పాశ్చాత్యీకరణం అంటే..
నిబంధన 23: మనుషుల అక్రమ రవాణా, బలవంతపు వెట్టిచాకిరీని నిషేధించింది.
-ఈ నిబంధన కింద మనుషుల అక్రమ రవాణా లేదా క్రయవిక్రయాలు అంటే 1) స్త్రీలు, బాలకార్మికులు, పురుషులను వస్తువులలాగా అమ్మడం, కొనడం నిషేధం.
2) వ్యభిచారం, మనుషుల అక్రమ రవాణా నిషేధం
3) దేవదాసీ వ్యవస్థ, 4) బానిసత్వం నిషేధం
-పై అమానుష చర్యలను నిషేధించడానికి ప్రభుత్వం ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్-1956ని ప్రవేశపెట్టింది. బానిసత్వం, దేవదాసీ వ్యవస్థను రూపుమాపడమే దీని లక్ష్యం.
-23వ నిబంధనలోని రెండో పదం బేగార్ (బలవంతపు వెట్టిచాకిరీ) అంటే పనికి సరైన వేతనం చెల్లించకపోవడం, బలవంతంగా పనిచేయించడం, డబ్బు చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయించుకోవడం వంటి దుర్మార్గపు భూస్వామ్య విధానాలవల్ల కొన్ని కులాలు శ్రమ దోపిడీకి గురికాకుండా ఈ అధికరణ ఆయుధంలా పనిచేస్తుంది.
బేగార్ నిరోధానికి ప్రభుత్వ చర్యలు
1) స్త్రీలు, బాలికల అక్రమ వ్యాపార నిరోధకచట్టం-1956, 2006 (సప్రెసన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్-1956)
2) ది బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబాలిషన్) యాక్ట్-1976 (వెట్టిచాకిరీ నిరోధక చట్టం- 1976)
3) అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం- 1978
4) సమాన పనికి సమాన వేతన చట్టం-1976
5) కనీస వేతనాల చట్టం- 1948, 1978
-వెట్టిచాకిరీ, శ్రమదోపిడీ, మనుషుల అక్రమ రవాణా, బానిసత్వం, దేవదాసీ వంటి సామాజిక దురాచారాలు ఎక్కువగా కులవ్యవస్థ నుంచి ఉద్భవించినవే. కాబట్టి వాటిని రూపుమాపడానికి పై చర్యలు దోహదపడ్డాయి.
-నిబంధన 24: 14 ఏండ్లలోపు పిల్లలతో ఫ్యాక్టరీల్లో పనిచేయించరాదు.
-బాలకార్మిక వ్యవస్థ ఎక్కువగా బడుగు, బలహీన వర్గాల కులాలకు సంబంధించిన సమస్య. గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో విద్యకు దూరమై బాలకార్మికులుగా మారుతున్న సమస్యను నిరోధించడానికి ఈ అధికరణ తోడ్పడుతుంది. దీనికి కార్యరూపం ఇస్తూ ప్రభుత్వం కింది చట్టాలను చేసింది.
1) ది చైల్డ్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్- 1986
కులంపై సంస్కృతీకరణ ప్రభావం
-సామాజిక పరివర్తన అంటే సమాజంలోని విలువలు, సంప్రదాయాలు, ఆర్థిక విధానాలు ఇలా మొదలైన సామాజిక అంశాల్లో వచ్చే పరివర్తననే సామాజిక మార్పు అంటారు. ఈ విషయాన్ని సోషల్ చేంజ్ ఇన్ మోడరన్ ఇండియా అనే గ్రంథంలో ఎంఎన్ శ్రీనివాస్ వివరించారు. ఈయనను ఫాదర్ ఆఫ్ సోషల్ చేంజ్ ఇన్ ఇండియా అని పిలుస్తారు.
-సామాజిక పరివర్తన ప్రభావం కులంపై ఏవిధంగా పడిందో శ్రీనివాస్ కింది భావనల ద్వారా వివరించారు. అవి.. 1) సంస్కృతీకరణ, 2) పాశ్చాత్యీకరణ, 3) ఆధునీకరణ
-సంస్కృతీకరణ: ఈ భావనను ఎంఎన్ శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. సంస్కృతీకరణ అంటే నిమ్నకులాలుగా భావిస్తున్నవారు సమాజంలో ఉన్నతమైన హోదాను పొందేందుకు సమూహంగా ఉన్న కులాలకు సంబంధించిన సంప్రదాయాలు, సంస్కారాలు, నమ్మకాలను పాటిస్తూ సాంస్కృతికంగా గతిశీలత చెందే ప్రక్రియ. ఈ ప్రక్రియ సంప్రదాయ కులవ్యవస్థ ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు మొదలైన విషయాల్లో పరివర్తనను తీసుకువచ్చింది. ఉదా: కర్ణాటకలోని కూర్గ్లు బ్రాహ్మణులను అనుసరించారు. దీన్నే ఎంఎన్ శ్రీనివాస్ బ్రాహ్మనైజేషన్ అని పేర్కొన్నాడు.
-సంస్కృతీకరణలో భాగంగా బ్రాహ్మణులను మాత్రమే అనుకరించకుండా స్థానికంగా ప్రాబల్యస్థాయి ఉన్న కులాలను అనుసరించారు (వీటినే ప్రాబల్య కులం అని శ్రీనివాస్ పేర్కొన్నాడు).
-ప్రాబల్య కులాలు అంటే స్థానికంగా ఆర్థికంగా, సామాజికంగా, అధికారపరంగా, సంఖ్యాపరంగా ప్రాబల్యం, ఉన్న కుల సమూహం.
-భారత సమాజంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ కులాలు ప్రాబల్య కులాలుగా చెలామణి అవుతున్నందున ఆయా ప్రాంతాల్లోని నిమ్నవర్గాలు వారిని అనుసరించే విధానాన్ని బట్టి శ్రీనివాస్ సంస్కృతీకరణను కింది విధంగా విశదీకరించారు.
సంస్కృతీకరణ నమూనాలు
1) పురోహిత నమూనా లేదా బ్రాహ్మణ నమూనా
2) క్షత్రియ నమూనా
3) వైశ్య నమూనా
4) శూద్ర నమూనా
-బ్రాహ్మణుల జీవన విధాన సరళిని అనుసరించడం బ్రాహ్మణ నమూనా. అలాగే క్షత్రియ, వైశ్య, శూద్ర నమూనాల్లో సంస్కృతీకరణ జరగుతుంది.
ఉదా: 1) బ్రాహ్మణ నమూనా-> విశ్వబ్రాహ్మణులు, లింగాయత్‌లు 2) క్షత్రియ నమూనా -> మరాఠీలు (గుల్జార్‌లు), కాయస్థులు (బెంగాల్)
3) వైశ్య నమూనా-> వ్యాపారం చేయడం ద్వారా ఒడిశా తేలీలు, గుజరాతీ కనీంబీలు అనుసరిస్తున్నారు.
4) శూద్ర నమూనా-> అంటరానివారు అని లాంఛనంగా అవలంబిస్తున్నారని శ్రీనివాస్ అభిప్రాయం.
-ఇలా సంస్కృతీకరణకు దోహదపడిన అంశాలు 1) పారిశ్రామీకరణ 2) విద్యాస్థాయి 3) వృత్తిపరమైన మార్పులు 4) ప్రసార మాధ్యమాలు 5) ఆధునిక సాంకేతికత 6) నగరీకరణ 7) ఆధునిక ప్రభుత్వం 8) సార్వజనీక ఓటుహక్కు 9) స్ట్రాంగ్ డెస్రో ఆఫ్ కల్చరల్ మొబిలిటీ, ఇతర స్థానిక పరిస్థితులు.
ఆధునీకరణ
-ఈ పదం లాటిన్ పదం అయిన మోడో నుంచి ఉద్భవించింది. దీనికి అర్థం ప్రస్తుతం.
-రుట్వో, వార్డ్లు ఆధునీకరణ అంటే ఆధునిక పరిజ్ఞానాన్ని మానవ కార్యకలాపాలకు అన్వయించడంగా తెలిపారు.
-శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధి, వ్యవసాయరంగ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, ఆధునిక పరిశ్రమలు, సమాచార ప్రసార రంగ వృద్ధి, నగరీకరణ వంటి అంశాల అన్వయాన్నే ఆధునీకరణగా భావిస్తున్నాం.
-ఈ ఆధునీకరణవల్ల విద్య, వృత్తులు, ఉపాధి, విదేశీయానం, వస్తు సంస్కృతి, ఆర్థికపరమైన అంశాలు, నైపుణ్యాలు వంటి అంశాలకు సమాజంలో ప్రాముఖ్యం రావడం కులవ్యవస్థపై రుణాత్మక ప్రభావం చూపింది.
-పై అంశాలతో పాటుగా ప్రపంచీకరణ, సరళీకరణ వంటి అంశాలు కులవ్యవస్థపై ప్రభావాన్ని చూపాయి. అయినా కులతత్వం సమాజంలో ఇంకా ప్రబలడానికి వివిధ కారణాలున్నాయి. అవి.. 1) సంకుచిత రాజకీయాలు 2) కులసంఘాలు 3) ప్రాబల్య కులాలు 4) ఓటు బ్యాంకు రాజకీయాలు 5) ఎంత అభివృద్ధి చెందినా సమాజం దృక్పథంలో మార్పు రాకపోవడం.
పాశ్చాత్యీకరణ ప్రభావం
-ఈ భావన భారత సమాజంలోని సామాజిక-సాంస్కృతిక పరివర్తనను అర్థం చేసుకునే క్రమంలో ఉద్భవించింది. అలాగే కుల వ్యవస్థపై దాని ప్రభావాన్ని కలిగి ఉంది.
-ఎంఎన్ శ్రీనివాస్ అభిప్రాయంలో పాశ్చాత్యీకరణ అంటే పాశ్చాత్య దేశాల సమాజం ప్రభావం ఇతర దేశాలపై ఎలా పడిందో తెలుపుతుంది. బ్రిటిష్ పరిపాలనా ప్రభావం భారత సామాజిక వ్యవస్థపై ఎలా ఉందో తెలిపే భావన.
-సాధారణ పరిభాషలో చెప్పాలంటే పశ్చిమ దేశాలు, బ్రిటిష్‌వారితో దీర్ఘకాల సంబంధాలవల్ల భారత సమాజం, సంస్కృతిలో వచ్చినటువంటి పరివర్తన.
-ఇలా పాశ్చాత్యీకరణ అనే ప్రక్రియ సుదీర్ఘకాలం పాటు పాశ్చాత్య దేశాల్లో సంపర్కంవల్ల భారతీయ సామాజిక వ్యవస్థలో మార్పులను తీసుకువచ్చింది. అదేక్రమంలో కులవ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. అందులోని ముఖ్యాంశాలు..
-జాతీయతాభావం, హేతుకీకరణ, సమానత్వం, ప్రజాస్వామ్యం, సమన్యాయం, స్వేచ్ఛ వంటి భావాలవల్ల కులవ్యవస్థలోని దుర్గుణాలను పరిశీలించారు.
-పత్రికలు, సమాచార ప్రసార సాధనాలు, రవాణా వ్యవస్థ అభివృద్ధివల్ల భావజాల వ్యాప్తి, నూతన విలువలు, ఆధునిక విలువల ఆచరణ ప్రారంభమైంది.
-సంస్కృతీకరణ అనేది ఒక అనుకరణ కాగా, పాశ్చాత్యీకరణ అనేది పైన తెలిపిన భావజాల వ్యాప్తి కారణంగా వాస్తవ గతిశీలతను పొందడానికి నిమ్నకులాలకు వేదికగా నిలిచింది.
-పాశ్చాత్యీకరణవల్ల వచ్చిన పారిశ్రామీకరణవల్ల నూతన వృత్తులు, వివిధ కులాలవారు కలిసి పనిచేయడం, సంప్రదాయ వృత్తుల స్థానంలో నైపుణ్యం, భద్రతా సంబంధంగల వృత్తి ఏర్పడటంవల్ల కులం, కులవ్యవస్థల ప్రాబల్యం తగ్గి అందరూ సమానమనే భావన ఏర్పడింది. ఫలితంగా కులాల స్థానంలో యజమానులు, కార్మికులు అనే వర్గాలు ఏర్పడినాయి.
-పట్టణీకరణవల్ల ప్రజలందరూ కుల రహితంగా సమూహ ఆవాసాల్లో నివసించడం, కులానికి సంబంధించిన వర్గాలు లేకపోవడం జరిగింది.
-ప్రయాణసాధనాలు మెరుగుపడటంవల్ల కూడా ప్రయాణించడం లాంటివి జరిగాయి.
-విద్యావిషయంలో మార్పులు, ఆధునిక విద్య, ఆంగ్లవిద్యతో నూతన భావాలు ప్రజల్లోకి వెళ్లి వారిని ప్రభావితం చేశాయి.
-ఆహార అలవాట్లు, వేషధారణ వంటి విషయాల్లో ఏకరూపత సంభంవించింది (వివిధ కులాలకు సంబంధించిన వ్యక్తులందరూ ఒకే రకమైన వేషధారణ పాటించడం).
-ఇలా ఈ ప్రక్రియ అంటరానితనాన్ని కొంతవరకు దూరం చేసి ప్రజలందరూ ఒక దగ్గర పనిచేసే సంప్రదాయ భిన్నరూపాన్ని పరిచయం చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు