సౌదీ-భారత్ సంబంధాల్లో ప్రాధాన్యత ఏంటి?
ఆధునిక రాజనీతి తత్వానికి పితామహుడిగా పేరొందిన మాకియవెల్లి వివరించినట్లు దేశ, జాతి ప్రయోజనాల కోసం పాలకుడు ఏవిధమైన విధానాలైనా అనుసరించవచ్చు. ఇటీవలకాలంలో సౌదీఅరేబియా వంటి దేశం తన విదేశాంగ విధానాన్ని అమలుచేసే క్రమంలో ఈ సూత్రాన్నే పాటిస్తున్నది. ముఖ్యంగా సౌదీఅరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్, భారత్‌ను సందర్శించారు. పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో (జైషే మహ్మద్ ఉగ్రసంస్థ) 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన నేపథ్యంలో రెండు దేశాలతో సమతుల్య విధానాన్ని అనుసరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
-పాకిస్థాన్-సౌదీఅరేబియాల మధ్య 1947లో పాక్ స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి బలమైన సాంస్కృతిక, మత, రాజకీయ, వాణిజ్య సంబంధాలున్నాయి. సౌదీలో ఎక్కువగా సున్నీ ముస్లింలు ఉన్నారు. అంతేకాకుండా ప్రపంచ సున్నీ ముస్లింలకు రక్షకులుగా సౌదీ పాలకులను భావిస్తారు. పాకిస్థాన్‌లో కూడా సున్నీలు ఎక్కువగానే ఉన్నారు. ఇస్లాం మతానికి పవిత్ర స్థలాలైన మక్కా, మదీనాలను సంరక్షిస్తుందనే నమ్మకం సౌదీపై ఉంది. ఈ విధంగా పాకిస్థాన్‌కు సౌదీకి మధ్య మతపరమైన సంబంధాలున్నాయి. అంతేకాకుండా పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయాన్ని అందించడంలో సౌదీ ఎప్పుడూ ముందుంటుంది. దీనికి అనుగుణంగా పాకిస్థాన్ సైనికపరమైన రక్షణ సహాయాన్ని అందిస్తుంది. సౌదీ రాజకుటుంబానికి రక్షణగా పాకిస్థాన్ సైనికులు పనిచేస్తుంటారు.
-1990-91లో గల్ఫ్ యుద్ధ సమయంలో కూడా పాకిస్థాన్ సౌదీలోని పవిత్ర స్థలాలకు రక్షణ కల్పించడంలో కీలకపాత్ర పోషించింది. పాకిస్థాన్‌లో మసీదులు, మదర్సాల నిర్మాణానికి సౌదీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇస్లామాబాద్‌లో ఉన్న ఫైజల్ మసీదు సౌదీ రాజు ఫైజల్ పేరుమీదుగా నిర్మించింది. అదేవిధంగా 1977లో లియాల్పూర్ పట్టణానికి ఫైజల్బాద్గా నామకరణంగా చేశారు.
-పాకిస్థాన్ సౌదీ సంబంధాల్లో మరో ముఖ్యమైన అంశం కశ్మీర్ వివాదం విషయంలో సౌదీ.. పాకిస్థాన్ వాదనకు అనుకూలంగా ఉన్నప్పటికీ భారత్-పాక్‌లు ఈ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిందిగా భావిస్తుంది. 1998లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అణుపరీక్షల నిర్ణయానికి పూర్తి మద్దతునిచ్చింది. ఆ సమయంలో పాక్ సంక్షోభాన్ని ఎదుర్కోకుండా ఉండేందుకు రోజుకు 50,000 బ్యారెళ్ల చమురును ఉచితంగా సరఫరా చేయడానికి కూడా హామీ ఇచ్చింది.
-ఇటీవల అప్పులతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్ రెండు వేల కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
-సౌదీఅరేబియాకు పాక్ వ్యూహాత్మకంగా ఎంతో అవసరం ముఖ్యంగా ఇరాన్‌ను ఎదుర్కోవడానికి, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా విరమణ తర్వాత తాలిబన్లతో చర్చల కోసం పాకిస్థాన్ పాత్ర కీలకమైనది. అయితే దీంతోపాటుగా ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ, భారతీయ మార్కెట్లో పెట్టుబడులకు అవకాశాలు, భారత్‌కు ఇంధన వనరుల ఎగుమతులు వంటి అంశాలు సౌదీ-భారత్ బంధం బలపడేందుకు దోహదం చేస్తున్నాయి.
-భారత్-సౌదీ ఆర్థిక సంబంధాలను పరిశీలిస్తే భారత్‌కు నాగులో పెద్ద వాణిజ్య భాగస్వామి (చైనా, అమెరికా, జపాన్)గా సౌదీ ఉంది. దేశానికి అవసరమైన ముడిచమురులో 17 శాతం సౌదీ నుంచి దిగుమతి అవుతుంది. భారతీయులు సుమారు 2.7 మిలియన్ల మంది (2018 డిసెంబర్) సౌదీలో ఉన్నారు. వారిద్వారా లభిస్తున్న విదేశీ మారకద్రవ్యం దేశ ఖజానాకు ఎంతో ఉపయోగపడుతుంది. భారతీయుల్లో ఉన్న నైపుణ్యాలు, క్రమశిక్షణ, చట్టాలను గౌరవించే స్వభావం వల్ల మోస్ట్ ప్రిఫర్డ్ కమ్యూనికేటీగా సౌదీలోని భారతీయ సమాజం ఉంది.
-భారత్-సౌదీ సాంస్కృతిక సంబంధాలను పరిశీలిస్తే సౌదీ జాతీయ సాంస్కృతిక, వారసత్వ పండుగ అయిన Janadriya 32వ మిషన్‌లో భాగంగా భారతదేశం గెస్ట్ ఆఫ్ హానర్ హోదాలో పాల్గొంది. అంతేకాకుండా 2018, జూన్ 21న 4వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని సౌదీలో నిర్వహించారు.
-ఇటీవల అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 2018, నవంబర్ 29న జరిగిన జి-20 సమావేశానికి హాజరైన ప్రధాని మోదీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ భారత్‌లోని వివిధ రంగాల్లో సౌదీ పెట్టుబడుల గురించి చర్చించారు. దీనిలో భాగంగా భారత్‌ను సౌదీ యువరాజు సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా రాబోయే రెండేండ్లలో శక్తి, రిఫైనరీ, పెట్రోకెమికల్స్, మౌలిక వసతులు, ఉత్పత్తి, వ్యవసాయరంగం వంటి వివిధ రంగాల్లో సుమారు వెయ్యి కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టడానికి అవకాశాలున్నాయిన వెల్లడించారు. అదేవిధంగా భారత పశ్చిమతీరంలో 44,000 కోట్ల డాలర్లతో నెలకొల్పనున్న రత్నగిరి రిఫైనరీ, పెట్రో కెమికల్స్ ప్రాజెక్టులో సౌదీ ఆరామ్ కో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఎడ్నాక్ సంస్థలు కలిసి పెట్టుబడులు పెట్టనున్నాయి.
-భారత్-పాక్ మధ్య సరైన సంబంధాలు లేనప్పటికీ, సౌదీ భారత్‌తో తన వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంచుకోడానికి ప్రధాన కారణం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడం, భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు అపార అవకాశాలుండటమే.
-పర్షియన్ గల్ఫ్‌లోని అమెరికా మిత్ర దేశాల భాగస్వామ్యాల్లో అనైక్యతను నివారించడానికి అమెరికా MESA (మిడిల్ ఈస్ట్ సెక్యూరిటీ అలయన్స్)ను ఏర్పాటు చేసింది. దీనిలో ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, జోర్డాన్, ఈజిప్ట్‌లు ఉంటాయి. భారత్ కూడా ఇటీవల MESA వైపు మొగ్గు చూపుతుంది.
-భారతదేశానికి ఇరాన్ నుంచి చమురు దిగుమతి అవుతుంది. అయితే ఇటీవల అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాల్సి వస్తుంది. అయితే ఇరాన్లో భారత్ చాబహార్ పోర్టులో షాహిద్, బెహస్తీ కాంప్లెక్స్‌ను నిర్మిస్తుంది. ఇది పాక్‌లో చైనా నిర్మిస్తున్న గదర్ పోర్టుకు అతికొద్ది దూరంలోనే ఉంది. చాబహార్ పోర్ట్ వాణిజ్యపరంగా, రవాణపరంగా, మధ్య ఆసియాదేశాలతో సంబంధాల కోసం కీలకమైనది. అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్ (ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్)లో కూడా చాబహార్ పోర్ట్ ప్రాముఖ్యాన్ని కలిగి ఉంది. ఈ కారిడార్ ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్‌కు సరకు చేరేవేసే క్రమంలో పాకిస్థాన్‌ను బైపాస్ చేస్తుంది. అదేవిధంగా ఫర్జాద్-బి ఆయిల్ ఫీల్డ్‌లో భారత్ ఓఎన్జీసీ ద్వారా పెట్టుబడులు పెట్టి చమురు వెలికితీయడానికి ప్రయత్నాలు చేస్తుంది. వీటితోపాటు ఇరాన్-పాకిస్థాన్-ఇండియా (ఐపీఐ) ద్వారా గ్యాస్‌లైన్ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
-సౌదీ అరేబియా-పాకిస్థాన్, సౌదీ అరేబియా-ఇండియా, ఇండియా-ఇరాన్ దేశాల్లో ఒకదానితో మరొకటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి తగిన కారణాలున్నాయి. కాబట్టి భారత్-పాక్ మధ్య వైరం కారణంగా సౌదీ-పాక్‌కు దూరం కావాలని భారత్ భావించకుండా సౌదీ అరేబియా మధ్యవర్తిత్వం ద్వారా చర్చలు జరిపి సమస్యను పరిష్కరించి రెండు దేశాల మధ్య (భారత్-పాక్) శాంతియుత వాతావరణం నెలకొల్పడం అవసరం. అదేవిధంగా భారత్‌కు ఇరాన్‌తో ఉన్న సంబంధాల విషయంలో కూడా సౌదీఅరేబియా ఇదే విధానం అవలంబించడం శ్రేయస్కరం.
-సౌదీ అరేబియా ప్రధానంగా చమురు ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఇటీవలకాలంలో ఆయిల్ ధరలో హెచ్చుతగ్గులు, దేశాలన్నీ పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టి కేంద్రీకరించడంవల్ల సౌదీ ఆర్థిక వ్యవస్థ చమురు ఆధారితం నుంచి ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార, వాణిజ్య విస్తరణకు అవకాశం లభిస్తుంది. భారత్ విషయానికి వస్తే BPs definite annual survey of global Energy నివేదిక ప్రకారం 2040 నాటికి భారతీయ శక్తి వినియోగం 165 శాతం పెరగనుంది. ఈ క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సౌదీ.. భారత్‌తో వాణిజ్య సంబంధాలను మెరుగుపర్చుకుంటుంది. ముఖ్యంగా భారత్‌కు ఇరాన్‌కు మధ్య వాణిజ్యం ఉన్నప్పటికీ సౌదీకి భారత్‌తో వాణిజ్యం అవసరం. భారత్‌కు సౌదీతోపాటు దాని శత్రుదేశం అయిన ఇరాన్‌తో సంబంధాలు అవసరం.
-భారత్‌కు స్వాతంత్య్రానంతరం 1947 నుంచి సౌదీ అరేబియాతో దౌత్య సంబంధాలున్నాయి. ముఖ్యంగా సౌదీ రాజు 1955లో భారత్‌ను సందర్శించడం, 1956లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సౌదీఅరేబియాను సందర్శించడం, అదేవిధంగా 2006లో అప్పటి సౌదీ రాజు అబ్దుల్లా ఢిల్లీ డిక్లరేషన్‌పై సంతకాలు చేయడం, 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రియాద్ డిక్లరేషన్‌పై సంతకాలు చేయడంద్వారా సౌదీ-భారత్ రాజకీయ, ఆర్థిక, రక్షణ, భద్రత అంశాలపై ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యాయి. 2014లో భారత్-సౌదీలు రక్షణ రంగంలో సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2016లో ప్రధాని మోదీ సౌదీఅరేబియాకు వెళ్లినప్పుడు భద్రతారంగంలో సహకారాన్ని వృద్ధి చేసుకోవాలని, ఉగ్రవాద వ్యతిరేక పోరులో చేతులు కలపాలని అంగీకారం కుదిరింది. ఈ క్రమంలో భారత ప్రధానికి సౌదీఅరేబియా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్అజీజ్ ను ప్రదానం చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు