భారతదేశ ఎన్నికలు-సంస్కరణలు

సార్వత్రిక ఎన్నికలముందు జరుగుతున్న వివిధ రాష్ర్టాల శాసనసభల ఎన్నికలు దేశంలో ఎన్నికల కోలాహలాన్ని తెచ్చిపెట్టాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రజాస్వామ్య దేశంలో క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించడమనేది ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ తరుణంలో ఎన్నికలు, వాటి ప్రాధాన్యం, ఎన్నికల సంస్కరణల స్థితిగతుల గురించి చర్చించడం అవసరం.
– ప్రజాస్వామ్యయుత పాలనకు సమయానికి జరిగే ఎన్నికలే ప్రతీకలు. పాలించే ప్రభుత్వాలపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలు, నమ్మకాలు, ప్రజలు పాటించే విలువలన్నీ ఎన్నికల ద్వారా తెలుస్తాయి. తమను ఎవరు పరిపాలించాలో ప్రజలు ఎన్నికల ద్వారా నిర్ణయిస్తారు. ప్రజాభిప్రాయం ప్రకారమే ఎన్నికైన ప్రభుత్వం ప్రజలను పాలిస్తుంది.
– పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలే కొలమానం. తమ ఆకాంక్షలను నెరవేర్చని ప్రభుత్వాలను ఓడించే హక్కు రాజ్యాంగం భారత ప్రజలకు కల్పించింది. ఇలాంటి గొప్ప బాధ్యతలను, అధికారాలను కట్టబెట్టే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జాతి, కుల, మత భేదం లేకుండా ధన, కండ బలం ప్రజలపై ప్రభావం చూపకుండా పూర్తి స్వేచ్ఛావాతావరణంలో ఎన్నికలు జరిగి ప్రజలు తమ ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించే అవకాశం కల్పించడం తక్షణ కర్తవ్యం.
– ఎన్నో ప్రాంతాలు, కులాలు, మతాలు మరెన్నో భాషాంతరాలున్న దేశంలో ఎన్నికల నిర్వహణ నిజంగా కత్తిమీద సాము లాంటిదే. అయితే ఇన్ని అవాంతరాల మధ్య కూడా విజయవంతంగా గత 70 ఏండ్లుగా ఎన్నికలు నిర్వహిస్తుండటం మన రాజ్యాంగం, ఎన్నికల కమిషన్ గొప్పతనం. మరీ ముఖ్యంగా మన ప్రజాస్వామ్యం గొప్పతనం.
– ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానంలో విడదీయలేని ఒక ముఖ్యమైన అంతర్భాగం. రాజకీయాలకు నిజమైన అధికారం ఇచ్చేది ఎన్నికలు మాత్రమే. రాజ్యాంగబద్ధంగా నిజమైన స్ఫూర్తితో ఎన్నికలు జరిగినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధించగలదు. ఎన్నికల్లో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రిగ్గింగ్ లాంటి దుర్ఘటనలు జరిగితే ప్రజాస్వామ్యం నిజంగా ప్రమాదంలో పడినట్టే.
– 1952-62 వరకు జరిగిన ఎన్నికల్లో అవినీతి తరహా సంఘటనలు దాదాపు లేవు. అవి చాలా స్వేచ్ఛగా జరిగిన ఎన్నికలు. కాలం గడుస్తున్న కొద్ది విలువల్లో క్షీణత మొదలైంది. దీంతోపాటే అవినీతి పెరిగిపోయింది. ప్రజల నుంచి రావాల్సిన నాయకుడు నేడు పార్టీల నుంచి వస్తున్నాడు. ముక్కు సూటిగా, నిజాయితీగా, నిస్వార్ధంగా, ప్రజాసేవే ధ్యేయంగా నాయకుడు ఉన్నప్పుడు పార్టీలకతీతంగా వారికి ఓట్లు పడేవి. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి నిక్కచ్చి మనిషి నాయకుడిగా ఎదగడం చాలా కష్టం.
– రాజకీయాలు చాలావరకు నేరమయం అయ్యాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో దాదాపు 30 శాతం మందిపై నేరారోపణలు ఉన్నట్లు ఏడీఆర్ అనే సంస్థ తన నివేదికలో తెలిపింది. ఇలాంటి తరుణంలో మన ఎన్నికల సరళిలో సమూల సంస్కరణలు చేయాల్సి ఉంది. అయితే దీనికోసం వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుని కాలానుగుణంగా ఎన్నికల కమిషన్, లా కమిషన్, వివిధ స్వచ్ఛంద సంస్థలు నివేదికలు తయారు చేస్తున్నాయి. కానీ ఇవి అమలుకు నోచుకోవడంలేదు.
ఎన్నికల సంస్కరణల్లో సవాళ్లు
-పరిష్కారాలు నేరమయ రాజకీయాలు
– రాజ్యాంగం ప్రజలకు రాజకీయ న్యాయాన్ని ప్రసాదించిం ది. అలాంటి రాజకీయాల్లోకి నేరస్తులు అడుగుపెడితే వారి కి రాజకీయ న్యాయమే కాదు మరే విధమైన సాంఘిక, ఆర్థిక న్యాయం జరగదు. గత కొన్నేండ్లుగా రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య పెరుగిపోతూ వస్తున్నది. ఇది చాలా ప్రమాదకరం.
– కాబట్టి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నేరచరిత్రను దాచిపెట్టేందుకు అవకాశం ఇవ్వకూడదు. ఎలక్షన్ కమిషన్‌కి ఇచ్చేముందే తమ పార్టీ దాన్ని తప్పకుండా పరిశీలించి, మంచి అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలి. దీంతోపాటే తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్న అభ్యర్థులను నిషేధించాలని ఎన్నికల కమిషన్ కూడా కోరుకుంటున్నది. దీన్ని పరిపాలనా సంస్కరణల కమిషన్ కూడా సమర్ధించింది.
పెరిగిపోయిన ధన ప్రవాహం
– ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగింది. గెలిచిన అభ్యర్థి, ఓడిన అభ్యర్థి ఎవరైనా డబ్బు అధికంగా ఖర్చుపెట్టనిదే ఎన్నికల్లో పోటీపడటం చాలా కష్టం. ఎన్నికల కమిషన్ విధించిన పరిమితి చాలా తక్కువగా ఉన్నది. అయితే అభ్యర్థులు అందులో 45% ఖర్చయినట్లు చూపిస్తున్నారు.
– విపరీతమైన ధన ప్రవాహంవల్ల చాలా సమయాల్లో నేరపూరిత మార్గాల్లో వచ్చిన డబ్బును ఎన్నికల సమయంలో ఉపయోగిస్తున్నారు. డబ్బు ఎంత ఎక్కువగా ఖర్చుచేస్తే అంత అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది. లంచాలు పెరగడం సహజమవుతుంది. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన డబ్బును తరువాత వేరే రూపంలో పొందుతున్నారు. ఇది క్విడ్-ప్రో-కోకి దారితీస్తుంది. కాబట్టి ఎన్నికల్లో ధన ప్రవాహమే తరువాత అవినీతికి పునాది.
– దీనికి విరుగుడుగా ఎన్నికల ఖర్చుపై పరిమితులను సడలించాలి. అభ్యర్థుల ఖర్చులను ఎన్నికల కమిషన్ భరించే ఆలోచన చేయాలి. అంతేకాకుండా గట్టి నిఘాను ఏర్పాటుచేసి ఎన్నికల ఖర్చులను మానిటర్ చేయాలి.
– పార్టీలకు విరాళాలను చెక్కుల రూపంలోనే ఇవ్వాలి.
– రాజకీయ పార్టీలు సమాచార హక్కు పరిధిలోకి రావాలి.
కుల, మతాల పేరుతో రాజకీయాలు
– మతాలు, కులాలు, తెగలు, సామాజిక వర్గం పేరుతో ఓట్లు అడగడం ప్రజాప్రాతినిథ్య చట్టం-1951 ప్రకారం నేరం. దీనికి మరింత పదునుపెట్టి ఇలాంటి అవకాశం ఏ రాజకీ య పార్టీ పొందకుండా చూడాలి. విభిన్న మతాలు, కులా లు, తెగల సమ్మిళితమైన మన దేశం వాటి ఆధారంగా విడిపోయి ఓటు రాజకీయాలు చేసే అవకాశం ఇవ్వకూడదు.
కొత్త పార్టీల నియంత్రణ
– ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజల అభిప్రాయాలు గట్టిగా వినబడాలి. అదే తరుణంలో ఎవరి అభిప్రాయాలను కూడా అణగదొక్కకూడదు. ఎన్నో పార్టీలు పోటీ పడటంతో తక్కువ మంది ఓటు వేసినప్పటికీ స్వల్ప మెజారిటీతో అభ్యర్థి విజయం సాధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి జాతీయ, రాష్ట్ర స్థాయిలో కొన్ని పార్టీలు మాత్రమే ఉండాల్సిన అవసరం ఉంది.
సరికొత్త ఆయుధం నోటా
– ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకునే అవకాశమివ్వాలి. అయితే తమకు నచ్చని సందర్భంలో ప్రజలు నోటా అనే బటన్ని ఎంపికచేసుకోవచ్చు. ఇది ప్రజల అభిప్రాయానికి ఒక ప్రతీకగా నిలుస్తుంది. అయితే మన ఎన్నికల విధానంలో ఎవరు ఎక్కువ ఓట్లు పొందితే వారే గెలిచే అవకాశం ఉండటంతో దీని ప్రయోజనం అంతగా నెరవేరదు. దీంతో ప్రజల నిజమైన అభిప్రాయాలను అక్కడి పార్టీలు గ్రహించే వీలుంది.
– సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులు, భారత ఎన్నికల సంఘం చేస్తున్న కృషి తర్వాత కూడా ఇప్పటికీ మన ఎన్నికల వ్యవస్థ లోపరహితంగా తయారు కాలేదు. ఇన్నిరకాల రుగ్మతల నుంచి బయడపడాలంటే ఎన్నికల సంఘానికి మరిన్ని అధికారాలు ఇవ్వాలి.
– నేరపూరిత రాజకీయ నాయకులు, పార్టీలను శిక్షించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలి. ఆర్థికపరమైన విషయంలో రాజకీయ పార్టీలు పారదర్శకత పాటించేలా చర్యలు తీసుకోవాలి. స్వేచ్ఛా పూరిత వాతావరణంలో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాదిలాంటివి. ఎన్నికల పవిత్రతను కాపాడాలంటే ఎన్నికలు ఎలాంటి ప్రలోబాలకు గురికాకుండా జరగడం చాలా ముఖ్యం. రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాలన చేయకపోతే భారత ప్రజాస్వామ్యానికి, దేశ సమగ్రతకు భగం కలిగే అవకాశం ఉంది.
2014 ఎన్నికల ముఖచిత్రం
– గత ఎన్నికల గణాంకాల ప్రకారం దాదాపు 23 మిలియన్ల కొత్త ఓటర్లు 2014 ఎన్నికల్లో నమోదయ్యారు. 8251 మంది లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడ్డారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 9 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు.
– 66.38 శాతం ఓటింగ్‌తో ఇప్పటివరకు ఎన్నడూ రానంతమంది ఓటింగ్‌లో పాల్గొని రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల కోసం రూ. 3,426 కోట్లు ఖర్చుచేశారు. మొత్తం 81.45 కోట్ల మంది ఓటర్లలో 55.1 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దేశంలో మొత్తం 9,30,000 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు.
– 2014, మే 12న జరిగిన ఎన్నికల్లో మొత్తం 10 మిలియన్ల అధికార యంత్రాంగం పాల్గొన్నది. ఈ సంఖ్య ఎన్నో దేశాల దేశ జనాభా కంటే ఎక్కువ.
రాజకీయ సంస్కరణలు
– రాజకీయంగా కూడా చాలా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో ఉండే పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామం తప్పనిసరి. ఇది గ్రామస్థాయి నుంచి మొదలవ్వాలి.
– రాజకీయ పార్టీలు తమను తాము ఎంత చక్కగా నిర్వహించుకుంటాయో అదేవిధంగా ప్రజలను పాలించగలుగుతాయి. ప్రజల నుంచి వచ్చిన నాయకులకు సీట్లు ఇవ్వాలి. అప్పుడే నిజమైన ప్రజాప్రాతినిధ్యం సాధ్యమవుతుంది. ధన బలం చూసి సీట్లు కేటాయిస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కష్టమవుతుంది.
RELATED ARTICLES
-
Indian Polity | సభ ఆమోదిస్తేనే అత్యవసరం.. లేదంటే రద్దు
-
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
-
General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
-
Biology | First Genetic Material.. Reactive Catalyst
-
Telangana Movement | ‘తెలంగాణ జాగో హైదరాబాద్‌కో బచావో’ సభ నిర్వహించిన పార్టీ?
-
Economy- Groups Special | భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ప్రధాన విధి?
Latest Updates
Groups / DSC Special – Social Studies | స్వయం మట్టి మార్పిడి విధానాన్నిఅనుసరించే నేలలు?
Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
Current Affairs | ఆది మహోత్సవ్ దేనికి సంబంధించింది?
UCEED & CEED 2024 | యూసీడ్ & సీడ్-2024 ఐఐటీలో ప్రవేశాలు !
Geography | ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది?
Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
DSC – Groups Special | తరిగిపోతే తిరిగిరావు.. పొదుపుగా వినియోగిద్దాం
SAT Preparation | SAT… Short and Digital
Group 2,3 Special | మహిళలు, బాలలు, ట్రాన్స్జెండర్ల చట్టాలు
General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం