ఐస్‌క్రీం ఇస్తానంటే చదువుకుంటాననే పిల్లవాడి నైతిక దశ? (TET special)
నైతిక వికాస సిద్ధాంతం / హెన్జ్ పరికల్పన సిద్ధాంతం
హెన్జ్ భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించబోతోంది. రేడియంకు సంబంధించిన ఔషధం ఆమెను రక్షించవచ్చు. దీనిని అదే పట్టణంలోని ఒక రసాయన శాస్త్రవేత్త అప్పుడే కొత్తగా కనుగొన్నాడు. ఈ ఔషధం ఖరీదు చాలా ఎక్కువ. హెన్జ్ అప్పుకోసం తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గర ప్రయత్నించాడు. అయినా ఆ ఔషధ ఖరీదులో సగాన్ని మాత్రమే సంపాదించగలిగాడు. మిగతా మొత్తాన్ని తర్వాత చెల్లించేటట్లుగా అభ్యర్థించాడు. అందుకు రసాయన శాస్త్రవేత్త ఒప్పుకోలేదు. దాంతో దుకాణంలోకి చొరబడి ఆ మందును దొంగిలించాడు.
ఈ సంఘటనను ఆధారంగా చేసుకొని కోల్బర్గ్ 7 సంవత్సరాలు ఆ పై వయస్సు గల పిల్లలకు, పెద్దలైన అనేక మందికి వివరించి ఈ కింది ప్రశ్నలు వేశారు. అవి..
1) హెన్జ్ దొంగతనం చేయవచ్చా? చేయకూడదా? ఎందుకు?
2) హెన్జ్కు భార్యపట్ల ప్రేమ లేకపోతే మందు దొంగతనం చేస్తాడా?
3) హెన్జ్ తన భార్యస్థానంలో వేరొకరు ఉంటే మందు దొంగతనం చేస్తాడా?
4) ఔషధం అందుబాటులో లేని కారణంగా హెన్జ్ భార్య మరణిస్తే ఆ మరణానికి బాధ్యుడిగా రసాయన శాస్త్రజ్ఞుడిని నిర్బంధించవచ్చా
5) పై ప్రశ్నలకు ఇప్పుడు మీరు ఇచ్చే సమాధానాన్నే భవిష్యత్తులో కూడా ఇచ్చేవారా?
ఇలాంటి నైతిక సందిగ్ధత కలిగిన ప్రశ్నలను 10-16 సంవత్సరాల వయస్సులకు చెందిన పిల్లలకు ఇచ్చి వారి తీర్పు ఆధారంగా కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
పరిచయం
- ప్రతిపాదించింది – కోల్బర్గ్(అమెరికా)
- గ్రంథం-The Philosophy of Moral Development.
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పనిచేసేవారు.
- ఈయన శిశువును నైతిక తత్వవేత్తగా పిలిచారు.
- కోల్బర్గ్ ప్రకారం సరైన దాని నుంచి సరికాని దాన్ని వేరుచేయడమే నైతికత
- నైతికతను ఆంగ్లంలో మొరాలిటీ (Marality) అంటారు. ఈ పదం Mores అనే లాటిన్ పదం నుంచి వచ్చింది అంటే ప్రవర్తించే తీరు/ సంప్రదాయం/ జానపదరీతులు / మ్యానర్ అని అర్థం.
ముఖ్యాంశాలు
- వ్యక్తిలో న్యాయభావన వికాసమే నైతిక వికాసం
- చిన్నపిల్లలు, జంతువుల్లో నైతిక వికాసం ఉండదు.
- అన్ని వికాసాల్లో నైతిక వికాసం క్లిష్టమైనది.
- మిగతా వికాసాలతో పోలిస్తే నైతిక వికాసం మందకొడిగా సాగుతుంది.
- ఆలోచన, వివేచన వంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు వ్యక్తి నైతిక వికాసంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
పియాజే సిద్ధాంతంలోని దశల్లాగే ఈ సిద్ధాంతంలో దశలో కూడా సార్వత్రికమైనవి, స్థిరమైనవి. - ప్రతీ వ్యక్తిలో దశలన్నీ ఒకే క్రమంలో జరుగుతాయి. కానీ అందరు వ్యక్తుల్లో ఒకే వయస్సులో ఈ దశలు సంభవించవు.
- కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని 3 స్థాయిల్లో, 6 దశలు ఆధారంగా వివరించారు. అవి.
నైతికస్థాయి (Moral Level)
- పూర్వ సంప్రదాయ స్థాయి (Pre- Conventio nal Morality Level)
- ఈ స్థాయి 4-10 సంవత్సరాల వరకు ఉంటుంది.
- పిల్లలు తప్పు/ఒప్పు, మంచి చెడులను వాటి పరిణామం / పర్యవసానాలను బట్టి ఆలోచిస్తారు.
- శిశువు : 1) తనకు ఇబ్బంది కలిగించేది – తప్పు
2) అవసరాలు తీర్చేది -ఒప్పు
3) బహుమతులు ఇచ్చేది – మంచి
4) శిక్షించేది – చెడుగానూ భావిస్తాడు - ఈస్థాయిలో శిశువు నైతికతను శారీరక శిక్షణ పరంగా అంచనా వేస్తారు.
నోట్ : శిక్షణను దృష్టిలో ఉంచుకోవడం 1వ దశ - బహుమతులను దృష్టిలో ఉంచుకోవడం 2వ దశ
2. సంప్రదాయ స్థాయి (Conventional Level):
- ఈ స్థాయి 11-13 సం.ల వరకు ఉంటుంది.
- ఈ స్థాయి పిల్లలు కౌమారదశలో ఉన్నప్పుడు ప్రారంభమవుతుంది.
- ఈ స్థాయిలో కుటుంబ సభ్యులు, సమాజ సభ్యులు దేనిని ఆశిస్తారో అనేది మంచి, చెడును నిర్ణయిస్తుంది.
నోట్: మంచి అబ్బాయి / అమ్మాయి అని అనిపించుకోవాలనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవడం -3వ దశ. - క్రమశిక్షణనే దృష్టిలో ఉంచుకోవడం 4వ దశ.
3. ఉత్తర సంప్రదాయ స్థాయి (Post – Conventional Level)
- ఈ స్థాయి 14 సంవత్సరాల నుంచి వయోజన దశ వరకు ఉంటుంది.
- ఈస్థాయిని స్వయం అంగీకార సూత్రాల నైతికతగా పిలుస్తారు.
- ఈ స్థాయిలో వ్యక్తులు ఇతరుల ప్రకారం నడుచుకోకుండా తమ అంతరాత్మ ప్రకారం నడుచుకుంటారు.
- ఇది నైతిక సాధనలో అత్యున్నత స్థాయి వ్యక్తుల్లో పరిపక్వత కలిగి ఉండటం వల్ల నీతి న్యాయం, ధర్మం, నిజాయితీ, సమానత్వం, మానవులను గౌరవించడం లాంటి అంశాలు కనబడతాయి.
- కోల్బర్గ్ ప్రకారం నైతిక వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తుల్లో ‘స్వీయ కేంద్రీకరణ’ తగ్గుతుంది.
నోట్: సామాజిక సంబంధాల్లో దృష్టి నిలపడం- 5వ దశ - వ్యక్తిగత నైతిక సూత్రాలపై / ఆత్మసాక్షిపై దృష్టి నిలపడం- 6వ దశ
దశ (Stage)
- 1. విధేయత, శిక్షా ఓరియంటేషన్ దశ (Obidience and punishment Orientation)
- ఈ దశలో పిల్లలు, తల్లిదండ్రులు విధించే శిక్షకు భయపడి వారిపట్ల గౌరవాన్ని విధేయతను చూపిస్తారు.
- ఉదా: తండ్రి కొడతాడనే కారణంతో రవి రోజూ పాఠశాలకు వెళ్లడం.
- టీచర్ శిక్షిస్తాడేమోనని భయపడి గోపి హోంవర్క్ చేయడం.
2. సహజ సంతోష అనుసరణ, సాధనోపయోగదశ (Native Orientation)
ఉదా : 1) సాయంత్రం బొమ్మ కొనిస్తానంటేనే ఇప్పుడు హోంవర్క్ చేస్తానని చెప్పడం.
2) నీ వీడియో గేమ్ నాకు ఆడుకోవడానికిస్తే నీవు రాయడానికి పెన్ ఇస్తానని చెప్పడం.
3) నా దగ్గరున్న స్వీట్ నీకిస్తాను, నీ దగ్గరున్న హాట్ నాకివ్వు అని చెప్పడం.
4) పాఠశాలలో మధ్యాహ్నం పెట్టే భోజనం కోసం ప్రతిరోజు బడికి వెళ్లడం.
3. మంచి ప్రవర్తన మంచి బాలుడి నీతి (Good Morality/ Good Boy)
- ఈ దశలోని పిల్లలు విషయాన్ని మంచి చెడుల నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహిస్తారు.
- ఇతరులతో మంచి అబ్బాయి/ అమ్మాయి అనిపించుకోవాలని ప్రయత్నిస్తారు.
- ఇక్కడ మంచి ప్రవర్తన అంటే ఇతరులను సంతోష పెట్టేది, ఇతరులకు సహాయపడేది అని అర్థం.
ఉదా: 1) తల్లిదండ్రులు సంతోషిస్తారనే కారణంతో రవి ప్రతిరోజు బడికి వెళ్లడం - 2) రమ్య మంచి అమ్మాయి అనిపించుకోవడం కోసం తల్లి చెప్పే పనులన్నీ చేయడం.
- శిశువు 1) ఇతరులకు సంతోషాన్ని కలుగచేసేది- సరైనదిగా (మంచిగా) భావిస్తాడు
- 2) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసేది సరికానిదిగా (చెడుగా) భావిస్తాడు .
- 3) సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటాడు.
4. సరైన ప్రవర్తన / అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి (Obidience and Social Order to Authority)
- ఈ దశలోని పిల్లలు నిందలు తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని భావిస్తారు.
- చట్టం, ధర్మం ప్రకారం నడుచుకుంటూ వాటిని గుడ్డిగా అంగీకరిస్తారు.
- ఇక్కడ సరైన ప్రవర్తన అనగా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించడం, అధికారాన్ని గౌరవించడం,
- సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం అని అర్థం.
1) రవి ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లడం బాధ్యతగా భావించడం.
2) గోపి ఉపాధ్యాయులను సమాజంలోని అధికారులను గౌరవించడం.
3) భరత్ రెడ్ సిగ్నల్‌ను చూసి బైక్ ఆపడం.
5. ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించిన చట్టనీతి
(Morality of Democratically accepted)
- ఈ దశలోని పిల్లలు సమాజం, సంక్షేమం, మానవ హక్కులకు విలువనిచ్చి తదనుగుణంగా ప్రవర్తిస్తారు.
- ఉదా: మానవ హక్కులను గౌరవించి మెర్సీ కిల్లింగ్ అనే నిర్ణయాన్ని వ్యాధిగ్రస్థునికే వదిలేయాలి.
- సమాజ సంక్షేమం కోసం అవసరమైతే చట్టాలను సవరింపచేయాలని భావిస్తాడు.
- ఉదా: మానవ అవసరాల దృష్ట్యా రాజ్యాంగంలో సవరణలు చేయవచ్చని భావిస్తాడు.
- ఇంతకు ముందు లేని నైతిక నియమాల్లో సరళత(Flexibility) ఈ దశలో ఉంటుంది.
6. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి (Morality of Individual Principles and Conscience)
- ఈ దశలో పిల్లలు ఇతరుల విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా తన ఆత్మ నిందను తప్పించుకోవడానికి సాంఘిక ప్రమాణాలు, మనలో భాగమైనటువంటి ఆదర్శాలకు రెండింటికీ అనుగుణంగా ప్రవర్తిస్తాడు.
- ఈ దశలో వ్యక్తి అంతరాత్మ, గౌరవం, న్యాయం, సమానత్వం అనే సార్వత్రిక సూత్రాలపై నిర్ణయాలు ఆధారపడతాయి.
- ఉదా: 1) వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, దొంగతనం చేయడం, అబద్ధం చెప్పడం తప్పుకాదని భావిస్తాడు.
- 2) విశ్వ క్షేమం కోసం సమాజ సేవలో పాల్గొనడం . తన ఆస్తులను ఆపన్నులకు పంచడం.
అన్ని మతాల సారం ఒక్కటే అని నమ్మడం. - నోట్: నైతిక వికాసం సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడుతుంది.
- ఏ సంస్కృతుల్లోనైనా వికాస క్రమం ఒకేలా ఉంటుంది.
- ఈ సిద్ధాంతంలో ఏ దశను ఏ వయస్సులో చేరుకుంటారో చెప్పకపోయినా చిన్నపిల్లలు 1వ స్థాయికి. పెద్దవారు 3వ స్థాయికి చెందుతారని కోల్బర్గ్ తెలిపారు.
- ఎక్కువ మంది వ్యక్తులు 2వ స్థాయి, 4వ దశను మించి పెరగరని తెలిపారు.
- ఒక వ్యక్తిలో మంచి నైతిక వికాసం 3వ స్థాయి 6వ దశలో జరుగుతుంది
- 6వ దశకు చేరుకున్న వ్యక్తి మళ్లీ వెనుకకు తిరోగమనం ఉండదు.
విద్యా విషయక ప్రాధాన్యత
- ఉపాధ్యాయులు పిల్లలకు స్థితి పరీక్షలు నిర్వహించి వారి స్థాయి లేదా దశను తెలుసుకొని మిగిలిన దశలకు, స్థాయిలకు వెళ్లే విధంగా చూడాలి.
- ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలి.
- పాఠశాలలో ప్రతిరోజు ప్రార్థన నిర్వహించడం
- వివిధ మతాల సారాంశాలను తెలియజేయడం
- నీతికథలు, దేశభక్తుల గాథలు చెప్పడం
- జాతీయ పండుగలు, జాతీయ దినోత్సవాలు నిర్వహించడం
- SUPW, NCC, NSS వంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నైతిక వికాసం పెంపొందుతుంది.
నోట్: సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మూర్తిమత్వ సిద్ధాంతంలో Super Ego (అథ్యహం)అనేది నైతిక సూత్రంపై పనిచేస్తుందని తెలిపారు. - లింగపరమైన భేదాలు: కోల్బర్గ్ నిజమైన అధ్యయనాలు కేవలం బాలురపైనే నిర్వహించాడు.
- గిల్లిగన్ (1982) ఇందులో లోపం ఉన్నట్లు గ్రహించారు. ఎందుకంటే బాలికలు / స్త్రీల నైతిక నిర్ణయాలు బాలురు/ పురుషులు కంటే భిన్న ప్రమాణాలతో కూడుకొని ఉంటాయని పేర్కొన్నాడు.
ప్రాక్టీస్ బిట్స్
1. పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక వికాస దశ ఏది?
1) 1వ దశ – పూర్వ సంప్రదాయ స్థాయి
2) 2వ దశ – పూర్వ సంప్రదాయ స్థాయి
3) 3వ దశ – సంప్రదాయ స్థాయి
4) 4వ దశ – సంప్రదాయ స్థాయి
2. కోల్బర్గ్ ప్రకారం పిల్లల్లో నైతిక వికాసం ఏ విధంగా జరుగుతుంది?
1) 2 స్థాయిలు – 7 దశల్లో
2) 6 స్థాయిలు – 2 దశల్లో
3) 6 దశలు – 2 స్థాయిల్లో
4) 3 స్థాయిలు – 6 దశల్లో
3. భౌతిక పర్యవసానాల ఆధారంగా చర్యల నైతికతను అంచనా వేసే దశ?
1) అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి
2) మంచి బాలుడి నీతి
3) విధేయత, శిక్ష ఓరియంటేషన్
4) సహజ సంతోష అనుసరణ దశ, సాధనోపయోగ దశ
4. ‘మానవ హక్కులను గౌరవించి, మెర్సీకిల్లింగ్ను అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి నిర్ణయానికి వదిలేయాలి. సమాజ సంక్షే మం కోసం సంబంధిత చట్టాలను సవరించాలి’ అనే వ్యక్తి నైతిక స్థాయి ఏది?
1) 3వ దశ – సంప్రదాయ స్థాయి
2) 4వ దశ – సంప్రదాయ స్థాయి
3) 5వ దశ – ఉత్తర సంప్రదాయ స్థాయి
4) 6వ దశ – ఉత్తర సంప్రదాయ స్థాయి
5. కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఏ స్థాయిలో కనిపిస్తుంది?
1) పూర్వ సంప్రదాయ నైతికత స్థాయి
2) సంప్రదాయ నైతికత స్థాయి
3) సంప్రదాయేతర నైతికత స్థాయి
4) ఉత్తర సంప్రదాయ నైతికత స్థాయి
6. పరీక్షలో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికమని భావించి కాపీ కొట్టలేదు. ఈ సందర్భంలో పిల్లవాడి నైతిక దశ ఏది?
1) 2వ దశ – పూర్వ సంప్రదాయ స్థాయి
2) 1వ దశ – పూర్వ సంప్రదాయ స్థాయి
3) 5వ దశ – ఉత్తర సంప్రదాయ స్థాయి
4) 4వ దశ – సంప్రదాయ స్థాయి
7. ఐస్‌క్రీం ఇస్తానంటే చదువుకుంటాననే పిల్లవాడి నైతిక దశ ఏది?
1) 3వ దశ – సంప్రదాయ స్థాయి
2) 2వ దశ – పూర్వ సంప్రదాయ స్థాయి
3) 1వ దశ – పూర్వ సంప్రదాయ స్థాయి
4) 4వ దశ – సంప్రదాయ స్థాయి
8. ‘నీ బొమ్మ నాకిస్తే, నిన్ను కూడా నా ఆటలో చేర్చుకుంటాను’ అనే అమ్మాయి నైతిక దశ ఏది?
1) విధేయత, శిక్ష ఓరియంటేషన్
2) సహజ సంతోష అనుసరణ దశ, సాధనోపయోగ దశ
3) మంచి బాలుడి నీతి
4) అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి
9. తాగి నడిపితే పోలీసులు జరిమానా విధించడంతో తాగుడు అలవాటున్న కిరణ్ తాగినపుడు వాహనం నడపకూడదని నిర్ణయించుకున్నాడు. కోల్బర్గ్ ప్రకారం అతని నైతిక స్థాయి ఏది?
1) పూర్వ సంప్రదాయ స్థాయి
2) సంప్రదాయ స్థాయి
3) ఉత్తర సంప్రదాయ స్థాయి
4) సంప్రదాయేతర స్థాయి
జవాబులు
1. 1 2. 4 3. 3 4. 3 5. 1 6. 4 7. 2 8. 2 9. 2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు