Our poets | మన కవులు
బచ్చు రామన్న గుప్త (క్రీ.శ. 1884-1954)
నేటి సంగారెడ్డి జిల్లా సదాశివపేట నివాసి, వైశ్యకుల బచ్చువంశ సంజాతులు, కవి పండితులు, సంస్కృతాంధ్రములేగాక ఇతర భాషల్లోనూ ప్రవేశమున్న సంపన్న కుటుంబీకులు మల్లయ్య మునిమనుమడు, శివలింగయ్య పుత్రుడు కృష్ణయ్యకు పుత్రుడినని తన నవనాథ చరిత్రలో తెలిపాడు. నవనాథ చరిత్రను గోరక్షనాథుడు కీమ్యాగర భాషలో రాయగా.. దుండి రాజకుమారుడగు మాలూ పండితుడు మరాఠీ బద్దంగా రచించారు.
బచ్చు రామన్న గుప్త తెలుగు భాషలో వచనశైలి గద్య ప్రబంధంగా రాశారు.నవనాథ చరిత్రను విదేశీయులు గుర్తించారు. ఇప్పటికీ విదేశీయుల గ్రంథాలయాల్లో ఈ గ్రంథాలున్నాయి. బచ్చు రామన్న గుప్త వారణాసి (కాశీ), రాజస్థాన్ ప్రాంతాలను సందర్శించారు.
ఉదా:
1.నిరవధిక సుఖ దమగు యీ
పరమాద్భుత నాథ చరిత్ర బ్రాశస్త్యమున్
వరకీమ్యాగర భాషన్
స్థిరమతి గోరక్షనాథ సిద్దుడు వ్రాసెన్//
2. కం// దుండీ సుతుడగు మాలూ
పండితుడు జగత్ప్రసిద్ద బ్రాకృతమున బ్ర
హ్మాండోద్దారక సిద్దుల
దండి చరిత్రంబు పిదప దనరగ వ్రాసెన్//
3. కావున నక్కథ లాంధ్ర మ
హా విజ్ఞులు దెలసి మిగుల హర్షింపగ మ
ద్భావంబున దలచి తెనుగు
గా విరచించెదను వచన కావ్యము సరణిన్//
1. మత్స్యేంద్రనాథ, 2. గో(రఖ్)రక్షనాథ, 3. గహనీనాథ, 4. జాలాంధరనాథ, 5. కానీపనాథ, 6. భర్తరీ నాథ, 7. నట సిద్దనాథ, 8. రేవణ సిద్దనాథ, 9. బర్పటనాథ మొదలైన నవనాథ సిద్దుల చరిత్రను మనకు అందించారు. యావత్ ప్రపంచానికి చెప్పుకోదగ్గది నవనాథ చరిత్ర. తెలంగాణ మాగాణంలో చెప్పుకోదగ్గ (మహా) కవి రామన్న గుప్త. మెదక్ జిల్లా సిద్దిపేట కవులకు కాణాచి. సదాశివపేట తాళపత్ర గ్రంథ కవి పండితులకు చెప్పుకోదగ్గ ప్రాంతం.
వేలేటి గౌరీశంకర శర్మ (ఆధునిక తెలంగాణ కవి)
ఈయన తెలంగాణలో చెప్పుకోదగ్గ కవి అనవచ్చు. ఈయన 1. శ్రీ కాశీ విశ్వనాథ మహా వైభవం, 2. శివశక్తి తాండవం, 3. శివ మయం, 4. శ్రీమాతా శతకం, 5. విజయభేరి, 6. లలితా వైభవం, 7. ఆదిపరాశక్తి వైభవం, 8. సత్యం-శివం-సుందరం మొదలైనవిగాక మరో తొమ్మిది మహాకవితా గ్రంథాలను మనకందించారు. చరిత్రకు తెలియని ఈ కవి.. పద్య కవితలను, వచన కవితలను మహోన్నతంగా రాయగల మహాదిట్ట. నిజామాబాద్లో నివాసం. స్వగ్రామం మెదక్ జిల్లాలోని లచ్చపేట గ్రామం. ఈయన రచనలు రుద్రవీణలో వస్తుంటాయి. ముద్రిత రచనలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్రాంతాలు తిరిగిన కవి పుంగవులు వేలేటి గౌరీశంకర శర్మ.
దేశరాజు హన్మంతరావు పట్వారి
ఈ కవి నేటి సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు గ్రామ నివాసి. గార్గేయగోత్రము, ఆర్వేల నియోగి, తండ్రి వల్లభరావు. ఈయన రాసిన 1. రాఘవ శతకం, 2. దామోదర శతకం ముద్రితాలు. తురంగ-వృషభ-గరుడ శతకాలు అముద్రితాలు. యాశూధారగా కవితను చెప్పడంలో ఈయన ఘనుడు. ఉర్దూ భాషలో ప్రవేశం కలిగి హృద్యములైన పద్యాలను అల్లిన కవి శేఖరుడు.
చం// ధనమున కాస జెంది వనితాసుత బాంధవులందు ప్రేమ బం
ధనమున కట్టబడ్డను గదా సతతంబు సుఖంబునుగోరి స
జ్జన సహవాస దూరమున జ్ఞాన విహీనుడనైతి నయ్య యో
వనజదళాక్ష భక్త జన వాంఛ ఫలప్రద రామరాఘవా///(రాఘవ శతకం)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు