చిత్తడి నేలలను ఏ చర్యలతో కోల్పోతున్నాం?
1. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? (3)
1) ఫిబ్రవరి 21 2) జనవరి 25
3) ఫిబ్రవరి 28 4) జనవరి 12
వివరణ: ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహిస్తారు. రామన్ ప్రభావం ఆవిష్కరణ అయింది ఈ రోజే. ఈ ప్రయోగానికే సీవీ రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. ఈ శాస్త్రంలో నోబెల్ పొందిన తొలి భారతీయుడు ఆయనే. ప్రభుత్వం 1986 నుంచి ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాతృభాష దినంగా జరుపుతారు. జనవరి 25 జాతీయ ఓటరు రోజుతో పాటు, జాతీయ పర్యాటక రోజు. జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తారు. ఆ రోజు స్వామి వివేకానంద జయంతి
2. దేశంలో పూర్తి స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్‌ను సాధించిన రాష్ట్రం ఏది? (4)
1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ
3) గుజరాత్ 4) కేరళ
వివరణ: బ్యాంకింగ్ సేవలకు సంబంధించి దేశంలో పూర్తి స్థాయిలో డిజిటల్‌గా మారిన తొలి రాష్ట్రంగా కేరళ అవతరించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటన చేశారు. స్థానిక ప్రభుత్వాల సాయంతో ఈ ఘనతను సాధించినట్లు విజయన్ ప్రకటించారు. బ్యాంకుల్లో ప్రతి ఖాతాదారుడు ఏదో ఒక డిజిటల్ సేవను వినియోగించుకుంటే 100% డిజిట్ పరిజ్ఞానంగా పరిగణిస్తారు. కేరళ రాష్ట్ర సమాచార సాంకేతిక మౌలిక సదుపాయాల సంస్థ, కేరళ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా సాయం చేయడంతో కేరళ డిజిటల్ బ్యాంకింగ్ రాష్ట్రంగా అవతరించింది.
3. జనవరి 5, 6, 7 తేదీల్లో కింది ఏ అధికారులతో జాతీయ స్థాయిలో ప్రధాని సమావేశమయ్యారు? (3)
1) రాష్ట్ర డీజీపీలు
2) రాష్ర్టాల ఆర్థిక మంత్రులు
3) రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు
4) అన్ని రాష్ర్టాల్లోని నీతి ఆయోగ్ సభ్యులు
వివరణ: రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులతో జనవరి 5, 6, 7 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. దీన్ని ఢిల్లీలో నిర్వహించారు. 2047 నాటికి వికాస భారతాన్ని సాధించేందుకు ఉద్దేశించిన సమావేశం ఇది. ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన రెండో సమావేశం కూడా ఇదే. ఆరు ఇతివృత్తాలను సమావేశంలో ఎంచుకున్నారు. అవి- ఎంఎస్ఎంఈల బలోపేతం, మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు, నిబంధనల సరళీకరణ, మహిళ సాధికారత, ఆరోగ్యం-పోషణ, నైపుణ్యాభివృద్ధి. వీటిని సాధించేందుకు కేంద్ర, రాష్ర్టాల మధ్య మరింత సమన్వయాన్ని కూడా సాధించాలని నిర్ణయించారు.
4. ఐక్యరాజ్య సమితి ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం ఓజోన్ పొర….? (1)
1) మెరుగవుతుంది
2) మరింత ధ్వంసమవుతుంది
3) మెరుగు కోసం చర్య తీసుకున్నా మార్పు లేదు
4) ఏదీకాదు
వివరణ: ఓజోన్ పొర మెరుగవుతుందని తాజాగా ఐక్యరాజ్యసమితి శాస్త్ర పరిశీలన నివేదికలో వెల్లడించింది. మాంట్రియల్ ప్రొటోకాల్‌లో అంగీకరించిన విధంగా ఓజోన్ పొర నాశనానికి కారణమయ్యే పదార్థాల వినియోగాన్ని నిలిపివేయడంతో ఇది సాధ్యమయిందని ఐకాస పేర్కొంది. ఓజోన్ అనేది మూడు ఆక్సిజన్ పరమాణువుల కలయికతో ఏర్పడుతుంది. భూమ్మీదకు అతినీలలోహిత కిరణాలు చేరకుండా అడ్డుకుంటుంది. ఒక వేళ ఇవి భూమిపై పడితే మనుషుల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కిరణ జన్య సంయోగక్రియపై ప్రభావం పడుతుంది. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. మరోవైపు భూతాపం పెరిగి వేగంగా మంచు కరుగుతుంది. సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
5. మోనికా సింగ్ ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచారు? (2)
1) అమెరికాలో ఒక రాష్ర్టానికి గవర్నర్ అయ్యారు
2) అమెరికా కోర్టులో జడ్జి అయ్యారు
3) అమెరికా ఉపాధ్యక్షురాలికి సలహాదారుగా నియమితులయ్యారు
4) పైవేవీ కాదు
వివరణ: భారత సంతతికి చెందిన సిక్కు మహిళ మన్‌ప్రీత్ మోనికా సింగ్ అమెరికాలో హారిస్ ప్రాంతంలోని కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి సిక్కు మహిళగా ఆమె నిలిచారు. హౌట్సన్లో పుట్టి, పెరిగారు. ఆమె తండ్రి 1970 దశకంలో అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆ దేశంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో పౌర హక్కుల వ్యవస్థల్లో పనిచేసిన అనుభవం కూడా మోనికాసింగ్కు ఉంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ప్రస్తుతం భారత సంతతికి చెందిన వ్యక్తి రక్షణ సలహాదారుగా ఉన్నారు. ఆమె పేరు శాంతి సేథీ.
6. వ్యవసాయ రంగంలో అధికంగా పెట్టుబడులు సాధించిన రాష్ర్టాల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? (3)
1) నాలుగో స్థానం 2) రెండో స్థానం
3) ఒకటో స్థానం 4) మూడో స్థానం
వివరణ: వ్యవసాయ సేవల రంగంలో అధికంగా విదేశీ పెట్టుబడులు వచ్చిన రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. 2019 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ మధ్య కాలంలో వచ్చిన పెట్టుబడుల ఆధారంగా కేంద్రం నివేదిక విడుదల చేసింది. దేశం మొత్తంలో 189 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు విదేశాల నుంచి వచ్చాయి. ఇందులో తెలంగాణ 49.44 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించింది. రెండో స్థానంలో గుజరాత్ ఉంది. ఆ రాష్ట్రం 30.49 మిలియన్ డాలర్ల పెట్టుబడి సాధించగా, 20.07 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించి తమిళనాడు మూడో స్థానంలో ఉంది.
7. డిజిటల్ ఇండియా-2022 అవార్డు తెలంగాణ ప్రభుత్వం ఏ విభాగంలో దక్కించుకుంది? (1)
1) భూ పోషకాల నిర్వహణలో
2) ఫైబర్ నెట్ ప్రాజెక్ట్
3) ఇంటింటికి ఇంటర్నెట్ కార్యక్రమం
4) పైవేవీ కాదు
వివరణ: భూమిలో పోషకాల నిర్వహణకు డిజిటల్ రూపంలో రైతులకు అందిస్తున్న సేవలకు డిజిటల్ ఇండియా-2022 అవార్డును తెలంగాణ రాష్ట్రం అందుకుంది. ఎరువులు, సూక్ష్మ పోషకాల వాడకంపై సలహాలు ఇవ్వడం, భూసార క్షీణత, నీటి కాలుష్య నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి, రైతులకు తగిన మార్గదర్శనం చేస్తున్నందుకు డిజిటల్ ఇనిషియేటివ్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టార్టప్స్ విభాగంలో ఈ పురస్కారం దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి ఈ అవార్డును అందుకున్నారు.
8. కింది ఏ చర్యల వల్ల చిత్తడి నేలలను కోల్పోతున్నామని వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నివేదిక పేర్కొంది? (4)
1) పట్టణీకరణ
2) వ్యవసాయానికి రసాయనాలు వాడటం
3) మానవ ఆవాసాలు పెరగడం
4) పైవన్నీ
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా చిత్తడి నేలలు క్రమంగా తగ్గిపోతున్నాయని వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ తాజాగా ఇచ్చిన నివేదికలో పేర్కొంది. నెదర్లాండ్స్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. జలచర జీవులు మనుగడ సాగించేందుకు దాదాపు 40% నీటి వ్యవస్థల నాణ్యత తగ్గిపోయిందని నివేదిక వెల్లడించింది. భారత్‌లో ప్రతి ఐదు రామ్సర్ సైట్లలో రెండు తమ నాణ్యతను కోల్పోయాయని తెలిపింది. ఇదంతా గడిచిన మూడు దశాబ్దాల్లో జరిగినట్లు పేర్కొంది. పట్టణీకరణ, వ్యవసాయానికి ఇష్టారీతిన రసాయనాలు ఉపయోగించడం, మానవ ఆవాసాలు పెరగడం, భూతాపం.. తదితర కారణాలను ప్రస్తావించింది. భారత దేశంలో మొత్తం 75 రామ్సర్ సైట్లు ఉన్నాయి. సంఖ్యాపరంగా అతి ఎక్కువ తమిళనాడులో ఉండగా, విస్తీర్ణం పరంగా ఎక్కువ గుజరాత్లో ఉన్నాయి.
9. ఏ దేశంలో భారత్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్‌ను ప్రారంభించింది? (3)
1) శ్రీలంక 2) మలేషియా
3) యూకే 4) రష్యా
వివరణ: యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అమలుకు భారత్, యూకే ఇటీవల సంతకాలను లండన్‌లో పూర్తి చేశాయి. రెండు దేశాలు 2021 మేలో ‘ఇండియా-యూకే మైగ్రేషన్ అండ్ మొబిలిటీ’ అనే అంశంపై అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఆ తర్వాత విధి విధానాలను రూపొందించుకున్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేవాళ్లకు ఇది వర్తిస్తుంది. భారత్‌కు చెందిన 3000 మంది యూకేలో నివసించేందుకు అలాగే, పనిచేసేందుకు అనుమతిస్తారు. అదే సంఖ్యలో బ్రిటిష్ యువతకు కూడా భారత్‌లో అవకాశం లభిస్తుంది.
10. ఏ రాష్ట్రంలోని శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి జనవరి 10న వివాదం చెలరేగింది? (4)
1) కేరళ 2) జార్ఖండ్
3) పశ్చిమబెంగాల్ 4) తమిళనాడు
వివరణ: సంవత్సరంలో జరిగే తొలి శాసనసభ సమావేశంలో ఆయా రాష్ర్టాల గవర్నర్లు తొలి ప్రసంగం చేస్తారు. అధికరణం 176లో ఈ నిర్దేశం ఉంది. ఆ ప్రసంగాన్ని ప్రభుత్వమే రూపొందిస్తుంది. అయితే తమిళనాడులో దీనికి సంబంధించి ఇటీవల వివాదం ఏర్పడింది. ఆ రాష్ట్ర గవర్నర్ రవి, ప్రభుత్వం ఇచ్చిన కొన్ని అంశాలను చదవలేదు. అలాగే మరికొన్ని చేర్చారు. అయితే ప్రభుత్వం అందించిన అంశాలను మాత్రమే రికార్డుల్లో చేర్చాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేశారు.
11. ఈ ఏడాది ప్రవాస భారతీయ దినోత్సవం ఏ నగరంలో నిర్వహించారు? (2)
1) భోపాల్ 2) ఇండోర్
3) బెంగళూర్ 4) న్యూఢిల్లీ
వివరణ: 2023లో 17వ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో నిర్వహించారు. ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవం నిర్వహిస్తారు. 1915లో జనవరి 9న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చారు. ఈ సంఘటనకు గుర్తుగా ఈ తేదీన ప్రవాస భారతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి ఈ ఉత్సవానికి గయానా అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ ఇర్ఫాన్ అలీ హాజరయ్యారు. ఆయన భారత్‌లో జనవరి 8 నుంచి 14 వరకు పర్యటించారు. ఢిల్లీ, కాన్పూర్, బెంగళూర్, ముంబైలలో వివిధ పర్యటనలను చేపట్టనున్నారు. ఈ ఏడాది చేపట్టిన ప్రవాస భారతీయ దినోత్సవ ఇతివృత్తం ‘డయాస్పోర: రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియా ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్’.
12. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలోని కూలీలకు సంక్షేమ పథకాలను అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది? (3)
1) త్రిపుర 2) సిక్కిం
3) కేరళ 4) హర్యానా
వివరణ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న కార్మికులకు పలు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రాష్ట్రంలో 26.71 లక్షల కార్మికులు లబ్ధి పొందనున్నారు. సంక్షేమ బోర్డును కూడా అందుబాటులోకి తేనున్నారు. పింఛను సౌకర్యంతో పాటు వైద్య సహాయం కూడా చేయనున్నారు.
13. హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ నుంచి ‘అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్’ అవార్డును పొందిన భారతీయుడు ఎవరు? (1)
1) డీవై చంద్రచూడ్
2) గిరీష్ చంద్ర ముర్ము
3) ఉజ్జల్ భూయాన్
4) జస్టిస్ ఎన్వీ రమణ
వివరణ: ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ చంద్రచూడ్‌కు హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ అవార్డును ప్రకటించింది. జనవరి 11న ఆయన అవార్డ్ ఫర్ గ్లోబల్ లీడర్ షిప్‌ను అందుకున్నారు. న్యాయవాద వృత్తికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఆయన భారత్‌కు 50వ ప్రధాన న్యాయమూర్తి. ఆయన తండ్రి కూడా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. గిరీష్ చంద్ర ముర్ము ప్రస్తుతం భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
14. జనవరి 7న మరణించిన టెహెమ్టన్ ఇ ఉద్వాడియా ఏ రంగంతో ముడిపడి ఉన్నారు? (2)
1) క్రీడా రంగం 2) వైద్యం
3) సాంస్కృతిక కళలు
4) రక్షణ రంగం
వివరణ: ప్రముఖ వైద్యుడు టెహెమ్టన్ ఇ ఉద్వాడియా మరణించారు. లాప్రోస్కోపిక్ పితగా ఆయనకు పేరు ఉంది. 1930 అక్టోబర్ 10న ఆయన ముంబైలో జన్మించారు. అక్కడే ఉన్న గ్రాంట్ మెడికల్ కాలేజీలో విద్యను అభ్యసించారు. సర్జన్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. లాప్రోస్కోపి చేయడంలో పేరు తెచ్చుకున్నారు. ఈ ఆపరేషన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టింది ఆయనే. 2002లో ఆయన పద్మశ్రీ అవార్డు పొందారు.
15. ఏ దేశంతో కలిసి భారత్ వీర్ గార్డియన్ వైమానిక విన్యాసాలను నిర్వహించనుంది? (3)
1) ఇండోనేషియా 2) మలేషియా
3) జపాన్ 4) దక్షిణ కొరియా
వివరణ: భారత్, జపాన్ దేశాల మధ్య జనవరి 16 నుంచి 26 వరకు వీర్ గార్డియన్ పేరుతో వైమానిక విన్యాసాలు జరుగనున్నాయి. జపాన్‌లోని హైకురి, అలాగే దాని చుట్టూ ఉన్న ఒమిటమ, ఇరుమా వైమానిక కేంద్రాల్లో కూడా ఈ విన్యాసాలు ఉంటాయి. భారత్‌లో తొలి మహిళ యద్ధ పైలట్ అవని చతుర్వేది కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ ఘనతను దక్కించుకున్న తొలి మహిళ ఆమె.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు