భారతదేశం – శాస్త్ర సాంకేతిక విధానాలు : కనిష్ఠ పెట్టుబడి.. గరిష్ఠ రాబడి
ఏ దేశ శ్రేయస్సు అయినా మూడు అంశాలను సమర్థంగా వినియోగించుకోవడంపై ఆధారపడి ఉంటుంది. అవి సాంకేతికత, ముడిపదార్థాలు, పెట్టుబడి. వీటిల్లో రెండు అంశాలు అత్యంత ప్రాముఖ్యం కలిగినవి. నూతన సాంకేతికతలను సమకూర్చుకోవడం వల్ల ముడిపదార్థాలను (లేదా) సహజ వనరులను తక్కువ మోతాదులో వినియోగించుకొని గరిష్ఠ ప్రయోజనాలను పొందడం, అదే విధంగా కనిష్ఠ పెట్టుబడితో ఎక్కువ లాభాలు/ ప్రయోజనాలు పొందడం సాధ్యపడుతుంది.
- శాస్త్రీయ విజ్ఞానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, దాని అనువర్తనాలను తగురీతిగా పరిశీలించడం, దైనందిన జీవన సమస్యలను సాధించుకోవడంలో అన్వయించుకోవడాన్ని సాంకేతికతగా పరిగణించవచ్చు. ఈ విధంగా భారతదేశాభివృద్ధికి శాస్త్రీయ విజ్ఞానంతో పాటు శాస్త్ర సాంకేతికతను కూడా ప్రధాన ఆయుధంగా గుర్తించిన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్ల నుంచి శాస్త్రసాంకేతికతను పెంచే విధానాల రూపకల్పనపై ప్రధానంగా దృష్టిసారించారు. వీటిని రూపొందించడంలో సామాజికస్పృహ కలిగిన విశిష్ట వ్యక్తులు, శాస్త్రవేత్తలు ఇతోధికంగా దోహదపడ్డారు.
- వీరి కృషి ఫలితంగా దేశ ప్రజల్లో సామాజిక స్పృహ పెంపు, నిత్య జీవన సవాళ్లను
సమర్థంగా ఎదుర్కోవడంలో శాస్త్రసాంకేతికత తోడ్పాటు లక్ష్యంగా జాతీయ శాస్త్రీయ విజ్ఞాన విధానం – 1958 (National Science Policy-1958) రూపుదిద్దుకొంది.
సాంకేతిక విధాన తీర్మానం – 1958
1. దేశంలో శుద్ధ, అనువర్తిత విద్యా సంబంధ శాస్త్రీయ విజ్ఞాన పరిశోధనలను విస్తృతం చేయడానికి అవసరమైన కార్యక్రమాలను ప్రచారం చేయడం, వేగవంతం చేయడం, భవిష్యత్తులోనూ కొనసాగించడం.
2. దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన శాస్త్రవేత్తలను మరింత మందిని రూపొందించడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడం (దేశ శ్రేయస్సు కోసం వారు చేపట్టే పరిశోధనా కార్యక్రమాలను గుర్తించడం, తగిన ప్రోత్సాహకాలు, వసతుల కల్పన).
3. శాస్త్రీయ విజ్ఞానం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు, రక్షణ రంగాల్లో దేశ అవసరాలు తీర్చగలిగేలా శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలు అందించడం, వారికి తగిన ప్రోత్సాహకర కార్యక్రమాలను సాధ్యమైనంత వేగంగా చేపట్టడం
4. దేశంలోని యువతీయువకుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభను వెలికితీసి తగిన ప్రోత్సాహం అందించడం, వారు పూర్తిగా తమ శాస్త్రసాంకేతిక కార్యకలాపాల్లో నిమగ్నమయ్యేలా అవసరమైన తోడ్పాటు అందించడం.
5. దేశంలోని యువత తమకు అవసరమైన విషయపరిజ్ఞానాన్ని అందుకొనేలా చేయడం, నూతన విషయాలు కనుక్కొనేలా మార్గనిర్దేశం చేయడం, దీని ద్వారా దేశ ప్రయోజనాలు నెరవేర్చుకొనే విధంగా తగిన అనువర్తనాలు రూపొందించుకొని వినియోగించుకోవడం.
- ఈ లక్ష్యాల సాధనకు అవసరమైన చర్యలు భారత ప్రభుత్వం చేపడుతుంది. దేశ శాస్త్రవేత్తలకు గౌరవప్రదమైన పరిస్థితుల కల్పన, వారిని కూడా శాస్త్రసాంకేతిక విధానాల తయారీలో భాగస్వాములను చేయడం, కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగినట్లుగా విధాన తీర్మానాల్లో భాగస్వాములను చేయడం, కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగినట్లుగా విధాన తీర్మానాల్లో తగిన మార్పులు, చేర్పులు చేయడానికి కావలసిన మార్గదర్శకాలను రూపొందించడం.
శాస్త్రసాంకేతిక విధాన తీర్మానం – 1983
- దేశీయ అవసరాలు, ప్రాధాన్యం, వనరుల రీత్యా తగిన స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవడం, దిగుమతి చేసుకొన్న విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకొనే లక్ష్యాలతో ఈ తీర్మానం
రూపొందించారు.
లక్ష్యాలు
1. సాంకేతిక సామర్థ్యం, స్వయం సమృద్ధి సాధించడం, దేశీ వనరుల గరిష్ఠ వినియోగం, వ్యూహాత్మక క్లిష్టమైన రంగాల్లో లోపాలను, దుర్బలత్వాన్ని తగ్గించడానికి దేశీయంగానే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం
2. సమాజానికి గరిష్ఠ ప్రయోజనాలు, సంతృప్తికరమైన ఉద్యోగితను సాధించడం, సమాజంలో బలహీన వర్గాలు, స్త్రీలకు అవసరమైన ఉద్యోగావకాశాలను కల్పించడం
3. సంప్రదాయ నైపుణ్యాలు, సామర్థ్యాలను వినియోగిస్తూనే వాటిని ప్రస్తుత వాణిజ్య పోటీని తట్టుకొనేలా అభివృద్ధి చేయడం.
4. సాంకేతికత సహాయంతో అధికోత్పత్తికి, మానవ వనరుల సహాయంతో జరిగే ఉత్పత్తుల మధ్య సమతౌల్యాన్ని సాధించడం. అంటే సాంకేతికత వినియోగం వల్ల నిరుద్యోగం ప్రబలే పరిస్థితులను అరికట్టడం.
5. కనిష్ఠ పెట్టుబడితో గరిష్ఠ అభివృద్ధి సాధించడం
6. కనుమరుగవుతున్న పాత (లేదా) కాలంచెల్లిన సాంకేతికతను గుర్తించి దాని స్థానంలో ఆధునిక యంత్ర సామగ్రి, నూతన సాంకేతికతను ఏర్పాటు చేయడం.
7. అంతర్జాతీయ పోటీని తట్టుకొనే ఎగుమతులను ఇతోధికంగా పెంచగలిగే సాంకేతికతలను అభివృద్ధి చేయడం
8. అందుబాటులో ఉన్న సామర్థ్యాలు, సాంకేతికతలను గరిష్ఠంగా వినియోగించుకొనే ఉత్పత్తిని వేగంగా మెరుగుపర్చడం, పనితీరును, ఉత్పత్తుల నాణ్యతను, విశ్వసనీయతను మెరుగుపర్చడం
9. శక్తిమీద ఉత్పన్నమయ్యే డిమాండ్‌ను తగ్గించడం, ముఖ్యంగా పునరుత్పాదక శక్తివనరుల మీద ఉన్న డిమాండ్‌ను తగ్గించడానికి అవసరమైన సాంకేతికతలను సముపార్జించుకోవడం
10. పర్యావరణ సమతౌల్యాన్ని పరిరక్షించడం, సోలార్ టెక్నాలజీ వంటి పర్యావరణహితమైన సాంకేతికతలు అభివృద్ధి చేయడం, ఆవాస ప్రాంతాల నాణ్యతను మరింత మెరుగుపరిచే సాంకేతికతలను సముపార్జించుకోవడం
11. వ్యర్థపదార్థాలను పునర్వినియోగం చేయడం ద్వారా లభించే ఉప-ఉత్పత్తులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొనేలా చూడటం.
శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానం – 1993
- దేశంలో ఆర్థికాభివృద్ధి త్వరితగతిన జరగడానికి 1991లో రూపొందించిన పారిశ్రామిక విధాన తీర్మానానికి అనుగుణంగా శాస్త్రసాంకేతిక విధాన తీర్మానం -1993 రూపొందించబడింది
- సమాజంలోని అత్యధిక వర్గాలకు శాస్త్రసాంకేతిక ఫలాలు అందించేలా, దానికి అవసరమైన సాంకేతికతను సాధ్యమైనంతవరకు స్వదేశీయంగా రూపొందించుకోవడం అనే ప్రధాన లక్ష్యాలుగా ఈ 1993 శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానం రూపొందించబడింది.
లక్ష్యాలు
1. శాస్త్ర సాంకేతికతలో వచ్చే అభివృద్ధిని త్వరితగతిన అందిపుచ్చుకొని వినియోగించుకోవడం
2. సమాజంలోని అన్ని వర్గాల్లో, ముఖ్యంగా బలహీన వర్గాలు, మారుమూల ప్రాంతాల వారు, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడంలో అవసరమైన సాంకేతిక ఉపకరణాలు, పరికరాలు సాంకేతికతలను వినియోగించుకొనేలా చేయడం. ఉదా. విద్యుచ్ఛక్తి సౌకర్యం అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో సౌరవిద్యుత్తు సౌకర్యాలను కల్పించడం
3. మౌలిక సదుపాయాల కల్పనలో శాస్త్రసాంకేతికత వినియోగం
4. సమాజంలోని బలహీనవర్గాలు, స్త్రీలు వారి ప్రత్యేక అవసరాలు తీర్చుకోవడానికి, వారిని వెట్టి చాకిరీ పనుల నుంచి విముక్తి చేయడానికి వారి సంప్రదాయ నైపుణ్యాలను ఆధునీకరించుకొనేలా చూడటం.
5. పారిశ్రామిక కార్మికుల నైపుణ్యాలను, సాంకేతికతలనూ అంతర్జాతీయ పోటీకి దీటుగా తయారు చేసుకొనేలా పరిశ్రమలను ప్రోత్సహించడం, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కంపెనీల ఏర్పాటుకు ప్రాధాన్యమివ్వడం
6. స్వదేశీ ప్రయత్నాల ద్వారానే వ్యర్థాల సమర్థ నిర్వహణ, ముడిపదార్థాలను స్వల్ప పరిమాణంలో వినియోగించుకొంటూనే గరిష్ఠ ప్రయోజనాలను పొందడం
7. అందుబాటులో ఉన్న సహజవనరుల సమర్థ వినియోగానికి అవసరమైన విధానాలు సాంకేతికతలను మార్చడం, ఆధునికరించడం
8. కాలుష్య నియంత్రణకు అవసరమైన నివారణా విధానాలను అవలంబించడం
9. పర్యావరణహితమైన సాంకేతికతలను ప్రోత్సహించడం, వినియోగించడం
10. స్వదేశీ సాంకేతికత అందుబాటులో లేని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న పర్యావరణహితమైన విదేశీ సాంకేతికతలను వినియోగించడం
శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానం – 2003
- 20వ శతాబ్దంలో మొదలైన సాంకేతిక విప్లవం వల్ల చాలా రంగాల్లో నూతన శకాలను ఆరంభించగలిగే నవీన సాంతికతలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి.
- ఫలితంగా 20వ శతాబ్దం ప్రారంభంలో రూపొందించిన ఈ విధాన తీర్మానం సాంకేతిక విప్లవం అందించిన నవీన సాంకేతికతలు మానవ కళ్యాణం కోసం ఉపయోగించే దిశగా తన లక్ష్యాలను
రూపొందించుకుంది. - గడిచిన వేల సంవత్సరాలుగా భారతీయ నాగరికత, సంస్కృతుల్లో శాస్త్రసాంకేతికత అంతర్గతంగా ఒక భాగమైంది. ఈ క్రమంలో సాంకేతికాభివృద్ధి, విధానాల రూపకల్పనలో భారతదేశం కూడా ఒక ముఖ్య భూమికను పోషించింది. ఈ కార్యకలాపాలు అన్నీ గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, ఆర్కిటెక్చర్, రసాయనశాస్త్రం, లోహసంగ్రహణశాస్త్రం, వైద్యరంగం, సహజ-తర్కశాస్త్రం వంటి రంగాల్లో అధికంగా
కనిపిస్తాయి. - స్వాతంత్య్రానంతరం ఈ అర్ధశతాబ్ది కాలంలోనే దేశాభివృద్ధికి, జాతి శ్రేయస్సును పెంపొందించడానికి సాంకేతికత పాత్ర ఒక ముఖ్యమైన సాధనంగా గుర్తించారు. దీనికి అనుగుణంగానే గడిచిన దశాబ్దాలుగా శాస్త్రసాంకేతికతల్లో వచ్చిన నూతన ఒరవడులను అందిపుచ్చుకొనే దిశగా శాస్త్రీయ విధాన తీర్మానం-1958, శాస్త్రసాంకేతిక విధాన తీర్మానం-1983 తమ లక్ష్యాలను రూపొందించుకొని వాటిని సాధించుకొనే దిశగా అడుగులు వేశాయి.
- ఇందుకు అనుగుణంగానే ఈ విధాన తీర్మానాల్లో స్వయం సంవృద్ధి కొనసాగించడం, సమాన, సమగ్రాభివృద్ధి అనేఅంశాలు పొందుపరిచారు.
- సాంకేతిక వ్యవస్థల్లో వస్తున్న మార్పులను గమనించుకొంటూనే, ప్రస్తుత దేశీయ అవసరాలు తీర్చుకొంటూ ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణలకు అనుగుణంగా 2003- శాస్త్రసాంకేతికత విధాన తీర్మానం తన లక్ష్యాలను రూపొందించుకొంది.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు