సమన్వయ లోపం- ఆర్థిక రంగానికి పెనుముప్పు
ప్రపంచంలో ప్రగతిపథంలో ఉన్న ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా బలమైన కేంద్ర బ్యాంకు ఉంటుంది. సమకాలీన ప్రపంచంలో సైనికవ్యవస్థ కంటే కూడా స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలే ప్రపంచంలో అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. వాటికే విలువ దక్కుతుంది.
– ప్రపంచంలో అత్యంత బలీయమైన కేంద్ర బ్యాంకుగా అమెరికా ఫెడరల్ బ్యాంకు పేరుగాంచింది. ఇది ప్రపంచ మార్కెట్లను ఏ విధంగా శాసిస్తుందో మనం గమనిస్తూనే ఉన్నాం. సమకాలీన ప్రపంచంలో కేంద్ర బ్యాంకుల పాత్ర చాలా పెరిగిపోయింది. ఏ దేశ ఆర్థికవ్యవస్థ పటిష్టత అయినా ఆ దేశ కేంద్ర బ్యాంకు అవలంబించే స్థిరమైన ద్రవ్య విధానాన్ని పాటించడంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేంద్ర బ్యాంకు, దాని పాత్ర, కేంద్ర ప్రభుత్వంతో ఉండవలసిన సహకారం, అవగాహన గురించి ప్రస్తుత సమకాలీన పరిణామంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
రిజర్వ్ బ్యాంకు కేంద్ర ప్రభుత్వ ఘర్షణ
– కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లు పరస్పరం బాహాటంగా విమర్శనాస్ర్తాలు సంధించుకునే అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్బీఐ తన చేతుల్లో ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుండగా, తన స్వయం ప్రతిపత్తికి భంగం కలగకుండా ఆర్బీఐ నిర్ణయాలు తీసుకోవడంతో ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ప్రభుత్వం, ఆర్బీఐల మధ్య అంతర్గత విభేదాలు, కొంత అసమ్మతి ఉండటం అసాధారణం కానప్పటికీ అవి పదేపదే వివాదాల సుడిలో చిక్కుకోవడం దురదృష్టకరం. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల నియంత్రణాధికారాలపై ఇటీవల ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. అంతర్జాతీయంగా అత్యం త ప్రతిష్ఠాత్మక కేంద్ర బ్యాంకుల్లో ఒకటైన ఆర్బీఐ వ్వవహారాల్లో మోదీ ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ దాని అధికారాలను మరింత కుదించి ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకింగ్ రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నందువల్ల పీఎస్‌బీలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు ఉండాలని గత జూన్‌లో పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొనడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. అదనపు అధికారాలు ఇవ్వడానికి అభ్యంతరాలు లేవంటూనే ఉన్నప్పటికి కత్తెర వేసే ప్రయత్నాలు ప్రారంభించింది.
అసాధారణ చర్య.. సెక్షన్-7
– వృద్ధికి ఊతమిచ్చే దిశలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటే, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చే లక్ష్యంతో వడ్డీరేట్ల తగ్గింపునకు ఆర్బీఐ విముఖత చూపడం సర్వసాధారణం. అభివృద్ధిని కోరుకోవడం ప్రభుత్వ ప్రాధాన్యత కానీ అభివృద్ధితోపాటు ద్రవ్యోల్బణం కట్టడి, స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్వహించడం ఆర్బీఐ ప్రాథమిక విధి. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రభుత్వం ఒకటి ఆశిస్తే ఆర్బీఐ తనదైన శైలిలో అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వాలకు మింగుడుపడని అంశం. ప్రభుత్వం ఆర్థిక అంశాలకు రాజకీయ కోణాన్ని జోడించి వడ్డీ రేట్లు తగ్గింపుకోసం ఆర్బీఐపై ఒత్తిడి తేవడం, దానికి లొంగకుండా ఆర్బీఐ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ప్రభుత్వం రిజర్వు బ్యాంకు చట్టం సెక్షన్-7 కింద తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఆర్బీఐకి తాఖీదులు జారీ చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సెక్షన్-7 ప్రయోగిస్తే ఆర్బీఐ గవర్నర్‌కు ఉన్న అధికారాలు నిర్వీర్యమై రిజర్వు బ్యాంకు ప్రభుత్వం చెప్పుచేతుల్లోకి వస్తుంది. కేంద్ర బ్యాంకు గవర్నర్‌కు ప్రభుత్వం నేరుగా ఆదేశాలు జారీచేసి తమకు కావాల్సిన విధంగా ఆర్థిక వ్యవహారాలను బ్యాంకింగ్ విధానాలను నడిపించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం చెప్పినట్లు ఆర్బీఐ నడుచుకోవాల్సిన అవసరం లేదు. సెక్షన్-7 ప్రయోగిస్తే మాత్రం దేశ కేంద్ర బ్యాంకు దాదాపు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లినట్లే. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ఈ సెక్షన్‌ను ఉపయోగించలేదు.
చల్లారని ఎన్పీఏల సెగ
– మొండి బకాయిలతో వరుస నష్టాలను చవిచూస్తూ ప్రతికూల రిటర్న్ ఆన్ అస్సెట్ (ఆర్ఓఐ) వంటి కారణాలతో ఇప్పటికే 11 దాకా ప్రభుత్వరంగ బ్యాంకులను సత్వర దిద్దుబాటు చర్య (పీసీఏ- ప్రాంప్ట్ కరిక్టమ్ యాక్షన్) జాబితాలో చేర్చడంపై ప్రభుత్వం అసహనంగా ఉంది. పీసీఏ ముద్రపడిన బ్యాంకులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలను నిర్వర్తించలేవు. కొత్త రుణాలివ్వడం, సిబ్బంది నియామకం, పదోన్నతి, శాఖల విస్తరణ వంటివాటిపై రిజర్వు బ్యాంకు ఆంక్షలు కొనసాగుతాయి. అందువల్ల పీసీఏ నిబంధనలను సడలించి ఆ బ్యాంకుల రుణ వితరణ పరిమితిని పెంచాలని ప్రభుత్వం కోరుకుంటుంది. అయితే వాటి నిర్వహణ సామర్థ్యం మెరుగుపడకుండా వాటి రుణ వితరణ ఆంక్షలను సడలించడం ద్వారా ఆ బ్యాంకుల పనితీరు మరింత దిగజారే ప్రమాదం ఉందని, పీసీఏ నిబంధనల సడలింపు అవాంఛనీయం అని ఆర్బీఐ పేర్కొంటుంది.
కొత్త వివాదం డెవిడెండ్ చెల్లింపు
– రిజర్వు బ్యాంకు ప్రతిఏటా ప్రభుత్వానికి చెల్లించే డెవిడెండ్పై కొత్త వివాదం తలెత్తింది. డెవిడెంట్ మొత్తాన్ని మరింత పెంచాలన్న విభేదాలు ఏర్పడ్డాయి. 2017-18 ఏడాదికి ఆర్బీఐ ప్రభుతానికి డెవిడెండ్ రూపంలో 50వేల కోట్లు అందించింది. అయితే ప్రభుత్వం మరింత పెద్ద మొత్తంలో డెవిడెండ్ రావాలని ఆశిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం ఆర్బీఐ దగ్గర 9 లక్షల కోట్ల మిగులు నిధులు ఉన్నట్లు అంచనా. అయితే అందులో మూడో వంతు నిధులను ప్రభుత్వం తన ఆర్థిక లోటు పూడ్చుకోవడానికి వినియోగిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే తమకు మిగులు నిధులు అవసరమని నిబంధనల మేరకే డెవిడెండ్లు చెల్లిస్తామని ఆర్బీఐ తేల్చిచెప్పింది.
సమస్యల సుడిగుండంలో ఆర్థికవ్యవస్థ
– దేశీయంగా అంతర్జాతీయంగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఆర్థిక పరమైన ప్రతికూలతలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఇప్పటిదాకా బ్యాంకింగ్ రంగ సంక్షోభం, పీఎస్‌బీల మొండి బకాయిల సమస్య, బ్యాంకుల్లో చోటు చేసుకుంటున్న భారీ కుంభకోణాలతో అట్టుడికిన దేశ ఆర్థిక రంగంపై ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రూపంలో మరో సంక్షోభం వచ్చిపడింది. ఈ సంస్థ ఆర్థికపరమైన సమస్యలో పడటంతో దీని ప్రభావం దేశంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపైపడింది. ఎన్బీఎఫ్సీలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలవల్ల ముడి చమురు ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించడం వంటి సమస్యలు ప్రస్తుత సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. వీటి ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.
సమన్వయం- తక్షణ అవసరం
– ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పినట్లు ప్రభుత్వానికి రిజర్వు బ్యాంకు సీటు బెల్టువంటిది. అది లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆర్బీఐకి ఉన్న సంస్థాగత స్వయంప్రతిపత్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది. 2008 నాటి ప్రపంచ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆర్బీఐని మరో ప్రభుత్వ కార్యాలయంగా మారకుండా చూసుకోవాలి. ఆర్థిక సంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూ వాటి నియంత్రణ యంత్రాంగాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల పర్యవేక్షణను మరింత పకడ్బందీగా నిర్వహించి గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా ఆర్బీఐ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పర్యవేక్షణ విధానంలో అవసరమైన మార్పులు చేసి సమస్యకు ముగింపు పలకాలి. కేంద్రం, రిజర్వ్‌బ్యాంకుల మధ్య సామరస్య పూర్వక సహకారాత్మక సమాలోచనలు పంచుకునే స్వేచ్ఛా వాతావరణం నెలకొనడం దేశ ఆర్థిక వ్యవస్థకు తక్షణ అవసరం.
సెక్షన్-7 దుష్పరిణామాలు
– ప్రభుత్వం వాస్తవంగా సెక్షన్-7 కింద అధికారాలను ఉపయోగిస్తే రిజర్వ్ బ్యాంకు చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం అవుతుంది. దీనివల్ల ప్రభుత్వం అప్రతిష్ట పాలవడంతో పాటు అంతర్జాతీయంగా ఆర్బీఐ ప్రతిష్ట పడిపోతుంది. ప్రభుత్వం, ఆర్బీఐల మధ్య సంబంధాలు సెక్షన్-7ను ఉపయోగించే స్థాయికి దిగజారాయంటే దేశ ఆర్థికవ్యవస్థ పటిష్టతకు భంగం వాటిల్లినట్లే.
పేమెంట్స్-రెగ్యులేటరీ బోర్డ్
– చెల్లింపుల పరిష్కార వ్యవస్థ (పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్) చట్టానికి కొన్ని సవరణలు చేసి ప్రత్యేకమైన చెల్లింపుల నియంత్రణమండలి (పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్)ని స్థాపించాలని కేంద్రం ప్రయత్నించడం మరో విపరీత పరిణామం. ప్రస్తుతం చెల్లింపులు-పరిష్కారాల కార్యకలాపాల నియంత్రిత అధికారాలు ఆర్బీఐ వద్ద ఉన్నాయి. చెల్లింపుల విధానం ఆర్బీఐ ఆధీనంలో ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా సాగుతున్నది. వాటిని వేరేవారికి అప్పజెప్పి నియంత్రణ అధికారాలు ఆర్బీఐ దగ్గరి నుంచి తీసుకోవడం కేంద్ర బ్యాంకు అధికారాలకు కోత పెట్టడమే అవుతుంది. అయితే ఆర్బీఐ కోరుతున్నట్టుగా పేమెంట్ బోర్డ్ పర్యవేక్షణ అధికారాలు ఇవ్వడం సబబుగా ఉంటుంది. గతంలో డిజిటల్ చెల్లింపుల విధానంపై ప్రభుత్వం నియమించిన రతన్ వతల్ కమిటీకూడా చెల్లింపు నియంత్రణమండలి రిజర్వ్ బ్యాంకు ఆధీనంలో ఉండాలని సిఫారసు చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు