శాస్త్ర సాంకేతిక విధానాలు- లక్ష్యాలు
1958 సైన్స్ విధాన ఉద్దేశాలు
స్వాతంత్య్రానంతరం దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆవశ్యకతను గుర్తించిన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1958 మార్చి 4న తొలిసారిగా జాతీయ శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
-అత్యధిక మానవ వనరులు, సహజ వనరులు కలిగిన భారతదేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం పురోభివృద్ధి సాధించడానికి ఆవశ్యకమైన విద్య, సాంకేతిక శిక్షణల కల్పనల దిశగా ఈ విధానం రూపొందింది. తదనుగుణమైన లక్ష్యాలను 1958 సైన్స్ విధాన తీర్మానంలో పొందుపర్చారు.
లక్ష్యాలు
1. దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించే చైతన్య కార్యక్రమాల రూపకల్పన, వారి ఆసక్తిని పెంచే విద్యావిధానం, కార్యక్రమాల రూపకల్పన.
2. శాస్త్ర సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధి సాధనే ఏకైక లక్ష్యంగా, అందుకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు దేశీయంగా రూపొందించడం.
3. భారతీయులందరిలో నూతన విషయాలు, జ్ఞానాన్ని సముపార్జించుకొనే విషయంలో అవసరమైన విద్యను అందించడం, అందుకు అవసరమైన స్వేచ్ఛను కల్పించడం
4. యువత ఉన్నత ప్రమాణాలు కలిగిన శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తద్వారా దేశ సంపదగా వారు రూపొందడానికి తగు చర్యలు తీసుకోవాలి.
5. దేశంలోని పలు కీలక రంగాల్లో (వ్యవసాయం, పారిశ్రామిక, రక్షణ రంగాలు) అభివృద్ధికి దోహదపడే శాస్త్రీయ పరిశోధనలను పెంపొందింపచేయడం.
6. వివిధ రంగాల్లో సాధించిన ఫలితాలను ప్రజాప్రయోజనార్థం వినియోగించేందుకు తగు చర్యలు తీసుకోవడం.
7. ఉన్నత ప్రమాణాలు సాధించిన శాస్త్రవేత్తలను దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపి, దేశాభివృద్ధికి వారి పరిశోధనలను వినియోగించడం.
8. శిక్షణ కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాపుల ద్వారా శాస్త్ర, సాంకేతిక ఫలాల పట్ల ప్రజలకు, ఆయా రంగాలకు అనువర్తింప చేసుకొనేలా చేయడం.
ముగింపు: దేశ సమగ్రాభివృద్ధిలో స్వదేశి పరిజ్ఞానం మాత్రమే ఏకైక పరిష్కారం కాదని గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విధానాల్లో వస్తున్న మార్పు చేర్పుల ఆధారంగా వివిధ శాస్త్రసాంకేతిక విధాన తీర్మానాలను రూపొందించింది. 1983 శాస్త్రీయ విధాన తీర్మానం, 1993, 2003, 2013 రూపొందిన శాస్త్రసాంకేతిక విధాన తీర్మానాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
2. 1983 శాస్త్రీయ విధాన తీర్మానం
-దేశ సామాజిక ఆర్థికాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతిక రంగం పాత్రను గుర్తించిన దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1958లో సైన్స్ విధాన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది తన లక్ష్యాల సాధన దిశగా పయనించే క్రమంలో దేశ సమగ్రాభివృద్ధికి స్వదేశీ పరిజ్ఞానం ఒక్కటే పరిష్కారం కాదని భావించారు. ఇదే సమయంలో ప్రపంచ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్లో సరళీకరణ ప్రపంచీకరణ దిశగా పయనిస్తుండగా భారత్‌లో కూడా అట్టి మార్పులు శాస్త్ర, సాంకేతిక రంగంలో ప్రతిఫలించేలా 1983 శాస్త్రీయ విధాన తీర్మానం రూపొందించబడింది.
-అంటే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటుగా, జాతి ప్రయోజనార్థం అవసరమైన రంగాల్లో విదేశీ టెక్నాలజీ కూడా దిగుమతి చేసుకొని వినియోగించుకొనేలా ఈ విధానం రూపొందింది.
లక్ష్యాలు
1. దేశీయ వనరుల సమర్థ వినియోగానికి, సాంకేతిక పరమైన పోటీని పెంచడంతోపాటుగా, దేశంలోని పలు కీలక, వ్యూహాత్మక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించడం
2. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి, స్వదేశీ పరిజ్ఞానంతో పాటు అవసరమైన పరిజ్ఞానం అందుబాటులోని రంగాల్లో విదేశీ టెక్నాలజీ దిగుమతికి ప్రాధాన్యం ఇవ్వడం, అందుకు అవసరమైన సరళీకరణలను రూపొందించడం.
3. దేశాభివృద్ధికి గల అవరోధాల (పేదరికం, నిరుద్యోగం) తొలగింపునకు, అన్ని సామాజిక వర్గాల వారికి ఉద్యోగ ఉపాధి కల్పించేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడం, అందుబాటులోకి తేవడం.
4. సంప్రదాయ రంగాలైన చిన్న, కుటీర పరిశ్రమల అభివృద్ధికి తగిన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడం.
5. సాంకేతికత సాయంతో యంత్రాల ఆధునీకరణ చేపట్టి స్వల్ప పెట్టుబడితోనే ఆర్థికాభివృద్ధి దిశగా పయనించడం.
6. విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతికి అంగీకరించినా, తత్సమానమైన స్వదేశీ పరిజ్ఞానాభివృద్ధికి అవసరమైన విధానాలను రూపొందించుకోవడం.
7. సంప్రదాయకమైన నైపుణ్యాలు వాణిజ్యపరంగా ఎదురయ్యే పోటీతత్వాన్ని ఎదుర్కొనేలా తీర్చిదిద్దడం.
8. పర్యావరణ సమతుల్యతతోపాటు భవిష్యత్తరాలకు ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత తరాల అవసరాలను పొదుపుగా చేపట్టడం.
9. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఎగుమతులను ప్రోత్సహించే సామర్థ్యాన్ని సముపార్జించడం
10. పై లక్ష్యాలను సాధించడానికిగాను కేంద్రస్థాయి సాంకేతిక విధానాల అమలు కమిటీ (Technology Policy implementation committee) ఏర్పాటుచేయడం.
అందుబాటులో ఉన్న దేశీయ వనరులు ముఖ్యంగా మానవవనరులు ఆశించిన స్థాయిలో వినియోగించుకొని దేశంలోని అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సును పెంపొందించే లక్ష్యాల సాధన దిశలో 1983 సాంకేతిక విధాన తీర్మానం రూపొందింది.
3. జాతీయ టెక్నాలజీ విధానం-1993
-1991లో ప్రవేశపెట్టిన దేశ పారిశ్రామిక విధాన తీర్మానానికి అనుగుణంగా, పారిశ్రామికాభివృద్ధి పెంపుదలకు, దేశ ఉజ్వల భవిష్యత్తుకు, స్వదేశీ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించే లక్ష్యంతో 1993 జాతీయ నూతన టెక్నాలజీ పాలసీని ప్రవేశపెట్టారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల శాస్త్రీయ విజ్ఞాన ఫలాలను అందుకొనే దిశగా ఈ విధాన తీర్మానం నిర్దేశించింది.
లక్ష్యాలు
1. టెక్నాలజీలోని అభివృద్ధిని వినియోగించుకొనే అవకాశాలను విస్తృతం చేయడం
2. ప్రత్యేకించి మారుమూల గ్రామీణ ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించే పరికరాలను టెక్నాలజీ అనువర్తనాల సాయంతో అందించడం.
3. మౌలిక అవస్థాపనా సౌకార్యాలను కల్పించడం.
4. మహిళలు, ఇతర బలహీన వర్గాలవారి ప్రత్యేకావసరాలు తీర్చగలిగేలా, వారి సంప్రదాయ నైపుణ్యాలను అభివృద్ధిపర్చడం.
5. పారిశ్రామిక రంగంలో పనిచేసే మానవవనరుల నైపుణ్యాలను, పరిశ్రమల ఆధునీకరణను ప్రోత్సహించేందుకు తగుచర్యలు తీసుకోవడం.
6. పర్యావరణ హితమైన పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు తగిన కృషి చేయడం.
7. దేశీయ సహజ వనరులను ఆశించిన స్థాయిలో వినియోగించడానికి అవసరమైన పరిజ్ఞానానికి మారడం లేదా ఉన్నతీకరించడం.
8. వ్యర్థపదార్థాల నిర్వహణలో మరింత సమర్థవంతమైన పరిజ్ఞానాభివృద్ధి.
9. ప్రధాన రంగాలైన లెదర్, వస్త్ర, జౌళి, ఆభరణాలు, చేనేత, వ్యవసాయోత్పత్తుల రంగాల అభివృద్ధికి అవసరమైన టెక్నాలజీ సపోర్ట్, సేవలను అందించడానికి
10. అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా వివిధరంగాల్లో పరిశోధన, అభివృద్ధికి తగు ప్రోత్సాహమివ్వడం.
11. ప్రజారోగ్యం, భద్రతలకు అవసరమైన స్వదేశీపరిజ్ఞానం అభివృద్ధి దిశగా సత్వర చర్యలు చేపట్టడం.
8 ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న సరళీకరణ, ప్రపంచీకరణల వల్ల ఎదురయ్యే అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా వస్తుత్పత్తి, మానవ మేధస్సును తీర్చిదిద్దే దిశగా 1993 టెక్నాలజీ పాలసీని రూపొందించారు.
4. 2003 జాతీయ శాస్త్రసాంకేతిక విధానం
-21వ శతాబ్దంలో మారుతున్న దేశీయ అవసరాలు, ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకొని 2003 జాతీయ శాస్త్రసాంకేతిక విధానం రూపొందించారు.
లక్ష్యాలు
1) విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, శాస్త్ర, ఇంజినీరింగ్ సంస్థల్లో శాస్త్రీయ పరిశోధనలను వేగవంతం చేయడం, మరింత నాణ్యవంతంగా చేయడం.
2) యువతను శాస్త్ర సాంకేతిక రంగాలవైపు ఆకర్షింపజేయడం, వారికి ఆకర్షణీయమైన ఉపాధి అవకాశాలను కల్పించడం.
3) ఎంపిక చేసిన రంగాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పెంపొందించడానికి అవసరమైన నైపుణ్యకేంద్రాలను ఏర్పాటు చేసి వాటి పనితీరును మెరుగుపర్చడం.
4) శాస్త్రసాంకేతిక రంగాల్లో మహిళాసాధికారతను సాధించడం, వారికి పూర్తి భాగస్వామ్యం కల్పించడం.
5) విద్యాసంస్థలు, ఇతర సంస్థల్లో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల ప్రోత్సాహానికి అవసరమైన స్వతంత్ర ప్రతిపత్తి, స్వేచ్ఛను అందించడం.
6) అదే సమయంలో దేశంలోని శాస్త్రీయరంగాల సంస్థలు తమవైపు గల సామాజిక బాధ్యతలను నిర్వర్తించేలా చేయడం.
7) శాస్త్రీయ విజ్ఞానాన్ని సాధారణ పౌరులందరికీ అందించి, మానవశ్రేయస్సుకు పనికివచ్చే ఆవిష్కరణల్లో వారిని నిమగ్నం చేయించడం.
8) దేశ ఆర్థిక, సామాజిక అవసరాలకు దోహదం చేయగల శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం.
9) బయోటెక్నాలజీ, డ్రగ్స్, ఔషధాల వంటి రంగాలకు ప్రాధాన్యతతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం.
10) మేథోసంపత్తి హక్కుల పరిరక్షణకు కృషిచేయడం.
11) ప్రకృతి విపత్తుల ముందస్తు అంచనా, వాటి ప్రభావాన్ని తగ్గించడం, నివారణకు సంబంధించి పరిశోధన, అనువర్తనాలను ప్రోత్సహించడం.
12) అంతర్జాతీయ సంబంధాలు కీలకంగా భావించి దేశ అభివృద్ధి, భద్రతల విషయాల్లో అంతర్జాతీయ సహకారానికి కృషి సల్పడం.
-మేథోవలసల నివారణ, శాస్త్రసాంకేతిక రంగ సంస్థల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల మధ్య సహకారం, అదేవిధంగా అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఉన్నత ప్రమాణాలు కలిగిన మానవవనరులను తయారుచేసి, దేశ శ్రేయస్సులో వారి సంపూర్ణ వినియోగ ప్రధాన ఉద్దేశంగా 2003 జాతీయ సాంకేతిక విధానం బెంగళూరు జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు.
2013 శాస్త్రసాంకేతిక నవకల్పనల విధానం
-దేశంలో కొనసాగించదగిన వృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో పలు సమస్యలకు శాస్త్రసంబంధ పరిష్కారాలను కనుగొనేందుకుగాను, భారత ప్రధాని మన్మోహన్సింగ్ 2013 జనవరిలో కోల్‌కతాలో జరిగిన 100వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో ఆవిష్కరించారు.
-ఇందుకోసం సైన్స్, రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సిస్టం ఫర్ హై టెక్నాలజీ లెడ్ పాత్ ఫర్ ఇండియా (SRISHTI) ను ఆధారం చేసుకున్నారు.
-2010-20 దశాబ్దంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో స్థూల వ్యయాన్ని జీడీపీలో 2 శాతానికి పెంచడం, ఇందుకు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం. R&Dలో మానవవనరులను రాబోయే ఐదేండ్లలో ప్రస్తుతమున్న సంఖ్యకు కనీసం 66 శాతానికి పెంచడం వంటి లక్ష్యాలతో ఈ విధానం రూపొందింది. ఇది 2010-20 దశాబ్దాన్ని నవకల్పనల దశాబ్దంగా ప్రకటించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు