Indian Polity | ఉభయ సభల ప్రతిష్టంభన.. ఉమ్మడి సమావేశం
భారత రాష్ట్రపతి ఎన్నిక, పద్ధతి, అధికార విధులు
- భారత రాజ్యాంగం ఐదో భాగంలో 52 నుంచి 78 వరకు గల ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయాలను తెలుపుతాయి.
- కేంద్ర కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్‌లు సభ్యులుగా ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి.
- ప్రకరణ 52 ప్రకారం భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు.
- ప్రకరణ 53 ప్రకారం కేంద్ర కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ, తన కింది అధికారుల సహాయంతో గాని నిర్వర్తిస్తారు. కింది అధికారులు అంటే మంత్రిమండలిగా పరిగణించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
- దేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటు ప్రభుత్వాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేశారు. రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి సంక్రమించినప్పటికీ వాటిని చెలాయించేది ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి మాత్రమే.
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి - ప్రకరణ 324 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాజ్యాంగంలో సమగ్రమైన వివరణ లేదు. అందుకోసం 1952లో పార్లమెంటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించింది. 1974లో రాష్ట్రపతి ఎన్నిక నియమావళిని రూపొందించారు.
- రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడటానికి ముందు 60 రోజుల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
- రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రొటేషన్ పద్ధతిలో లోక్‌సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు. 16వ రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా పి.సి. మోదీ మిశ్రా వ్యవహరించారు.
రాష్ట్రపతి ముందస్తు అనుమతితో ప్రవేశపెట్టే బిల్లులు - ప్రకరణ 3: రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ అంశాలు
- ప్రకరణ 109: ద్రవ్య బిల్లుకు సంబంధించిన అంశాలు
- ప్రకరణ 112: బడ్జెట్‌ను రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టాలి
- ప్రకరణ 117: మొదటి రకం ఆర్థిక బిల్లులోని అంశాలు
- ప్రకరణ 266: రాష్ట్రపతి అనుమతితోనే కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేయాలి
- ప్రకరణ 274: రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉన్న పన్నులు
- ప్రకరణ 304: అంతర్రాష్ట్ర వ్యాపారం, వాణిజ్యం ఇమిడి ఉన్న అంశాలు
- ప్రకరణ 349: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉపయోగించే భాషలకు సంబంధించిన అంశాలు
రాష్ట్రపతి వీటో అధికారం - వీటో అనే పదం లాటిన్ భాష నుంచి గ్రహించారు. ఆంగ్లంలో దాన్ని ఫర్బిడ్ అంటారు. వీటో అంటే తిరస్కరించే అధికారం. ఏదైనా బిల్లు కాని, ప్రతిపాదన కానీ పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే, ప్రకరణ 111 ప్రకారం రాష్ట్రపతి కింది ప్రత్యామ్నాయాలను కలిగి ఉంటారు.
ఎ. బిల్లును ఆమోదించవచ్చు
బి. బిల్లును ఆమోదించకుండా అట్టిపెట్టవచ్చు
సి. పునఃపరిశీలనకు పంపవచ్చు (ద్రవ్యబిల్లు తప్ప మిగతా బిల్లులను)
డి. బిల్లుపై ఎలాంటి అభిప్రాయం చెప్పకుండా మౌనంగా ఉండవచ్చు - రాష్ట్రపతి సూచించిన సమయంలో సభలు బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. రెండోసారి బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది.
ఆధునిక ప్రజాస్వామిక వ్యవస్థలో కింది వీటో అధికారాలు ఉన్నాయి.
1. అబ్సల్యూట్ వీటో 2. క్వాలిఫైడ్ వీటో
3. సస్పెన్సివ్ వీటో 4. పాకెట్ వీటో
1. అబ్సల్యూట్ వీటో - ఏదైనా బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే ఎట్టి పరిస్థితుల్లోను చట్టంగా మారదు. ఆ బిల్లు శాశ్వతంగా రద్దవుతుంది. రాష్ట్రపతి కింది సందర్భాల్లో అబ్సల్యూట్ వీటోను వినియోగించవచ్చు.
- ప్రైవేట్ మెంబర్స్ బిల్లుల విషయంలో (మంత్రులు కాని శాసన సభ్యులు ప్రవేశపెట్టిన బిల్లులను ప్రైవేటు బిల్లులంటారు)
- క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రభుత్వ బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపబడి, రాష్ట్రపతి ఆమోదం తెలపక ముందే మంత్రిమండలి రాజీనామా చేస్తే, కొత్తగా ఏర్పడిన మంత్రిమండలి ఆ బిల్లులను ఆమోదించవద్దని రాష్ట్రపతికి సలహా ఇచ్చినప్పుడు కొన్ని బిల్లుల విషయంలో భారత రాష్ట్రపతి ఈ అధికారాన్ని వినియోగించవచ్చు.
ఉదా: 1954లో రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు PEPSU-Patila East Punjab States Union అనుమతి ఉపక్రమణ బిల్లులో, అలాగే 1991లో ఆర్.వెంకట్రామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, అలవెన్సులకు సంబంధించిన బిల్లులో అబ్సల్యూట్ వీటోను వినియోగించారు. (రాష్ట్రపతి పూర్వ అనుమతి లేకుండా ప్రవేశపెట్టారు) - రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ప్రకరణ 201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదానికి నివేదించవచ్చు. ఈ సందర్భంలో రాష్ట్రపతి తన ఆమోదాన్ని నిరాకరిస్తే ఆ బిల్లులు ఎప్పటికీ చట్టంగా మారవు.
2. క్వాలిఫైడ్ వీటో - పార్లమెంటు చేత ఆమోదించబడి రాష్ట్రపతి ఆమోదానికి పంపబడిన బిల్లును రాష్ట్రపతి తిరస్కరిస్తే రెండోసారి అదే బిల్లును పార్లమెంటు 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించి పంపితే, రాష్ట్రపతి/అధ్యక్షుడు తప్పనిసరిగా ఆమోదాన్ని తెలపాలి. ఈ తరహా వీటో అధికారం భారత రాష్ట్రపతికి లేదు. ఈ అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంది.
3. సస్పెన్సివ్ వీటో - పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి పంపినప్పుడు మొదటిసారి దాన్ని తిరస్కరిస్తే రెండోసారి అదే బిల్లును పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదించి తిరిగి పంపితే భారత రాష్ట్రపతి ఆ బిల్లులను తప్పనిసరిగా ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోయినా ఆమోదించబడినట్లుగా భావిస్తారు. ఈ అధికారం రాష్ట్రపతికి ఉంది.
4. పాకెట్ వీటో
l బిల్లులు పార్లమెంటుచేత ఆమోదించబడి రాష్ట్రపతి ఆమోదముద్రకు పంపినప్పుడు ఆ బిల్లులను తిరస్కరించకుండా పునఃపరిశీలనకు పంపకుండా రాష్ట్రపతి నిరవధికంగా తన నిర్ణయాన్ని వాయిదా వేస్తారు. దీన్నే పాకెట్ వీటో అంటారు. ఉదా: 1986లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా జైల్‌సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పోస్టల్ బిల్లు విషయంలో ఈ వీటో అధికారాన్ని వినియోగించారు. సుమారు 18 నెలలు బిల్లును అట్టిపెట్టారు.
రాష్ట్ర బిల్లులపై వీటో అధికారం - రాష్ట్ర శాసనసభ రూపొందించిన బిల్లులను గవర్నర్ అవసరమనుకుంటే రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. ఆ విధంగా పంపిన బిల్లులపై రాష్ట్రపతికి కింది ఐచ్ఛికాలు ఉంటాయి.
ఎ. తన ఆమోదాన్ని తెలపవచ్చు
బి. ఆమోదం తెలపకుండా అట్టిపెట్టవచ్చు
సి. సంబంధిత బిల్లును రాష్ట్ర శాసనసభ పునఃపరిశీలనకు పంపమని (ద్రవ్య బిల్లును మినహాయించి) గవర్నర్‌ను ఆదేశించవచ్చు. - ఆ సంబంధిత బిల్లును శాసనసభ సవరించి లేదా సవరించకుండా మరొకసారి రాష్ట్రపతికి నివేదిస్తే ఈ సందర్భంలో కూడా రాష్ట్రపతి తమ ఆమోదాన్ని తెలపవచ్చు లేదా నిరాకరించవచ్చు.
- రాష్ట్ర శాసనసభ రాష్ట్రపతి వీటో అధికారాన్ని అధికరించలేదు. కాబట్టి రాష్ట్ర బిల్లులపై రాష్ట్రపతికి సంపూర్ణ వీటో అధికారం ఉంటుంది.
ఆర్థిక అధికారాలు-విధులు - పార్లమెంటులో ప్రవేశపెట్టే ద్రవ్య బిల్లులకు పూర్వానుమతిని ఇవ్వటం- ప్రకరణ 117(1)
- రాష్ట్రపతి అనుమతితోనే కేంద్ర సంఘటిత నిధి నుంచి ఖర్చు చేయాలి-ప్రకరణ 266
- భారత ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధీనంలోనే ఉంటుంది. దాని నుంచి పార్లమెంటు ఆమోదం పొందే వరకు వచ్చే అత్యవసర ఖర్చులకు అడ్వాన్స్ మంజూరు చేయడం- ప్రకరణ 267
- ఆర్థిక సంవత్సర ప్రారంభంలో వార్షిక బడ్జెట్‌ను, సప్లిమెంటరీ బడ్జెట్‌ను తన పేరుపై పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతినివ్వటం- ప్రకరణ 112
శాసనాధికారాలు-విధులు - ప్రకరణ 79 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం. పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాదు. అయినా అతనికి కింది శాసనాధికారాలున్నాయి.
- పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచం- ప్రకరణ 85(1)
- ఏ సభా సమావేశాన్ని అయినా సమాపనం చేయడం- ప్రకరణ85(2)
- పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే దీన్ని పరిష్కరించడానికి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయడం- ప్రకరణ 108
- లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయడం- ప్రకరణ 331 (ప్రస్తుతం వీరి నామినేషన్ రద్దయింది)
- రాజ్యసభకు 12 మంది వివిధ రంగాల నిష్ణాతులను నామినేట్ చేయడం- ప్రకరణ 80(3)
- పార్లమెంటు సభ్యుల అనర్హతలను నిర్ణయించటం- ప్రకరణ 103
- పార్లమెంటు సభలను విడిగాగాని, సంయుక్త సమావేశంలో ఉన్నప్పుడు కానీ ప్రసంగించడం- ప్రకరణ 87
- పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్‌లు జారీ చేయడం- ప్రకరణ 123
- లోక్‌సభలో ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే ప్రవేశపెడతారు- ప్రకరణ 117
- కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్థిక సంఘం నివేదికలను పార్లమెంటు పరిశీలనకు పంపడం- ప్రకరణలు 151(1), 323(1), 281
- లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షుడు లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను నియమించడం- ప్రకరణ 95(1), 91(1)
- పార్లమెంటు ఆమోదించిన బిల్లులు చట్టాలుగా కావడానికి ఆమోదం తెలపడం- ప్రకరణ 111
- రాష్ట్ర గవర్నర్ తనకు పంపించిన రాష్ట్ర బిల్లులను ఆమోదించడం లేదా తిరస్కరించడం- ప్రకరణ 201
- రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదముద్ర వేయడం- ప్రకరణ 368
న్యాయాధికారాలు-విధులు (ప్రకరణ-72)
- రాజ్యాంగాధినేతగా ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలను నిలిపివేయవచ్చు లేదా శిక్ష అమలు వాయిదా వేయవచ్చు లేదా ఒక రకమైన శిక్షను మరోరకంగా మార్చవచ్చు. దీని ముఖ్య ఉద్దేశం న్యాయస్థానాల పొరపాట్లను సరిదిద్దడం.
- రాష్ట్రపతి దేశ అధిపతి కాబట్టి పౌరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ముద్దాయిలు పరివర్తన చెందడానికి కూడా క్షమాభిక్ష అధికారాలు ఉపకరిస్తాయి.
- ఈ అధికారాలను రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు నిర్వర్తిస్తారు. విచక్షణాధికారాలకు ఆస్కారం లేదు.
- క్షమాభిక్ష అధికారాలను వినియోగించే సమయంలో రాష్ట్రపతి ప్రజాభిప్రాయాన్ని, బాధిత కుటుంబాల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
క్షమాభిక్ష పెట్టడం - శిక్షను రద్దు చేసి క్షమాభిక్షను ప్రసాదించడం. క్షమాభిక్ష ఇచ్చినంత మాత్రాన నేరం నుంచి విముక్తిగా భావించొద్దు.
శిక్షను తగ్గించడం - శిక్ష స్వభావాన్ని మార్చకుండా శిక్ష కాలాన్ని తగ్గించడం.
శిక్షలను మార్పు చేయడం - శిక్ష కాలాన్ని మార్చకుండా స్వభావాన్ని మార్చడం. ఉదాహరణకు రాజీవ్‌గాంధీ హత్య కేసులో ముద్దాయి నళినికి విధించిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు.
శిక్ష అమలు కాకుండా వాయిదా వేయడం - శిక్ష అమలు కాకుండా తాత్కాలికంగా వాయిదా వేయడం. క్షమాభిక్ష పిటిషన్ ప్రభుత్వ పరిగణనలో ఉన్నప్పుడు ఈ వెసులుబాటు ఉంటుంది.
సలహా అధికారం (ప్రకరణ 143) - రాజ్యాంగపరమైన, చట్టపరమైన, ప్రజాసంబంధమైన వ్యవహారాల్లో సుప్రీంకోర్టు సలహాను రాష్ట్రపతి తీసుకోవచ్చు. అయితే దీన్ని సలహాగానే పరిగణించవచ్చు. రాష్ట్రపతి దీనికి బద్దుడు కావాల్సిన అవసరం లేదు.
సైనిక అధికారాలు - 53(2) ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతి. అతడు త్రివిధ దళాలకు అధిపతి.
- యుద్ధం ప్రకటించడానికి, సంధి షరతులు చేసుకోవడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది.
- రక్షణ శాఖను నిర్వహించే రక్షణ మంత్రిని, రక్షణ మంత్రిత్వ శాఖలోని ముఖ్యమైన అధికారులను నియంత్రించడం మొదలైనవి.
దౌత్యాధికార విధులు - అంతర్జాతీయ వ్యవహారాలకు ప్రతినిధిగా వ్యవహరిస్తాడు.
- మిత్ర దేశాలకు రాయబారులను నియమించటం
- భారత దేశానికి ఇతర దేశాలకు మధ్య సంబంధాలను ఏర్పాటు చేయడానికి కృషి చేయడం
- ఐక్యరాజ్య సమితికి భారతదేశ ప్రతినిధులను నియమించడం.
రాష్ట్రపతి ఇతర అధికారాలు-మినహాయింపులు - రాష్ట్రపతి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సభ్యులను, పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్ ఇతర సభ్యులను, ప్రసార భారతి చైర్మన్, ప్రెస్ ట్రస్ట్ చైర్మన్ మొదలైనవారిని నియమిస్తారు.
- రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులను తొలగిస్తారు.
- ప్రకరణ 361 ప్రకారం రాష్ట్రపతికి ప్రత్యేక మినహాయింపులు కల్పించారు. అతడు పదవిలో ఉండగా ఎలాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయొద్దు. అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. ఐతే రెండు నెలల ముందస్తు నోటీస్‌తో సివిల్ కేసులు నమోదు చేయవచ్చు.
- రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలకు ఏ న్యాయస్థానానికి బాధ్యత వహించడు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
Previous article
Current Affairs May 24 | క్రీడలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు