POLITY | పార్లమెంటుకే అధికారం.. రాష్ర్టాలకూ ఉంటేనే ఉపకారం
రాజ్యాంగ సవరణ పద్ధతి
సవరణ ఆవశ్యకత
- రాజ్యాంగం ప్రజాస్వామిక దేశాల్లో పరిపాలనకు పునాది, సర్వోన్నతమైనది. ఏ దేశ రాజ్యాంగమైనా దాన్ని రచించే కాలంలో నెలకొని ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకనుగుణంగా రూపొందిస్తారు. దేశ, కాల పరిస్థితులు మార్పు చెందుతున్నప్పుడు ఉత్పన్నమయ్యే సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను పరిష్కరించేలా రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది.
- ఈ వాస్తవాన్ని గ్రహించిన భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ సవరణ విధానాన్ని రాజ్యాంగంలోనే పొందుపరిచారు.
రాజ్యాంగ సవరణ విధానాన్ని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
సవరణ అర్థం - సవరణ అంటే కొత్త ప్రకరణలను చేర్చడం, పూర్తిగా తొలగించడం, మార్పులు చేయడం. ఒక ప్రకరణలోని అంశం స్థానంలో మరొక అంశాన్ని చేర్చడం మొదలగు అంశాలన్నిటిని సవరణగానే పరిగణిస్తారు. రాజ్యాంగ సవరణ అనే పదానికి రాజ్యాంగంలో నిర్వచనం లేదు.
సవరణకు ఉత్తమమైన పద్ధతి ఏది? - సాధారణంగా రాజ్యాంగాలను సాధారణ మెజారిటీతో కానీ లేదా ప్రత్యేక మెజారిటీతో కానీ సవరిస్తారు.
- రాజ్యాంగ సవరణకు చాలా సరళమైన ప్రక్రియ ఉన్నప్పుడు రాజ్యాంగ స్థిరత్వం, నిరంతరతకు విఘాతం కలుగుతుంది. అలాగని కఠినమైన ప్రక్రియను ఎంచుకుంటే అవసరమైన మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. అందుచేత రాజ్యాంగ నిర్మాతలు ఈ రెండు ప్రక్రియల మధ్య సమతుల్యత పాటించారు.
సవరణ పద్ధతులు- రాజ్యాంగ స్థానం - రాజ్యాంగంలోని 20వ భాగం ప్రకరణ 368లో రాజ్యాంగ సవరణ పద్ధతిని పొందుపరిచారు. రాజ్యాంగ ప్రకరణలను మూడు వర్గాలుగా వర్గీకరించి, మూడు ప్రత్యేక పద్ధతులను నిర్దేశించారు. అవి..
1. పార్లమెంటు సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి
2. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా జరిగే సవరణ పద్ధతి
3. పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ, సగానికంటే ఎక్కువ రాష్ట్ర శాసనసభల ఆమోదం ద్వారా జరిగే సవరణ పద్ధతి
ప్రత్యేక వివరణ - మౌలిక రాజ్యాంగంలో ప్రకరణ 368లో రాజ్యాంగాన్ని ‘సవరించే ప్రక్రియ’ అని పేర్కొన్నారు. కానీ 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదబంధాన్ని రాజ్యాంగాన్ని, ప్రక్రియను సవరించే అధికారంగా మార్పులు చేశారు.
- ప్రకరణ 368లోని అంశాలను ఇప్పటివరకు రెండు పర్యాయాలు సవరించారు. అవి 24వ రాజ్యాంగ సవరణ (1971), 42వ రాజ్యాంగ సవరణ (1976).
ప్రకరణ 368లో ఐదు సబ్ క్లాజులు ఉన్నాయి. అవి.
1. పార్లమెంటుకు రాజ్యాంగాన్ని, ప్రక్రియను సవరించే అధికారం
2. ప్రత్యేక మెజారిటీతో సవరించబడే అంశాలు
3. ప్రకరణ 13లో పేర్కొన్న చట్టం నిర్వచన పరిధిలోని అంశాలు రాజ్యాంగ సవరణ నిర్వచనంలోకి రావు.
4. పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణను (ప్రాథమిక హక్కులతో సహా) రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానంలో ప్రశ్నించటానికి వీలులేదు.
5. సవరణ అధికారాల్లో మార్పులు, కూర్పులు, రద్దు చేసే అంశాల్లో పార్లమెంటుకు ఏ విధమైన ఆంక్షలు వర్తించవు.
ప్రత్యేక వివరణ - క్లాజు 4, 5లోని అంశాలను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే ఈ క్లాజులు చెల్లవని, రాజ్యాంగ విరుద్ధమని మౌలిక నిర్మాణానికి విఘాతం కలిగిస్తాయని 1980లో మినర్వా మిల్స్
కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
సాధారణ మెజారిటీ పద్ధతి - ఈ పద్ధతి ప్రకారం సాధారణ మెజారిటీ ద్వారా కొన్ని ప్రకరణలను పార్లమెంటు సవరిస్తుంది. సాధారణ చట్టాన్ని పార్లమెంటు ఏ విధంగా సవరిస్తుందో అదే పద్ధతిలో రాజ్యాంగంలోని కొన్ని ప్రకరణలు సవరించబడతాయి. సాధారణ మెజారిటీ అంటే హాజరై ఓటు వేసిన వారిలో సగానికంటే ఎక్కువ ఉండాలి.
ప్రత్యేక వివరణ-విశ్లేషణ - సాధారణ మెజారిటీ పద్ధతి గురించి ప్రకరణ 368లో ప్రస్తావించలేదు. అందుకే సాధారణ మెజారిటీ ద్వారా జరిగే సవరణలను రాజ్యాంగ సవరణలుగా పరిగణించరు. అంటే కింద పేర్కొన్న అంశాలు ప్రకరణ 368లో పేర్కొనబడిన రాజ్యాంగ సవరణ పరిధిలోకి రావు.
ఈ పద్ధతి ద్వారా సవరించే అంశాలు.. - కొత్త రాష్ర్టాలను ఏర్పాటు చేయడం, రాష్ట్ర సరిహద్దుల మార్పు, రాష్ర్టాల పేర్ల మార్పు (ప్రకరణలు 1-4)
- రాష్ట్ర ఎగువసభ (విధాన పరిషత్) ఏర్పాటు, రద్దు (ప్రకరణ 169)
- భారత పౌరసత్వంలో మార్పులు (ప్రకరణలు 5-11)
- పార్లమెంటులో కోరం (ప్రకరణ 100)
- రెండో షెడ్యూల్లో పేర్కొన్న రాజ్యాంగ పదవుల జీతభత్యాలు (ప్రకరణలు 59, 65, 75, 97, 125, 148, 158, 164, 186, 221)
- పార్లమెంటులో శాసన నిర్మాణ ప్రక్రియలు, శాసన సభ్యుల అధికారాలు (ప్రకరణలు 105, 194)
- సుప్రీంకోర్టు పరిధికి సంబంధించిన అంశాలు (ప్రకరణ 139)
- కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన (ప్రకరణ 239)
- నియోజకవర్గాల పునర్విభజన (ప్రకరణ 82)
- పార్లమెంటులో ఉపయోగించే భాష (ప్రకరణ 120)
- సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య నిర్ణయించడం (ప్రకరణ 124)
- అధికార భాషల వాడకం
- పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించే అంశాలు
- ప్రకరణ 368 ఈ పద్ధతిని వివరిస్తుంది. రాజ్యాంగంలో అత్యధిక భాగాలు ఈ పద్ధతి ద్వారానే సవరించబడతాయి. పార్లమెంటు ఉభయ సభల్లో హాజరై ఓటు వేసిన వారిలో 2/3వ వంతు మెజారిటీ సభ్యులు ఆమోదించాలి. ఇది మొత్తం సభ్యుల్లో సగానికంటే తగ్గొద్దు. ఈ పద్ధతి ద్వారా కింది అంశాలు సవరిస్తారు. అవి..
ఎ. భారత రాజ్యాంగంలో మూడో భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు (ప్రకరణలు 12-35)
బి. భారత రాజ్యాంగంలో నాలుగో భాగంలో పేర్కొన్న నిర్దేశక నియమాలు (ప్రకరణ 36-51)
సి. మొదటి పద్ధతిలోను, మూడో పద్ధతిలోను పేర్కొనబడని ఇతర అన్ని అంశాలు ప్రత్యేక మెజారిటీ, రాష్ట్ర శాసనసభల ఆమోదం - ఈ పద్ధతిలో పేర్కొన్న అంశాలను పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించిన తర్వాత ఆ రాజ్యాంగ సవరణ బిల్లును సగానికి తగ్గకుండా రాష్ట్ర శాసనసభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి (ఖాళీలు, గైర్హాజరైన సభ్యులతో కలుపుకొని) ఉంటుంది. రాష్ర్టాల ఆమోదానికి నిర్ణీత సమయం అంటూ ఏదీ ఉండదు.
- రాష్ట్రపతి నిర్ణయించిన గడువు లోపల రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని చెప్పాలి.
ఈ పద్ధతి ద్వారా సవరించే అంశాలు - రాష్ట్రపతి ఎన్నిక విధానం (ప్రకరణ 54, 55)
- కేంద్ర కార్యనిర్వాహక పరిధిని విస్తృతపరచడం (ప్రకరణ 73)
- రాష్ట్ర కార్యనిర్వాహక పరిధిని విస్తృతపరచడం (ప్రకరణ 162)
- కేంద్ర, రాష్ర్టాల మధ్య శాసనపరమైన అధికారాల విభజన ఏడో షెడ్యూల్లో పేర్కొన్న అంశాలు
(ప్రకరణలు 241, 246 భాగం 21) - రాష్ర్టాలకు పార్లమెంటులో ప్రాతినిథ్యం (ప్రకరణలు 80, 81)
- సుప్రీంకోర్టు (పార్ట్ 5), హైకోర్టు (పార్ట్ 6) సంబంధించిన విషయాలు (ప్రకరణలు 124, 214)
- రాజ్యాంగ సవరణ పద్ధతి (ప్రకరణ 368)
రాజ్యాంగ సవరణ పద్ధతి-నియమ నిబంధనలు
- రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియలో ప్రకరణ 368లో పేర్కొన్న విధంగా కింది నియమాలను పాటించాలి.
- రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రతిపాదించవచ్చు. రాష్ట్ర శాసనసభలకు రాజ్యాంగ సవరణ ప్రతిపాదించే అధికారం లేదు.
- రాజ్యాంగ సవరణ బిల్లును మంత్రికాని, సాధారణ సభ్యుడు కానీ ప్రతిపాదించవచ్చు.
- రాష్ట్రపతి పూర్వానుమతి అవసరం లేదు.
- రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయ సభలతో నిర్ణీత మెజారిటీ ప్రకారం వేర్వేరుగా ఆమోదించబడాలి. ఒక సభ ఆమోదించి మరో సభ తిరస్కరిస్తే ప్రతిష్టంభన తొలగించడానికి సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. కాబట్టి బిల్లు వీగిపోతుంది.
- సమాఖ్య అంశాలకు సంబంధించిన ప్రకరణలు సవరించడానికి సగానికి పైగా రాష్ట్ర శాసనసభలు కూడా తమ ఆమోదాన్ని తెలపాల్సి ఉంటుంది.
- పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపుతారు.
- రాష్ట్రపతి తప్పనిసరిగా తన ఆమోదాన్ని తెలపాలి. తిరస్కరించడం కానీ, పునఃపరిశీలనకు కానీ అవకాశం లేదు.
గమనిక: రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలనే నియమాన్ని 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. - రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారుతుంది. చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి రాజ్యాంగాన్ని సవరించినట్లుగా పరిగణిస్తారు.
- రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేది స్వయం నిర్దేశిత పద్ధతి. ప్రకరణలో పేర్కొన్న సాధారణ చట్ట సవరణ పద్ధతికి పోలిక లేదు.
- రాజ్యాంగ సవరణ న్యాయసమీక్షకు లోబడి ఉంటుంది.
గమనిక: ద్రవ్య బిల్లులోని (ప్రకరణ 110) అంశాలు రాజ్యాంగ సవరణ బిల్లులో ఉన్నప్పటికీ దాన్ని రాజ్యాంగ సవరణ బిల్లుగానే పరిగణిస్తారు. ప్రకరణ 368, ఆర్థిక బిల్లు, ద్రవ్య బిల్లుల్లోని అంశాలను
అధిగమిస్తుంది.
రాజ్యాంగ సవరణ-విమర్శ - రాజ్యాంగ సవరణలో అనేక లోపాలున్నాయనే విమర్శలున్నాయి.
- రాజ్యాంగ సవరణకు ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తు/సభ లేకపోవడం
- సవరించే అధికారాన్ని పార్లమెంటుకే పరిమితం చేయడం
- రాష్ర్టాలకు రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించే అధికారం లేదు. అమెరికాలోని రాష్ర్టాలకు ఈ అధికారం ఉంది.
- రాజ్యాంగ సవరణలో ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే పరిష్కారానికి సంయుక్త సమావేశం
ఏర్పరిచే ఆస్కారం లేదు. - రాజ్యాంగంలోని చాలా భాగాలను పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరిస్తారు. రాష్ర్టాల భాగస్వామ్యం తక్కువగా ఉంది.
- రాజ్యాంగ సవరణ బిల్లుకు రాష్ర్టాల ఆమోదంలో జాప్యం జరగవచ్చు. దీనికి కారణం రాష్ర్టాలు నిర్ణీత సమయంలోగా తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించాల్సిన అవసరం లేదు.
రాజ్యాంగ సవరణ స్వభావం-ప్రముఖుల వ్యాఖ్యానాలు - భారత రాజ్యాంగ సవరణ పద్ధతి దృఢ, అదృఢ లక్షణాల మధ్య మంచి సమతుల్యాన్ని సాధించింది. సవరణ పద్ధతిలో వైవిధ్యం ఉంది. ఇది చాలా అరుదు, వివేకవంతమైనది. -కె.సి. వేర్
- రాజ్యాంగ సవరణ విధానం ఒక మూస విధానాన్ని ఎంచుకోలేదు. ఇదే అంతిమం, సవరణకు అతీతం అనే లేబుల్ ఏర్పాటు చేయదలుచుకోలేదు. ఒక సరళ విధానాన్ని పొందుపరచటం జరిగింది.
-డా.బీఆర్ అంబేద్కర్
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
Previous article
General Studies Polity | రాష్ట్ర హైకోర్టు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు