో పశ్చిమబెంగాల్లో దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం, నైవేలిలో లిగ్నైట్ కార్పొరేషన్, శ్రీపెరంబుదూర్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రాంచీలో ఇంజినీరింగ్ పరికరాల పరిశ్రమ, భోపాల్‌లో హెవీ ఎలక్ట్రికల్స్‌ను, ఎరువుల కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికలో పరిశ్రమలరంగంలో వైవిధ్యం సాధించడం, పారిశ్రామిక పునాది విస్తరించడం జరిగింది. చమురు అన్వేషణ, బొగ్గుగనుల తవ్వకం కార్యక్రమాలు శక్తిమంతంగా అములుపర్చడం జరిగింది. ఈ ప్రణాళిక కాలంలో అణుశక్తి పరిశ్రమ అభివృద్ధి ప్రారంభమైంది.
మూడో పంచవర్ష ప్రణాళిక (1961-66): మూడో పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలు, గనుల తవ్వకానికి మొత్తం రూ. 3000 కోట్లు వ్యయం చేశారు. ఈ మొత్తంలో ప్రభుత్వరంగం వాటా రూ. 1700 కోట్లు. ప్రైవేటు రంగంవాటా రూ. 1300 కోట్లు. పారిశ్రామిక ఉత్పత్తిలో 70 శాతం వృద్ధి లక్ష్యంగా నిర్ణయించారు. 1965-66 తప్ప మిగిలిన అన్ని సంవత్సరాల్లో ఏటేటా 7.6 శాతం వృద్ధి సాధించడం జరిగింది. ఈ ప్రణాళికలో రష్యా సహకారంతో బీహర్‌లో (ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో) 1964లో ఇనుముఉక్కు కర్మాగారం స్థాపించారు. రాంచీలో యంత్ర పరికరాలు (రాంచీ మెషీన్ టూల్స్), ఇంకా మూడు హెచ్ఎంటీ యూనిట్లు స్థాపించారు. యంత్ర నిర్మాణం, లోకోమోటివ్, రైల్వేకోచ్‌ల తయారీ, నౌకా నిర్మాణం, ఎయిర్‌క్రాప్ట్ తయారీ, రసాయనాలు, మందులు, ఎరువుల తయారీ పరిశ్రమలు కూడా స్థిరమైన ప్రగతిని సాధించాయి. ఈ ప్రణాళిక భవిష్యత్‌లో పారిశ్రామికవృద్ధికి పునాది వేసింది.
నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969-74): నాలుగో ప్రణాళికలో ప్రభుత్వరంగంలో మొత్తంపెట్టుబడి రూ. 3050 కోట్లుగా నిర్ణయించారు. ప్రభుత్వరంగంలోని గ్రామీణ చిన్న పరిశ్రమలకు రూ. 190 కోట్లు కేటాయించారు. ఈ ప్రణాళికలో పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధిరేటు లక్ష్యం 8 శాతం కాగా సాధించిన పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధిరేటు 5 శాతం. నాలుగో పంచవర్ష ప్రణాళికలో పంచదార, పత్తి, జనపనార, వనస్పతి వంటి వ్యవసాయాధారిత పరిశ్రమలు, లోహ ఆధారిత, రసాయన పరిశ్రమలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ కాలంలోనే అలోయిన్, అల్యూమినియం, ఆటోమొబైల్స్, టైర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, ప్రత్యేక ఉక్కు పరిశ్రమల్లో అధికంగా ప్రగతి కనిపించింది. ఈ ప్రణాళికలో పరిశ్రమలు వివిధ ప్రాంతాలకు విస్తరించే ప్రకియను వేగవంతం చేసేందుకు కృషి జరిగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు