బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఇలా జరిగింది..
ప్లాసీ యుద్ధభూమిలోనే బెంగాల్‌కు కొత్త నవాబుగా మీర్జాఫర్ను ైక్లెవ్ ప్రకటించాడు. మీర్జాఫర్ ఇంగ్లిష్వాళ్లకి బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ర్టాల్లో స్వేచ్ఛా వర్తకం చేసుకునే హక్కు ప్రసాదించాడు. కలకత్తా సమీపంలోని 24 పరగణాల మీద కంపెనీకి జమిందారీ హక్కు ఏర్పడింది. కలకత్తా మీద లోగడ జరిపిన దాడికి నష్టపరిహారంగా కొత్త నవాబు కంపెనీకి, వర్తకులకు రూ. 1,70,00,000 సమర్పించుకున్నాడు.
-ఇవిగాక కంపెనీ ఉన్నతాధికారులకు కానుకలు, లంచాల రూపేణా భారీ మొత్తాలు చెల్లించాడు. ైక్లెవ్ రూ. 20 లక్షలకుపైగా కొట్టేశాడు. వాట్సన్‌కు రూ. 10 లక్షలకుపైగా ముట్టింది. మొత్తం మీద కంపెనీ, కంపెనీ ఉద్యోగులుకీలుబొమ్మ నవాబు దగ్గర రూ. 3 కోట్లకుపైగా వసూలు చేసి ఉండవచ్చునని ైక్లెవ్ అంచనా. పైపెచ్చు బ్రిటిష్ వర్తకులు, అధికారులు ప్రైవేటుగా చేసుకొనే వ్యాపారం మీద చిల్లిగవ్వ కూడా పన్నుగా చెల్లించనక్కరలేదు. ప్లాసీ యుద్ధం బెంగాల్ మీద, ఆ తర్వాత యావత్ భారతదేశం మీద బ్రిటిష్ ఆధిపత్యానికి బాటలు వేసింది. బ్రిటిష్ ప్రతిష్ఠను ఆకాశానికెత్తింది. ఒక్కదెబ్బతో అది ఇంగ్లిష్ కంపెనీని భారత సామ్రాజ్య ఆధిపత్యానికి ప్రధాన అభ్యర్థి హోదాకి లేవనెత్తింది.
-బెంగాల్ నుంచి వచ్చినప్పుడే పుష్కలమైన ఆదాయంతో ఇంగ్లిష్‌వాళ్లు బలమైన సైన్యాన్ని నిర్మించుకోగలిగారు. బెంగాల్ మీద ఆధిపత్యం ఆంగ్లో-ఫ్రెంచి సంఘర్షణలో నిర్ణాయక పాత్ర వహించింది. ప్లాసీయుద్ధం విజయం ద్వారా కంపెనీ, కంపెనీ ఉద్యోగులు బెంగాల్ ప్రజల కడుపుకొట్టి కోటానుకోట్ల సంపద కాజేశారు. అయితే మీర్జాఫర్ నవాబు కావడానికి ఇంగ్లిష్వాళ్లే కారణమైనా.. వాళ్లతో జరిపిన లావాదేవీలకు అతడు పశ్చాత్తాపపడ్డాడు. కంపెనీ అధికారులు అదేపనిగా డిమాండ్ చేసే కానుకలు, లంచాలకు ఖర్చుపెట్టిన డబ్బుతో ఖజానా ఖాళీ అయ్యింది.
-క్లైవ్ అంతటివాడే స్వయంగా డబ్బు కోసం పదేపదే నవాబుని అడిగేవాడు. కల్నల్ మాలేసన్ చెప్పినట్టుగా అందినంతవరకు డబ్బుదోచెయ్యడం, ఇష్టమొచ్చినప్పుడల్లా చేతులుచాచి దోసిళ్లతో డబ్బు బయటికి తీసే బంగారు గోనె సంచిలా మీర్జాఫర్ని వాడుకోవడం కంపెనీ అధికారుల ఏకైక లక్ష్యం అయింది. అంతేకాకుండా కోరికలు తీర్చే కామధేనువు దొరికిందనుకొని బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల యావత్ పరిపాలనా వ్యయాన్ని బెంగాల్ ఒక్కటే భరించాలని కంపెనీ డైరెక్టర్లు తాఖీదులు పంపారు. అక్కడితో ఆగకుండా ఇండియా నుంచి ఎగుమతి చేసే సరుకులు సమస్తం బెంగాల్ ఆదాయంతో కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీచేశారు.
-ఈ విధంగా కంపెనీ భారతదేశంలో కేవలం వ్యాపారంతో సరిపెట్టుకోలేదు. బెంగాల్ నవాబు మీద తన పెత్తనాన్ని ఉపయోగించుకొని, ఆ రాష్ట్ర సంపదను జలగ మాదిరి పీల్చివేసింది. దీంతో కంపెనీవాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చడం అసాధ్యమని మీర్జాఫర్కి బోధపడింది. వారి కోరికలను తిరస్కరించడం మొదలుపెట్టాడు. దీంతో అతని మీద తాము పెట్టుకొన్న ఆశలకనుగుణంగా నవాబు నడుచుకోవడం లేదని కంపెనీ ఉద్యోగుల్లో అసంతృప్తి ప్రబలింది. కంపెనీ మీర్జాఫర్ని చేతగానిదద్దమ్మ కింద జమకట్టి 1760 అక్టోబర్‌లో గద్దె దింపి అతని అల్లుడు మీర్‌ఖాసీంను నవాబుగా ప్రకటించింది. మీర్‌ఖాసీం కంపెనీవాళ్లు తనకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా బర్దాన్, మిడ్నాపూర్, చిట్టగాంగ్ జిల్లాల మీద కంపెనీకి జమిందారీ హక్కు దాఖలుపర్చాడు. ఉన్నతాధికారులందరికీ సుమారు రూ. 29 లక్షల వరకు కానుకల కింద సమర్పించుకున్నాడు. అంతటితో కంపెనీవాళ్లు సంతృప్తి పడి, పరిపాలనా వ్యవహారాల్లో తనని స్వేచ్ఛగా వ్యవహరించనిస్తారని మీర్‌ఖాసీం భావించాడు. తన రాజధాని నగరాన్ని ముర్షిదాబాద్ నుంచి మాంఘీర్కు మార్చి బ్రిటిష్‌వారికి దూరంగా ఉన్నాడు.
-మీర్‌ఖాసీం శక్తి, సామర్థ్యం, దక్షత కలిగిన పరిపాలకుడు. తన స్వతంత్రాన్ని పరిరక్షించుకోవాలంటే సమృద్ధిగా ఆదాయం, సమర్థమంతమైన సైన్యం ఉండాలని గ్రహించాడు. అతని ధోరణి ఇంగ్లిష్వాళ్లని నిరుత్సాహపర్చింది. రెవెన్యూ వ్యవహారాల నిర్వహణలోని అవినీతిని రూపుమాపి, ప్రభుత్వ ఆదాయాన్ని వృద్ధి చేయడానికి, పాశ్చాత్య పద్ధతుల్లో ఒక ఆధునిక, క్రమశిక్షణాయుత సైన్యాన్ని నిర్మించడానికి మీర్‌ఖాసీం సంకల్పించాడు. ఇది ఇంగ్లిష్వాళ్లకి రుచించలేదు.
-1717 ఫర్మానా ప్రసాదించిన ప్రత్యేక హక్కులను దుర్వినియోగపర్చకుండా నవాబు తీసుకొనే చర్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. తమ సరుకులు ఎగుమతి కోసమైతేనేం, దేశంలోపల వ్యాపారానికైతేనేం నవాబు పట్టించుకోకూడదని కంపెనీ ఉద్యోగుల భావన. సొంత వ్యాపారానికి ఉద్దేశించిన సరుకుమీద కూడా తాము సుంకాలు చెల్లించేదిలేదని వాళ్లు మొండికేశారు. ఇది సహజంగా స్వదేశీ వర్తకుల మనస్సుని గాయపర్చింది. విదేశీయులు చట్ట వ్యతిరేకంగా పన్ను మినహాయింపు అనుభవిస్తూ, తమచేత పన్నులు కక్కించటం భారతీయ వర్తకులు సహించలేకపోయారు. పైపెచ్చు కంపెనీ అధికారులు తమకు ఇష్టమైన భారతీయ వర్తకులకు చట్ట వ్యతిరేకంగా దస్తక్‌లు (ఫ్రీ పాసులు) అమ్మటం ప్రారంభించారు.
-ఆ విధంగా చాలామందికి అంతర వాణిజ్య సుంకాలు ఎగవేయడానికి వీలుపడింది. దానివల్ల నీతిగా, నిజాయితీగా వ్యాపారం చేసే దేశీయ వర్తకులు ఇతరుల అక్రమ పోటీకి తట్టుకోలేకపోయారు. ప్రభుత్వ ఖజానాకు వచ్చే రాబడి పడిపోయింది. వీటికి తోడు కంపెనీ ఉద్యోగులు నవాబు అధికారులను అవమానిస్తూ బెంగాల్ ప్రజానీకాన్ని పీల్చిపిప్పి చేయడానికి పూనుకున్నారు. దేశంలోని వృత్తిపనివాళ్లు, రైతాంగం, వర్తకులకు తమ సరుకుని చౌకగా అమ్మి, కంపెనీ సరుకుని ప్రియంగా కొనుక్కోమని వారిని నిర్బంధించారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిలా తయారైన ఈ పరిస్థితిని ఎదురించినవాళ్లని కొరడాలతో కొట్టారు.
-ఈ కాలాన్ని సిగ్గూశరం వదిలేసిన బహిరంగ దోపిడీ యుగంగా ఆధునిక బ్రిటిష్ చరిత్రకారుడు పెర్సివల్ స్పియర్ వర్ణించాడు. ఈ విధంగా అమితమైన సంపదకు పేరుపడ్డ బెంగాల్ క్రమేణా దారిద్య్రంలోకి కూరుకుపోయింది. ఈ అవినీతి, అవకతవకలు కొనసాగిన పక్షంలో బెంగాల్‌ను పటిష్టంగా తీర్చిదిద్దడంగానీ, కంపెనీ అదుపాజ్ఞల నుంచి బయటపడటంగానీ జరగని పని అని మీర్‌ఖాసీం గ్రహించి, దేశం లోపల జరిగే వర్తక వ్యాపారాల మీద పన్నుని రద్దు చేశాడు. ఇది నిజంగా సాహసోపేతమైన చర్య. ఇంగ్లిష్‌వాళ్లు బలవంతంగా గుంజుకున్న రాయితీని మీర్‌ఖాసీం పన్ను రద్దు ద్వారా స్వదేశీ వర్తకులకు ధైర్యం కల్పించాడు. తమకు, భారతీయులకు మధ్య సమాన హోదా ఇవ్వడం ఇంగ్లిష్వాళ్లకి నచ్చలేదు. దీంతో భారతీయ వర్తకులపైన మళ్లీ పన్ను విధించమని నవాబుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో 1763లో వరుసగా జరిగిన యుద్ధాల్లో మీర్‌ఖాసీం ఓడిపోయి అవధ్‌కు పారిపోయి, అవధ్ నవాబు షుజా ఉద్దౌలాతోను, రాజ్యభ్రష్టుడైన మొఘల్ చక్రవర్తి రెండో షా ఆలంతోను పొత్తు పెట్టుకున్నాడు.
బక్సార్ యుద్ధం (1764 అక్టోబర్ 22)
-ఈ ముగ్గురు కలిసి బక్సార్ వద్ద కంపెనీవాళ్లతో తలపడి ఓడిపోయారు. భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత నిర్ణయాత్మక యుద్ధాల్లో బక్సార్ యుద్ధం ఒకటి. ఈ యుద్ధంలో భారతదేశంలోని రెండు పెద్ద రాజ్యాల సంయుక్త సేనల మీద ఇంగ్లిష్‌వారి ఆయుధ బలం ఆధిక్యత వెల్లడయ్యింది. ఇది బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ర్టాలకు ఇంగ్లిష్వాళ్లని ప్రభువులుగా స్థిరపర్చింది.
-1765లో బెంగాల్ గవర్నర్‌గా తిరిగివచ్చిన క్లైవ్ ఇంగ్లిష్‌వాళ్ల ప్రత్యక్ష రాజ్యాధికారాన్ని స్థాపింపజేయడం కోసం నవాబుల నుంచి సకల ప్రభుత్వాధికారాల్ని క్రమేణా కంపెనీకి బదలాయించడానికి పూనుకున్నాడు. 1763లో కంపెనీ తిరిగి మీర్జాఫర్ని నవాబుగా చేసింది. యధా ప్రకారం కంపెనీ, కంపెనీ అధికారులు కట్నకానుకలు గుంజుకున్నారు.
-మీర్జాఫర్ చనిపోగానే, అతని కుమారుడు నిజాం ఉద్దౌలాని గద్దెనెక్కించి దానికి ప్రతిఫలంగా 1765 ఫిబ్రవరి 20న అతనిచేత ఒక కొత్త ఒడంబడిక మీద సంతకాలు చేయించాడు. దాని ప్రకారం నవాబు తన సైన్యాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి. కంపెనీవాళ్లు నియమించిన ఒక ఉపసుబేదారు ద్వారా పరిపాలన నిర్వహించాలి. ఆ ఉపసుబేదారుని తొలగించాలంటే కంపెనీవారి అనుమతి పొందాలి. ఆ విధంగా ఇంగ్లిష్ తూర్పు ఇండియా కంపెనీ బెంగాల్ మీద సర్వాధిపత్యం సంపాదించింది.
-బెంగాల్ కంపెనీ కౌన్సిల్ సభ్యులు నవాబు దగ్గర మళ్లీ రూ. 15 లక్షలు దోచుకున్నారు. మొఘల్ సామ్రాజ్యానికి నామమాత్రపు చక్రవర్తిగా ఉన్న రెండో షా ఆలం నుంచి కంపెనీ దివానీ హక్కు (రెవెన్యూ వసూలు చేసుకొనే హక్కు) రాబట్టుకుంది. దివానీ హక్కు దక్కించుకున్నందుకు బదులుగా కంపెనీవాళ్లు రెండో షా ఆలం చక్రవర్తికి రూ. 20 లక్షల కోరాలు, అలహాబాద్ జిల్లా ఇచ్చాడు. సుమారు ఆరేండ్ల పాటు రెండో షా ఆలం ఇంగ్లిష్‌వారి బందీగా అలహాబాద్ కోటలో జీవితం గడిపాడు. అవధ్ నవాబు షుజా ఉద్దౌలా యుద్ధ పరిహారం కింద కంపెనీకి రూ. 50 లక్షలు చెల్లించాడు.
బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం
-సుమారు 1765 నుంచి తూర్పు ఇండియా కంపెనీ బెంగాల్ రాష్ర్టానికి నిజమైన యజమానిగా అవతరించింది. రాష్ట్ర రక్షణ బాధ్యత యావత్తు కంపెనీ సైన్యం చేతుల్లోకి పోయి రాజకీయ సర్వాధికారం కంపెనీ హస్తగతమైంది. దివాన్‌గా కంపెనీ ప్రత్యక్షంగా పన్నులు వసూలు చేసుకుంది. ఉప సుబేదారును నేరుగా నియమించి పాలనాధికారం చెలాయించింది. అంటే పోలీసు, న్యాయాధికారాలు కంపెనీ చేతుల్లోకిపోయాయి. ఒకే వ్యక్తి కంపెనీ తరఫున ఉప దివాన్గాను, నవాబు తరఫున ఉప సుబేదార్గాను వ్యవహరించడం వల్ల పాలనాబాధ్యతలు, పన్నువసూలు హక్కు దాదాపు కలిసిపోయి బ్రిటిష్‌వారి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని చాటాయి.
-ఈ పద్ధతి ద్వంద్వ ప్రభుత్వం పేరుతో చరిత్రకెక్కింది. దీనివల్ల బ్రిటిష్‌వారికి గొప్ప లాభం చేకూరింది. బాధ్యతల బెడద లేకుండా కంపెనీకి అధికారం సిద్ధించింది. ఇంగ్లిష్‌వాళ్లు రాష్ట్ర ఆదాయాన్ని, సైన్యాన్ని నేరుగా తమ చేతుల్లో పెట్టుకొని పాలనా నిర్వహణ మీద పరోక్షంగా అజమాయిషీ చేశారు. నవాబు, అతని కింద అధికారులు పాలనా బాధ్యతలు నెత్తినవేసుకున్నా ఆ బాధ్యతల్ని నిర్వర్తించే అధికారాలు వాళ్లకులేవు. కాబట్టి అవకతవకలకి భారతీయులు బాధ్యత వహిస్తే ఆదాయాన్ని, లాభాల్ని బ్రిటిష్‌వారు దండుకున్నారు. ఈ విధంగా బెంగాల్ యావత్తు కంపెనీ అధికారుల కబంధహస్తాల మధ్య ఇరుక్కుపోయింది. ఇష్టానుసారంగా ప్రజల్ని పీడించుకు తినడం పెరిగిపోయింది.
ప్రాక్టీస్ బిట్స్
1. భూములను సర్వే చేసి, ముందుగానే పన్ను లెక్కించే పద్ధతి ఏమిటి? (2)
1) జమిందారీ వ్యవస్థ
2) రైత్వారీ వ్యవస్థ
3) మహల్వారీ వ్యవస్థ
4) ఏదీ కాదు
2. శాశ్వత భూమిశిస్తు విధానం దేని ప్రత్యేకత?(1)
1) జమిందారీ వ్యవస్థ
2) రైత్వారీ వ్యవస్థ
3) మహల్వారీ వ్యవస్థ
4) ఏదీ కాదు
3. మద్రాసులో రైత్వారీ పద్ధతిని అమలు చేసింది?(3)
1) మాల్కమ్ 2) మెట్కాల్ఫే
3) మన్రో 4) ఎల్ఫిన్ స్టోన్
4. భారతీయ కర్మాగారాల చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం?(2)
1) 1861 2) 1881
3) 1887 4) 1898
5. దేశంలో మొదటి రైలు మార్గం ఎప్పుడు ప్రారంభమైంది?(1)
1) 1853 2) 1833
3) 1857 4) 1861
6. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ (3)
1) క్లైవ్ 2) లార్డ్ కానింగ్
3) లార్డ్ విలియం బెంటిక్
4) లార్డ్ లిట్టన్
7. కింది ఏ ఒడంబడికలు ఆంగ్లేయులు, భారత రాజులు చేసుకున్నారు?(4)
1) అలహాబాద్ – షుజా ఉద్దౌలా
2) పూణాసాల్చే – మరాఠాలు
3) శ్రీరంగపట్నం – టిప్పు సుల్తాన్
4) పైవన్నీ
8. లార్డ్ రాబర్ట్ క్లైవ్ ఏ యుద్ధంలో సిరాజుద్దౌలాని ఓడించాడు? (1)
1) ప్లాసీ 2) బక్సార్
3) ముంగర్ 4) వాండివాష్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు