మహాత్మాగాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలివి..!
మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ గుజరాత్‌లోని పోరుబందర్లో 1869, అక్టోబర్ 2న జన్మించారు. పాఠశాల విద్యను రాజ్‌కోట్ సమీపంలో అభ్యసించారు. ఆ ప్రాంత స్థానిక పాలకుడి దగ్గర గాంధీ తండ్రి దివాన్‌గా పనిచేశారు. పాఠశాల విద్య ముగియక ముందే ఆయన తండ్రి మృతిచెందారు. 13 ఏండ్ల్ల వయస్సులో తన కంటే చాలా చిన్న వయస్కురాలైన కస్తూర్బాను గాంధీ వివాహం చేసుకున్నారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ కోసం 1888లో ఇంగ్లండ్ వెళ్లారు. తన ప్రయాణానికి ముందు స్త్రీ, మద్యానికి దూరంగా ఉంటానని తల్లికి ప్రతిజ్ఞ చేశాడు. న్యాయశాస్త్ర డిగ్రీని పూర్తిచేసి 1891 చివరలో గాంధీ భారతదేశానికి పయనమయ్యారు.
దక్షిణాఫ్రికా అనుభవం
దాదా అబ్దుల్లా అనే గుజరాతీ వ్యాపారి న్యాయపరమైన వివాదాన్ని పరిష్కరించడానికి ఏడాది కాంట్రాక్టు మీద గాంధీ 1893లో డర్బన్‌లో అడుగుపెట్టాడు. దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన తొలి భారతీయ బారిష్టర్ గాంధీనే. అక్కడ విద్యాధికుడైన భారతీయుడు కూడా ఆయనే.
1890ల్లో భారతదేశం నుంచి దక్షిణాఫ్రికాకు వలస ప్రారంభమైంది. అక్కడే స్థిరపడ్డ కొందరు, వారి చెరుకు తోటల్లో పనిచేయడానికి భారతీయ కార్మికులను, ప్రధానంగా దక్షిణ భారతీయులను నియమించుకోవడంతో ఈ వలస మొదలైంది. వారితోపాటు భారతీయ వ్యాపారులు, ముఖ్యంగా అధిక సంఖ్యలో యెమెన్ ముస్లింలు దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టారు. అయితే, ఈ భారతీయులెవరికీ చదువు రాదు. చదువుకునే అవకాశమూ లేదు. ధనిక వ్యాపారులకు కూడా ఏదో వ్యాపార అవసరాల కోసం నేర్చుకున్న నాలుగు ఇంగ్లిష్ ముక్కలు మినహా భాషాజ్ఞానం లేదు. దక్షిణాఫ్రికా భారతీయుల జీవితాల్లో జాతి వివక్ష అంతర్భాగం. ఈ వివక్షపై వారిలో అసంతృప్తి ఉన్నా దానిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియదు. వారు జాతి వివక్షను సహించి, భరించి దానికి అలవాటు పడిపోయారు.
దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే గాంధీ చవిచూసిన జాత్యాహంకారాన్ని, వివక్షపూరితమైన అవమానాలను ఇటు భారతదేశంలో గానీ, అటు ఇంగ్లండ్‌లో గానీ ఎన్నడూ ఎదుర్కోలేదు. ఈ ఖండంలో అడుగుపెట్టిన వారం రోజుల్లోనే డర్బన్ నుంచి ప్రిటోరియాకు జరిపిన ప్రయాణంలో ఆయన వరుసగా అవమనాలను ఎదుర్కొన్నారు. ఒక శ్వేత జాతీయుడు గాంధీని మొదటితరగతి బోగి నుంచి బయటకు తోసేయడంతో వెయిటింగ్ రూమ్‌లో రాత్రంతా చలికి వణుకుతూ కూర్చున్న సంఘటనతోపాటు మొదటి తరగతి టిక్కెట్ కొనుక్కుని కూడా ఇంజిన్ బోగీలో ప్రయాణించారు. జోహాన్నెస్‌బర్గ్ చేరుకున్న తర్వాత రాత్రి బస చేయడానికి హోటల్ గది కోసం ఆయన ఇబ్బందులు పడ్డారు. తాను గది అడిగిన తక్షణమే జాత్యాహంకార దృష్ట్యా గదులు ఖాళీ లేవన్న సమాధానం గాంధీని నిర్ఘాంతపరిచింది.
ప్రిటోరియాకు చేరుకున్న వెంటనే గాంధీ అక్కడి భారతీయులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంగ్లిష్ నేర్చుకోదలచుకున్న వారెవరికైనా తాను నేర్పుతానని ప్రకటించారు. భారతీయులు తమను తాము సంఘటిత పరుచుకుని అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సూచించి, తన నిరసనను పత్రికల ద్వారా కూడా వ్యక్తపరిచారు. జరుగుతున్న అన్యాయాలపై తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తంచేస్తూ నేషనల్ అడ్వయిజర్‌కు రాసిన ఉత్తరంలో క్రైస్తవం దీన్ని అంగీకరిస్తుందా.. ఇది న్యాయమైన విధానమేనా.. అసలది నాగరికతేనా?.. జవాబు కోసం ఎదురు చూస్తున్నాను అన్నారాయన. దక్షిణాఫ్రికాలోనే ఉండిపోవాలన్న ఉద్దేశం ఆయనకు అప్పటికి లేకపోయినప్పటికి, ప్రిటోరియాలోని భారతీయులకు ఆత్మగౌరవాన్ని గుర్తుచేసి, జాతివివక్షకు సంబంధించి అన్నిరకాల దురాగతాలను ఎదుర్కోవాల్సిందిగా ప్రోత్సహించారు.
గుజరాతీ వ్యాపారి వ్యాజ్యం పరిష్కరించిన తర్వాత గాంధీ భారతదేశానికి వెళ్లిపోవాలని సంకల్పించారు. అయితే, డర్బన్ నుంచి భారత్‌కు బయలుదేరుతున్న సమయంలో భారతీయుల పౌరసత్వాన్ని రద్దు చేయడానికి ఉద్దేశించిన ఒక బిల్లుపై గాంధీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ బిల్లు చట్టసభకు సంబంధించిన అన్ని వ్యవహారాలు పూర్తి చేసుకుని ఆమోదానికి సిద్ధంగా ఉన్న దశ అది.
దక్షిణాఫ్రికాలోని భారతీయులు గాంధీని కలిసి ప్రయాణం వాయిదా వేసుకోమని కోరారు. కనీసం నెలపాటు ఉండి ఈ బిల్లుపై నిరసన తెలియజేయడంలో తమకు సహకరించమని ప్రాధేయపడ్డారు. కనీసం పిటిషన్లు రాయడానికి కూడా తగిన ఇంగ్లిషు పరిజ్ఞానం లేని కారణంగానూ తమను తాము సంఘటిత పరుచుకొని తమ వ్యతిరేకతను వ్యక్తం చేయలేని అశక్తత కారణంగానూ గాంధీ సహకారం అవసరమని వారు వివరించారు. నెల రోజులపాటు దక్షిణాఫ్రికాలో ఉండటానికి అంగీకరించిన గాంధీ అనుకోకుండా 20 ఏండ్లపాటు అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పటికి ఆయన వయస్సు 25.
దక్షిణాఫ్రికాలో గాంధీ మితవాద రాజకీయాలు
1894 నుంచి 1906 వరకు గాంధీ సాగించిన రాజకీయ కార్యకలాపాలను దక్షిణాఫ్రికాలోని భారతీయుల కోసం ఆయన జరిపిన పోరాటంలోని మితవాద దశగా చెప్పుకోవచ్చు.
ఈ దశలో ఆయన ప్రధానంగా దక్షిణాఫ్రికా చట్టసభలకు లండన్‌లోని వలస విభాగం అధిపతికి, బ్రిటిష్ పార్లమెంట్‌కు అర్జీలు సమర్పించడంపైన దృష్టి కేంద్రీకరించారు. అన్ని వర్గాలకు చెందిన భారతీయులను సంఘటితం చేయడం, వారి డిమాండ్లకు ప్రాచుర్యం కల్పించడం గాంధీ లక్ష్యంగా పెట్టుకున్నారు. నటాల్ ఇండియన్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, ఇండియన్ ఒపీనియన్ పత్రికను ప్రారంభించడం ద్వారా ఈ లక్ష్య సాధనకు ఆయన కృషి చేశారు. ఉద్యమాన్ని నిర్మించడంలోనూ నిధులు సేకరించడంలోనూ పాత్రికేయుడిగా వ్యవహరించడంలోనూ, గాంధీకి ఉన్న శక్తిసామర్థ్యాలు బహిర్గతమయ్యాయి. కానీ, 1906 నాటికి గాంధీ ఈ మితవాద పోరాట ధోరణితో బాగా అలసిపోయారు. ఈ విధానాలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని ఆయనకు పూర్తిగా అర్థమైపోయింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు