పారిశ్రామిక విత్తం అంటే తెలుసా..?
పరిశ్రమల స్థాపనకు, నిర్వహణకు అవసరమయ్యే మూలధనాన్నే (పెట్టుబడి) పారిశ్రామిక విత్తం అంటారు. ఇది రెండు రకాలు
1) స్థిర మూలధనం (Fixed Capital)
2) చర మూలధనం (Variable Capital)
స్థిర మూలధనం: పరిశ్రమ స్థాపనకు అవసరమైన భౌతిక వనరుల (భూమి, భవనాలు, యంత్రపరికరాలు)ను సమకూర్చుకోవడానికి అవసరమైన మూలధనాన్నే స్థిర మూలధనం అంటారు.
చర మూలధనం: పరిశ్రమ స్థాపించిన తర్వాత ఉత్పత్తిని కొనసాగించడానికి అవసరమయ్యే వ్యయాన్ని (ముడిసరుకులు, శ్రామికవేతనాలు…., ప్రకటనలు, మార్కెటింగ్ వ్యయం) చరమూలధనం లేదా నిర్వహణ మూలధనం అంటారు.
-పారిశ్రామిక విత్తాన్ని కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక విత్తం అని వర్గీకరించారు.
-దీర్ఘకాలిక విత్తం: మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల కాలానికి అవసరమయ్యే విత్తం. ఇది స్థిర మూలధన అవసరాలను తీరుస్తుంది.
-మధ్యకాలిక విత్తం: ఏడాది నుంచి మూడేండ్ల కాలానికి అవసరమయ్యే విత్తం. ఇది కూడా స్థిర మూలధన అవసరాలను తీరుస్తుంది.
-స్వల్పకాలిక విత్తం: ఏడాది కంటే తక్కువ కాలానికి అవసరమయ్యే విత్తం. ఇది చర మూలధన అవసరాలను తీరుస్తుంది.
-పారిశ్రామిక విత్తం ప్రధానంగా షేర్లు, డిబెంచర్లు, ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు, వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలిచ్చే రుణాల ద్వారా సమకూరుతుంది.
-వి-త్త సంస్థలు: పారిశ్రామిక అవసరాల కోసం రుణ సహాయాన్ని అందించే సంస్థలను పారిశ్రామిక విత్త సహాయ సంస్థలు అంటారు.
-1953 నాటి పారిశ్రామిక విత్త సంస్థల విచారణ సంఘం సిఫారసుల ప్రకారం విత్త సహాయ సంస్థలను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు.
-భారతదేశంలో మొదటి పారిశ్రామిక విత్త సహాయ సంస్థ IFCI 1948లో ఏర్పడింది.
భారత పారిశ్రామిక విత్త సంస్థ (ఐఎఫ్సీఐ)
-ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్సీఐ)ని 1948, జూలైలో ఒక ప్రత్యేక చట్టం ద్వారా నెలకొల్పారు. ఇది దేశంలో మొదటి విత్త సంస్థ.
-1993 జూలై నుంచి దీన్ని ఒక పబ్లిక్ లిమిటెడ్ సంస్థగా మార్చారు. అప్పటి నుంచి భారత పారిశ్రామిక విత్త సంస్థ లిమిటెడ్ అని పిలుస్తున్నారు.
భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ (ఐసీఐసీఐ)
-ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐసీఐసీఐ)ని 1955, జనవరిలో స్థాపించారు.
-ప్రైవేటురంగంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు మిషన్ ఈ సంస్థ ఏర్పాటును ప్రోత్సహించింది.
-ఇది ప్రైవేటురంగంలో ఏర్పాటైంది. 2002, ఏప్రిల్‌లో ICICI బ్యాంకులో విలీనమయ్యింది.
భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు (IIBI)
-దేశంలో 1960లో అనేక పారిశ్రామిక సంస్థలు ముడిపదార్థాల కొరత, కార్మిక విధానాలు, యాజమాన్య నిర్వహణలోపం, తమ ఉత్పత్తులకు తగిన డిమాండ్ లేకపోవడం, ముడిపదార్థాల దిగుమతులపై ఆంక్షలు వంటి అనేక సమస్యల కారణంగా మూసివేసే పరిస్థితులు ఉన్నాయి.
-ఖాయిలాపడిన, మూసివేసిన పరిశ్రమలకు విత్త సహాయాన్ని అందించి వాటిని పునర్వ్యవస్థీకరించడానికి 1971, ఏప్రిల్‌లో భారత కంపెనీల చట్టం కింద ప్రభుత్వం భారత పారిశ్రామిక పునర్నిర్మాణ సంస్థ (ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-IRCI)ను నెలకొల్పింది.
-1984, ఆగస్టులో చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం 1985, మార్చి IRCIని భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకు(IRBI)గా మార్చింది. 1995, మార్చి నుంచి IRBIని భారత పారిశ్రామిక పెట్టుబడి బ్యాంకు లిమిటెడ్ (ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-IIBI) పేరుతో కంపెనీగా మార్చారు.
రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలు (స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్)
-భారత పారిశ్రామిక విత్త సంస్థ (IFCI).. తయారీ, గనుల తవ్వకం, నౌకరవాణా, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి, పంపిణీ మొదలైన పరిశ్రమలకు, పెద్దసంస్థలకు, సహకార సంఘాలకు విత్త సహాయం అందిస్తుంది. కానీ చిన్న పరిశ్రమలకు, మధ్యతరహా పరిశ్రమలకు ఈ సంస్థ వల్ల ఎలాంటి ప్రయోజనం లేనందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలను నెలకొల్పుకున్నాయి.
-1951లో కేంద్రప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థల చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేశాయి.
-రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థల అధీకృత మూలధనం రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల మధ్య ఉండేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.
-ప్రస్తుతం భారతదేశంలో 18 రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలు పనిచేస్తున్నాయి. ఒక రాష్ట్రంలోని రాష్ట్ర ఆర్థిక సహాయాన్ని ఆ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తన శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చు.
-ఈ సంస్థల వాటాలను (మూలధనాన్ని వాటాలుగా విభజిస్తాయి) రాష్ట్ర ప్రభుత్వాలు, రిజర్వ్‌బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు ఇతర విత్త సహాయ సంస్థలు, ప్రైవేటు సంస్థలు కొనుగోలు చేస్తాయి. రాష్ట్రప్రభుత్వాలు ఈ సంస్థల వాటాలకు హామీ ఇస్తాయి.
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థలు (స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)
-పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడానికి అనేక రాష్ట్రప్రభుత్వాలు తమ రాష్ర్టాల్లో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థలను నెలకొల్పాయి.
-మొదటగా 1960లో ఆంధప్రదేశ్, బీహార్ రాష్ర్టాలు ఈ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. ఆయా రాష్ట్రప్రభుత్వాల యాజమాన్యంలో ప్రస్తుతం 26 సంస్థలు పనిచేస్తున్నాయి.
పెట్టుబడి సంస్థలు యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (యూటీఐ)
-దీన్ని 1964, ఫిబ్రవరిలో నెలకొల్పారు. 1954లో షరాఫ్ కమిటీ సిఫారసుల మేరకు UTI ప్రారంభమైంది. ఈ సంస్థ మూలధనం రూ.5 కోట్లు.
-RBI, LIC, భారతీయ స్టేట్ బ్యాంకు, ఇతర వాణిజ్య బ్యాంకులు ఈ సంస్థల చందాదారులు. ట్రస్టీల మండలికి దీని నిర్వహణ బాధ్యత అప్పగించారు.
-2002, డిసెంబర్ నుంచి UTI నుంచి రెండు సంస్థలుగా విడగొట్టబడింది. అవి.. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా-I, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా-II
-ఇది భారతీయ స్టేట్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషనల్ ఆఫ్ ఇండియా సహాయంతో యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్స్ (UTI-AMC) నెలకొంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)
-భారత్‌లో బ్రిటిష్ పరిపాలన కాలంలో జీవిత బీమాను ప్రవేశపెట్టారు. 1818లో కలకత్తాలో ఒక ఆంగ్లేయ సంస్థ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని నెలకొల్పింది.
-1923లో ముంబయిలో బాంబే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని నెలకొల్పడం జరిగింది.
-1829లో చెన్నైలో మద్రాసు ఈక్వటబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ సొసైటీ ఏర్పడింది.
-1912లో దేశంలో జీవితబీమా వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడానికి ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ చట్టం చేయబడింది.
-1956, జనవరి 19న భారత్‌లో పనిచేస్తున్న 245 భారతీయ, విదేశీ జీవితబీమా సంస్థలను కేంద్రప్రభుత్వం స్వాధీనపర్చుకుంది.
-1956, సెప్టెంబర్ 1న వాటినీ జాతీయం చేసింది. రూ.5 కోట్ల మూలధనంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెలకొల్పింది.
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ)
-1973లో ప్రైవేటురంగంలోని సాధారణ బీమాను జాతీయం చేసిన తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ 2000, నవంబర్ నుంచి ఇండియన్ రీ ఇన్సూరెన్స్‌గా మారింది.
-ఈ GIC ప్రభుత్వరంగానికి, ఇతర సాధారణ బీమా కంపెనీలకు రీ ఇన్సూరెన్స్ మద్దతు ఇస్తుంది. GIC కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలతోపాటు గృహ నిర్మాణం, అవస్థాపనారంగాల్లోనూ కేంద్రప్రభుత్వ ఆమోదిత పెట్టుబడుల్లోనూ పెట్టుబడి పెడుతుంది.
ప్రత్యేక విత్త సంస్థలు (స్పెషలైజ్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్)
దేశంలో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా విస్తరించడంవల్ల విత్తరంగంలో వ్యవస్థాపూర్వక మార్పులు చోటు చేసుకున్నాయి. వర్తక వాణిజ్య అవసరాలకు అనుగుణంగా కొన్ని విత్త సంస్థలు నెలకొల్పబడ్డాయి.
1) ఎగ్జిమ్ బ్యాంకు (Exim Bank): భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (IDBI) నిర్వహిస్తున్న అంతర్జాతీయ విత్తానికి సంబంధించిన విభాగాన్ని వేరుచేసి 1982, జనవరి 1న భారత ఎగుమతులు, దిగుమతుల బ్యాంకు (ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నెలకొల్పారు.
ఎగుమతి, దిగుమతి దారులకు విత్త సహాయం అందించడం, అంతర్జాతీయ వ్యాపారానికి విత్త సహాయం అందించే ఇతర సంస్థలకు ప్రధాన సంధానకర్తగా పనిచేయడం ఎగ్జిమ్ బ్యాంక్ లక్ష్యం.
2) IFCI వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (ఐవీసీఎఫ్): కొత్త ఉద్యమదారులు, సాంకేతిక నిపుణులు, వృత్తినిపుణులు పారిశ్రామిక ప్రాజెక్టులు ప్రారంభించడానికి వడ్డీలేని రుణాలుగాని, తక్కువ వడ్డీకి రుణాలు గాని ఇచ్చి వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో 1975, మార్చిలో భారత పారిశ్రామిక విత్త సంస్థ (IFCI) రిస్క్ క్యాపిటల్‌ను ప్రారంభించించారు.
1988, జనవరిలో ఈ సంస్థ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ లిమిటెడ్ (RCTC)గా మారింది.
3) టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (టీఎఫ్సీఐ) : దేశంలో పర్యాటక పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం 1988లో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా TFCIని నెలకొల్పారు.
-సంప్రదాయ పర్యాటక ప్రాజెక్టులకే కాకుండా అమ్యూజ్మెంట్ పార్కులు, రోప్‌వేలు, కార్ రెంటల్ సేవలు, నీటి రవాణా ఫెర్రీల వంటి సంప్రదాయేతర పర్యాటక ప్రాజెక్టులకు ఈ సంస్థ విత్త సహాయం అందిస్తుంది.
4) భారతీయ అవస్థాపన విత్త సంస్థ (ఐఐఎఫ్‌సీఎల్)
-ఇది 2006, జనవరి 6న ప్రారంభించిన పూర్తి ప్రభుత్వ యాజమాన్య సంస్థ. ఇది దీర్ఘకాలిక అవస్థాపన సౌకర్యాల ఏర్పాటుకు విత్త సహాయం చేస్తుంది.
-రహదారులు, విద్యుత్, విమానాశ్రయాలు, ఓడరేవులు, పట్టణ అవస్థాపన ప్రాజెక్టులకు నిధులు అందిస్తుంది.
భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ (SIDBI)
-స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI)ని 1990, ఏప్రిల్ 2న ఒక ప్రత్యేక చట్టం ద్వారా స్థాపించారు.
-జాతీయ స్థాయిలో చిన్న పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి నిధుల సమీకరణ ద్వారా చిన్న పరిశ్రమల అభివృద్ధికి దోహద పడటమే దీని ప్రధాన లక్ష్యం. ఇది IDBIకి అనుబంధ బ్యాంకు.
-దీని ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. దీనికి అయిదు ప్రాంతీయ, 21 బ్రాంచీ కార్యాలయాలు ఉన్నాయి.
-ఈ సంస్థ మూలధనంలో అతిపెద్ద వాటాదారు IDBI తర్వాత స్థానాల్లో SBI, LIC ఉన్నాయి.
భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (ఐడీబీఐ)
-ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)ను 1964, జూలై 1న స్థాపించారు. ప్రత్యేక చట్టం ద్వారా ఆర్బీఐకి అనుబంధ సంస్థగా ఇది ఏర్పాటైంది.
-ఈ సంస్థను 1976, ఫిబ్రవరి 16 నుంచి కేంద్రప్రభుత్వ యాజమాన్యం కిందికి బదిలీ చేశారు.
-2004, అక్టోబర్ 1 నుంచి IDBI లిమిటెడ్‌గా 1956 కంపెనీల చట్టం కింద మార్చారు.
-2004, అక్టోబర్ 11 నుంచి రిజర్వ్ బ్యాంక్ చట్టం కింద ఒక షెడ్యూల్ బ్యాంకుగా పనిచేస్తుంది.
పునర్విత్త సంస్థలు (రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్) జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ)
-1988, జూలైలో ఆర్బీఐ అనుబంధ సంస్థగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB)ను స్థాపించారు. ఇది దేశంలో గృహనిర్మాణానికి విత్త సహాయం అందించే శిఖ సంస్థ.
-గృహ నిర్మాణ విత్తాన్ని ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, క్రమబద్ధీకరించడం దీని చట్టబద్ధమైన విధులు. దేశంలో ఒక ఆరోగ్యకరమైన గృహనిర్మాణ విత్త వ్యవస్థను అభివృద్ధి చేయడం దీని బాధ్యత.
-ఈ బ్యాంకు బాండ్లు, డిబెంచర్ల ద్వారా తనకవసరమైన నిధులను, రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసిన జాతీయ గృహ నిర్మాణ పరపతి నిధి (నేషనల్ హౌసింగ్ క్రెడిట్ ఫండ్) నుంచి పొందుతుంది.
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్)
-1982, జూలై 12న ఏర్పాటైన నాబార్డ్ గ్రామ ప్రాంతాల్లో ఉత్పాదక కార్యకలాపాలకు రుణాలనందించే విత్త సంస్థలకు పునర్విత్త సౌకర్యం కల్పిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు