Indian Society | గ్రూపు 1 ప్రత్యేకం ..ఇండియన్ సొసైటీ ప్రిపరేషన్ ప్లాన్
గ్రూప్-1 నోటిఫికేషన్ కు చాలా గ్యాప్ వచ్చినందున ఈసారి ఎలాగైన విజయం సాధించాలని గ్రూప్-1 అభ్యర్థులు ఆశిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్నతమైన ఉద్యోగాలు కాబట్టి పోటీ తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్రధానంగా సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్నవారు, ఇదివరకు సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లివచ్చినవారితోపాటు ప్రత్యేకంగా గ్రూప్-1 కోసం ప్రిపేర్ అవుతున్నవారు ఇందుకు సిద్ధపడుతున్నారు.
-ఇప్పటివరకు గ్రూప్-1 సాధించినవారి ఫలితాలను పరిశీలిస్తే.. అంతా 65 నుంచి 70 శాతం మార్కులు వచ్చినవారే ఉన్నారు. అంటే ప్రతి పేపర్లో 105 నుంచి 110 మార్కులు సాధించగలిగేలా గ్రూప్-1 ప్రిపరేషన్ ఉండాలి. సిలబస్ మారిన తర్వాత ప్రిలిమినరీ పరీక్షను అలాగే 150 మార్కులుగా ఉంచారు. కానీ మెయిన్స్ పరీక్షలో ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున 6 పేపర్లను రూపొందించారు. మెయిన్స్‌లో అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ పేపర్లో అర్హత మార్కులు సాధించాలి. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు.
-ప్రిలిమినరీ పరీక్షలో 150 మార్కులకు ఎన్ని మార్కులు సాధిస్తే మెయిన్స్‌కు అర్హత సాధిస్తారనేది ఉద్యోగాల సంఖ్యను బట్టి ఉంటుంది. ప్రతి ఉద్యోగానికి 50 మంది చొప్పున మెయిన్స్‌కు అవకాశం కల్పిస్తారు. ప్రిలిమ్స్‌లో 150 మార్కులకు కనీసం 100 మార్కులు సాధించగలిగేలా అభ్యర్థులు సన్నద్ధం కావడం మంచిది. పోస్టుల సంఖ్యనుబట్టేగాక ప్రిలిమ్స్ పరీక్ష కఠినస్థాయిని బట్టి, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎంత సమయంలో పరీక్ష ఉంటుంది అనేదాన్ని బట్టి కూడా ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు ఆధారపడి ఉంటాయి.
-నోటిఫికేషన్ వెలువడే వరకు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికి ప్రిపేర్ కావొచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఉమ్మడిగా ఉన్న అంశాలు గుర్తించి సన్నద్ధమవ్వాలి. మెయిన్స్ పరీక్షలో విజయావకాశాలు విషయ పరిజ్ఞానం, అన్వయ సామర్థ్యం, విశ్లేషణ నైపుణ్యం, సిలబస్‌ను సమకాలీన అంశాలతో మిళితం చేస్తూ జవాబులు రాసే నేర్పరితనం, తక్కువ సమయంలో తక్కువ పదాల్లోనే ప్రశ్నకు తగినట్లుగా జవాబులు రాయడం, చక్కని దస్తూరీ, ప్రశ్నలను సరిగా అర్థం చేసుకోవడం, ఎలాంటి సమాధానం ఆశించి ప్రశ్నను రూపొందించారో అర్థం చేసుకోగలగడం లాంటి అంశాల్లో పరిణితి చూపిన అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.
-ముఖ్యంగా ప్రశ్నల్లో ఉపయోగిస్తున్న పదజాలాలైన సహేతుకంగా విమర్శించండి, చర్చించండి, వ్యాఖ్యానించండి, ప్రభావాన్ని తెల్పండి, పర్యవసానాలు పేర్కొనండి లాంటి వాటికి సరైన రీతిలో అభ్యర్థి పరిజ్ఞానంతో సమాధానం రాయాల్సి ఉంటుంది.
-చాలా మంది అభ్యర్థులకు సిలబస్ అధికంగా ఉందనే అభిప్రాయం ఉండొచ్చు. అది కొంతవరకు నిజమే. ఎందుకంటే జనరల్ ఇంగ్లిష్ కాకుండా మరో 6 పేపర్లను రూపొందించారు. ప్రతి పేపర్లో మూడు విభాగాలున్నాయి. జీఎస్ (పేపర్-1) కాకుండా మిగతా 5 పేపర్లలో సుమారు 840 ప్రధాన టాపిక్స్ ఉన్నాయి. అయితే సిలబస్‌లోని కొన్ని అంశాలు వివిధ సందర్భాల్లో పునరావృతం అయ్యాయి. మరికొన్ని అంశాలు చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు అవగాహన చేసుకోవాలి. ప్రతి పేపర్లోని టాపిక్స్‌పై పరిజ్ఞానం ఉండాలి. వివిధ కోణాల్లో ప్రశ్నలను నిపుణుల మార్గదర్శకత్వంలో రూపొందించుకొని, ఆయా ప్రశ్నలకు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, నిపుణులతో మూల్యాంకనం చేయించుకోవడం, లోపాలను సరిదిద్దుకోవడం ఇలా దశలవారీగా ప్రణాళికాబద్ధంగా అభ్యసనం కొనసాగించాలి.
-గ్రూప్-1 సిలబస్‌లో పునరావృతమవుతున్న లేదా దగ్గరి సంబంధం ఉన్న అంశాల్లో ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్ అండ్ సోషల్ మూవ్‌మెంట్స్‌కు సంబంధించిన అంశాలు ప్రిలిమ్స్ సహా వివిధ పేపర్లలో, వివిధ యూనిట్లలో సూటిగా.. కొన్ని సందర్భాల్లో అంతర్లీనంగా ఉన్నాయి. అందుకు సంబంధించిన అంశాలపై అభ్యర్థులకు అవగాహన ఉంటే ప్రిపరేషన్ సులభతరం అవడమేగాక గరిష్టంగా మార్కులు సాధించడానికి దోహదపడుతుంది.
-పేపర్-3లో ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్‌లో సెక్షన్-1లో భాగంగా 50 మార్కులకుగాను 5 యూనిట్లలో సిలబస్‌ను పొందుపర్చారు. ఈ విభాగంలోని అంశాలపై పట్టు సాధించినట్లయితే సిలబస్‌లోని ఇతర పేపర్లలో అయా అంశాల అభ్యసనం సులువవుతుంది. ఆయా అంశాలను గమనించండి..
-ప్రిలిమినరీ పరీక్షలోని మొత్తం 13 అంశాల్లో.. 12వ అంశమైన సోషల్ ఎక్స్క్లూషన్, రైట్స్ ఇష్యూ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజేబిలిటీ అండ్ ఇంక్లూసివ్ పాలసీస్ ఉన్నాయి. అంటే దాదాపు 15 మార్కుల ప్రిలిమినరీ సిలబస్ ఇండియన్ సొసైటీ సెక్షన్లో యూనిట్-2లో ఉంది.
-ప్రిలిమ్స్‌లోని 13 అంశాల్లో 9వ అంశమైన గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అనే అంశానికి సంబంధించి అభ్యర్థులు పబ్లిక్ పాలసీలో బాగా బలహీనవర్గాలు, సమాజంలో వారు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం వారికోసం తీసుకున్న విధానాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సమాజంలో వెనుకబడిన వర్గాల వెతలు, సంక్షేమం అనే అంశాలు మెయిన్స్‌లో ఇండియన్ సొసైటీ విభాగంలో ఉన్న విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
-మెయిన్స్ పేపర్-I జనరల్ ఎస్సేలోని మూడు విభాగాల్లో మొదటి విభాగంలోని కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ (సమకాలీన సామాజికాంశాలు, సామాజిక సమస్యలు) నుంచి 50 మార్కులకుగాను సమాధానం (ఎస్సే టైప్) రాయాలి.
-ఇవే అంశాలు దాదాపుగా ఇండియన్ సొసైటీ విభాగంలోని యూనిట్-2లో బలహీనవర్గాలు, యూనిట్-3లో వివిధ సామాజిక అంశాలు (అవినీతి, లౌకికవాదం, మతతత్వం, కుల సంఘర్షణలు, పట్టణీకరణ, వలసలు, వ్యవసాయదారుల దుస్థితి, అభివృద్ధి-స్థానచలనం), యూనిట్-3లోని సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణలో వెట్టి, జగిని, దేవదాసి, బాలబాలికల సమస్యలు, ఫ్లోరోసిస్, బాలకార్మికులు, బాల్యవివాహాలు ఉన్నాయి. పై అంశాలన్నీ స్థూలంగా సోషల్ ఇష్యూస్‌గా అధ్యయనం చేయాలి.
-అలాగే మెయిన్స్ పేపర్-IIIలోని మూడో విభాగం అయినటువంటి గవర్నెన్స్‌లో కూడా సమాజ శాస్ర్తానికి సంబంధించిన, సమాజ శాస్త్ర పరిజ్ఞానంతోనే సరిగ్గా అర్థం చేసుకోగలిగిన అంశాలు ఉన్నాయి. అవి..
-పార్ట్-III, యూనిట్ IVలోని పౌరసమాజం (సివిల్ సొసైటీ), సముదాయ ఆధారిత సంస్థలు, స్వయం సహాయ బృందాలు, చారిటీ సంస్థలు.
-ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలు (పీపీపీ), కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత (కార్పొరేట్ స్కూల్ రెస్పాన్సిబిలిటీ) లాంటివి, వీటి నుంచి సుమారు 10 నుంచి 20 మార్కులకుగాను ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
-కాబట్టి ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్, సోషల్ మూవ్మెంట్స్ అనే విభాగంపై పట్టు సాధించి జవాబులను రాసే నైపుణ్యాలను సాధనచేస్తే ప్రిలిమ్స్‌లో 20పైగా మార్కులు, మెయిన్స్‌లో 50 మార్కులు జనరల్ ఎస్సేలో, పేపర్-III సెక్షన్-Iలో భాగంగా 50 మార్కులు, గవర్నెన్స్ విభాగంలో 25 మార్కుల వరకు మొత్తంగా 125 మార్కుల వరకు మెయిన్స్‌లో, సుమారు 20 మార్కుల వరకు ప్రిలిమ్స్‌లో పొందే అవకాశం ఉంది.
-ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్, సోషల్ మూవ్మెంట్స్ అనే అంశాన్ని ఈసారి నూతనంగా చేర్చారు. కాబట్టి అభ్యర్థులు ఆలిండియా సర్వీసెస్ పరీక్షల గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే, ప్రశ్నల సరళిపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ విభాగంలోని ఐదు యూనిట్లలో మొదటి యూనిట్లో భారతీయ సమాజ నిర్మాణానికి సంబంధించి, రెండో యూనిట్లో సామాజిక వెలి, దర్బల సమూహాలకు సంబంధించిన అంశాలు, సమస్యలు, 3వ యూనిట్లో సోషల్ ఇష్యూస్లాగే 4వ యూనిట్లో తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సామాజిక సమస్యలు, సోషల్ మూవ్మెంట్స్ ఇన్ తెలంగాణ, 5వ యూనిట్లో బలహీన, దుర్బల వర్గాల వారికి సంబంధించిన ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను పొందుపర్చారు.
-ఈ విభాగాన్ని స్థూలంగా అర్థం చేసుకోవాలంటే దేశ సామాజిక నిర్మాణం అందులోని లోపాలు లేదా సమస్యలు, లోపాల వల్ల తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన వర్గాలు, వారి ఉద్దరణ కోసం, సామాజిక మార్పు కోసం జరిగిన సామాజిక ఉద్యమాలు, ప్రభుత్వం తరఫున సమాజంలో వెనుకబడిన వర్గాల వారి కోసం ఉద్దేశించిన సాధనాలు, పథకాలు లాంటి అంశాలకు సంబంధించి సిలబస్‌గా అర్థం చేసుకుని అభ్యసించాలి.
-ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్ అండ్ సోష్ల్ మూవ్మెంట్స్ అనే విభాగంలోని మొదటి యూనిట్.
-యూనిట్-I: ఇండియన్ సొసైటీ: సలియంట్ ఫీచర్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, రిలీజియన్, లాంగ్వేజ్, రూరల్-అర్బన్ కంటిన్యూ, మల్టీ కల్చరలైజేషన్ (భారతీయ సమాజం: విశిష్ఠ లక్షణాలు, భిన్నత్వంలో ఏకత్వం, కుటుంబం, వివాహం, బంధుత్వం, కులం, గిరిజనులు, మతం, భాష, గ్రామీణ-పట్టణ కొనసాగింపు, బహుళ సంస్కృతి).
మోడల్ ప్రశ్నలు
-భారతదేశ సమాజం విశిష్ఠ లక్షణాలను సంతరించుకునేందుకు దోహదపడిన అంశాలను సోదాహరణంగా వివరించండి?
-భారతీయ సమాజంలోని విశిష్ఠ లక్షణాలే భిన్నత్వంలో ఏకత్వానికి దోహదపడుతున్నాయి? వ్యాఖ్యానించండి?
-దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం ఉందా? లేదా ఏకత్వంలో భిన్నత్వం ఉందా? పరీక్షించండి?
-దేశంలో భిన్నత్వంలో ఏకత్వం రావడానికి రాజ్యాంగం ఏ విధంగా తోడ్పడుతుందో సోదాహరణలతో వివరించండి?
-సమకాలీన దేశంలో కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అందుకుగల కారణాలు, పర్యవసానాలు, సమాజంపై ఆయా పర్యవసానాల ప్రభావాన్ని తెలపండి?
-దేశంలో కులం అనే సంస్థ అంతరిస్తున్నదా లేదా బలపడుతున్నదా వ్యాఖ్యానించండి?
-గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన, విలుప్తానికి గిరిజనులెవరు, వారి సమస్యలేమి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నివారణోపాయాలను తెలపండి?
-కుల అశక్తతలను రూపుమాపేందుకు రాజ్యాంగం, సామాజిక శాసనాలు తోడ్పడుతున్నాయా? చర్చించండి?
-భారతీయ సమాజంలో ఉన్నటువంటి బహుళ-సంస్కృతి వల్ల కలుగుతున్న రుణాత్మక, ధనాత్మక పర్యవసానాలను తెలపండి?
-మతం ప్రకార్య వికార్యాలను సోదాహరణలతో తెలపండి?
-దేశంలో వివాహ వ్యవస్థలోని లింగపరమైన అసమానతలు, ఇతర లోపాలను తెలుపుతూ, వాటిని రూపుమాపడానికి రాజ్యం తీసుకున్న చర్యలను తెలపండి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు