పంచవర్ష ప్రణాళికలతో అభివృద్ధి సాధ్యమా?
దేశంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రధాన లక్షణాలు
– పారిశ్రామిక విప్లవంవల్ల భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో చేతివృత్తులు నశించిపోయాయి. యంత్రాల సహాయంతో ఉత్పత్తిచేసిన వస్తువులు అధికంగా దిగుమతి అయ్యాయి.
– పరిమాణాన్ని బట్టి పరిశ్రమలను పెద్దతరహా పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు అని మూడు రకాలుగా విభజించారు.
– ప్రణాళికలు ప్రారంభమయ్యేనాటికి దేశంలో అల్ప మూలధనమున్న పరిశ్రమలు అధికంగా ఉండేవి.
– తయారీ రంగంలో ఉత్పాదక వస్తు పరిశ్రమల కంటే వినియోగవస్తు పరిశ్రమలే ఎక్కువగా ఉండేవి.
– మూలధన వస్తు పరిశ్రమ అభివృద్ధి చెందితేనే ఆర్థిక వ్యవ స్థ వేగంగా పారిశ్రామీకరణ చెంది స్వావలంబన సాధించగలుగుతుంది. తలసరి ఆదాయం వేగంగా పెరుగుతుంది.
ప్రణాళికా కాలంలో పరిశ్రమల వృద్ధి
– సత్వర పారిశ్రామికాభివృద్ధి కోసం పరిశ్రమల రంగంలో స్వావలంబన కోసం ముందుగా మౌలిక, మూలధన వస్తు పరిశ్రమలకు ప్రాధాన్యమిచ్చారు.
– 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రభుత్వరంగానికి పెద్దపీట వేసింది.
మొదటి ప్రణాళిక (1951-56)
– ఈ ప్రణాళికలో అప్పటికే పనిచేస్తున్న పరిశ్రమల ఉత్పాదకశక్తిని సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళిక మొత్తం వ్యయంలో పరిశ్రమల రంగానికి 2.8 శాతం కేటాయించారు.
– ఈ ప్రణాళిక కాలంలో హిందుస్థాన్ మెషిన్టూల్స్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్, పెన్సిలిన్ ఫ్యాక్టరీ, సింద్రి ఎరువుల కర్మాగారం, చిత్తరంజన్ రైలు ఇంజిన్ల కర్మాగారం, హిందుస్థాన్ షిప్యార్డ్, హిందుస్థాన్ యాంటీబయోటిక్స్, హిందుస్థాన్ ఇన్సెక్టిసైడ్స్ వంటి ప్రభుత్వ పారిశ్రామిక సంస్థలు, ప్రైవేట్ రంగంలో చక్కెర, నూలు వస్ర్తాలు, కుట్టు మిషన్లు, సైకిళ్లు మొదలైన వినియోగ వస్తువుల
పరిశ్రమలను నెలకొల్పారు.
రెండో ప్రణాళిక (1956-61)
– ఈ ప్రణాళికలో పారిశ్రామీకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రణాళిక మొత్తం వ్యయంలో 20.1 శాతం పరిశ్రమలరంగానికి కేటాయించారు. 1956 పారిశ్రామిక విధాన తీర్మానం ఆధారంగా ప్రభుత్వ రంగాన్ని భారీగా విస్తరించడానికి ప్రయత్నం చేశారు. మహలనోబిస్ నమూ నా ప్రకారం భారీఎత్తున మౌలిక, మూలధన వస్తువుల పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
– ఈ ప్రణాళిక కాలంలో రూర్కెలా, బిలాయ్, దుర్గాపూర్లలో ప్రభుత్వ రంగంలో ఉక్కు కర్మాగారాలు స్థాపించారు. హిందుస్థాన్ మెషిన్టూల్స్, సింద్రి ఎరువుల కర్మాగారం విస్తరించారు. నంగల్ వద్ద ఎరువుల కర్మాగారం నిర్మించారు.
3వ ప్రణాళిక (1961-66)
– రెండో ప్రణాళికలాగే మూడో ప్రణాళికలో కూడా మౌలిక, మూలధన పరిశ్రమలకు ప్రాధాన్యం ఇచ్చారు.
– ఈ ప్రణాళిక మొత్తం వ్యయంలో పరిశ్రమల రంగానికి 20.1 శాతం కేటాయించారు.
– పరిశ్రమలు, వ్యవసాయరంగం సంతులనంతో సమగ్రాభివృద్ధి సాధించే లక్ష్యం దిశగా 15 ఏండ్లు దీర్ఘదర్శి ప్రణాళికకు ఈ ప్రణాళిక నాంది పలికింది.
– ఉక్కు యంత్ర నిర్మాణం వంటి మూలధన వస్తువుల పరిశ్రమలతో స్వయం పోషకత్వం, స్వావలంబన సాధించి, విదేశీ సహాయ అవసరాన్ని తక్కువ స్థాయికి కుదించాలని ఈ ప్రణాళిక సంకల్పించింది.
4వ ప్రణాళిక (1969-74)
– మూడో ప్రణాళికా కాలంలో ఆరంభించిన పరిశ్రమల నిర్మాణం పూర్తిచేయడం, ఎగుమతి ప్రోత్సాహక పరిశ్రమలు, దిగుమతి ప్రత్నామ్నాయ పరిశ్రమల స్థాపిత శక్తిని పెంచడం దీని లక్ష్యాలు.
– ఈ ప్రణాళిక మొత్తం వ్యయంలో పరిశ్రమల రంగానికి 18.2 శాతం కేటాయించారు.
– ఈ మొత్తం వ్యయంలో 3/4వ వంతు ఇనుము-ఉక్కు, నాన్ ఫెర్రస్ లోహాలు, ఎరువులు, పెట్రోలియం, రసాయనాలు, బొగ్గు, ముడి ఇనుము మొదలైన పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు.
– పారిశ్రామిక ఉత్పత్తిలో 8శాతం వృద్ధి సాధించాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. కాని వాస్తవంగా 5 శాతం మాత్రమే సాధించాం. ఈ ప్రణాళికలో పరిశ్రమల రంగం వృద్ధి లక్ష్యాలు సాధించలేదు.
– ముడి పదార్థాలు, విద్యుచ్ఛక్తి కొరత, అల్ప డిమాండ్, శ్రామికుల సమస్యలు, ఉత్పత్తి, సామర్థ్యం, అల్ప వినియోగం, రవాణాపరమైన చిక్కుల వంటి కారణాలతో 4వ ప్రణాళికలో పారిశ్రామిక ఉత్పత్తి కుంటుపడింది.
5వ ప్రణాళిక (1974-78)
– ఈ ప్రణాళిక మొత్తం వ్యయంలో పారిశ్రామిక రంగానికి 22.8శాతం కేటాయించారు.
– ఈ కాలంలో వాస్తవిక వృద్ధిరేటు లక్ష్యం 8.1 శాతం. అయితే ఇది అంచనాకంటే అల్పంగా ఉంది.
– ఎగుమతుల్లో వేగంగా వృద్ధి, వైవిధ్యం తీసుకురాగల పరిశ్రమల అభివృద్ధి.
– ఎగుమతికోసం తప్ప ప్రాధాన్యత లేని వస్తువుల ఉత్పత్తులను పరిమితం చేయడం.
– 124 వస్తువులను ప్రత్యేకంగా చిన్న పరిశ్రమల రంగానికి కేటాయించి ఆ పరిశ్రమల అభివృద్ధి సాధించడం.
6వ ప్రణాళిక (1980-85)
– మొత్తం ప్రణాళిక వ్యయంలో 13.7 శాతం పారిశ్రామిక రంగానికి కేటాయించారు.
– ప్రస్తుతం ఉన్న ఉత్పాదక సామర్థ్యాలను అభిలషణీయ స్థాయిలో ఉపయోగించుకోవడం లక్ష్యం.
– ఉత్పాదకతను, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం, మూలధన వస్తువులు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల పరిశ్రమలపై ప్రత్యేక శ్రద్ధ, శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం.
7వ ప్రణాళిక (1985-90)
– ఈ ప్రణాళిక మొత్తం వ్యయంలో 12.5 శాతం పరిశ్రమలకు కేటాయించారు. వృద్ధి లక్ష్యం సాలీనా 8 శాతం అయితే వాస్తవ వృద్ధిరేటు 8.5 శాతం.
– టెలీకమ్యూనికేషన్లు, కంప్యూటర్లు, మైక్రో ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ మొదలైన సన్రైజ్ పరిశ్రమలను ప్రోత్సహించడం, చిన్న జిల్లా కేంద్రాల్లో పరిశ్రమలు నెలకొల్పడం, వాతావరణ కాలుష్య నివారణ సామగ్రిని ఉపయోగించే విధంగా చర్యలు తీసుకున్నారు.
– విశాఖ ఉక్కు కర్మాగారం, మహారాష్ట్ర గ్యాస్ క్రేకర్, నాల్కో అల్యూమినియం కాంప్లెక్స్, జే గ్యాస్ పైప్లైన్ అనే నాలు గు భారీ ప్రాజెక్టులను పూర్తిచేశారు.
8వ ప్రణాళిక (1992-97)
– ఆర్థిక సంస్కరణల కాలంలో 8వ ప్రణాళిక ప్రారంభమైంది.
– ప్రణాళిక మొత్తం వ్యయంలో 8.4 శాతం పరిశ్రమల రంగానికి కేటాయించారు.
– ప్రభుత్వరంగ సంస్థల ఆధునీకరణ, అధికస్థాయిలో ప్రైవేటీకరణ ఒక వ్యూహంగా రూపొందించారు.
– ప్రభుత్వరంగంలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం పెంచడానికి, సంస్థ సామార్థ్యాన్ని పెంచే యాజమాన్య పద్ధతులు అనుసరించడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
– ఈ ప్రణాళిక పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధి లక్ష్యం 7.4 శాతం. కాగా వాస్తవిక వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదయ్యింది.
9వ ప్రణాళిక (1997-2002)
– ఈ ప్రణాళిక మొత్తం వ్యయంలో 7.6 శాతం పరిశ్రమల రంగానికి కేంటాయించారు. పారిశ్రామిక ఉత్పత్తిలో 6.2 శాతం వార్షిక వృద్ధి లక్ష్యం. కానీ సాధించింది మాత్రం 5 శాతం.
– ఈశాన్య రాష్ర్టాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టారు.
10వ ప్రణాళిక (2002-2007)
– ఈ ప్రణాళికలో పరిశ్రమలు, ఖనిజాల రంగానికి కేటాయింపులు చేశారు. ప్రణాళిక మొత్తం వ్యయం 3.9 శాతం మాత్రమే.
– ప్రైవేటు రంగం కార్యకలాపాల విస్తరణకు అధిక అవకాశం ఇచ్చారు.
– పారిశ్రామిక రంగం వృద్ధి లక్ష్యం 10 శాతం. ఈ లక్ష్యసాధనలో ప్రైవేటు రంగానిదే ప్రధాన బాధ్యత.
– ఈ ప్రణాళిక సాధించిన వృద్ధిరేటు 3.2 శాతం మాత్రమే.
11వ ప్రణాళిక (2007-12)
– ఈ ప్రణాళిక మొత్తం వ్యయంలో పరిశ్రమల రంగం వాటా 4.2 శాతం.
– ఈ ప్రణాళిక వృద్ధిరేటు లక్ష్యం 10 శాతం. సాధించిన వృద్ధిరేటు 6.9 శాతం. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక తిరోగమన పరిస్థితి దీనికి కారణం.
12వ ప్రణాళిక (2012-17)
– ఈ ప్రణాళిక మొత్తం వ్యయంలో పారిశ్రామిక రంగానికి 4.9 శాతం కేటాయించారు.
– దీని వృద్ధిరేటును 10 శాతంగా నిర్ణయించారు.
పారిశ్రామికాభివృద్ధి దశలు
మొదటి దశ (1951-65)
– ఇది పటిష్టమైన పారిశ్రామిక పునాది దశ.
– మొదటి మూడు ప్రణాళికలు ఈ దశలోకి వస్తాయి.
– ఈ దశలో దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన గట్టి పునాది ఏర్పడింది.
– ఇనుము, ఉక్కు భారీ ఇంజినీరింగ్ యంత్రాలు, యంత్ర పరికరాలు, భారీ రసాయనాలు, బొగ్గు, సిమెంట్, ఎరువులు వంటి మౌలిక, మూలధన పరిశ్రమలను నెలకొల్పారు.
రెండో దశ (1965-80)
– మూడు వార్షిక ప్రణాళికలు, నాలుగు, ఐదో పంచవర్ష ప్రణాళికలు ఈ దశ కిందకు వస్తాయి. ఈ దశలో పారిశ్రామికాభివృద్ధి మందగించింది.
– కృత్రిమ నూలు, పానీయాలు, సౌందర్య పోషక వస్తువులు, కార్యాలయాలు, గృహోపకరణ వస్తువులు, గడియారాలు, నాణ్యమైన వస్ర్తాలు వంటి వినియోగ వస్తువుల ఉత్పత్తి పెరిగింది.
మూడో దశ (1980-91)
– ఈ దశను స్వస్థత దశ అని కూడా అంటారు. ఈ దశలోకి ఆరు, ఏడు ప్రణాళికలు వస్తాయి. ఈ దశలో పారిశ్రామిక ఉత్పత్తి పూర్వదశకు చేరుకుంది.
స్వస్థతకు కారణాలు
1. నూతన పారిశ్రామిక విధానం, సరళ కోశ విధానం
– ఈ కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి పుంజుకోవడానికి సరళీకృత పారిశ్రామిక, వర్తక విధానాలే కారణం.
– సరళీకృత వర్తక విధానాలు సప్లయ్ పెంచడానికి తోడ్పడ్డాయి.
2. వ్యవసాయరంగ తోడ్పాటు
– కొన్ని ప్రాంతాల్లో పెద్ద కమతాలుగల రైతుల ఆదాయాలు పెరుగడంవల్ల వారి నుంచి పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ పెరిగింది.
3. సేవారంగం అభివృద్ధి
– ఈ దశలో పలు రకాల సేవలపై ప్రభుత్వ వ్యయం అధికంగా పెరిగింది.
– సేవారంగంలో పనిచేసేవారు ఆహార వస్తువుల కంటే మన్నికగల వస్తువులపై అధికంగా వ్యయం చేయడంవల్ల ఆ వస్తువులకు డిమాండ్ పెరిగింది.
నాలుగో దశ (1991-92, తదుపరి కాలం)
– ఈ దశ 1991లో నూతన ఆర్థిక విధానం సరళీకరణకు ప్రాధాన్యం ఇచ్చింది.
– పారిశ్రామిక రంగంలో లైసెన్సింగ్ విధానం రద్దుకావడం, ప్రభుత్వరంగ పరిశ్రమల సంఖ్యను కుదించడం, ప్రభుత్వరంగ సంస్థలో పెట్టుబడి ఉపసంహరణ అమలు చేయడం, స్వదేశీ సంస్థల్లో విదేశీ సంస్థల వాటా పెంచడానికి అనుమతించడం, వర్తక విధానం, విదేశీ మారకద్రవ్యం, మార్పిడి రేటు విధానం సరళీకరణ చేయడం, ఎగుమతి దిగుమతి సుంకాలు, ఎక్సైజ్ సుంకం, కార్పొరేట్ పన్నురేట్ల హేతుబద్దీకరణ చేయడం, తగ్గించడం వంటివి ప్రధాన అంశాలు. ఫలితంగా పారిశ్రామిక ఉత్పత్తిలో మార్పులు కలిగాయి.
– సంస్కరణల అనంతరం పరిశ్రమల వృద్ధిరేటు పెరిగింది. అయితే మౌలిక వస్తువుల ఉత్పత్తి రేటు తగ్గింది. వినియోగ వస్తురంగం అభివృద్ధి ఇంజిన్ లాగా పనిచేస్తుందని భావించి దానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
– సంస్కరణల అనంతరం 9వ ప్రణాళిక కాలంలో 2001-02లో పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.
– ఈ కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వార్షిక వృద్ధిరేటు 2.7 శాతం. వినియోగ వస్తురంగం మాత్రం 11.5 శాతం వృద్ధి సాధించింది. మూలధన వస్తురంగం వృద్ధి రుణాత్మకమైనది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు