అతివాద జాతీయత అంటే ఏంటి?
మితవాద జాతీయత (1885-1905)
-భారతదేశంలో బ్రిటిష్‌వారి పాలన సామ్రాజ్యవాద దోపిడీకి నిలయమయ్యింది. భారతదేశాన్ని ముడిపదార్థాలు సరఫరాచేసే దేశంగా, బ్రిటిష్ వస్తువులకు విపణి వీధిగా, బ్రిటిష్ పెట్టుబడులకు సుభిక్షమైన క్షేత్రంగా చేసే బ్రిటన్ విధానాన్ని జాతీయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు.
-బ్రిటిష్‌వారి ఆర్థిక విధానాల వల్ల మనదేశం తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజలకు వివరించడం మితవాద నాయకుల విజయాల్లో ముఖ్యమైనది. దాదాభాయ్ నౌరోజీ, ఆర్సీ దత్ తమ రచనల ద్వారా విజయవంతంగా ఈ పనిని నిర్వహించారు. వీరు బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక విధానాల గుట్టును బహిరంగపరచడం ద్వారా దేశ ప్రజల్లో జాతీయతను పెంపొందించారు.
-బ్రిటిష్ పరిపాలన శాశ్వతంగా పాతుకుపోయి, నిత్యం పెరుగుతూపోయే ఒక విదేశీ దురాక్రమణ అని దాదాభాయ్ నౌరోజీ ప్రకటించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక విమర్శల్లో సంపద తరలింపు సిద్ధాంతంను జాతీయవాదులు ప్రధాన ఆయుధంగా ఉపయోగించారు. భారతదేశ సంపద బ్రిటిష్ విధానంవల్ల ఇంగ్లండ్ తరలిపోతుందని వివరించిన మొదటి భారతీయ నాయకుడు దాదాభాయ్ నౌరోజీ. ఆయన తన గ్రంథమైన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. దీన్నే డ్రెయిన్ సిద్ధాంతం అనికూడా అంటారు. బ్రిటిష్ పరిపాలన దమనకాండకు ప్రధాన కారణం సంపద తరలింపు విధానమని ఆయన భావించాడు.
-బ్రిటిష్ పాలకులు మొదట్లో భారత జాతీయ కాంగ్రెస్‌తో స్నేహపూర్వకంగానే ఉన్నారు. అయితే క్రమంగా కాంగ్రెస్ నాయకుల ప్రభుత్వ వ్యతిరేకచర్యలపై కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. జాతీయ కాంగ్రెస్‌ను తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ జాతీయ నాయకుల పట్ల శత్రుభావాన్ని ప్రకటించింది. ఈ ఉద్దేశంతోనే జాతీయ నాయకులను విశ్వాసంలేని బాబులని, రాజద్రోహ పూరిత బ్రహ్మలని, తీవ్ర భావాలుగల దుర్మార్గులని బ్రిటిష్ అధికారులు విమర్శించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పతనం కావడానికి సిద్ధంగా ఉంది. నేను భారతదేశంలో ఉండగానే అది ప్రశాంతంగా కళ్లు మూయడానికి సహాయపడాలని నా కోరిక అని లార్డ్ కర్జన్ వ్యాఖ్యానించాడు. భారతీయ ప్రజల్లో సమైక్యత తమ పరిపాలనకు ప్రమాదకరమని గుర్తించిన బ్రిటిష్ అధికారులు కాంగ్రెస్ సంస్థ ప్రభావాన్ని తగ్గించడానికి, దాన్ని బలహీనపర్చడానికి విభజించి పాలించు అనే విధానాన్ని అనుసరించారు.
-సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్, బెనారస్ రాజు శివప్రసాద్ వంటివారిని బ్రిటిష్ వారికి అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రోత్సహించారు. హిందువులు, ముస్లింలకు మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించారు. అయితే 1885-1905 జాతీయోద్యమానికి సాంఘిక పునాది చాలా తక్కువగా ఉన్నది. అంటే సామాన్య ప్రజలు జాతీయోద్యమంపై పెద్దగా మొగ్గుచూపలేదు. ప్రజలు పూర్తిగా చైతన్యవంతులు కాకపోవడానికి కారణం జాతీయవాదులకు, రాజకీయ విషయాలకు సంబంధించి ప్రజలపై పెద్దగా నమ్మకం లేదు. దీనికి కారణం ప్రజలకు రాజకీయ చైతన్యం లేకపోవడమే.
అతివాద జాతీయత (1905-19)
-జాతీయ కాంగ్రెస్ శాంతియుత విధానం, రాజ్యాంగబద్ధ పద్ధతులు, మితవాద ధోరణి ఆంగ్ల ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపలేదు. అందువల్ల కాంగ్రెస్‌లోని అతివాదవర్గం తీవ్రవాద ధోరణిలో ప్రభుత్వంతో తలపడి కోర్కెలను సాధించుకోవాలనే అభిప్రాయానికి వచ్చింది.
-నాటి అతివాద నాయకుల్లో పంజాబ్‌లో లాలా లజపతిరాయ్, మహారాష్ట్రలో బాల గంగాధర తిలక్, బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, అరవిందఘోష్లు ముఖ్యమైనవారు. పోరాడితేగాని రాజకీయ హక్కులు లభించవు అని తిలక్ ప్రకటించాడు. 1905 నుంచి కాంగ్రెస్‌లో అతివాద, మితవాద వర్గాలమధ్య భేదాభిప్రాయాలు ఎక్కువయ్యాయి. క్రమంగా మితవాదుల ప్రభావం తక్కువై అతివాదుల ప్రభావం అధికమైంది.
కర్జన్ విధానాలు
-దేశంలోని మధ్యతరగతి విద్యాధికులను కర్జన్ అవమానించాడు. 1904లో విశ్వవిద్యాలయాల చట్టం ప్రవేశపెట్టి వాటిపై ప్రభుత్వ ఆధిపత్యాన్ని దృఢపరిచాడు.
-తొందపాటుతో ఏకపక్షంగా బెంగాల్‌ను విభజించి, మహమ్మదీయులను బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ప్రజలు ఆంగ్ల ప్రభుత్వంపై ద్వేషాన్ని పెంచుకున్నారు.
మితవాద, అతివాదుల మధ్య బేధాభిప్రాయాలు
-మితవాదులు నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో సహకరించాలంటే, అతివాదులు ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించారు.
-మితవాదులు ఆంగ్లేయుల అభిమానాన్ని పొందాలని ప్రయత్నించగా, అతివాదులు ఆంగ్లేయులను తరిమివేయాలని నిశ్చయించారు.
-అతివాదులు విదేశీ వస్తుబహిష్కరణకు ప్రాముఖ్యమివ్వగా, మితవాదులు బహిష్కరణ ఉద్యమాన్ని వ్యతిరేకించారు. మితవాదుల శాంతియుత రాజ్యాగబద్ధ పద్ధతుల్లోనే కోర్కెలను సాధించాలని ప్రయత్నించగా, అతివాదులు ప్రజాఉద్యమాల ద్వారా పోరాట పద్ధతుల్లో స్వరాజ్యం సాధించాలని భావించారు.
-మితవాదులు బ్రిటిష్‌వారి అదుపులో మాత్రమే భారతదేశం ప్రగతి సాధిస్తుందనే భావనను తెలుపగా, అతివాదులు బ్రిటిష్‌వారి పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించి జాతీయోద్యమ లక్ష్యం స్వరాజ్ లేదా స్వాతంత్య్రం అని స్పష్టంగా ప్రకటించారు.
-బంకించంద్ర చటర్జీ ఏడాదిలో మూడురోజులు సమావేశం నిర్వహించే కాంగ్రెస్ సంస్థ యాచకత్వ విధానాన్ని అపహాస్యం చేస్తూ తీవ్రపదజాలంతో మితవాదులను విమర్శించాడు.
-1896లో తిలక్ తన కేసరి పత్రికలో కాంగ్రెస్ నాయకులు గత 12 ఏండ్లుగా గొంతుకలుపోయేట్లుగా కేకలు పెట్టినా ప్రభుత్వంపై ఏ మాత్రం ప్రభావాన్ని కనబరచలేకపోయారని విమర్శించాడు. కప్పలు బెకబెకమన్నట్లే తప్ప ఎలాంటి ఫలితం లేదని మితవాదులను విమర్శించాడు.
-1897లో జరిగిన అమరావతి కాంగ్రెస్ సమావేశాన్ని అశ్వనీకుమార్దత్ మూడురోజుల తమాషాగా వర్ణించాడు.
-మితవాదులుకూడా అతివాదులను విమర్శించారు. ఈ నేపథ్యంలో గోపాలకృష్ణ గోఖలే అతివాదులను విమర్శిస్తూ పిచ్చాసుపత్రి వెలుపల ఉన్న పిచ్చివారు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడుతారని అన్నాడు.
బెంగాల్ విభజన, వందేమాతర ఉద్యమం
-పరిపాలనా సౌలభ్యం అనే నెపంతో అతిపెద్దదైన బెంగాల్ రాష్ర్టాన్ని లార్డ్ కర్జన్ 1905లో రెండు రాష్ర్టాలుగా విభజించాడు. అవిభక్త బెంగాల్ ఒక శక్తి. బెంగాల్‌ను విభజిస్తే బలహీనమవుతుంది. మన పరిపాలనలో ప్రతిఘటించే బలమైన ప్రత్యర్థులను బలహీనపరచడమే మన ముఖ్య లక్ష్యమని ఆనాటి భారతప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి రిస్లే ప్రకటించాడు. ఈ చర్యవల్ల బెంగాల్లో హిందువులు, ముస్లింలు అధికసంఖ్యలో ఉండే ప్రాంతాలు వేరయ్యాయి. ఈ విభజన 1905, అక్టోబర్ 16న బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీన్ని బెంగాల్ రాష్ట్రమంతా శోకదినంగా పాటించింది.
-కాంగ్రెస్‌లోని అతివాదులు, మితవాదులు కలిసికట్టుగా విభజనను వ్యతిరేకిస్తూ 1905, ఆగస్టు 7న కలకత్తాలోని టౌన్హాల్లో జరిగిన నిరసన ప్రదర్శనలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నారు. దీన్నే వందేమాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అని అంటారు. స్వదేశీ అన్న పదాన్ని మొదటిసారిగా స్వామి దయానంద సరస్వతి ఉపయోగించాడు. ఆయన ప్రచార ఫలితంగా ఆర్యసమాజ నాయకులంతా స్వదేశీ సరుకుల వినియోగ ప్రచారాన్ని ఉద్యమ స్థాయికి తీసుకుపోయారు. బెంగాల్ విభజన ప్రకటన నిశ్చేష్టులను చేసిందని సురేంద్రనాథ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం బెంగాలీలను ఘోరంగా అవమానించిందని, దగా చేసిందని ప్రకటించాడు. కృష్ణకుమార్ మిత్ర తన సంజీవని వార పత్రిక ద్వారా విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత అది దేశమంతటా వ్యాపించింది.
-రవీంద్రనాథ్ ఠాగూర్ ఆత్మశక్తి సిద్ధాంతాన్ని తెలుపగా, మనం సొంతంగా పరిశ్రమలను స్థాపించుకోవాలని పీసీ రాయ్ ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఆయన బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీని స్థాపించగా, విద్యాపరంగా సతీష్ ముఖర్జీ డాన్ సొసైటీని ఏర్పాటు చేశాడు. ఈ సమయంలోనే ఠాగూర్ శాంతినికేతన్తోపాటు తూర్పు, పశ్చిమబెంగాల్, బీహార్లలో అనేక జాతీయ విద్యాలయాలు వెలిశాయి. బెంగాల్‌లోని జాతీయ కళాశాలలకు అరవిందఘోష్ ప్రిన్సిపల్‌గా ఉన్నాడు. కృష్ణకుమార మిత్ర యాంటీ సర్క్యులర్ సొసైటీ, అశ్వనీదత్ స్వదేశీ బాంధవ్ సమితి స్వదేశీ ఉద్యమాన్ని వ్యాప్తి చేశాయి.
అతివాదుల ప్రాబల్యం – పరిస్థితులు
-1892 చట్టం జాతీయ వాదులను తృప్తిపరచలేదు. దీనివల్ల భారతీయులకు పరిపాలనాధికారాలు ఏ మాత్రం లభించలేదు.
-1896-1900 వరకు దేశంలో అనేక ప్రాంతాల్లో కరువు సంభవించింది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా ఇదే సమయంలో రాజదర్బార్ నిర్వహించడంపై ఉత్సాహం చూపిన కర్జన్, సైనిక వ్యయాన్ని తగ్గించడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. దీంతో జాతీయ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు.
-బంకించంద్ర చటర్జీ, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అరవిందఘోష్ల రచనలు నాటి యువతరాన్ని ప్రభావితం చేశాయి.
-బంకించంద్ర చటర్జీ తన ఆనంద్‌మఠ్ నవలలో దేశభక్తికి ప్రాముఖ్యతనిచ్చి దేశం కోసం ఏ త్యాగానికైనా సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చాడు.
-దయానంద సరస్వతి, వివేకానందుడు తమ ప్రచారంలో దేశాన్ని అధిష్టాన దేవతగా పూజించి గౌరవించాలని తెలిపాడు.
-వివేకానందుని బోధనలు తమకెంతో స్ఫూర్తినిచ్చాయని లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్‌లు పేర్కొన్నారు. ప్రాచీన భారతీయ వైభవాన్ని గుర్తుచేసి భారతీయుల జాతీయ ఐక్యతకు ప్రాధాన్యతను ఇచ్చిన దయానంద సరస్వతి బోధనలు నాటి నాయకులను అతివాదంవైపు మళ్లించాయి.
-అరవిందఘోష్ రచనలు ప్రత్యక్షంగా అతివాద సిద్ధాంతాన్ని బలపరిచాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు