Science & technology March 17 | లక్ష్యం కచ్చితం.. శత్రు ఛేదన సులభం
క్షిపణి అనేది స్వయంచోదక, కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించేందుకు అవసరమైన మార్గనిర్దేశక వ్యవస్థ కలిగిన ఒక ఆయుధ వ్యవస్థ. రాకెట్ (లేదా) జెట్ విమానాల ద్వారా పైకి ఎగరగలిగి పేలగల విస్ఫోటశీర్షం (వార్‌హెడ్) కలిగి ఉండేవి. శాస్త్రీయంగా విసరబడిన ఏ వస్తువునైనా క్షిపణిగా పరిగణించవచ్చు. క్షిపణుల్లో ప్రధానంగా నాలుగు భాగాలుంటాయి.
1. లక్ష్యం (లేదా) మార్గనిర్దేశక వ్యవస్థ
2. చోదక వ్యవస్థ
3. ఇంజిన్
4. విస్ఫోటశీర్షం
క్షిపణులు
- యుద్ధ అవసరాలకు మొదటిసారి రెండవ ప్రపంచయుద్ధ సమయంలో నాజీలు క్షిపణులను తయారు చేశారు.
ఉదా. వి1, వి2 – ఫ్లయింగ్ బాంబులు - చాలా పద్ధతుల్లో క్షిపణులను మార్గనిర్దేశం చేయవచ్చు. వీటికి గాను లేజర్లు, పరారుణ తరంగాలు, రేడియో తరంగాలను వినియోగించవచ్చు. దీన్ని క్షిపణిని ప్రయోగించిన స్థానం నుంచి (లేదా) క్షిపణుల్లోనే అమర్చి (లేదా) వేరొకచోట నుంచి కంప్యూటర్ల సహాయంతో నిర్దేశం చేయవచ్చు.
క్షిపణుల రకాలు - క్షిపణులను అవి ఛేదించే లక్ష్యాలు, ప్రయోగించే వేదికను అనుసరించి వర్గీకరించవచ్చు. ప్రయోగించే ఉద్దేశాన్ని బట్టి క్షిపణుల రకాలు
- ఉపరితలం-ఉపరితలం క్షిపణులు
ఉదా : పృథ్వీ, శౌర్య - గగనతలం – ఉపరితలం క్షిపణులు
ఉదా : బ్రహ్మోస్, హెలీనా - ఉపరితల-గగనతల క్షిపణులు
ఉదా : త్రిశూల్, ఆకాశ - గగనతలం-గగనతలం క్షిపణులు
ఉదా : Astra Mk 1
బాలిస్టిక్ క్షిపణులు - ఇవి ప్రయోగించిన తరువాత ఒక నిర్ణీత ఎత్తును చేరే వరకు నియంత్రించబడి, నిర్దేశించిన నిర్ణీత ఎత్తును చేరిన తరువాత లక్ష్యాల వైపునకు భూగురుత్వాకర్షణ బలం ఆధారంగా ప్రయాణించి నాశనం చేసే క్షిపణులు. ఇవి రాకెట్ లాగా గాల్లో పైకి ప్రయాణించి, నిర్ణీత ఎత్తు చేరిన తర్వాత లక్ష్యాలవైపునకు స్వేచ్ఛాపతన వస్తువుల్లా ప్రయాణించి వాటిని నాశనం చేస్తాయి.
- ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల పథాన్ని కింది విధంగా వర్గీకరించవచ్చు.
(ఎ) నియంత్రిత ప్రయాణ పథం/మార్గం
(బి) శక్తిమంతమైన చోదక/ఎగిరే దశ
(సి) భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించే దశ - చాలా వరకు బాలిస్టిక్ క్షిపణులు భూవాతావరణంలోనే ప్రయాణిస్తాయి. వాటిని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు మొదటి రెండు దశలనే కలిగి ఉంటాయి.
- భూవాతావరణంలోకి తిరిగి ప్రవేశించే దశ/పునః ప్రవేశ దశ. క్షిపణి చేరే నిర్దిష్ట ఎత్తు/గరిష్ఠ ఎత్తు నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి భూగురుత్వాకర్షణ దాన్ని వాతావరణం నుంచి భూమి వైపునకు లాగుతుంది.
- ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించే బాలిస్టిక్ క్షిపణుల ఉపయోగం, వాటి పరిధిని బట్టి మారుతాయి.
- పరిధి ఆధారంగా బాలిస్టిక్ క్షిపణులను పలు రకాలుగా వర్గీకరించారు.
1. వ్యూహాత్మక క్షిపణులు – ఈ రకమైన బాలిస్టిక్ క్షిపణుల పరిధి 150 కి.మీ. నుంచి 300 కి.మీ. ఉంటుంది. కొన్ని వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులను కింది పట్టికలో పొందుపరచడమైంది. - ఈ రకమైన క్షిపణులను సాధారణంగా సరిహద్దు వెంబడి మోహరించిన లక్ష్యాల వైపు ప్రయోగించారు.
- వ్యూహాత్మక క్షిపణులను రవాణా చేయడం, విపత్కర సమయాల్లో ప్రయోగించడం కూడా సులభమే
- సరిహద్దు వెంబడి మోహరించిన శత్రు శిబిరాలు, ఆయుధ వ్యవస్థలు, ఇతర లక్ష్యాలపైకి సంప్రదాయ పేలుడు సామగ్రిని, రసాయనిక, జీవసంబంధ ఆయుధాలను అదేవిధంగా అణ్వాయుధాలను ప్రయోగించవచ్చు.
- సాధారణంగా ఈ రకమైన క్షిపణులు సంప్రదాయక క్షిపణులు, దీర్ఘశ్రేణి క్షిపణులకు మధ్య ఉండే అంతరాన్ని పూడ్చగలిగేలా ఉంటాయి.
2. థియేటర్ బాలిస్టిక్ క్షిపణులు- ఈ క్షిపణుల పరిధి 300 కి.మీ. నుంచి 3,500 కి.మీ. వరకు ఉంటుంది. ఈ క్షిపణిని మరో రెండు రకాలుగా వర్గీకరించారు.
ఎ. స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు – వీటి పరిధి 300 కి.మీ. నుంచి 1000 కి.మీ. ఉంటుంది. ఉదా : పృథ్వీ-I, II, III ; షహాబ్- I, II
బి. మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు – వీటి పరిధి 1000 కి.మీ. నుంచి 3,500 కి.మీ. ఉదా : అగ్ని-1, 2 ; షాహీన్- 2, 3 ; ఘోరీ-1, 2
3. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు – ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ (లేదా) లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్‌గా కూడా వ్యవహరించే ఈ క్షిపణుల పరిధి 3500 కి.మీ. నుంచి 5500 కి.మీ. ఉదా : అగ్ని-III, అగ్ని-IV క్షిపణులను పేర్కొంటారు.
4. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు – వీటి పరిధి 5500 కి.మీ. కంటే అధికం. ఆధునిక ఖండాంతర క్షిపణుల్లో బహుళ లక్ష్యాలను ఛేదించగలిగే పునఃప్రవేశ వాహన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఫలితంగా ఒకే క్షిపణిలో వేర్వేరు వార్హెడ్లను అమర్చి విభిన్న లక్ష్యాలను ఒకేసారి ఛేదించవచ్చు.
ఉదా. అగ్ని-V, అమెరికాకు చెందిన Minuteman-III క్షిపణి
5. జలాంతర్గ బాలిస్టిక్ క్షిపణులు – వీటిని జలాంతర్గాముల నుంచి ప్రయోగిస్తారు.
ఉదా : దేశానికి చెందిన సాగరిక, కె-4 క్షిపణులు, ఉత్తర కొరియాకు చెందిన కేఎన్-11, చైనాకు చెందిన జేఎల్-1 మొదలైనవి.
l స్వల్ప, మధ్యశ్రేణి క్షిపణులను థియేటర్ బాలిస్టిక్ క్షిపణులుగా పరిగణిస్తారు. ముఖ్యమైన మిలిటరీ కార్యకలాపాలు నిర్వహించే ప్రదేశాలను యుద్ధ పరిభాషలో థియేటర్‌గా వ్యవహరిస్తారు. ఈ బాలిస్టిక్ క్షిపణులు ప్రక్షేపకం లాగా పరావలయ మార్గంలో ప్రయాణిస్తాయి.
క్రూయిజ్ క్షిపణులు
- ఇవి భౌగోళిక లక్ష్యాలపై దాడి చేయడానికి కంప్యూటర్‌తో నిర్ణయించిన మార్గంలో ప్రయోగించే క్షిపణులు. వీటి ప్రయాణం సాధారణంగా భూవాతావరణంలోనే దాదాపు స్థిర వేగంతో జరుగుతుంది. బాలిస్టిక్ క్షిపణుల్లాగా భూవాతావరణాన్ని దాటి ప్రయాణించవు.
- లక్ష్యాలవైపునకు, భూమికి దాదాపు సమాంతరంగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరే సమయంలో నిలువుగా పైకి లేచి కొంత ఎత్తు తర్వాత భూగురుత్వాకర్షణ ఉపయోగించి లక్ష్యాలపై పడి వాటిని నాశనం చేస్తాయి. ఈ క్షిపణులు సాధారణంగా మార్గనిర్దేశక వ్యవస్థ, పేలోడ్, విమానచోదక వ్యవస్థను కలిగి ఉంటాయి. ఫ్లైట్ కంట్రోల్ కోసం వీటికి ఎయిర్‌క్రాఫ్ట్ లాగా చిన్నచిన్న రెక్కలను అమర్చుతారు. ఫలితంగా ఎగిరే సమయంలో వీటిని నియంత్రించే వీలు కలుగుతుంది.
- పేలోడ్గా సంప్రదాయ వార్హెడ్లనూ (లేదా) అణువార్ హెడ్లను అమర్చి ప్రయోగించవచ్చు. క్రూయిజ్ క్షిపణుల్లో చోదక వ్యవస్థల్లో భాగంగా జెట్ ఇంజన్ గానీ, టర్బోఫాన్ ఇంజన్లను అమర్చుతారు. ఫలితంగా తక్కువ ఎత్తుల్లోనూ సబ్‌సోనిక్ వేగంతో, అధిక సామర్థ్యంతో ప్రయాణిస్తాయి.
ఉదా. భారత్, రష్యాలు సంయుక్తంగా అభివృద్ధి పరుస్తున్న బ్రహ్మోస్-2 సూపర్సోనిక్ క్షిపణి
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ - భారతదేశంలో రక్షణ సంబంధ, సైన్యానికి అవసరమైన ఆయుధ వ్యవస్థల పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు న్యూఢిల్లీ కేంద్రంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు.
- 1958లో
1) Technical Development Establishment
2) Directorate of Technical Development and Production
3) Defence Science Organisation సంస్థలను కలపడం ద్వారా డీఆర్డీవో ఉనికిలోకి వచ్చింది. ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. - దేశవ్యాప్తంగా ఏర్పాటైన రక్షణ సంబంధ పరిశోధనాశాలల ద్వారా, రక్షణ సాంకేతికతల అభివృద్ధికి డీఆర్డీవో కృషి చేస్తుంది. ఏరోనాటిక్స్, ఆర్మమెంట్స్, ఎలక్ట్రానిక్స్, ల్యాండ్ కంబాట్ ఇంజినీరింగ్, లైఫ్ సైన్సెస్, వివిధ రక్షణ సంబంధ పదార్థాలు, క్షిపణులు, నేవల్ సిస్టమ్స్ వంటి రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించే అతిపెద్ద, అత్యున్నత సంస్థ డీఆర్డీవో.
- ప్రస్తుతం ఈ సంస్థలో 500 మంది శాస్త్రవేత్తలు వివిధ రక్షణ, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకొంటుండగా వీరికి మరో 25వేల మంది శాస్త్రసాంకేతిక, సహాయ సిబ్బంది తోడ్పాటును అందిస్తున్నారు.
- డీఆర్డీవో తన మొదటి ప్రాజెక్ట్‌ను 1960లో ప్రారంభించింది. ‘ప్రాజెక్ట్ ఇండిగో’గా వ్యవహరించే ఈ కార్యక్రమంలో ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే శ్యామ్ (SAM- Surface-to-Air Missile) క్షిపణులను అభివృద్ధి పరచడం ప్రారంభించారు. అయితే ఎటువంటి విజయం సాధించకుండానే కార్యక్రమం నిలిపివేయబడింది.
- ప్రాజెక్ట్ ఇండిగో తర్వాత పాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వేరియంట్ స్వల్పశ్రేణి శ్యామ్ క్షిపణులు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి 1970లో ప్రారంభించబడ్డాయి.
- ఈ ప్రాజెక్ట్‌ల పరిశోధనల ఫలితంగా పృథ్వీ వంటి క్షిపణులను సమీకృత మార్గనిర్దేశక క్షిపణి అభివృద్ధి కార్యక్రమం కింద 1980 నుంచి రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విభిన్న పరిధులు కలిగిన పృథ్వీ, అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్ వంటి క్షిపణులను రూపొందిస్తున్నారు.
సమీకృత మార్గనిర్దేశక క్షిపణి అభివృద్ధి కార్యక్రమం
- భారత సైన్యంలోని మూడు విభాగాలకు అవసరమైన ఆయుధ వ్యవస్థలు, ఇతర సాంకేతికతల అభివృద్దికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం సైనిక విభాగాల ఆయుధాలను స్థానికంగానే రూపొందించి, అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించబడింది.
- త్రివిధ దళాలకు ఉపయోగపడేలా రూపొందించిన క్షిపణి త్రిశూల్. దీన్ని స్వల్ప శ్రేణి ఉపరితలం నుంచి గగనతలం క్షిపణిగా రూపొందించారు. కొన్ని సాంకేతికతపరమైన సమస్యలు ఎదురైనందువల్ల దీన్ని 2007లో ఉపసంహరించారు.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
Previous article
Telangana History | తెలంగాణ చరిత్ర సంస్కృతి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు