సాలార్జంగ్ ఆర్థిక విధానాలతో మేలు జరిగిందా?
హైదరాబాద్ స్టేట్‌లో కుంటుపడిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి, భూ చట్టాలను ప్రక్షాలన చేయడానికి, విద్య, పాలనా రంగం, పోలీసు వ్యవస్థలో, ఆర్థిక రంగం, భూమిశిస్తు విధానం, రవాణా వ్యవస్థ, వ్యవసాయ రంగాల్లో మొదటి సాలార్జంగ్ ప్రవేశపెట్టిన (1853-83) మార్పులే సాలార్జంగ్ సంస్కరణలు.
-ఇతడు పనిచేసిన కాలం (1853-83) వరకు నిజాం ప్రభువు ఆస్థానంలో ప్రధానమంత్రిగా నాలుగో అసఫ్‌జాహీ, ఐదో అసఫ్‌జాహీ, ఆరో అసఫ్‌జాహీ ముగ్గురు రాజుల వద్ద పనిచేశాడు.
-ఇతనికంటే ముందు సిరాజ్ ఉల్ ముల్క్ ఇతని తరువాత మీర్ లాయక్ అలీఖాన్ (సాలార్జంగ్-2) పనిచేశారు.
-నిజాం సంస్థానంలో దివానులుగా పనిచేసిన వారందరిలో గొప్పవాడు, సుప్రసిద్ధుడు, రాజకీయవేత్త.
-బ్రిటిష్‌వారు అతనికి సర్ అనే బిరుదు ఇవ్వగా, నిజాం రాజు సాలార్జంగ్ అనే బిరుదునిచ్చాడు. దీంతో సర్ సాలార్జంగ్గా పిలువబడ్డాడు.
సంస్కరణల నేపథ్యం
-తరతరాలుగా రాజ్యంలో బ్రిటిష్ ప్రతినిధి అయిన రెసిడెంట్, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన చేసే వైశ్రాయ్ లేదా గవర్నర్ జనరల్ మాటకు ఎదురులేని హైదరాబాద్ రాజ్యంలో మొదటి సాలార్జంగ్ మాత్రం తనకు ఇష్టం వచ్చిన సంస్కరణలను ప్రవేశపెట్టాడు.
-ప్రభుత్వంలో ఏర్పడిన అస్తవ్యస్త పరిస్థితులు, అలసత్వాన్ని చక్కదిద్దుతూ పాలనాపరమైన సంస్కరణలకు నాంది పలికాడు. ఆర్థికంగా ఉన్న ఒడిదుడుకులను, లోటు బడ్జెట్‌ను పట్టాలపైకి ఎక్కించి మొత్తం రాజ్యాన్ని సంస్కరించాడు.
సాలార్జంగ్ సంస్కరణలు
1. ఆర్థికపరమైన సంస్కరణలు
2. పాలనా సంస్కరణలు
3. పోలీసు సంస్కరణలు
4. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు
5. విద్య, ప్రభుత్వ సేవలు
6. సమాచార, రవాణా వ్యవస్థ
7. ఇతర సంస్కరణలు
ఆర్థిక సంస్కరణలు
-ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సాధారణ పరిపాలనలో, పాలనా సౌలభ్యం కోసం కొన్ని మార్పులు చేశాడు. అందులో సాలార్జంగ్ కంటే ముందు పాలన కింది విధంగా ఉండేది.
సుభాలు- సుబేదార్
సర్కారులు- తహసీల్దార్
-తాలూకాలు- తాలూక్దార్ (బ్రిటిష్ ఇండియాలో కలెక్టర్‌తో సమానం)
-పై పాలనా చట్రంలో తాలూకాదార్లకు ఎలాంటి జీతభత్యం ఉండేది కాదు. వీరు డిప్యూటీ తాలూకాదార్లను కూడా నియమించుకునేవారు. వీరికి ఎలాంటి జీతభత్యాలు లేకపోవడంతో రైతుల నుంచి వసూలు చేసే పన్నుల్లో కమీషన్ పొందేవారు. కొంతమంది లంచాలు ఇచ్చి డిప్యూటీ తాలూక్దార్ పదవిని పొందేవారు. దీనిలో లోపాలు ఉండటంతో తాలూకాదార్లను పర్యవేక్షించడానికి బ్రిటిష్ వారు రెసిడెంట్ అధికారులను నియమించారు. వీరి స్థానంలో అమీన్సాబ్లను నియమించారు.
-పన్ను వసూలు కోసం 1855లో తాలూకాదార్లను నియమించారు.
-1865లో జిలాబంది విధానాన్ని ప్రవేశపెట్టి రాజ్యాన్ని ఐదు ప్రావిన్సులుగా, మళ్లీ వాటిని 17 జిల్లాలుగా విభజించారు. ఇలా ప్రతి జిల్లాలో పాలనా బాధ్యతలను అవల్ తాలూకాదారులకు అప్పగించారు. వీరికి సహాయంగా దోయం తాలూకాదార్ (సబ్ కలెక్టర్)లను నియమించారు. వీరికి సహాయపడటానికి సోయం తాలూకాదారులు (3వ తరగతి ఉద్యోగులు) కూడా నియమితులయ్యారు.
-పన్ను వ్యవస్థను రద్దుచేసి, తాలూకాదార్లను నియమించి వారికి స్థిరమైన జీతాలిస్తూ పన్నులు వసూలు చేశారు. వేలం పద్ధతిలో గుత్తేదారులుగా చెలామణి అవుతున్నవారిని కూడా తొలగించి ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం వచ్చేట్టు చేశాడు. దీంతో తనఖాపెట్టిన సర్కారు ఆభరణాలను విడిపించడమే కాకుండా, బ్రిటన్ వద్ద తీసుకున్న అప్పును కూడా తీర్చడానికి ఒక అవకాశం ఏర్పడింది.
-తక్కువ వడ్డీతో కొత్త రుణాలను సేకరించి రాజ్య రుణభారాన్ని తగ్గించాడు.
-నాణేల సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్‌లో కేంద్ర ద్రవ్య ముద్రణాలయాన్ని స్థాపించాడు. గద్వాల, నారాయణపేట జిల్లా ద్రవ్య ముద్రణాలయాలను దీని పరిధిలోకి తీసుకొచ్చాడు. 1854లో హాలిసిక్కా అనే నూతన నాణేన్ని ప్రవేశపెట్టాడు. ఈ నాణెం విలువ బ్రిటన్ కరెన్సీకంటే 15 రెట్లు ఎక్కువగా ఉండేది.
పాలనాపరమైన సంస్కరణలు ముందు స్థితి…
-రాష్ట్రస్థాయి- సుబేదార్లు (19వ శతాబ్దం వరకు, బ్రిటిష్ ఇండియాలో రెవెన్యూ కమిషన్‌తో సమానం)
-జిల్లాస్థాయి- తాలూక్దార్ (కలెక్టర్)
-డివిజన్ స్థాయి- సోయం తాలూక్దార్/తహసీల్దార్ నాయిబ్ తహసీల్దార్ (డిప్యూటీ తహసీల్దార్)
-ఫిర్కా స్థాయి- గిర్దావార్
-గ్రామస్థాయి- మాలి, కొత్వాల్, పటేల్, పట్వారీ గ్రామ సేవకులు
-ఈ విధంగా కొనసాగిన పాలనను సమూలంగా మార్చి…
1. జీతంపై పనిచేసే తాలూకాదార్లను నియమించడం (తద్వారా మధ్యవర్తులు తగ్గి, లంచాలు తగ్గి రాజ్య ఆదాయం పెరిగింది)
2. జిలాబంది పద్ధతి
3. రెవెన్యూ పాలన నేరుగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది.
-దీంతో లంచాలు, అవినీతి తగ్గి పాలన చక్కదిద్దబడింది.
పోలీసు సంస్కరణలు
-1865 కంటే ముందు హైదరాబాద్ స్టేట్‌లో పోలీసువ్యవస్థ సరైన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. కొత్వాల్ అనే నగర పోలీసు కమిషనర్ ఉండేవాడు. అయితే పాలనలో ఉన్న అస్తవ్యస్త విధానాలవల్ల తరువాతి కాలంలో రెవెన్యూ అధికారులే పోలీసు విధులు నిర్వహించేవారు. అదేవిధంగా వంశపారంపర్యంగా వచ్చే గ్రామ కాపలాదార్ల పద్ధతి గ్రామాల్లో ఉండేది.
సాలార్జంగ్ సంస్కరణల్లో భాగంగా…
1. మహ్కామ-ఇ-కొత్వాలి అనే పోలీసు డిపార్ట్మెంట్ను, నిజామత్ అనే పోలీసు దళాన్ని ఏర్పాటు చేశాడు.
2. పోలీసు సూపరింటెండెంట్‌ను- మహ్అమీన్గా, ఇన్స్పెక్టర్ను- అమీన్‌గా, పోలీసు స్టేషన్లను- చౌకీలు అని పిలిచేవారు.
3. 1867లో పోలీసు, రెవెన్యూ శాఖలను వేరు చేశారు.
-దీంతో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చి, రాజ్యంలో నేరాల సంఖ్య కూడా తగ్గింది.
న్యాయ సంస్కరణలు
-రాజ్యంలో సమర్థవంతమైన పాలన అందించడానికి అప్పీలు కోర్టు లేదా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులన్నింటినీ సంస్కరించాడు. ఇందులో భాగంగా…
1. జిల్లాల్లో ఉన్న న్యాయస్థానాల్లో మున్సిఫ్, మీర్ ఆదిల్ అనే న్యాయ అధికారులను నియమించాడు. వీరిని మహ్కాయ-ఇ-సదర్ పర్యవేక్షించేవాడు.
2. హైకోర్టుకు పైన అప్పీలు చేయడానికి మజ్లిస్-ఇ-మురఫా పేరుతో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
3. హైదరాబాద్‌లో బుజుంగ్ దివానీ అదాలత్, కుర్ద్ దివానీ అదాలత్ అనే రెండు సివిల్ కోర్టులను స్థాపించారు. అదేవిధంగా ఫౌజ్దారీ అనే క్రిమినల్ కోర్టును కూడా స్థాపించారు.
4. ముస్లిం చట్టమైన షరియత్‌ను ఆధారంగా చేసుకుని ప్రధాన న్యాయమూర్తి నాజమ్ తీర్పులిచ్చేవాడు.
5. వివిధ కోర్టులను సమన్వయ పరచడానికి ప్రత్యేక న్యాయవిభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
విద్య, ప్రభుత్వ సేవల్లో సంస్కరణలు
-పరిపాలనలో సహాయం పొందేందుకు సుశిక్షితులైన ఉద్యోగులను నియమించేందుకు విద్యా విధానంలో సమూల మార్పులు చేశారు.
1. 1855లో దార్-ఉల్-ఉలూమ్ అనే ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే ఈ పాఠశాలల్లో పర్షియన్, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో బోధన ఉండేది.
2. ఆంగ్లభాషా బోధనకు పాశ్చాత్య విద్యావ్యాప్తికి అనేక పాఠశాలలను స్థాపించారు.
3. 1870లో హైదరాబాద్‌లో నగర ఉన్నత పాఠశాలను, 1872లో చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలను, ప్రజాపనుల శాఖలో పనిచేయడానికి కావాల్సిన సాంకేతిక సిబ్బంది శిక్షణ కోసం 1870లో ఇంజినీరింగ్ పాఠశాలను నెలకొల్పారు.
4. పాలకుల పిల్లల కోసం 1873లో మదరసా-ఇ-ఆలియాను స్థాపించారు.
5. రాజ కుటుంబంలో పిల్లలు చదువుకోవడానికి 1878లో మదరసా-ఇ-ఐజాను ప్రారంభించారు.
6. అలీగఢ్‌లో విద్యాసంస్థలను నెలకొల్పేందుకు సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్‌కు ఆర్థిక సహాయాన్ని అందించాడు.
7. 1881లో గ్లోరియో మహిళా హైస్కూల్‌ను ఏర్పాటు చేశారు.
8. 1887లో సాలార్జంగ్ మరణించిన తరువాత చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలను మదరసా-ఇ-ఆలియాలో విలీనం చేసి నిజాం కాలేజీని ఏర్పాటు చేశారు.
-ఈ పాఠశాల, కళాశాల స్థాపనల నుంచే ముల్కీ, నాన్ ముల్కీ వివాదాలు మొదలయ్యాయి.
సమాచార సంస్కరణలు
-రవాణా, రైళ్ల పరంగా వివిధ సంస్కరణలు ప్రవేశపెట్టి హైదరాబాద్ స్టేట్ గుర్తింపును మరింత పెంచాడు. ఇందులో భాగంగా..
1. 1863లో హైదరాబాద్ నుంచి షోలాపూర్ వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించాడు.
2. బ్రిటిషర్లు నిర్మించే మద్రాసు-బొంబాయి మధ్య రైల్వేను గుల్బర్గా, వాడి మీదుగా నిర్మించాడు.
3. 1874లో హైదరాబాద్, వాడి మధ్య రైల్వే నిర్మాణం ప్రారంభించి, 1879లో పూర్తిచేశారు. తద్వారా రాజ్యంలో రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడి కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగింది.
భూమిశిస్తు సంస్కరణలు
-రాజ్యంలో ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. రాజ్యంలో రైత్వారీ విధానం అమల్లో ఉండేది. మునగాల, అమరచింత, గద్వాల లాంటి జమీందారీ సంస్థానాలు చాలా ఉండేవి. ప్రతి గ్రామంలో పటేల్ అనే అధికారి ఉండేవాడు. వీరు వంశపారంపర్యగా అధికారాన్ని చెలాయించేవారు. గ్రామంలో శాంతి భద్రతలను కాపాడటానికి ఫౌజ్దార్ పటేల్ అనే ఉద్యోగి ఉండేవాడు. గ్రామంలో పట్వారి/పంద్…. అనే వ్యక్తులు లెక్కలు వేసేవారు.
-దేశ్‌ముఖ్, దేశ్‌పాండే నాయకత్వంలో గ్రామాలను సర్కిళ్లుగా విభజించారు. అయితే ఈ భూమిశిస్తు విధానంలో పన్ను వసూలు చేసే అధికారం పై అధికారులకు వంశపారంపర్యగా ఉండటంతో అవినీతి పెరిగిపోయింది. మధ్యవర్తులు కూడా అధికమవడంతో రాజ్యానికి వచ్చే స్థిరమైన ఆదాయం తగ్గడమే కాకుండా, ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. దీన్ని తీసివేయడానికి సాలార్జంగ్ ఈ వ్యవస్థ మొత్తాన్ని రద్దుచేసి జీతం తీసుకునే తాలూకాదార్లను నియమించాడు.
ఇతర సంస్కరణలు
-పైన పేర్కొన్న విద్య, ప్రజాసేవ, రవాణా, సమాచార, పోలీసు, న్యాయపర, రెవెన్యూ సంస్కరణలే కాకుండా రాజ్య సంక్షేమం కోసం సాలార్జంగ్ ఇంకా ఎన్నో ప్రభావవంతమైన సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
ప్రభుత్వంలో సంస్కరణలు
-పరిపాలనా భారం పెరగడంతో తనకు సహాయంగా ఉండటానికి సదర్-ఉల్-మహమ్ అనే నలుగురు మంత్రులను నియమించాడు.
-వీరిలో ముగ్గురు మంత్రులకు కొత్తగా ఏర్పాటు చేసిన పోలీసు, రెవెన్యూ, న్యాయశాఖలను అప్పగించాడు.
-విద్య, ఆరోగ్య రంగాలకు నాలుగో మంత్రిని నియమించాడు.
-ఈ నలుగురు మంత్రులు ప్రధానమంత్రి (దివాన్) నేతృత్వంలో పనిచేసేవారు.
-ఇలా పనిభారాన్ని తగ్గించుకుంటూ శ్రేష్టమైన అధికారుల కోసం విద్యావిధానాన్ని సంస్కరించి రాజ్యాన్ని దీర్ఘకాలికంగా అభివృద్ధి చేయాలనుకున్నాడు.
-మొత్తం పాలన 14 డిపార్టుమెంట్లుగా విభజించబడింది. అవి….
1. న్యాయ
2. రెవెన్యూ
3. పోలీసు
4. ప్రజా పనులు
5. విద్య
6. మెడికల్
7. మున్సిపాలిటీ
8. మిలిటరీ
9. ఫైనాన్స్
10. పోస్టాఫీసులు
11. రైల్వే, టెలిగ్రాఫ్
12. సర్ఫ్-ఈ-ఖాస్
13. రాజకీయ
14. న్యాయశాఖ
-పై మొత్తంలో మొదటి ఏడు నేరుగా ప్రధానమంత్రికి నివేదించేవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు